"నాకు తెలుస్సార్ మీరు ఆశ్చర్యపోతారని_ ఇదే ఇంకెవడయినా అయితే ఇలాంటి బ్రహ్మాండమయిన అవకాశం వచ్చినప్పుడు కనీసం పాతికవేలు గుంజేస్తాడు. వీడేమిటా పదివేలే అడుగుతున్నాడు పూర్ ఫెలో_ ఇడియట్ అని అనుకుంటున్నారు. కద్సార్?"
"అవును మైడియర్ భజన్ రావ్! ఎదుటివాళ్ళ బ్రెయిన్ని డిటెక్టివ్ నవల చదివినట్లు చదివేస్తున్నావు. ఓ.కే.! మనిద్దరం రాజీకి రావటం చాలా అవసరం గనుక ఓ వెయ్యి రూపాయలు ఇస్తాననుకో ఎలా వుంటుంది?"
"చాలా చీప్ గా వుంటుంది సార్. పదివేలుకి ఒక్క పైసా తగ్గను. మీరివ్వనంటే వెంటనే కల్నల్ గారికి, సీతా మేడమ్ గారికీ మీరు రచయిత చంద్రకాంత్ ప్లేస్ లో వచ్చిన డూప్లికేట్ అని చెప్పేస్తాను. రెండు నిమిషాలు టైమిస్తున్నా సార్! ఇప్పుడు నా వాచీలో పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు"
"ఓకే భజన్ రావ్! నువ్వంత అభిమానంగా అడుగుతున్నప్పుడు కాదని నేనూ అనలేను. వన్ మినిట్" అంటూ తన బ్రీఫ్ కేస్ లో నుంచి చెక్ బుక్ తీసి చెక్కు పదివేలు రాసి సంతకం చేసి అతనికిచ్చాడు.
"ఈజిట్ ఓకే భజన్ రావ్?"
"సెంట్ పర్సెంట్ ఓకే సార్! అయితే చెక్ తిరిగి రానంతవరకే ఓకే సార్!"
సీత, పూజ హడావుడిగా వచ్చారా గదిలోకి.
"ఏమిటి భజన్ రావ్ తో మాట్లాడుతున్నారు?" అడిగింది పూజ.
"భజన్ రావ్ నా సీరియల్స్ చూసే వీరాభిమాని అన్న విషయం ఇప్పుడే తెలిసింది పూజాజీ! కేవలం నామీద అభిమానంతో ఖమ్మం వచ్చి నన్ను కలుసుకుని నా ఫోటో ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడట."
పూజ ఆశ్చర్యపోయింది.
"మైగాడ్! నిజంగానా? నువ్వు బాగా టేస్ట్ ఉన్న కుక్ వన్నమాట" అంది సీత.
"అవును మేడమ్! మా ఫ్యామిలీయే బాగా కల్చర్ బ్యాక్ గ్రౌండ్ వున్న ఫ్యామిలీ. నేను గవర్నమెంట్ లైబ్రరీలో చదవని గ్రంథం లేదు."
"మీతో ఓ విషయం మాట్లాడమని మా పూజ గొడవ చేస్తోంది." అంది సీత.
"వెల్ కమ్ సిస్టరిన్లా! ఒకటి కాదు, వంద విషయాలు మాట్లాడండి రడీ."
"మా పూజక్కూడా సినిమా స్క్రిప్ట్ రాయాలని ఎంతో కోరిక. పోతే ఆ టెక్నిక్ తెలీటం లేదు. మీరు హెల్ప్ చేస్తే నేర్చుకోవాలని ముచ్చటపడుతోంది.
"ఓ_ ఒండర్ ఫుల్! పూజాకి తెలీటంలేదుగానీ ఆమె ఇప్పటికే ఓ గొప్ప రచయిత్రి. రచయిత్రి అవ్వాలంటే అందమయిన ఆమె మొహం చాలు వెయ్యి ఛానెల్స్ టీఆర్పీని రాకెట్ లాగా ఆకాశంలోకి పంపించేయగలదు. ఆ అందం ఆమెకు టూమచ్ గా వుంది. ఇంక టెక్నిక్ అంటారా... వారం రోజుల్లో నేర్పించేస్తాను. అంతే_ ఆ తర్వాత శోభాడే, విక్రమ్ సేఠ్ లాగా..."
"ఓ_ థాంక్యూ వెరీమచ్! ఎప్పట్నుంచి నేర్పుతారు?" అడిగింది పూజ ఉత్సాహంగా.
"ఎప్పుడోనా? అలస్యాత్ అమృత్ విషమ్ అన్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచీ స్టార్ట్."
"అంటే రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు"
"నో_ నో_ నో! యూ ఆర్ మిస్టేకెన్ పూజాజీ! ఇది ఎమ్సెట్ కోచింగ్ సెంటర్ కాదు_ గంటకో బాచ్ కి కోచింగ్ ఇచ్చి పంపించేయడానికి. ఇదొక అద్భుతమైన కళ. కళకి ఓ టైమంటూ వుండదు. సడెన్ గా నాకు ఉదయం ఆరుగంటలకు 'రచన' గురించి ఉపన్యాసం ఇవ్వాలనిపించవచ్చు. లేదా రాత్రి ఎనిమిదింటికి గార్డెన్ లో పచార్లు చేస్తూండగా ఇంతవరకూ ఏ రచయితా కనుక్కోలేకపోయిన కొన్ని మెళుకువలు తెలియజేయాలనిపించవచ్చు. అదీగాకపోతే రాత్రి ఒంటిగంటకు వర్షం కురుస్తూండగా మిమ్మల్ని లేపి 'వర్షం' అనే ఓ పురుగల కథను రాయమని చెప్పి దగ్గరుండి రాయించవచ్చు."
పూజ ఆనందంతో పొంగిపోయింది.
"ఫెంటాస్టిక్! ఐ లైకిట్!"
"ఓకే చంద్రకాంత్ గారూ! మీరు రిలాక్సవండి. భోజనం వడ్డించాక పిలుస్తాను" అంది సీత.
"బై!"
"థౌజండ్ కాండిల్స్ బల్బ్ లా వెలిగిపోతూ పూజ ఆమెను ఫాలో అయి బయటకు నడిచింది.
"ఈ చెక్ ఎక్కడ క్యాష్ అవుతుంది సార్?" అడిగాడు భజన్ రావ్.
"అబిడ్స్ బ్రాంచ్ లో మైడియర్! మధ్యాహ్నం రెండు నుంచీ సాయంత్రం ఆరు వరకూ బ్యాంకు టైమింగ్స్"
భజనరావ్ కూడా వెళ్ళిపోయాడు.
భవానీశంకర్ రిలాక్సయిన కాసేపటికి గోపాల్రావ్ వచ్చాడు నెమ్మదిగా.
"వండర్ ఫుల్ ఫెర్ఫారమెన్స్ రా! మా ఫాదిరిన్లాని బోల్తా కొట్టించిన ఏకైక వీరుడివి నువ్వే."
"మీ ఫాదరిన్లా గ్రాండ్ ఫాదర్ని కూడా మాయ చేసేయగలం బ్రదర్ అవునూ... బైదిబై_ మీ మరదలు పిల్ల చాలా అందంగా వుందే."
"మా మిసెస్ కంటే అందంగా వుంటుంది కదూ?"
"ఛ! మీ మిసెస్ ఆ అమ్మాయి ముందు ఫిఫ్టీ పర్సెంట్ కూడా వుండదు."
గోపాల్రావ్ నిరాశగా కూలబడిపోయాడు.
"దెబ్బతినేశాను గురూ!"
"ఏమిటి దెబ్బతినటం?"
"మా మరదలినే చేసుకునుంటే బావుండేది. అప్పట్లో మనకు కరెక్ట్ జడ్జిమెంట్ ఏడ్చి చచ్చేది కాదు."
"ప్రస్తుతానికా క్రూకెడ్ ఆలోచనలు మానెయ్ మిత్రమా! ఎందుకంటే నేను పూజ ప్రేమలో మునిగిపోయాను."
"మునిగిపోయావా?"
"ఎస్_నెక్ డీప్!"
"ఈ విషయం కల్నల్ కి తెలిసిందంటే నీ 'డెడ్ బాడీ' పోస్ట్ మార్టమ్ టేబుల్ మీదుంటుంది."
"నో ప్రాబ్లమ్! నాకూ, పూజకూ తప్ప ఇంకెవరికీ తెలీదు కదా! అయినా కల్నల్ దాకా రావటానికింకా టైముంది బ్రదర్! ప్రస్తుతం ట్రైల్ రన్ లో ఉంది."
"ఉంటే వుండుగానీ నన్నిందులోకి లాగకు. నా పరిస్థితేం బావుండలేదు ప్రస్తుతానికి."
"డోంట్ వర్రీ బ్రదర్! నీ ఆశీర్వాదం వుంటే చాలు దున్నేస్తాను."
"కానీ తర్వాత నువ్వు ఒరిజినల్ చంద్రకాంత్ వి కాదని తెలిస్తే?"
"రేపటి సంగతొద్దు_ ఇవాళ్టి గురించి ఆలోచించు మిత్రమా_ ప్రపంచము నీ కాళ్ళ దగ్గరుంటుంది అన్నాడో ఫేమస్ ఫెలో. విన్ ఛాధాలు, హర్షద్ మెహతాలు... ఇలా ఎంతోమంది ఆ రూల్ ని ఫాలో అయి ఇవాళ అనుకున్నది సాధించారు బ్రదర్! ప్రపంచాన్ని కాళ్ళ దగ్గరకు తెచ్చేసుకున్నారు. రేపేమవుతుంది అని వాళ్ళు ఆలోచిస్తే కనీసం టెంపరరీగా అయినా వాళ్ళు ఆ సక్సెస్ సాధించేవాళ్ళా? లేదు. అంచేత..."
"ఓకే భవానీ! భోజనానికి పిలుపు వచ్చింది. కమాన్!"
"మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు మధ్యలో ఎవరేం పలికినా వినిపించదు మిత్రమా! కమాన్ లెటజ్ గో!"
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకున్నారు.
"మిస్టర్ చంద్రకాంత్! నువ్వు రచయితనన్నావు కదూ?"