ప్రియాంక తన నిస్సహాయతకు షాక్ తింది. ముఖం పాలిపోయింది. ఆమె లేత పెదవులు తడారిపోయి వణుకుతున్నాయి. హఠాత్తుగా ఏదో విచిత్రం జరిగితే తప్ప తను రక్షింపబడలేదు.
ఒక్కక్షణం పాటు ఓ సరికొత్త ఆలోచన చోటు చేసుకుంది. మనిషికీ ఆస్తీ, ఆర్భాటం కన్నా ఆత్మవిశ్వాసం, స్థయిర్యం, ప్రమాదాన్ని ఎదుర్కోగల గుండె బలం కావాలి. నిజంగానే అది ఆమె స్వభావానికి విరుద్ధమైన ఆలోచన.
ఒక మనిషి వంకర ఆలోచనను ఏ చదువూ, ఏ సిలబస్, ఏ గురువూ, ఏ విద్యా సంస్థా, ఏ తల్లీ, తండ్రీ, ఏ పరిస్థితులూ మార్చినా, మార్చకపోయినా ఓ చేదు అనుభవం మాత్రం మార్చి తీరుతుంది అనటానికి ప్రియాంకే ఉదాహరణ. జీవితంలో తొలిసారి ఆమె భగవంతుణ్ని స్మరించింది. ఆమెలో ఇదొక అద్భుతమైన మార్పు.
అంతలో ఆమె దృష్టిలో త్రినాధ్ జీప్ హెడ్ లైట్స్ పడ్డాయి. అప్పటికే బోస్ మనుషులు ఆ వాహనాన్ని వెనక్కు మళ్ళించే ప్రయత్నంలో అటువైపు పరుగెత్తటం కనిపించింది.
ఆమెలో ఒకింత ఆశాభావం కదలాడింది. కాని అంతలోనే మరలా సందేహం. బోస్ కాకలు తీరిన రౌడీ. అతని వెనుక ఐదారుగురు నరరూప రాక్షసులున్నారు. ఆ వస్తున్న జీప్ లో ఒకే ఒక వ్యక్తి వుంటే తనను కాపాడలేడు.
కారులో కూర్చున్న అమ్మాయిలంతా భయంతో బిక్క చచ్చి వున్నారు. వాళ్ళు ఈ ప్రమాదం నుండి ఎప్పుడు బయట పడతామా అని క్షణాలు లెక్కెట్టుకుంటున్నారు.
పరిస్థితి అంతా చాలా సీరియస్ గా, టెన్షన్ గా వుంది. చాలాసేపటి నుంచి ప్రియాంక బోస్ ని సంభాషణ ద్వారా అతని చర్యను కొంతవరకు ప్రొలాంగ్ చేయగలిగింది. ఈలోపు ఏదో ఒక వెహికల్ ఆవైపు రాకపోతుందా అన్న ఆశతో. ఆశించినట్లే వెహికల్ వస్తోంది.
సుదూరంలోనే తన జీప్ హెడ్ లైట్స్ కాంతిలో ప్రియాంక మెర్సిడస్ ని గుర్తించాడు త్రినాధ్. తనూహించినట్లుగానే బోస్ ప్రియాంకను ఆపి ఏదో గొడవ చేస్తున్నట్లు ఊహించి జీప్ వేగాన్ని పెంచాడు.
త్రినాధ్ దగ్గరవుతుండగా నలుగురు వ్యక్తులు రోడ్డుకడ్డంగా నిలిచారు. చేతులు బారచాపి అక్కడితో ఆగిపొమ్మన్నట్టుగా.
అక్కడితో ఆగిపోయినా ప్రియాంకకు తక్షణం ఏ ప్రమాదం లేకపోతే ఫర్వాలేదు. లేదంటే...? జీప్ ని పక్కకు తిప్పాడు. హెడ్ లైట్స్ కాంతిలో అక్కడి పొజిషన్ ని తక్షణం తెలుసుకొనేందుకు. అప్పుడు కనిపించింది ప్రియాంక తన రెండు చేతులు గుండెలకు అడ్డంగా పెట్టుకొని భీతిగా అటు బోస్ వైపు, ఇటు తన జీప్ హెడ్ లైట్స్ వైపు చూస్తూ.
అంతే- జీప్ ని సడన్ గా అమితవేగంతో ముందుకి దూకించాడు. అది సరాసరి వచ్చి బోస్ పక్కగా ఆగింది. ఆగుతూనే త్రినాధ్ జీప్ లోంచి ఎగిరి దూకాడు. కానప్పటికే బోస్ మనుష్యులు త్రినాధ్ మీదకు విరుచుకుపడ్డారు.
ప్రమాదం తప్పే అవకాశం వచ్చిందని ప్రియాంక ఓ ప్రక్క ఒకింత ఊరట పొందినా ఆ అవకాశం తన ప్రత్యర్ధి త్రినాధ్ ద్వారా రావటం ఇబ్బందిగా అనిపించింది. తానా దుస్థితిలో వుండగా త్రినాధ్ రావటం, చూడటం ఆమెకు తలకొట్టేసినంత అవమానంగా వుంది.
ప్రియాంక మనస్సులో కదలాడే భావాన్ని సరిగ్గా అంచనా వేయగలిగాడు త్రినాధ్.
"చూడండి, ఈ అమ్మాయి మీద నాకు ప్రత్యేకమైన ఇష్టంకాని, మరే అభిప్రాయం కాని లేవు. ఆమెనిప్పుడు సురక్షితంగా ఇక్కడి నుండి పంపించాలనుకుంటున్నాను. అది కేవలం ఆమె మీద జాలితో. ఈ స్థానంలో ఎవరున్నా నేనీపని చేస్తాను" అంటూ తనమీదకు దూకిన నలుగురు వ్యక్తుల్ని బాగా దగ్గరకు రానిచ్చి, ఓసారి గుండెలనిండా గాలి పీల్చుకుని చేతుల్ని ఇనుపముక్కల్లా మార్చి ముఖాలమీదకు సడన్ గా విసిరాడు.
ఒక వ్యక్తి తమ నలుగుర్ని అలా దూరంగా విసిరేయగలగటం వారికి ఆశ్చర్యంతోపాటు కోపం తెప్పించింది.
బోస్ మౌనంగా వున్నాడు.
తనను, తన గ్యాంగ్ ని ఒక్కడేం ఎదుర్కోగలడని అతని ధీమా.
చూస్తుండగానే ఆ వీధిలో అప్పటివరకు పర్చుకున్న చీకటి నిశ్శబ్దం బ్రద్ధలై ఓ చిన్నసైజు రణరంగంలా మారిపోయింది.
త్రినాధ్ పులి పంజాలాంటి దెబ్బల్ని తట్టుకోవటం రాను రాను వారికి ప్రాణాంతకమైంది. తన అనుచరుల వెనకడుగును చప్పున గ్రహించాడు బోస్. సర్రున నడుంచుట్టూ వున్న చెయిన్ బయటకు లాగి లాఘవంగా గాల్లోకి తిప్పి చటుక్కున దాన్ని చేతిచుట్టూ చుట్టుకుంటూ ఒకడుగు త్రినాధ్ వేపు వేసి ఆగిపోయి గుర్రుగా చూశాడు.
"చూడు... నువ్వు నా శత్రువు కావు. మాతో నీకు గొడవ అనవసరం. మర్యాదగా నీ దారిన నీవు వెళ్ళిపో. ఈ రాక్షసిని చచ్చినా వదలను..." గర్జించాడు బోస్.
త్రినాధ్ అప్పటికే బోస్ గ్యాంగ్ ని మట్టి కరిపించి ఒకడుగుముందుకేసి "ఒక ఆడపిల్ల- అందునా నిస్సహాయురాలైన ఆడపిల్లను అర్దరాత్రి నడిరోడ్డుమీద అల్లరిపెట్టడం సంస్కారవంతుడు చేయాల్సిన పనికాదు. మర్యాదగా వాళ్ళను వదిలేయ్..."
రెండు కొండలు ఢీకొనబోతున్న ఉద్విగ్నత అక్కడ అలుముకుంది క్షణాల్లో.
దెబ్బలు తిని క్రిందపడ్డ బోస్ అనుచరులు ఓ ప్రక్క ప్రియాంక ఇంకో ప్రక్క, కారులో కూర్చున్న అమ్మాయిలు మరో ప్రక్క ఊపిరి బిగపట్టి చూస్తున్నారు ఇంకొద్ది క్షణాల్లో అక్కడేం జరుగుతుందోనని.
శారీరకంగా ఇద్దరూ బలిష్టులే. కాస్త అటూ, ఇటూగా ఇద్దరూ సమాన కండబలం కలవారే.
త్రినాధ్ కి అప్పటికే ఒకింత అలసటగా వుంది. ఆ స్థితిలో బోస్ ని లొంగ దీసుకోవడం అంత తేలికైన పనికాదు. అది అతను నడుం నుంచి చెయిన్ లాగిన విధానమే తెలియజేస్తోంది. అందుకే ఆలోచిస్తున్నాడు.
యుద్ధం తప్పదనుకున్న బోస్ అమాంతం గాల్లోకి డైవ్ చేశాడు అప్పుడు అతను విసిరినా చెయిన్ త్రినాధ్ ని తాకుంటే అతను మరిక లేచేవాడు కాదు. అలాంటి గెరిల్లా దాడేదో జరగవచ్చని ముందే వూహించిన త్రినాధ్ మెళుకువగా పక్కకు తప్పుకుని ముందుకు దూకాడు.
చూస్తుండగానే ఇద్దరి మధ్య సంకుల సమరం మొదలైంది. త్రినాధ్ కి కేవలం ఆ అమ్మాయిల్ని రక్షించాలని వుంటే, అప్పటికే పరువు పోగొట్టుకున్న బోస్ కి ఇప్పుడూ ఓడిపోతే మరింత అవమానం అన్న ఉద్దేశంతో కసిగా దూకుతున్నాడు.
చూస్తున్న వారికి వళ్ళు గగుర్పొడిచేలా వుంది వారి సమరం.
అప్పటివరకు కారుకు అతుక్కుపోయి నించున్న ప్రియాంక చప్పున తేరుకుని రోడ్డుమీద పడున్న చీరను అందుకొని త్వరత్వరగా ఒంటికి చుట్టబెట్టుకుని కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. ఓ కన్ను ఇటేసి వుంచిన బోస్ కసిగా అరుస్తూ త్రినాధ్ తో సహా ఒక్క ఊపున వచ్చి కారుకు అడ్డంగా పడ్డాడు.
వెనుక జీపు.... ముందు బోస్ త్రినాధ్. ఎటూ వెళ్ళలేక ప్రియాంక స్టీరింగ్ ముందు బిగుసుకుపోయి కూర్చుంది. కాని ఏ క్షణాన వాళ్ళు అడ్డం తప్పుకున్నా కారును దూకించేందుకు సిద్ధంగా వుంది.
ఇక్కడ త్రినాధ్ విషయానికొస్తే అతని పరిస్థితి క్రమంగా దిగజారి పోతోంది. బోస్ తో తలపడడానికి ముందే ఐదుగురితో తలపడి వార్ని దెబ్బ తీసిన మూలంగా కొంత శక్తిని కోల్పోయాడు.
బోస్ సామాన్యమైనవాడు కాదని అనుభవపూర్వకంగా తెలిసిపోతోంది.
అప్పుడనుకున్నాడు ఒక అన్యాయం జరక్కుండా ఆపటానికి మరొక అన్యాయం చేయక తప్పదని. అంతే- మరొక్క క్షణం ఆలస్యం చేయలేదు. బోస్ ని దూకుడుగా ముందుకు రానిచ్చాడు. ఎలాంటి అడ్డు తగలకుండా అతను మరింత చేరువుగా రానిచ్చి రెండు చేతుల్ని ఇనుప ముక్కల్లా బిగించి గాల్లోకి లేపి సెకన్ లో వెయ్యోవంతు మాత్రమే ఆగిపోయాడు. ఆ మరుక్షణం బోస్ మీద దొంగ దెబ్బ పిడుగులా పడింది.
బోస్ పెద్దగా అరిచి కుప్పకూలిపోయాడు. జాలిగా బోస్ వేపు చూస్తూ క్షమించు మిత్రమా అని మనస్సులో అనుకుంటూ అతని రెండు చేతుల్ని పట్టుకుని రోడ్డుకు ఓ ప్రక్కకు లాగేసాడు. వెనుతిరిగే లోపే ప్రియాంక కారు బాణంలా ముందుకు దూసుకుపోయింది.
ఆమె చర్యకు మ్రాన్పడిపోయి త్రినాధ్ ఎగిరి జీప్ ఎక్కాడు. ముందు ప్రియాంక కారు, వెనుక త్రినాధ్ కారు రేస్ హార్స్ ల్లా దూసుకుపోతున్నాయి.
అంతటి ప్రమాదం నుంచి ఎంతో రిస్క్ తీసుకుని రక్షిస్తే, కనీసం మాట వరసకైనా కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్ళిపోతున్న ప్రియాంక మీద అప్పటికప్పుడు పిచ్చి కోపం వచ్చింది. అందుకే ఆమెను మధ్యలోనే అడ్డుకుని ఆ చెంపా, ఈ చెంపా వాయించాలనుకున్న త్రినాధ్ ప్రియాంక కారును వెంటాడుతున్నాడు.
ఓ ఐదు నిముషాలపాటు రేసింగ్ కొనసాగింది.
అప్పుడెందుకో అనుకోకుండా త్రినాధ్ స్మృతిపథంలో మాలిని కదలాడింది. తర్వాత అతని ఆలోచనలు సడన్ గా మారిపోయాయి.
బోస్ ని మందలించబోయి, శిక్షించిన తను ఇప్పుడు చేయబోతున్నదేమిటి?
ఆలోచనలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. జీప్ వేగం తగ్గింది.
ఆ ఆలోచనల చివర ప్రశ్నలా కనిపించాడు దెబ్బలు తిని క్రిందపడిన బోస్. అంతే- ఆ మరుక్షణం జీప్ వెనక్కు తిరిగింది.
అప్పటికే స్పృహలోకి వచ్చిన బోస్ వంట్లోని శక్తినంతా కూడ గట్టుకుని బలవంతాన లేచి నిలబడి నలువేపులా చూశాడు. తన అనుచరులంతా నిస్త్రాణంగా రోడ్డుకు ఆవల అస్తవ్యస్తంగా పడున్నారు.
కొద్దిక్షణాలు ఏవో ఆలోచనల్లోకి వెళ్ళిన బోస్ చప్పున ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా, ఎవరో మంత్రించినవాడిలా దగ్గర్లో వున్న బ్రిడ్జివేపు వేగంగా కదిలాడు.
అతని కళ్ళ ముందిప్పుడు ప్రియాంకే కనిపిస్తోంది. ఆమె పరిహాసపు నవ్వే అంతకంతకు స్థాయి పెరిగి తనను చిత్రహింస పెడుతున్నట్లు ఫీలవుతున్నాడు. ఆమెనేదో చేయబోయిన తను దారుణంగా ఆమె కళ్ళముందే చావు దెబ్బలు తిన్నాడు. అందుకే ఆ నిర్ణయానికి వచ్చాడు.
బ్రిడ్జికి అటు చివరనుంచి త్రినాధ్ జీప్ దూసుకు వస్తోంది ఇటు చివర బోస్ బ్రిదిజి మధ్యకు వెళ్ళే ప్రయత్నంలో వేగంగా అడుగులు వేస్తున్నాడు.
దూరం నుంచే త్రినాధ్ ఎవరో తనకు ఎదురుగా వస్తున్నట్లు గమనించి జీప్ వేగం ఇంకాస్త పెంచాడు.
అప్పటికి బ్రిడ్జి అంచునున్న సేఫ్టీవాల్ ఎక్కేసాడు. ప్రమాదాన్ని పసిగట్టిన త్రినాధ్ ఆనాలోచితంగా పెద్దకేక వేశాడు.
అంతే... మరో క్షణం ఆలస్యం చేయలేదు బోస్. దబ్బున నీళ్ళ శబ్దం వచ్చింది ఒక్కసారిగా.
* * * *
తనలోని పౌరుషాన్ని రెచ్చగొట్టి తెలివిగా పెట్టుబడి సంపాదించాడు. తనకు జరిగిన అవమానాన్ని అతను మరచిపోలేదు. పట్టుదలగా ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి ఉదాహరణ- అతని వేష, భాషల్లో అతి తక్కువ కాలంలో వచ్చిన అనూహ్యమైన మార్పు ఒక కారణమైతే... పూటకు గతిలేని అతను ఇప్పుడు జీప్ లో తిరగడం... పైగా తనే డ్రైవ్ చేయడం... అంతకుమించి బ్లూమూన్ లాంటి కాస్ట్ లీ రెస్టారెంట్ కు రావడం.
చిన్నవిగా కనిపిస్తున్న అతనిపట్ల వూహించని మార్పులివి.
ఎట్టి పరిస్థితుల్లోనూ అతను తన మీద గెలవలేడు. అయినా... థ్రిల్లింగ్ కోసమైనా అతని వ్యవహారాలపై ఓ కన్నేసి వుంచాలి.
ఇవన్నీ అలా వుంచితే... ఒంటరిగా... అతనికై అతనిలో ఇంత మార్పు ఎలా సాధ్యం? కాదు. అంటే అతని వెనుక ఎవరో వుండి వుండాలి. వుంటే ఎవరు వాళ్ళు...? వాళ్ళను దెబ్బకొట్టాలి ముందు. తన ఆలోచనల్ని డాడీకి చెబితే నవ్వి తేలిగ్గా కొట్టిపారేస్తాడు. పోనీ తానంటే ప్రాణంగా చూసుకునే అన్నయ్యకు చెబితే...?
ప్రియాంక ఆలోచనలు ఒక నిర్దుష్ట రూపం సంతరించుకోలేదింకా. తన గదిలో తెల్లవారుఝామైనా లైట్ వెలుగుతుండడంతో అనుమానం కలిగిన తల్లి ఇటువేపు వస్తూండడం కనిపించింది ప్రియాంకకు. చటుక్కున బెడ్ ఎక్కేసి కళ్ళు మూసుకుంది.
* * * *