"అప్పుడెప్పుడో జగన్నాథంగారు ఈ సంబంధం గురించి మధ్యవర్తిత్వం చేశారు. కాని అది హటాత్తుగా కార్యరూపం దాలుస్తుందని అనుకోలేదు. మరి ఈవేళ అనుకోకుండా ఉత్తరం వచ్చింది" అని కూతురి చుబుకాన్ని పట్టుకొని పైకి ఎత్తుతూ "ఇంతట్లో మునిగిపోయేదేముంది! వాళ్లు వస్తారు. చూసిపోతారు. జరిగిందా పెట్టిందా! పెంకితనం చెయ్యక నా మాట దక్కించు తల్లీ" అంటూ ప్రాధేయపడింది.
ఆశ హృదయాంతరాళాల్లో ఆవేశం ఉబుకుతోంది. కాని ఇటు తల్లి దైన్యస్థితి చూస్తుంటే జాలివేస్తుంది. తన అసమర్థతను తలచుకుని ఆమె నేత్రాలు చెమ్మగిల్లినాయి. "నీ ఇష్టం అమ్మా" రుద్ధకంఠంతో అని తలవంచుకుని లోపలకు నడిచింది.
పదిహేను నిముషాలు గడిచాక మేడముందు కారాగింది. పెళ్ళివాళ్ళు విశ్వనాథరావుగారి వెంట బిలబిలమని కారు దిగి పైకి వచ్చేశారు.
కాసేపటి అనంతరం ఆశ వాళ్లముందు చాపమీద తలవంచుకుని కూర్చుని వుంది. ఆమె నేత్రాలు అంతవరకూ ఎంత వర్షించినాయో, ఆ సుకుమారి హృదయంలో ఎలాంటి ఆలోచనలు చెలరేగుతున్నాయో ఎవరు అర్థం చేసుకుంటారు? తాను చిన్నన్నయ్యవెంట పెళ్ళిచూపులకు వెళ్ళినప్పుడు, అక్కడి దృశ్యంలోని రమణీయత, మాధుర్యం ఆమె ఇక్కడ అనుభవించటంలేదు. ముళ్ళమీద కూర్చున్నట్లుగా బాధగా, అసహ్యంగా వున్నదామెకు.
పెళ్లికొడుక్కి ఇరవైమూడో, ఇరవయి నాలుగేళ్ళుంటాయి. ప్యాంటూ బుష్ కోటూ వేసుకున్నాడు. చామనఛాయగా వున్నాడు. ఫరవాలేదనిపించే కనుముక్కు తీరు, అతనితోపాటు తల్లి, మరో బంధువూ వచ్చారు. జగన్నాథంగారు సూత్రధారి కాబట్టి ఆయన హాజరు సరేసరి.
పెళ్ళికొడుకు తండ్రి బ్రహ్మకాయలాగా ఒకటే వడవడ వాగుతున్నాడు. ఆయనతో ఆయన హాస్యంగా మాట్లాడతాడని వెనకటికి యెవరన్నా చెప్పి వుండాలి. మాట్లాడే ప్రతిమాటకూ ముందు చమత్కారంలాంటిది ఒకటి తగిలించి, అవతలివాళ్ళు నవ్వుతున్నారేమోనని ఓసారి నలువయిపులా చూసి ఎవ్వరూ నవ్వకపోతే తనే పకపకమని నవ్వేసి, ఇలా వాతావరణం సృష్టిస్తున్నాడు.
"ఏమిటమ్మా నీ పేరు? ఆశ కదూ! ఏమాశ దురాశా! నిరాశా! హహహహ" ఇదీ ఆయన ప్రసంగపు తంతు.
ఆయన వైఖరికి ఆశ మనసులో ఛీదరించుకున్నది. ఎవరివంకా చూడకుండా ముఖం మరింత క్రిందకు దించుకుంది.
"నీకు మాటలు రావా ఏమిటమ్మా యేం చదువుతున్నావు?"
ఆశ జవాబు చెప్పలేదు.
లోపలనుంచి లలితమ్మగారు "జవాబు చెప్పు ఆశా" అన్నది.
అప్పటికీ ఆమె ఉలకలేదు. పలకలేదు. ఆమెకు అసహ్యంగా వుంది.
విశ్వనాథంగారు 'చెప్పు ఆశా!" అన్నారు.
అంతే. తండ్రిగొంతు వినబడగానే ఆశ హడలిపోయింది. ఒణికే కంఠంతో సమాధానం చెప్పింది.
"నాకు వినబడలేదు" అన్నాడాయన.
దుఃఖాన్నాపుకుంటూ ఆమె మళ్ళీ చెప్పింది.
పెళ్లికొడుకు మొహమాటపడకుండా ఆమెను మింగివేసేటట్లు గుడ్లు మిటకరించి చూస్తున్నాడు. ఇంత అందాన్ని ఇక్కడ చూడగలుగుతాడని అతను ఊహించనట్లు అతని ముఖకవళికలు చూస్తేనే తెలుస్తున్నాయి.
"ఎన్నో సంబంధాలొచ్చాయండీ ఇంతవరకూ. కాని మావాడు చదువు పూర్తయితేనేగానీ పెళ్ళిచేసుకోనని భీష్మించుకు కూర్చోవటం వలన అందర్నీ పంపేయాల్సి వచ్చింది. యేమో! మీ అమ్మాయికోసమే ఆగాడేమో మావాడు" అని ఏమంటారు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడాయన.
"యేమో ఎవరికెక్కడ రాసిపెట్టివుందో?" అన్నారు విశ్వనాథంగారు.
"బావగారు బాగా చెప్పారు. మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు" అని కొత్తసత్యాన్ని కనుగొన్నట్లు భుజాలెగురేసి మెల్లిగా విషయచర్చలోకి దిగాడు.
కాసేపు వున్నాక ఆయనకు అనుమానం వచ్చింది. "యేమమ్మా నీ పొదుగు యెంత?" అనడిగాడు.
"అయిదడుగుల మూడంగుళాలు" అని ఆశ చెప్పిన జవాబు ఆయనలో కాస్త కలవరం కలిగించింది. తన పుత్రుడు ఆ పిల్లకన్న యెత్తు తక్కువ వుండే ప్రమాదమేమన్నా వున్నదా అని కాసేపు తర్జన భర్జన పడి-
"బావగారూ ! ఇద్దర్నీ ప్రక్కప్రక్కన నిలబెట్టి చూడాలనివుంది యేమంటారు?"
విశ్వనాథంగారు లోపల ఏమనుకున్నారోగాని ఒకక్షణం మౌనంగా ఊరుకుని "కానివ్వండి" అన్నాడు.
ఆశ శరీరమంతా భగభగ మండినట్లయింది. ఆమెలో పౌరుషం చెలరేగుతోంది. ఆమె ఎంతసేపటికీ లేచి నిలబడుటలేదు. పెళ్ళికొడుకు అప్పుడే గోడదగ్గరకు వచ్చి తయారుగా నిల్చున్నాడు. ఎంతమంది చెప్పినా ఆశ నిలబడలేదు. చివరకు విశ్వనాథంగారు "ఆశా!" అని గట్టిగా గర్జించేసరికి గజగజ వణికిపోయింది. "నేను నిల్చోను నాన్నగారూ! పరాయి మొగవాడి ముందు అట్లా నిలబడటానికి నాకు అభిమానంగా వుంటుంది" అని చెబుదామనుకున్న ఆమె ప్రయత్నం గాలిలో కలిసిపోయింది.
నిలబడక తప్పలేదు ఆమెకి అతని ప్రక్కన.
పెళ్లికొడుకు తండ్రి బాగా పరీక్షగా చూసి సంతృప్తుడై "ఫర్వాలేదు మావాడే ఓ అంగుళం వున్నాడు బావగారూ! ఇంక లోపలకు వెళ్ళమ్మా నువ్వు" అన్నాడు.
ఆశ అక్కడ్నుంచి బయటపడి నరకంనుంచి తప్పించుకుని వచ్చినట్లు ఊపిరి పీల్చుకుంది. తర్వాత నిశ్శబ్దంగా ఏడ్చింది.
ఆ గొడవ అంతటితో సమసిపోతుందని ఆమె ఏమీ నమ్మలేదు. దానికి తగ్గట్టే తల్లిదండ్రులు మరుక్షణంనుంచీ ఆమెను వత్తిడి చేయసాగారు.
"నాకు చదువుకోవాలని వుందండీ" అన్నది తండ్రితో ధైర్యంచేసి.
"ఎందుకమ్మా చదువులు? ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేగాలా? మంచి సంబంధం. నీ బాగోగులు చూడటం మాకు తెలుసుకదా! కుర్రాడు నీకు నచ్చాడా! ఆ విషయం చెప్పు" అన్నాడు తండ్రి.
ఆశ అసలు ఆ అబ్బాయిని తలయెత్తి చూడలేదు. కాని ఆ విషయం చెబుతే తండ్రి కోపంతో గట్టిగా అరుస్తాడని భయపడి మెదలకుండా ఊరుకుంది.