Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 27

ఆ రోజు సాయంత్రం జగన్నాథ్ దగ్గరికి వెళ్ళాడు రవిచంద్ర. జగన్నాథ్ నాటకాల రాయుడు. ఆఫీసులో కల్చరల్ క్లబ్ కి సెక్రెటరీ! "నువ్వొక నాటకం ఆడాలి" అన్నాడు రవిచంద్ర ఉపోద్ఘాతం లేకుండా.
"చెప్పు గురూ! ఏదన్నా పరిషత్తు పోటీలా?"
"కాదు బ్రదర్! నిజ జీవితంలో నాటక మాడాలి"
"నిజ జీవితంలో నాటకాలాడ్డం ప్రాణాలతో చెలగాటమాడ్డంతో సమానం" అని ఒక డైలాగు వదిలి, "కథేమిటో చెప్పు" అన్నాడు జగన్నాథ్.
చెప్పాడు రవిచంద్ర. డబ్బులివ్వబోయాడు గానీ జగన్నాథ్ తీసుకోలేదు.
ఆ తర్వాత రెండు రోజులపాటు భానురేఖ వాళ్ళ ఇంటిముందే కాపువేసి కూర్చున్నాడు జగన్నాథ్. ఇప్పుడు అతను ఒక ఎన్జీవోలాగా లేడు. గళ్ళ లుంగీ కట్టుకున్నాడు. ఎర్ర షర్టు వేసుకున్నాడు. భుజం మీద టర్కిష్ టవల్, నోట్లో జర్దాపాన్, జుట్టు రేపేసుకుని, బుగ్గమీద ఒక పులిపిరికాయ అంటించుకుని ఉన్నాడు.
మూడోరోజున బయటికి వచ్చింది భానురేఖ. కాలి నడకనే బయలుదేరి ఎటో వెళ్ళడం మొదలెట్టింది. ఆమెని కొంతదూరం నుంచి అనుసరిస్తున్నాడు జగన్నాథ్.
త్వరత్వరగా నడిచి వెళ్తోంది భానురేఖ. నిర్జనంగా ఉన్న ఒక సందులోకి మళ్ళింది.
వెంటనే నడకవేగం పెంచి ఆమెని సమీపించాడు జగన్నాథ్. బొడ్లో నుంచి చాకు తీశాడు.
అడుగుల చప్పుడికి చటుక్కున వెనక్కి తిరిగి చూసింది భానురేఖ. భీకరంగా వున్న మనిషి. చెయ్యెత్తి తన మీదికి వస్తున్నాడు. ఆ చేతిలో పదునైన బాకు.
తనకు తెలియకుండానే, అప్రయత్నంగా కేకపెట్టింది భానురేఖ. హఠాత్తుగా ఆమె కళ్ళలో ప్రాణభయం చోటుచేసుకుంది. వెనక్కి తిరిగి వేగంగా పరిగెత్తడం మొదలెట్టింది.
"ఆగు!" అంటూ వెంటపడ్డాడు జగన్నాథ్.
మరింత వేగం పెంచింది భానురేఖ. చెప్పు ఒకటి తెగిపోయింది. చెప్పులని వదిలేసింది. పమిట జారిపోయింది. దాన్ని చేతుల్లో పట్టుకుని పరిగెత్తుతోంది తను. ఆయాసంతో రొప్పు వచ్చేస్తోంది. ఊపిరందటం లేదు. గుండె గొంతుకకి అడ్డం పడుతున్నట్లు అనిపిస్తోంది.
ఇంక పరిగెత్తలేనని అనిపించిన తర్వాత ఆగి రొప్పుతూ వెనక్కి తిరిగి చూసింది భానురేఖ.
తన వెంటపడిన రౌడీ కనబడలేదు. ఇళ్ళలో నుంచి ఇద్దరు ముగ్గురు బయటికొచ్చి చూస్తున్నారు.
"ఏమయింది?" అన్నాడు ఒకాయన దగ్గరికొస్తూ.
"ఎవరో రౌడీ! వెంటబడ్డాడు. మిమ్మల్ని చూసి పారిపోయి ఉండాలి." అంది శ్వాస అందిన తర్వాత.
"జాగ్రత్తగా వెళ్ళమ్మా! మమ్మల్ని తోడు రమ్మంటావా?"
వద్దని చెప్పబోయి, ఒక్కక్షణం తటపటాయించింది భానురేఖ. ఆ రౌడీ ఇంకా ఇక్కడే ఎక్కడో మాటు వేసి ఉండొచ్చు. తను దొరకగానే పొడిచెయ్యవచ్చు. అలా అనుకోగానే భయంతో ఆమె వెన్ను జలదరించింది.
"ప్లీజ్! తోడుగా వచ్చి ఇంటిదగ్గర దింపగలిగితే...."
"తప్పకుండా! బట్టలు మార్చుకు వస్తాను. లోపలికొచ్చి కూర్చోమ్మా!"
"థాంక్స్! ఇక్కడ వెయిట్ చేస్తుంటాను."
ఆయన లోపలికెళ్ళిపోయాడు. అప్పుడు మొదటిసారిగా అనిపించింది భానురేఖకి. తనకి తోడా? ఎందుకు? ఆ రౌడీ చంపుతాడనా? చచ్చిపోవాలనే కదా తన కోరిక? చచ్చిపోవాలనేగా తను ఆత్మహత్యా ప్రయత్నం చేసింది? తనని చంపమనేగా రవిచంద్రకి లక్షా పాతికవేలు ఇచ్చింది? ఇన్నాళ్ళూ తను మృత్యుదేవత వెంటపడింది. తీరా మృత్యుదేవతలాంటి రౌడీ తన వెంటబడ్డాక, బెదిరిపోయి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిందేమిటి? ఎందుకు?
తనకి మళ్ళీ బ్రతుకు మీద ఆశ కలిగింది?
ఎందుకు?
చుట్టూ ఉన్న పరిసరాలు ఆమెకి మెల్లగా గమనానికొస్తున్నాయి. ఇదే రోడ్డు - అవును ఈ బంగళానే - ఈ కాంపౌండు వాల్ మీద నుంచి వాలి చూస్తున్న తెల్ల గులాబి పువ్వునే తెంచి ఇచ్చాడు రవిచంద్ర. తెల్ల గులాబిని తన రక్తంతో ఎర్రగా మార్చి ఇచ్చాడు. గుండె చీల్చి రక్త తర్పణం చేస్తూ ప్రేమ కుసుమాన్ని అర్పిస్తున్నట్టు.
"వెళ్దామా అమ్మా!" అన్నాడు బంగళాలో నుంచి వచ్చిన ఆయన.
కలలోలా తల ఊపింది భానురేఖ.
ఆయన అటు వచ్చి ఆటోని ఆపాడు. ఆటో ఎక్కబోతుంటే భానురేఖకి మళ్ళీ అదే భయం! ముక్కూ మొహం ఎరగని మనిషితో ఆటో ఎక్కుతోంది తను! ఏమన్నా అయితే?
వేళ్ళతో కణతలు నొక్కి పట్టుకుంది భానురేఖ. ఏమిటిది? ఇదివరకెప్పుడూ లేని కొత్త ఆలోచనలు వస్తున్నాయ్ తనకి? బ్రతుకు మీద మోజు పెరిగిపోతోందా? ఎందుకు?
కళ్ళముందు తెల్ల గులాబి ఎర్రగా మారుతోంది.
ఇంటి ముందు దింపి, జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు ఆయన.
ఇంటికి రాగానే వాతావరణంలో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తున్నట్లు అనిపించింది. పెళ్ళికి ముందు ఉండే సందడి.
భానురేఖని చూడగానే, "రామ్మా పెళ్ళికూతురా!" అంది విలాసిని సంతోషంగా.
"హలో మిసెస్ మదన్ మోహన్!" అంది పింకీ అల్లరిగా. తల్లిదండ్రులు మాటల్లో నుంచీ సంగతి కనిపెట్టేసింది తను.
స్థంభించిపోయింది భానురేఖ. మిసెస్ మదన్ మోహన్! తను! ఏమిటిది?
పరుగులాంటి నడకతో తన రూంలోకి వెళ్ళిపోయి, పరుపు మీద బోర్లా పడుకుండిపోయింది చాలాసేపు.

 Previous Page Next Page