Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 24


                                           15

 

    ధర్మయ్య పొలాన తోటలో వంకాయలూ, సొరకాయలూ, బెండకాయలూ కోసి గంపనింపాడు. బరువు గంపను నెత్తిమీద పెట్టుకున్నాడు. నెత్తి మీద బరువుతో, భారంగా అడుగులు వేస్తూ, నిప్పులు చెరిగే ఎండలో ఇంటికేసి నడకసాగించాడు.

 

    త్రోవలో ఎదురుపడి పలకరించిన వాళ్ళకు సమాధానాలు చెబుతూ ఇల్లు చేరుకున్నాడు. వళ్ళంతా చెమటతో తడిచిపోయి స్నానంచేసి వస్తున్నట్టు వుంది.

 

    ధర్మయ్య ఇంటికి వచ్చేప్పటికి సునంద హాల్లో రాక్ లో పుస్తకాలూ, తనకు వచ్చన ప్రైజులూ సర్దుకుంటూ వుంది. తల్లి పక్కనే నిల్చుని తళతళ మెరిసే కప్పుల్ని చూస్తూ, ఏది, ఎప్పుడు, ఏ సందర్భంలో వచ్చిందీ అడుగుతూ వుంది. సునంద నవ్వుకుంటూ తల్లి ప్రశ్నలకు విసుక్కోకుండా సమాధానాలు చెబుతూ వుంది.

 

    కూరగాయాల గంప నెత్తిన పెట్టుకొని లోపలకు వచ్చిన ధర్మయ్య ఓ క్షణం నిల్చుని తల్లీ కూతుళ్ళను చూశాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు గిర్రున వెనక్కి తిరిగి, వరండాలో ఓ మూల గంప దించాడు. తలగుడ్డ తీసి దులిపి, ముఖం, వళ్ళూ తుడుచుకున్నాడు. ఆ తర్వాత అదే తుండును భుజం మీద వేసుకొని హాల్లోకి వచ్చాడు.

 

    "ఇంత ఎండలో ఎక్కడ కెళ్ళావు నాన్నా!" సునంద తండ్రిని ప్రశ్నించింది.

 

    "ఆ కప్పు ఎప్పుడు వచ్చిందమ్మా?" మాటమారుస్తూ రాక్ లో సర్ది వున్న పెద్ద వెండికప్పును చూపిస్తూ అడిగాడు ధర్మయ్య.

 

    "వార్షికోత్సవంలో నాకు బెస్ట్ కాండక్ట్.... అదే మంచి ప్రవర్తనకు ఇచ్చారు నాన్నా!" అన్నది సునంద.

 

    ధర్మయ్య ముఖంలోని అలసట క్షణంలో మాయం అయింది. సంతృప్తితో కళ్ళు నిండిపోయాయి.

 

    "అదీ?" మరొకటి చూపిస్తూ అడిగాడు.

 

    "అదేరోజు నేను పాట పాడాను. దానికి స్పెషల్ ఫ్రైజు ఇచ్చారు."

 

    సునంద వరసగా ఏఏ ప్రైజులు, ఎందుకువచ్చాయో చెబుతూవుంటే ధర్మయ్య తన్మయత్వంతో మునిగిపోయి వింటున్నాడు.

 

    "ధర్మయ్యగారూ! ధర్మయ్యగారూ!" కొంపలు అంటుకుపోతున్నట్టు హడావిడిగా కేకలుపెట్టాడు కూరగాయల సుబ్బయ్య.   

 

    "బస్ వచ్చేసిందండి! త్వరగా...." ధర్మయ్య కంగారు అర్ధం చేసుకోకుండా అదే గొంతుతో అన్నాడు సుబ్బయ్య.

 

    ధర్మయ్య, సుబ్బయ్యకు కూరగాయల బుట్ట అందించాడు.

 

    "తూకంవేసే టైం లేదు. బస్ వెళ్ళబోతోంది. వంకాయ లెన్ని ఉంటాయి? బెండకాయలు కొంచెం ముదిరినట్లున్నాయ్? ఎంతో త్వరగా చెప్పండి" అన్నాడు సుబ్బయ్య.

 

    "అవన్నీ తర్వాత చూసుకుందాం! త్వరగా తీసుకెళ్ళండి!" గొంతు తగ్గించి గాబరాగా అన్నాడు ధర్మయ్య.

 

    "నిన్నటికంటే ఇవ్వాళ మార్కెట్ పడిపోయింది. కిలో వంకాయలు...."

 

    "అవన్నీ ఇప్పుడెందుకయ్యా! ఎంతోకంత ఇవ్వు!" విసుక్కున్నాడు ధర్మయ్య, సుబ్బయ్య మాటలకు మధ్యలోనే అడ్డువచ్చి.

 

    "నిన్నటికి మీ బాకీ ఇంకా ఇరవై రూపాయలు వుంది. ఇవికూడా తూకం వేయించి...." అమాయకంగా తన ధోరణిలోనే మాట్లాడుకుంటూ పోతున్నాడు సుబ్బయ్య.

 

    "సరే! సరే! తీసుకెళ్లు! ఆ లెఖ్ఖంతా తర్వాత చూసుకుందాం!" అన్నాడు ధర్మయ్య.

 

    "మళ్ళీ వస్తాను!" ఒక అడుగు ముందుకేసి ఆగి "ఇవ్వాళ టమాటాలు లేనట్లున్నాయ్!" లొడలొడ మాట్లాడుతున్నాడు సుబ్బయ్య.

 

    "ఇంకా పదునుకు రాలేదు. నాకు తొందర పనివుంది. ఇక నువ్వెళ్ళు." అన్నాడు ధర్మయ్య లబలబలాడిపోతూ.

 

    కూతురు ఎక్కడ చూస్తుందోనని ధర్మయ్యకు కంగారుగా వుంది.

 

    సుబ్బయ్య గంప నెత్తిమీద పెట్టుకొని వెళ్ళిపోయాడు.

 

    కూరగాయల సుబ్బయ్య వీధివాకిలి దాటగానే, ఏదో పెద్ద బరువు దించుకున్నవాడలా నిట్టూర్చి, తిరిగి ఇంట్లోకి రాబోతున్న ధర్మయ్య వాకిట్లో నిల్చునివున్న సునందను చూసి గతుక్కుమన్నాడు. విషాదచ్చాయలు ముసురుకొని వున్న కూతురి ముఖంలోకి చూసి ధర్మయ్య పేలవంగా నవ్వాడు.

 

    సునంద ఏదో అనబోయి ఆగిపోయింది. భారంగా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ధర్మయ్య కొద్ది నిముషాలపాటు నిల్చున్నచోటే వుండిపోయాడు.

 

    నాన్న కూరగాయలు పండించి అమ్ముతున్నాడా? తనే ఇంత ఎండలో కూరగాయలు కోసి గంపనెత్తినపెట్టుకొని వచ్చాడా? తమ కుటుంబం ఆర్ధిక పరిస్థితులు ఇంత హీనంగా ఉన్నాయా? తన చదువుకోసం నాన్న ఉన్న కొద్ది పొలంకూడా అమ్మేశాడు! తన తండ్రి పువ్వులు అమ్మిన ఊళ్ళో కట్టెలు అమ్ముతున్నాడు. అయినా నిండుగా, తొణక్కుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ జీవిస్తున్నాడు.

 

    సునంద కళ్ళలో గిర్రున నీరు తిరిగింది.

 

    "ఏమ్మా అలా కూర్చున్నావ్? ఇంకా భోజనం చెయ్యలేదా? మీ అమ్మ ఏం చేస్తూంది ఇంకా?" విషాద పూరితమైన చిరునవ్వు పెదవులమీద తొణికిసలాడుతుండగా అన్నాడు ధర్మయ్య.

 

    "వడ్డించాను. ఇద్దరూ రండి!" అంటూ సరస్వతమ్మ వంటింట్లో నుంచి బయటకు వచ్చింది.

 

    "లే తల్లీ! చాలా ఆలస్యం అయింది!" అంటూ ధర్మయ్య వంటింట్లోకి దారితీశాడు. సునంద దిగులుగా తండ్రిని అనుసరించింది.


                                          16


    గ్రామం నడిబొడ్డున రచ్చబండమీద నిలబడి రామిగాడు డప్పు వాయిస్తున్నాడు. దండోరా విని చుట్టూ జనంచేరారు. దండోరా ఆపి రామిగాడు పెద్దగా అరుస్తూ చెప్తున్నాడు....

 

    "డేగలమర్రి పంచాయితీ సమితి ప్రెసిడెంటుగారైన శ్రీశ్రీశ్రీ సిరిమాన్ నరహరిగోరు మన గ్రామానికి ఇచ్చేయబోతున్నారహో!" అంటూ రెండుసార్లు డప్పుమీద దెబ్బలు వేసి, ఆపి మళ్ళీ అందుకున్నాడు__ "ఆరు ఇచ్చేసి, మన మయిలామండలి బవనానికి భూస్తా.... కాదు.... చంకుత్తాపన సేయబోతున్నారహో!!" మళ్ళీ మూడుసార్లు డప్పుమీద వాయించాడు.

 

    మరికొంతమంది వచ్చి చుట్టూ చేరారు.

 

    దండోరా ఆపి, మళ్ళీ అందుకొన్నాడు రామిగాడు__ "కనీ ఇనీ ఎరగనిదీ, ఈ త్తాపన - ఇది ఇట్టాంటి అట్టాంటి చంకుత్తాపనకాదు_శ్రీవారు సొయంగా శమట కార్సి శమదానంశేసి చంకుత్తాపన సేత్తారు __ గాన మీరంతా ఇచ్చేసి మీమీ శమదానాన్ని ఇచ్చి.... మమ్మల్నానంద పర్సగోర్తున్నా మహో!" డప్పు గట్టిగా మోగించసాగాడు.

 

    అంతావిని జనం వెళ్ళిపోయారు. రామిగాడు దండోరావేస్తూ పదిమంది చేరినప్పుడల్లా ఆ మాటల్నే తిప్పితిప్పి అరుస్తూ చెబుతున్నాడు.


                                          17


    ఇప్పటికే ఊళ్ళో పెద్దలు చాలామంది శేఖరం భవంతిలో చేరారు. శేఖరం తయారై బయటికి వచ్చి అందర్నీ పలకరించాడు.

 

    రాణీని వెతుక్కుంటూ పెరట్లోకి వచ్చాడు శేఖరం. ఇంకా ఎంతో సమయంలేదు. రాణీ ఇంకా ముస్తాబు కాలేదు. శేఖరానికి చిరాకు వేసింది.

 

    "రాణీ! ఏమిటి ఇంకా అట్లాగే నిలబడివున్నావ్? ఇంకా స్నానం కూడా చెయ్యలేదా?" విసుక్కున్నాడు శేఖరం.

 

    "దీనికి తలుపులేదు, ఎట్లా స్నానం చెయ్యమంటావ్?" పెరట్లో స్నానాల గదిముందు నిలబడి చిరాగ్గా అన్నది రాణి.

 

    "ఇక్కడ అంతేలే! లోపలకు ఎవరూ రార్లే!" అన్నాడు శేఖరం.

 

    "ఎట్లా బావా! తలుపులేని బాత్ రూంలో స్నానం చెయ్యడం? ఏం పల్లెటూర్లు బాబూ!" విసుక్కుంటూ అలాగే నిల్చుంది.

 

    "ఏడ్చినట్టేవుంది. అవతల పెద్దమనుష్యులు వచ్చి కూర్చున్నారు. ఏర్పాట్లన్నీ చెయ్యాలి. త్వరగా తెములు!" అంటూ శేఖరం హాల్లో కూర్చునివున్న పెద్దల దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.

 

    "మమ్మల్ని ఏం చెయ్యమంటారో చెప్పు శేఖరం!" అడిగాడు పరమయ్య.

 

    "సాయంత్రం మీటింగుకి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరే చూసుకోవాలి. డబ్బుకు వెనకాడవద్దని మామయ్య చెప్పాడు" అన్నాడు శేఖరం.

 

    "సభ అయిపోయాక భోజనం ఏర్పాట్లు వున్నాయ్ గదా?" రామయ్య ప్రశ్నించాడు.

 

    "ఆఁ ! ఊరందర్నీ పిల్చారనుకుంటా! భారీగానే చేస్తున్నారు" అన్నాడు మరో పెద్దమనిషి.

 

    "అవునండీ! ఊళ్ళో వున్న అన్ని తెగలవాళ్ళకూ భోజనం ఏర్పాట్లు చేస్తున్నాం! ఆ ఏర్పాట్లన్నీ చలమయ్యగారు చూసుకుంటున్నారు" అన్నాడు శేఖరం.

 

    "సభ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాలే! అన్నాడు పరమయ్య.

 

    అలా తలొక బాధ్యతా తీసుకున్నారు. ఒక్కొక్కరే వెళ్ళిపోయారు.

 

    "చూడు బాబూ! నువ్వెళ్ళి ఒకసారి ధర్మయ్యను ఆహ్వానిస్తే బాగుంటుంది!" అన్నాడు జానకిరామయ్య లేచి నిలబడి.

 Previous Page Next Page