Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 24

తను కోమాలోకి వెళ్ళిపోతున్నట్లుగా, మగత ఆవరిస్తున్నట్లుగా అనిపించింది రవిచంద్రకి. తను జీవమూ, రక్త మాంసాలూ లేని ప్లాస్టిక్ బొమ్మ అయినట్లూ, భానురేఖ మాటల వేడికి తను కరిగి రూపం కోల్పోయి, మట్టితో మురుగులా మారిపోయినట్లూ భ్రమ కలిగింది.
తను తన ప్రాణాన్ని సులభంగా తీసుకోగలడు గానీ, ప్రాణానికి ప్రాణమైన భానురేఖని ఎలా చంపగలడు? ఇంపాజిబుల్!! నెవర్! నెవర్!!
"ఏమంటారు?" అంది భానురేఖ ఆదుర్దాగా.
తేరుకున్నాడు రవిచంద్ర. అలర్టుగా అయిపోయింది అతని మనసు. త్వరత్వరగా ఆలోచించడం మొదలెట్టాడు. తను ఇప్పుడీ అమ్మాయి చెప్పినపని ఒప్పుకోకుండా మందలించవచ్చు. భయపడి ఇప్పటికి ఊరుకుంటుంది భానురేఖ. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరితోనో ఇదే బేరం పెట్టవచ్చు. డబ్బుకి ఆశపడ్డ వాళ్ళెవరైనా ఆమెను చంపెయ్యడానికి ఒప్పుకోవచ్చు. ఒప్పుకోకపోతే భానురేఖే తనంతట తాను మళ్ళీ ఇంకోసారి ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యవచ్చు.
అందుకని తను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత తీరిగ్గా ఆలోచించుకోవాలి. అంతకంటే ముందు తను సీరియస్ గానే చెబుతున్నానని ఆ అమ్మాయి నమ్మకం కలిగించాలి.
"సరే! చంపుతాను. కానీ ఇది చాలా డేంజరస్ టాస్క్! దొరికిపోతే నా ప్రాణాలు పోతాయి. లక్షరూపాయలు చాలవు. రెండు లక్షలిస్తే ఫినిఫ్ చేసేస్తాను."
భానురేఖ మొహం ఒక్కసారిగా వికసించి, మళ్ళీ వెంటనే వాడిపోయినట్లయింది.
"రెండు లక్షలా! రెండు లక్షలయితే నా దగ్గర లేవు!" అని గబగబా నోటితోనే లెక్కవేసింది భానురేఖ. మా నాన్నగారు నా పేరుతో కొన్ని ఫిక్స్ డ్ డిపాజిట్లు వేశారు. అవన్నీ బ్రేక్ చేసి లక్షా పాతికవేల దాకా తేగలను. అంతకంటే ఎక్కువ నాకు దొరకదు. ప్లీజ్! నామీద దయుంచి ఆ డబ్బుతో సరిపెట్టుకుని నన్ను చంపెయ్యండి! ప్లీజ్!" జాలిగా అడిగింది భానురేఖ.
తనకి చాలా నష్టం జరిగిపోతున్నట్లు మొహం పెట్టాడు రవిచంద్ర. నానుస్తూ, "సరే! మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి, సరిపెట్టుకుంటాలెండి" అన్నాడు.
"డబ్బు తక్కువ ఇస్తున్నానని మీరు తేలిగ్గా తీసుకోకూడదు. నిజంగానే చంపెయ్యాలి నన్ను."
"ష్యూర్!"
"థాంక్స్! థాంక్స్ ఎలాట్! ఇక వెళ్దామా?"
"సరే!" అని అయిష్టంగానే లేచి నిలబడ్డాడు రవిచంద్ర. ఆమె వెళ్ళిపోతుంటే గుండెలు పిండేసినట్లయి గుర్తొచ్చింది ఒక కవిత, "ఎవరి ప్రాణమన్నా ఎగిరిపోతుండగా నువ్వెప్పుడన్నా చూశావా? అదిగో చూడు! నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోతోంది"
"మిస్ భానురేఖా!"
తిరిగి చూసింది భానురేఖ.
"రేపు ఒక్కసారి చివరిసారిగా మనం కలుసుకుందాం. రేపు మధ్యాహ్నం హోటల్లో గ్రాండ్ ఫేర్ వెల్ పార్టీ ఇస్తాను మీకు. ఆ తర్వాత.. ఆ తర్వాత మనం ఇంక కలుసుకోం!"
కొద్దిగా ఆలోచించి "సరే!" అంది భానురేఖ.
                                                            * * * *

పెద్ద హోటలు అది. మధ్యాహ్నం పూట కాబట్టి ఎక్కువ మంది కస్టమర్లు లేరు.
రెస్టారెంట్ లోకి భానురేఖ రావడం చూసి లేచి నిలబడ్డాడు రవిచంద్ర. "రండి! రండి! చూసి చూసి ఇంక మీరు రారేమో అని భయపడ్డాను."
మాట్లాడకుండా కూర్చోబోయింది భానురేఖ.
"ఇక్కడ వద్దు! స్విమ్మింగ్ ఫూల్ దగ్గరయితే చల్లగా ఉంటుంది." అన్నాడు రవిచంద్ర.
ఉదాసీనంగా అటువైపు నడిచింది భానురేఖ.
స్విమ్మింగ్ ఫూల్ పక్కనే ఎత్తుగా డెక్ వుంది. నీడ కోసం నిలువు చారల షామియానా వేసి ఉంది అక్కడ. దాన్లో కూర్చున్నారు. స్విమ్మింగ్ ఫూల్ లోని నీళ్ళు ఆకుపచ్చ, నీలం కలిసిన టర్ కోయిస్ బ్లూ కలర్ లో కనబడుతున్నాయి.
పావుగంట తర్వాత వచ్చాడు వెయిటరు. "బాగా హెవీగా ఆర్డర్ చెయ్యండి. నా తృప్తి కోసం" అన్నాడు రవిచంద్ర.
"అస్సలు ఆకలి లేదు. ఫ్రూట్ పంచ్ తాగుతాను" అంది భానురేఖ నిర్లిప్తంగా.
ఆశాభంగం చెందినట్లు చూశాడు రవిచంద్ర. ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చెయ్యబోతే, ఇష్ట దేవత అవన్నీ తిరస్కరించి, మంచి తీర్థం మాత్రం ముట్టుకున్నంత బాధగా ఉంది అతనికి.
రెండు ఫ్రూట్ పంచ్ ఆర్డరు బుక్ చేసుకుని వెయిటర్ వెళ్ళిపోయాడు.
"మీతో కలిసి లంచ్ తీసుకోవచ్చని ఆశపడి నేను పొద్దున నుంచి ఏమీ తిననే లేదు" అన్నాడు రవిచంద్ర.
"అదేమిటి? నా కోసం మీరు కూడా మానెయ్యడమెందుకు? ఏదన్నా ఆర్డర్ చెయ్యకపోయారా?"
"మీరేమీ అనుకోరా?"
"నేనేం అనుకుంటాను?"
"సరే! వెయిటర్ రానివ్వండి! బకాసురుడిలా భోజనానికి ఆర్డరిస్తాను"

 Previous Page Next Page