"ఇన్ స్క్రూటబుల్ ఇంటెలిజెంట్" అని అనుకుంది మనస్సులో మేఖల.
మరలా యిద్దరి మధ్యా నిశ్శబ్దం అలుముకుంది.
"మీరు చెప్పినవన్నీ వినటానికి బాగానే వున్నాయి. అవి నిజమైతే చూడటానికి కూడా బాగానే వుంటాయి. కానీ... కానవన్నీ ఎలా సాధించగలరు? ఎంతో సువిశాలమైన ఈ దేశాన్ని దేశమంతటా పరుచుకుపోయిన కోట్లాది జనాల్ని ఎలా అమీరు మార్చగలరు? ఎలా ప్రభావితం చేయగలరు? చేయగలననే నమ్మకం మీకు ఉండి ప్రయత్నించినా మీ జీవితకాలం అందుకు సరిపోతుందా? ఈ దేశ పేదరికాన్ని ఇంకా మిగతా రుగ్మతల్ని జాతి శ్వాస నుండి తొలగించటం సాధ్యమయ్యే పనేనా? ఇదంతా ఒక కల అన్న భ్రాంతి కలుగుతోంది నాకు..." అంది అతన్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.
* * * * *
ఆ రోజు ఆ నలుగురు అవి ఇవీ మాట్లాడుకుంటూ అర్ధరాత్రి పోయే వరకు ఉన్నారు.
దాంతో వారిమధ్య స్నేహం, చనువూ ఏర్పడ్డాయి. అప్పటికే వారి వారి ఆలోచనలు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోకపోయినా, ఒక అవగాహన మాత్రం వారిలో ఏర్పడింది.
"అయితే మనం ఎవరికీ నచ్చిన పద్దతిలో వారు ప్రయోగాలు చేద్దాం. 365వ రోజు ఆ ప్రయోగ ఫలితాన్ని ఆయన ముందుంచుదాం. ఇంతకీ ఆయన పేరేమిటి....?" అంది మేఖల విమల్ కేసి చూస్తూ.
"పూర్తి పేరు తెలీదు - పేరులో ఒక భాగం మాత్రం జ్ఞాని" అన్నాడు విమల్.
"జ్ఞాని.... ఓహో.... నిజంగా ఆయన పెట్టుకోవాల్సిన పేరే... మేం ఇక బయలుదేరుతాం...." అంది మేఖల చాపమీంచి లేచేందుకు ఉద్యుక్తురాలవుతూ.
"ఒక్కమాట" అన్నాడు అభిరామ్.
మిగతా ముగ్గురూ అభిరామ్ కేసి తిరిగారు.
"ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి విజయం సాధించాలంటే తెలివితేటలు, కార్యదీక్ష, కామన్ సెన్స్ ఎంత ముఖ్యమో భుజ బలమూ అంతే ముఖ్యం. అది నాకుంది. మీరుచేసే ప్రయోగాలకు నా పూర్తి రక్షణ అండదండలుంటాయి" అన్నాడు తన చేతిని వారి మధ్యకు చాపుతూ వారితో తన చేతుల్ని కలపాలన్న ఉద్దేశ్యంతో ఆ పని చేశాడతను.
"ఒకరు ఇండియాని జపాన్ లా చేయాలని కలలు కంటున్నారు. మరొకరు స్వయం సంరుద్దిని సాధించాలని తాపత్రయ పడుతున్నారు. ఇంకొకరు ఈ రెంటికీ రక్షణ కల్పిస్తానంటున్నారు. ఇక మిగిలిపోయిన నేను ఏం చేయాలి...?" క్రాంతి సాలోచనగా ఆ ముగ్గురికేసి చూపుల్ని మార్చి చూస్తూ అంది.
"సరే.... నీ జీవన విధానం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకోవటం సముచితంగా వుంటుంది. కానీ.... జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ దేశ రుగ్మతలకు శస్త్రచికిత్స దుర్గంధ భూయిష్టమైన జాతి శ్వాసకు ప్రాణ వాయువును అందించేలాంటి నిర్ణయమే నువ్వూ తీసుకుంటే బావుంటుంది" అన్నాడు విమల్.
మరికొద్దిసేపు ఆ నలుగురి మధ్య లోతయిన నిశ్శబ్దం పరుచుకుంది.
అప్పటివరకు అభిరామ్ కుడిచేయి అలాగే వుంది.
బుద్దిబలం, అభివృద్ధి పథం, ప్రగతికరం ప్రధానం కానీ భుజబలం దేనికీ అన్న ఆలోచనలు అటు విమల్ కు, యిటు మేఖలకూ యిద్దరికీ వుంది.
అందుకే వెంటనే వాళ్ళు చేతులు కలపలేకపోయారు.
"మీ ఉద్దేశ్యాలు నాకర్ధమయ్యాయి. ఇది రౌడీల రాజ్యం, గూండాల భోజ్యం అన్న స్థిరమయిన అభిప్రాయం నాది. అందుకే భుజబలం అనివార్యం అనేది నా సిద్దాంతం. అభివృద్దిని సాధిస్తూ అందనంత ఎత్తులకు ఎదిగే బృహత్తర కార్యక్రమాలలో భుజబలం, రక్షణ చాలా చిన్న విషయాలనే ఉద్దేశం మీకున్నట్లుగా నాకు తోస్తోంది. నో ప్రాబ్లమ్... కొన్నిటికి కాలమే పరిష్కారం చెబుతుంది....చెప్పాలి కూడా.... అప్పుడే చేతులు కలిపే విషయం గురించి ఆలోచిద్దాం" అంటూ అభిరామ్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు.
అప్పుడతని ముఖం వాళ్ళు తనతో చేతులు కలపలేదన్న నిస్పృహ ఏదీ కనిపించలేదు.
నలుగురూ చాపమీంచి లేచారు.
మేఖల ముందు, ఆ వెనుక అభిరామ్ గది బయటకు నడిచారు.
"సరీగ్గా 365 రోజులు... ఆల్ రెడీ వాటిలో ఒకరోజు గతంలోకి జారుకోబోతోంది. ఇక మిగిలింది 364 రోజులు మన సిద్దాంతాల్ని మనం బయట పెట్టుకోవాల్సిన రోజు కరెక్ట్ గా జనవరి 5 అవుతుంది. సో.... ప్రతి క్షణం మనల్ని హెచ్చరించే రోజు, మనల్ని అప్రమత్తుల్ని చేసే రోజు జనవరి 5 అవుతుంది... వస్తాం మరి గుడ్ నైట్" అంది మేఖల చిరునవ్వుతో వారికి వీడ్కోలు చెబుతూ, రోడ్డుదాటి వెళుతున్న ఆమెకేసి విమల్ చూస్తుంటే, అభిరామ్ ని క్రాంతి చూసింది.
* * * * *
మరో ఐదురోజులకు కొంచెం బిజీ సెంటర్ లో అతి కష్టంమీద ఒక గది అద్దెకు తీసుకున్నాడు విమల్.
విమల్ ఏం చేయబోతున్నాడన్నది ఎవరికీ అంతు చిక్కలేదు. అతని లాగే అతని ఆలోచనలు కూడా ఎవరికీ అర్ధంకావు. సరిగ్గా జనవరి ఎనిమిదినాడు అతను రెంట్ కు తీసుకున్న గది ముందు ఒక బోర్డు కనిపించింది.
దానిమీద "అదృష్టాన్ని అందుకునేందుకు అడ్డదారులు లేవు. కష్టపడుతూ క్రమంగా పైకి వెళ్ళాలనుకునే వారి కార్యసాధనకు మేం తోడ్పడతాం. ఇక్కడ ఫైనాన్షియల్ జీనియస్ మీ కలలకు ఊపిరి పోసేందుకు సిద్దంగా వున్నాడు" అని పెయింట్ చేసుంది.
రోడ్డంట వెళ్ళేవారు ఒక క్షణం ఆగి కొత్తగా వెలసిన ఆ బోర్డుకేసి దాని వెనుక వున్న గదికేసి ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు సాగిపోతున్నారు.
ఆ గదిలో కేవలం ఒక కుర్చీ, ఒక టేబుల్ వున్నాయి. గది లోపల గోడకు వున్న అల్మారాలో కొన్ని పుస్తకాలు, ఫైల్స్ వున్నాయి.
అదృష్టాన్ని అందుకునేందుకు యోజనాల దూరం నడిచే ఓపిక ఈ జనరేషన్ కి లేదు అనే నగ్నసత్యాన్ని రుజువు చేస్తూ ఆ రోజంతా విమల్ ని కలిసేందుకు ఎవ్వరూ రాలేదు.
* * * * *
అదే విధిలో విమల్ తీసుకున్న రూమ్ కి మరికొంత దూరంలో తనూ గదిని తీసుకుంది మేఖల.
"నిన్న ప్యారిస్ లో పుట్టుకొచ్చిన డిజైన్ నేడే మా దగ్గర దొరుకుతుంది. సెయింట్ లారెంట్ స్థాయి ఫ్యాషన్ డిజైన్స్ కావాలంటే మీరు విదేశీ కరెన్సీని ఖర్చుపెట్టనక్కరలేదు" అనే అక్షరాలు ఆ గదిముందు వేలాడదీసిన బోర్డుమీద పెయింట్ చేసున్నాయి. దానిక్రింద బ్లూ ఎలిఫెంట్ రడీమేడ్ కంపెనీ అని పెయింట్ చేసి ఆ షాపు అడ్రస్సు పెయింట్ చేసి వుంది చిన్న అక్షరాల్లో.
మేఖల ఒక రోజంతా తిరిగి ఒక టైలర్ ని, బట్టల వ్యాపారంలో బాగా అనుభవమున్న ఒక సేల్స్ మన్ ని పట్టుకుంది. ఆ నలుగురూ ఇప్పుడా గదిలో సమావేశమయ్యారు.
"బహుశా ఈపాటికి మిమ్మల్ని ఎందుకు ఇక్కడ సమావేశపర్చానో మీ కర్దమయి వుంటుంది" అందామె తలవంచుకొని నెమ్మదిగా పచార్లు చేస్తూ.
వాళ్ళు అర్దమయి, అర్ధంకాని సందిగ్ధ పరిస్థితిలో వున్నారు. "మీ షాపు ముందున్న బోర్డుని చూసి కొంత అర్ధం చేసుకోగలిగాం. పూర్తిగా మీరు తెలియచెపితే మేమేం చేయాలన్నది మాకర్ధమవుతుంది" అన్నాడు టైలర్.
"ఫ్యాషన్ అన్న మూడక్షరాల పదం వెనుక దాగిన భావం, అర్ధంతో వ్యాపారాన్ని ఆరంభించాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి. దానికోసం మిమ్మల్ని వెతికి పట్టుకున్నాను.
మీకు నెలవారి జీతం కావాలన్నా లేదా నేను చేయబోయే వ్యాపారంలో భాగం కావాలన్నా ఇచ్చేందుకు నేను సిద్దమే..." మేఖల కంఠంలో ధ్వనించిన స్థిరత్వానికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు.
"మాకంతా అయోమయంగా ఉంది. కట్ త్రోట్ కాంపిటీషన్ నడుస్తోందిప్పుడు మార్కెట్ లో దుస్తులు కొని కుట్టించుకునే ప్రాసెస్ పట్ల ప్రజలు విముఖత చూపుతున్నారు. దాంతో స్టాల్ వర్ట్స్ రడీమేడ్ బట్టల తయారీపట్ల మొగ్గు చూపుతున్నారు. ఆల్ రెడీ మార్కెట్ లో కొన్ని బ్రాండ్స్ పాపులర్ అయిపోయాయి. మంచి లాభాల దిశలో ఆ కంపెనీలు ప్రయాణిస్తున్నాయి. అలాంటప్పుడు మనం ముగ్గురం.... కేవలం మనం ముగ్గురం ఏం చేయగలం? ఎలా ఈ పోటీలో నెగ్గుకు రాగలం?" సేల్స్ మెన్ ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అన్నాడు.
మేఖల మౌనంగా వుంది. టైలర్ కూడా తన అభిప్రాయాలిని తెలియపర్చాక తను మాట్లాడితే బావుంటుందానే ఆమె మౌనంగా వుంది.
"నాదంతా ఒల్డు ఫ్యాషన్. నాకీ కాలపు ఫ్యాషన్స్ అంతగా తెలియవు. ఈ కాలం కుర్రాళ్ళు ఏ రకమయిన దుస్తుల పట్ల మొగ్గు చూపుతారో నాకంతగా తెలీదు. నేనేం చేయగలను మీకు? అయినా ఏది చేయాలన్నా లక్షల్లో పెట్టుబడి కావాలి. మరి మీరు?" టైలర్ సందేహంగా ఆగిపోయాడు.