Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 24


                                    శ్రీ బాలగంగాధర తిలక్

    త్రిశూలము

    వివేకం:

    నమ్మకు నవ్వలేనివాడిని
    పువ్వులు చిదిమేవాడిని
    బరిమీద వదలిన పాముని
    చైనా వాడిని.

    నమ్మకు హంతకుని యీటెని
    గోతులున్న బాటని;
    బోగందాని పాటని
    చౌ ఎన్ లై మాటని.

    నమ్మకు మొసళ్లున్న సరస్సుని
    మూర్ఖు డధ్యక్షించిన సదస్సుని
    సినీతార వయస్సుని
    మావ్ సేటుంగ్ మనస్సుని.

    ధర్మం:

    సరిహద్దు మాత్రమే అయితే
    సరిపెట్టుకోవచ్చు నొకలాగ.
    చిరకాలం కృషిచేసి మానవుడు
    స్థిరంగా నిలుపుకున్న విలువల్ని
    చెరపివేస్తానంటే, ఊరుకోవడ మెలాగ?
    దేశానికి హద్దులూ, ప్రవర్తనకి ఎల్లలూ,
    ఆవేశాలకి మితీ, కావేషాలకి పరిమితీ,
    అవసరం మానవ సౌఖ్యానికీ, సఖ్యానికీ,
    అందుకే అనాదిగా చరిత్రకి పునాదిగా
    పొందుపరిచారు జాతికీ, వ్యక్తికీ స్వతంత్రం;
    అందంగా, అందర్నీ,
    సమంగా వాడుకొమ్మన్నారు.
    అవి కాదని వాదుకు సిద్ధమయితే,
    యుద్ధానికి కాలుదువ్వితే,
    ఊరుకునే చవట యీ కాలంలో ఎవడు?
    ఉరుకుతాడు సింహంలా ముందుకి నరుడు!
    చివ్వకు ప్రతి భారతీయుడూ ఒక కవ్వడి;
    గవ్వకు మారడు శత్రువు వాడెవడైనా.
    ఇకనుంచైనా చైనా బుద్ధిగా మెలగకపోతే,
    క్రకచంవంటి ప్రజాబలం కంఠాన్ని కోస్తుంది;
    సకల ప్రపంచం సంఘటితమై ఎదురిస్తుంది;
    మునిపటివాళ్లంకాదు, ముసలివాళ్లం కాదు,
    మొనతేరిన బాకులమై మోహరించి నిలుస్తాం!

    సాహసం:

    ప్రతి సోల్జర్ ఒక శతఘ్ని;
    ప్రతి పౌరు డొక దవాగ్ని;
    ప్రతినబూని నిలబడు నిటారుగా;
    బ్రతుకెందుకు స్వతంత్రం పోవగా;
    ఇదే అదను పదును పెట్టు
    పదేపదే యెద మొహదా,
    మనదేశం, మనస్వప్నం,
    మరచిపోకు! వెరచిరాకు!
    మనిషికి ఒకసారే మరణం.

                                        *  *  *  *   

 Previous Page Next Page