అంతలో జలపాతం దగ్గరకు వెళ్ళిన వైశాలి, యువరాజు, కపాలేశ్వర్ వచ్చారు.
"ఇక్కడ మమ్మీలుంటాయా సార్" తడారిపోయిన గొంతుతో అడిగింది వైశాలి.
"అందుకే చిన్నపిల్లలు... అడవిలోకి రాకూడదంటారు. ఇక్కడ మమ్మీలు, డాడీలు ఎవరూ ఉండరు" నవ్వుతూ అన్నాడు యువరాజు.
"యువరాజూ కీప్ క్వయిట్. నీకేం తెలుసు" విసుక్కుంది వైశాలి.
ఆమెవైపు సీరియస్ గా చూసాడు యువరాజు.
"కొన్ని గిరిజన జాతుల్లో శవాల్ని భద్రపరిచే సంప్రదాయం ఇప్పటికీ వుంది. కలహండిలోని జువాంగులు, నీలగిరుల్లో ఉర్లా జాతులవారు తమ పూర్వుల శవాల్ని భద్రపరచి, ఏడాదికొకసారి, వాటిని బయటకు తీసి, పూజలు చేసి, పండుగలు చేస్తారని విన్నాను. ఆ కార్యక్రమాన్ని వారు రహస్యంగా చేస్తారు. ఆ సమయంలో మనలాంటి నాగరిక జనం అక్కడికి వెళితే మనల్ని చంపి శవాలు చేసేదాకా ఊరుకోరు" చెప్పాడు శంతన్ కుమార్.
రాత్రి భోజనాలయ్యాయి. గెస్ట్ హౌస్ డాబా మీద కూర్చుని, దూరంగా కొండలవేపు చూస్తూ రెడియోలోని హిందీ పాటల్ని వింటోంది వైశాలి. ఆమెకు కొంచెం దూరంలో కపాలేశ్వర్, ముత్యాలనాయుడు, యువరాజు కూర్చున్నారు.
రాత్రి పదవుతోంది.
"ఉదయాన్నే బయలుదేరాలి. నిద్రపోతే మంచిది" వైశాలి దగ్గరగా వస్తూ రేడియోని ఆఫ్ చేస్తూ అన్నాడు యువరాజు.
"నాకు టెల్వోక్లాక్ దాకా పాటలు వినడం హాబీ" విసుక్కుంటూ మళ్ళీ రేడియోని ఆన్ చేస్తూ అంది వైశాలి.
"మీ అలవాట్లని, కొన్నాళ్ళు ఎడ్జెస్ట్ చేసుకుంటే మంచిది" కోపంగా రేడియోని లాక్కుంటూ అన్నాడు యువరాజు.
"ఇక్కడ ఎవరికీ, ఎవరూ బాస్ కాదు- గుర్తుంచుకో" చివ్వున లేస్తూ అంది వైశాలి.
"బాస్ అని చెప్పడం లేదు. ఒక టీమ్ గా మనం వెళుతున్నప్పుడు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టణంలో ఉన్నప్పుడు మనం ఎలా వున్నా పర్లేదు. అడవిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పైన నీ ఇష్టం" కోపంగా మెట్లు దిగబోతూ మెట్ల అంచున నిలబడ్డ ఇందుమతిని చూసి ఆగిపోయాడు యువరాజు. విషయం అర్ధమైంది ఇందుమతికి- వైశాలి వైపు నడిచిందామె.
"అందరూ వున్నారు కాబట్టి చెప్తున్నాను. లిజన్ మీ కేర్ ఫుల్లీ- మనం వెళుతున్నది పెళ్ళీ పేరంటానికీ కాదు. ట్రెజర్ హంటింగ్ కి. భయంకరమయిన ఫారెస్ట్ లోకి. గ్రూప్ గా మనం వెళుతున్నప్పుడు ఆ గ్రూప్ కి ఒక లీడర్ వుండాలి. ఆ రెస్పాన్స్ బులిటీ నాది. కానీ మనల్ని నిత్యం కాపాడ్డానికి, మన మంచి చెడ్డలు చూడ్డానికి కేర్ టేకర్ గా వచ్చిన వ్యక్తి యువరాజు. ఇకనుంచి యువరాజు ఏం చెప్తే మనం మాట్లాడకుండా అదే చెయ్యాలి. దారీ, తెన్నూ లేని దట్టమైన భయంకరమయిన అడవిలోకి మనం వెళుతున్నాం. అక్కడ మనం చేసే ఏ చిన్న పొరపాటైనా మన ప్రాణాలకు ముప్పు తేవచ్చు. గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ నేను చెప్పను" సీరియస్ గా అంది ఇందుమతి.
"నిజమేనమ్మా... మంచి నిర్ణయం. అలాగే ఎవరెవరు ఏయే పనుల్ని చెయ్యాలో ముందుగానే నిర్ణయించేస్తే ఏ గొడవలుండవ్" అన్నాడు ముత్యాలనాయుడు నర్మగర్భంగా.
"అందరూ పడుకోండి. కపాలేశ్వర్ మీరొకసారి రండి" అంటూ మెట్లు దిగింది ఇందుమతి.
కింద హాల్లో- ఏయే దార్లంట ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు విశ్వరూపశర్మ- కపాలేశ్వర్ ఒక కాగితమ్మీద వాటిని నోట్ చేసుకుంటున్నాడు. అప్పటికే కపాలేశ్వర్ తనొక మాప్ ని సిద్ధం చేసుకున్నాడు- శంతన్ కుమార్ సజెషన్స్ ఇస్తున్నాడు మధ్య మధ్యలో.
-అదే సమయంలో.
డాబా మీద బెడ్ సర్దుకుంటూ యువరాజు వేపు కొరకొర చూస్తూ- "మమ్మీ అంటే తెలీనోడు కేర్ టేకరట" ఉడికిపోతూ అంది వైశాలి.
ఆ మాటకు చిర్రెత్తుకొచ్చింది యువరాజుకి.
"గ్రీన్ షిప్ లో ప్రపంచాన్నంతా మూడుసార్లు తిరిగివచ్చినోడ్ని- అరేబియా సముద్రంలో ఒకసారి సైక్లోన్ లో షిప్ మునిగిపోతే... నూట యాభై మైళ్ళు ఈదుకుంటూ ఒడ్డుకి వచ్చినవాడ్ని... నేను చదువుకోకపోవచ్చు... నేను తిరిగిన దేశాలు నువ్వు తిరగలేదు... నాకు తెలిసిన భాషలు నీకు తెలీవు. అండమాన్ అడవుల్లో భయంకరమయిన ట్రైబల్స్ చేతికి చిక్కి... వారి దగ్గర్నించి తప్పించుకుని, బైటకొచ్చినవాడ్ని" పౌరుషంగా అన్నాడు యువరాజు.
"నువ్వు తిరిగావో, తిరగలేదో నాకనవసరం. తెలిస్తే మమ్మీ గురించి చెప్పవోయ్" నిర్లక్ష్యంగా అంది వైశాలి.
ఆ నిర్లక్ష్యాన్ని భరించలేకపోయాడు యువరాజు. అదే ఏ మగవాడైనా అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే తాట వలిచేసేవాడు.
"మమ్మీస్ కన్సిడర్డ్ బైద ఈజిప్టియన్ యాజ్ ద రిప్రెజంటేటివ్ ఆఫ్ డెత్ గాడ్, హిజ్ బాడీ వజ్ మసాజ్డ్ విత్ ఆయిల్ అండ్ అదర్ పేస్ట్స్ బిఫోర్ టర్నింగ్ ఇన్ టూ ఏ మమ్మీ- శవాలు పాడైపోకుండా భద్రంగా వుంచే పద్ధతిని పూర్వకాలంలో ఈజిప్టియన్లు అవలంభించారు. శవం గర్భాన్ని పదునైన రాతితో కోసి లోపలున్న జీర్ణకోశం, లివరు తదితరమైన అవయవాలు తీసేసి ఖాళీగా చేస్తారు. గుండెను మాత్రం కదల్చరు కళ్ళున్నచోట వజ్రాలూ రత్నాలూ వుంచుతారు. శవానికి అనేకరకాలయిన రసాయనాలు, విలువైన సుగంధ ద్రవ్యాలూ పూసి దాదాపు నలభైరోజులపాటు నిల్వ వుంచి, మానవ శరీరంలో వున్న నీటిని ఇగిరిపోయేట్టు చేస్తారు. ఆ తర్వాత ఆ శవానికి పల్చటి దుస్తులు చుట్టి ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు హోదాను బట్టి ఆభరణాల్ని, రత్న, వజ్ర, వైఢూర్యాల్ని, విలాస వస్తువుల్ని, ఆహారధాన్యాలతో సమ సమాధుల్లో ఉంచుతారు. మహారాజ కుటుంబానికి చెందిన శవాలవైతే బ్రహ్మాండమైన పిరమిడ్లు కట్టి ఆ శవాల్ని వాటిల్లో భద్రపరుస్తారు.
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని ఆర్కియాలజీ మ్యుజియంని నువ్వెప్పుడయినా చూసావా? అందులో ఒక మమ్మీ వుంది. కావలిస్తే వెళ్ళి చూడు... గుడ్ నైట్" సీరియస్ గా చెప్పి మెట్లు దిగబోయాడు యువరాజు.
ఎదురుగా ఇందుమతి- తమ చర్చలకు యువరాజుని పిలుద్దామని పైకొచ్చిన ఇందుమతి మమ్మీ గురించి చెపుతుండటంతో ఆశ్చర్యంగా వింటూ వుండిపోయింది.
మొట్టమొదటిసారి యువరాజుకోసం వెళ్ళినప్పుడే యువరాజులో వున్న భిన్న మనస్తత్వాన్ని గమనించింది ఇందుమతి.
ఇది రెండోసారి. యువరాజు పట్ల వున్న నమ్మకాన్ని రెండింతలు చేసింది ఈ సంఘటన-
వైశాలి అయోమయంగా అయిపోయింది- సిగ్గుతో తల వంచుకుందామె.
"గట్టి పిండమే" అనుకున్నాడు ముత్యాలనాయుడు ఆనందంగా.
* * * *
ఉదయం ఆరుగంటలు-
"విష్ యూ ఆల్ ది బెస్ట్ బేబీ నేను చెప్పిన ప్రతి విషయం జ్ఞాపకం ఉంచుకుంటావుగదూ" విశ్వరూపశర్మ ఆర్ద్రత నిండిన గొంతుతో అన్నాడు.
రెండు చేతులు ముకుళించి ఆయనకు నమస్కారం చేసింది ఇందుమతి. ఇగ్నీషన్ 'కీ' తిప్పి జీపును స్టార్ట్ చేసి రెడీగా వుంచాడు యువరాజు.
శంతన్ కుమార్ ఉత్సాహంగా చేతులూపేడు.
ఇందుమతి గబగబా మెట్లు దిగి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువరాజు పక్కన కూర్చుంది. యాక్స్ లేటర్ మీద కాలేసాడు యువరాజు- మరుక్షణం జీపు ముందుకు దూసుకుపోయింది.
గెస్ట్ హౌస్ మట్టి దారిలోంచి, తారురోడ్డు మీద కొచ్చింది. కొండ చిలువలా మెరుస్తున్న తారురోడ్డు మీద జీపు ఎనభయ్ కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూంటే అందరూ ఉద్విగ్నత అంచులకు చేరుకున్నారు.
* * * *
నిముషాలు- గంటలు కాలగతిలో కరిగిపోతుంటే-
నాగరిక లోకంతో నెమ్మదిగా సంబంధం తెగిపోతుందన్నట్లుగా తారురోడ్డు మాయమయిపోతోంది. దూరంగా ఇసక దారి- అడవి మధ్య పెద్ద వాగు. రాళ్ళ నుంచి పారుతున్న నీరు- మనోహరమైన అడవి ప్రాంత దృశ్యాలు.
'తూర్పు కనుమలు ప్రారంభం' అన్న బోర్డ్ ని ఒకసారి చూసి జీపును మలుపు తిప్పాడు యువరాజు.
దూరంగా వరసగా నిలబడ్డ ఏనుగు గుంపుల్లా కొండలు- అటూ ఇటూ ఎత్తయిన దేవదారు వృక్షాల మధ్య నుంచి సన్నటి మట్టిబాట.
దూరంగా వెదురుపొదల మధ్య నుంచి దూసుకొస్తున్న వింత రాగాల గాలి. చేతి వాచీవేపు చూసింది ఇందుమతి.
"యువరాజూ! బాగా నీడున్న ప్రాంతంలో జీపుని ఆపు. లంచ్ చేద్దాం" చెప్పింది ఇందుమతి.
"కొంచెం ముందుకెళ్తే ఏదయినా చెరువు వస్తుందేమో" వెనక నుంచి చెప్పాడు ముత్యాలనాయుడు.
అప్పటికీ మెయిన్ రోడ్డుకి మూడుమైళ్ళ దూరంలో ఉన్నారు వాళ్ళు. సరయిన ప్రదేశం కోసం చూస్తూ డ్రయివ్ చేస్తున్నాడు యువరాజు.
మరో రెండు మూడు కిలోమీటర్లు దూరం ముందుకు వెళ్ళింది జీపు.
దూరంగా కొండమీద అక్కడక్కడ లక్కపిడతల్లా గుడిసెలు.
"ఆ కొండవార కనిపించేది తిమ్మాపురం- ఫారెస్టులో మొట్టమొదటి గిరిజన గ్రామం. కొంచెం ముందుకెళ్తే ఓ వాగొస్తుంది. అక్కడ ఆపండి" ఫారెస్టు గార్డు కురవభీముడు చెప్పాడు.
జీపు కురవభీముడు చెప్పినచోటే ఆగింది.
జీపు ఆగి ఆగడంతోనే అందులోంచి చిన్నపిల్లలా దూకింది వైశాలి. ఎటు చూస్తే అటు దట్టమైన పచ్చటి ప్రకృతి-
ఇరవై అడుగుల దూరంలో రోడ్డుకి కుడివేపున పెద్ద నల్ల మద్ది వృక్షాలు వరసగా సైనికుల్లా నించున్నాయి.
సుమారు ఎనభైవేల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన అడవి. పచ్చదనపు దుప్పటి కప్పుకున్న అందమైన అడవి.