కోమలి నాతో ఈ విషయం చెప్పగానే నా బుర్ర చురుగ్గా పనిచేసింది. ఇంటికి వెళ్ళేముందు నా మామయ్య గారింటికి ఫోన్ చేసి రేపు పద్మిని వస్తోందనికూడా చెప్పాను.
ఇంట్లో మామయ్యగారు లేరు. అత్తయ్యగారు ఫోన్ అందుకొని "నువ్వుకూడా రాకూడదా నాయనా?" అన్నది.
మా పిల్లల స్కూలు. వాళ్ళింటికి దగ్గర. పిల్లలు అక్కన్నించి అలా వచ్చేస్తారనీ వుదయం భోంచేసి పద్మిని వస్తుందనీ-సాయంత్రం నేను తిన్నగా డిపార్టుమెంటునుంచి వాళ్ళింటికి వస్తాననీ చెప్పాను. అక్కణ్ణించి అంతా కలసి యింటికి వెళ్ళిపోతాం.
నా ప్రోగ్రాం బాగుందని అత్తయ్యగారు అన్నది.
నేనింటికి బస్సులో వెళ్ళి శ్రీమతికి విషయం చెప్పాను.
"అయ్యో! పిన్నికి వంట్లో బాగుండకపోతే ఇప్పుడే వెళ్ళి చూసి వద్దామండీ" అన్నది పద్మిని.
"రేపు వస్తానని చెప్పాను. రేపు వెడితేనే బాగుంటుంది."
"ముందుగా ఎందుకు చెప్పారండీ? మనకోసమని పిన్ని ఏమేమో చేస్తుంది. అనవసరంగా హైరానాపడుతుంది అసలే వంట్లో బాగోలేదన్నారు. చెప్పకుండానే వెడితే బాగుండేది" అన్నది పద్మిని.
నాకీ విషయం తెలియకపోలేదు. ఆవిడకు అభిమానం, ఆప్యాయత ఎక్కువ. ఒంట్లో ఓపిక లేకపోయినా మా కోసం శ్రమపడిపోతుంది. అయితే ఆవిడకు ముందుగా చెప్పకపోతే పద్మిని ఈ ప్రయాణానికి ఏదైనా వంక పెట్టవచ్చు. రేపు మధ్యాహ్నం మూడింటికి నా డ్రాయింగ్ రూంలో ఏమి విశేషం జరుగుతుందో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా వున్నది.
ఆ రాత్రి నాకు సరిగా నిద్రపట్టలేదు.
డాక్టర్ విలాస్ న అభార్య మీద కన్నువేశాడు. అతడు ప్రమాదకరమయిన మనిషి. అనుకున్నది సాధిస్తాడు.
అదీకాక పద్మిని...
ఆమె మాధవరావు ముందు నగ్నంగా నిలబడి బొమ్మ గీయించుకున్నది ఏ మానిక బలహీనత ఆమెనందుకు పురిగోల్పిందో కాని-ఆమెకు మానసిక బలహీనత ఉన్న విషయం తధ్యం మానసిక బలహీనతలను కనిపెట్టి తన స్వార్దానికి వుపయోగించుకోవడంలో డాక్టర్ విలాస్ నేర్పరి.
మర్నాడుదయం డిపార్టుమెంటుకు బయల్దేరుతూ స్కూటర్ బయటకు తీశాను.
"అరే-అదెందుకూ" అన్నాడు విలాస్ స్కూటర్ స్టార్టవుతున్న చప్పుడు విని పరుగున అక్కడకు వచ్చి.
"ఈ రోజు నాకు వేరే పనులున్నాయి" అన్నాను.
"అయ్యో! ఈరోజు మీతో మంచి కార్యక్రమం పెట్టుకున్నానే" అన్నాడు విలాస్ నిరుత్సాహంగా.
"దానికేముంది మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం" అన్నాను తప్పితే అతడి కార్యక్రమం ఏమిటని అడగలేదు.
డిపార్టుమెంట్ చేరుకున్నా చూపంతా గడియారం మీదా మనసంతా మూడుగంటల మీదా వుంది.
ఒంటిగంటన్నరకు డిపార్టుమెంట్ కు ఫోన్ వచ్చింది. పద్మిని ఫోన్ చేసింది తన అత్తయ్యగారిల్లు చేరుకున్నదట. వీలుచేసుకొని నన్నూ పెందరాళే వచ్చేయమన్నది.
అలాగేనని చెప్పాను.
టైము రెండున్నర దాటగానే ఇంటివేపు బయలుదేరాను.
నా వుద్యోగం మహా సుఖమైంది.
ఏదో వుదయంపూట ముఖం డిపార్టుమెంటులో కనపడితే చాలు. ఆపైన క్లాసులేమైనా ఉంటే పాఠాలు చెప్పడం, లేకుంటే ఎక్కడికెళ్ళావూ అని అడిగేవారులేరు" నాదగ్గర ఇంకా ఎవరూ రీసెర్చికి చేర లేదు.
పావుగంటలో ఇల్లు చేరాను.
ఇంటికి తాళం పెట్టి వున్నది. నా వద్ద డూప్లికేట్ కీ ఉన్నది. తాళంతీసి ఇంట్లో ప్రవేశించి ఫాన్ వేసుకుని డ్రాయింగ్ రూంలో సోఫాలో కూర్చున్నాను.
టైం నడుస్తోంది.
ఇప్పుడేం జరుగుతుంది?
నాబుర్ర పని చెయ్యడంలేదు. వాచీ వంకనే చూస్తున్నాను.
డ్రాయింగ్ రూంలో గోడగడియారం వున్నది. సమయం మూడుగంటలు కాగానే అది సరిగ్గా మూడు గంటలు కొట్టింది.
ఆ మూడుగంటలూ విన్నాను.
తర్వాత...
టక్...టక్...టక్...
చప్పుడు గడియారం నుంచికాదు.
మరెక్కడ్నుంచి వస్తుంది?
త్వరగానే అర్ధమైంది నాకు.
ఇల్లు కట్టినపుడు డ్రాయింగ్ రూం పెద్ద హాలుగా వున్నది. ఇంటిని రెండు వాటాలుగా చేయడంకోసం మధ్య కర్రగోడ పెట్టించాను. ఎప్పుడు కావాలంటే అప్పుడా కర్ర గోడను తొలగించవచ్చు. ఆ పెద్దహాలు ఇప్పుడు రెండు డ్రాయింగ్ రూమ్స్ గా మారింది. ఆ కర్రగోడకు ఓ తలుపు ఏర్పాటుచేశాను. దానికి అటూ యిటూ గడియలు వున్నాయి.
ఇప్పుడు గోడకు అవతల పక్కనుంచి శబ్దం వస్తుంది.
టక్...టక్...టక్...
నేనా తలుపును సమీపించాను.
"తలుపు తియ్యండి..." సన్నగా ఒక స్వరం.
నావళ్ళు జలదరించింది.
ఆమె.... ఆమె...
డాక్టర్ విలాస్ భార్య.