ఆమె ఫోన్ చేస్తే ఫిబ్రవరి 14కి సమాధానం చెప్పాలని అతనిలో ప్రోగు చేసుకున్న ఉత్సాహం, ఉద్వేగం సాంద్రత ఒకింత తగ్గిపోయినట్లయింది.
కార్డ్ లెస్ ఫోన్ చేతిలో పట్టుకొని కిచెన్ వైపు నడిచాడు.
ఆకలేసినప్పుడు మెస్ కెళ్ళి భోంచేయాలన్న కోరికను కూడా అపరిచితురాల్నుంచి ఫోన్ కాల్ వస్తుందన్న ఆశ చంపేసింది.
ఫ్రిజ్ లోంచి ఎగ్స్ తీసి ఆమ్లెట్ వేసుకొనే ప్రయత్నంలో పడ్డాడు.
మరి కొద్దిక్షణాలు గడిచాయి.
సరిగ్గా అప్పుడే మోగింది ఫోను. వెంటనే కార్డ్ లెస్ ఆన్ చేసి-
"హలో..." తనలో రేగుతున్న ఉద్వేగాన్ని అణచుకుంటూ అన్నాడు శ్రీధర్.
అటువైపు నుంచి ఏం విన్పించలేదు.
"హలో... హలో... హలో..." అన్నాడు గట్టిగా.
"పూర్వజన్మలో కోర్టులో అమీన్ ఉద్యోగం చేశావా?" కిలకిలా నవ్వుతూ అంది అపరిచితురాలు.
"అదేంటి అలా అడిగావ్? నీకు పూర్వజన్మలు, పునర్జన్మల పరిజ్ఞానం కూడా వుందా మహాతల్లీ?"
"ఏ విషయాన్నైనా మూడుసార్లు వెంట వెంటనే ఉచ్ఛరిస్తే కోర్టు అమీన్ అనక ఏమంటారు?"
"మరి ఎంతకీ పలక్కపోతే ఏం చేయాలి? ఇండియాలో టెలికమ్యూనికేషన్స్ ఐతే బాగానే డెవలప్ అయ్యాయిగానీ, జనాలకి ఫోన్ లో ఎలా మాట్లాడాలో బొత్తిగా తెలిచ్చావదు. అవతలివాడు మనకు ఫోన్ చేసి తనెవరో, తన పేరేమిటో చెప్పకుండా, ఎవరు మాట్లాడేది అని మనల్నే అడుగుతాడు. ఐడోన్ట్ లైకిట్. ఫోన్ మ్యానర్స్ తెలియని వాళ్ళంటే నాకు మహా చెడ్డ చిరాకు. ఈ హైదరాబాదులో అయితే మరీ ఘోరం, 'కౌన్ బాత్ కర్ రహే' అని వాడు ఫోన్ చేసి మనల్ని నిలదీస్తాడు.
ఫోన్ చేసినపుడు నా పేరు ఇది, నాకు ఫలానావాళ్ళు కావాలి అని అడిగి, వాళ్ళు లైన్లోకొచ్చాక అప్పుడు అసలు విషయం మాట్లాడాలి. ఇవేవీ తెలియదిక్కడి వాళ్ళకి" కావాలనే కవ్వింపుగా అన్నాడు శ్రీధర్.
"నీకు డొంకతిరుగుడుగా మాట్లాడ్డం కూడా వచ్చే... ఇంతకీ నీకు నా పేరు చెప్పి, నేనెవరో చెప్పి, నాకేం కావాలో చెబితేగానీ నీకు నచ్చదన్నమాట..."
"అవును. దాని సంగతలా వుంచు, ఫిబ్రవరి 14 గురించి చెప్పనా?" వుత్సాహంగా అన్నాడు శ్రీధర్.
"ఈ రోజుల్లో కూడా వాలెంటైన్ డే గురించి చెప్పడానికి గంట టైం తీసుకోవడం చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని మన మన్మథుడే కాదు, ఫెబ్రుటా కూడా క్షమించడు. నీలాంటి వాళ్ళని, గాల్లో సూక్ష్మరూపంలో తిరుగుతుండే వాలెంటైన్ ఆత్మ అస్సలు క్షమించదు. బైదిబై మరో 40 రోజుల్లో ఫిబ్రవరి 14 రాబోతోంది. ఆ తర్వాత మరో పదిహేను రోజుల్లో మార్చి ఒకటికూడా వస్తుంది. అంటే ఈరోజు జనవరి 5. ఈ దినాల్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది... ఆలోచించు. పాపం నువ్వు నీ పర్సనల్ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చిందరవందర చేసినా ఫలితంలేక నేనిచ్చిన గడువులోపల మరెక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చుంటావు. అవునా?"
ఆమె మాటలు వింటూనే విభ్రాంతికరమైన అనుభూతికి లోనయ్యాడు శ్రీధర్.
ఈ అమ్మాయికేమైనా టెలిపతి తెలుసా? లేక క్షుద్రవిద్యలో ప్రవేశం వుందా? ఇంత ఖచ్చితంగా ఎలా వూహించగలుగుతోంది? శ్రీధర్ కి మతిపోతోంది ఆమె గురించి ఆలోచిస్తూంటే.
"మాటల్లో తప్పున్నా ఫర్వాలేదు, కానీ, మనసుమాత్రం తప్పుచేయకూడదు. నువ్వు మిగతా విషయాల్లో బ్రిలియంట్ వే కావచ్చు...కానీ, అమ్మాయిల విషయంలో, ప్రేమ విషయంలో పిచ్చ అమాయకుడివి. ఆమ్లెట్లు వేసుకోవడం, ఆడ బొద్దింకలతో సహవాసం చేయటం, అందే వాళ్ళని వదిలేసి అందని అపర్ణకోసం అర్రులు చాచడం అసమంజసం. వీటి గురించి ఆలోచించకుండా అందమైన అనుభూతుల్ని అరమరికలు లేకుండా అందిస్తున్న నాపై విరుచుకు పడటం, నన్ను కవ్వించడం మంచిది కాదబ్బాయ్...వెనకటికొకడు నీలాంటివాడే అమావాస్యనాడెందుకు కయ్యానికి దిగావంటే ఎదుటివాడికి అచ్చిరాకుండా వుండటానికి అని అన్నాడట" అందామె తొలకరి చినుకులు చిలకరించినట్లుగా నవ్వుతూ.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమె నార్త్ ఇండియన్ అయి వుండదు.
కారణాలు : 1. స్వచ్చమైన తెలుగు భాష.
2. తెలుగు సామెతలు.
నార్త్ ఇండియన్ అమ్మాయికి ఇవి అబ్బే అవకాశంలేదు. ఇకపోతే మిగిలింది ఒకటే క్లూ? నల్లపిల్ల.
"ఒకరు ఒకసారి నిన్ను మోసగిస్తే అది వారితప్పు. రెండుసార్లు మోసగిస్తే అది నీ తప్పు. ప్రేమకి, ప్రచారానికి అసలు పడదు. ప్రేమను నువ్వు ప్రేమిస్తే -ప్రచారాన్ని ఆమె ప్రేమిస్తోంది.
కలవని రైలు పట్టాల్లాంటి జీవితాన్ని ఎవరూ ఎప్పుడూ కోరుకోకూడదు..." చెప్పటం ఆపిందామె.
కొద్ది నిమిషాలవరకు శ్రీధరేం మాట్లాడలేకపోయాడు. అపరిచితురాలు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూండిపోయాడు.
"ఆలోచన ఎప్పుడూ మంచిదే. బాగా ఆలోచించుకో-మరో 40 రోజుల్లో ఫిబ్రవరి 14 రాబోతుంది. ఆ తర్వాత మరో పదిహేను రోజుల్లో మార్చి ఒకటికూడా వస్తుంది. ఈ రోజు జనవరి 5. ఈ దినాల్ని సద్వినియోగం చేసుకొనే దిశకేసి ప్రయాణించడం మంచిది. ఈ పాతా పాతా బొమ్మలెపుడూ కొత్త వేనండి...రేఖలకి ప్రాణంపోసి రేఖంత అందమైన అమ్మాయిని సృష్టించగల బాపు తీసిన బాలరాజు కథ సినిమా చూశావా? ఇప్పుడు నేను చెప్పే కొటేషన్ పాతదే అయినప్పటికీ ఎప్పుడూ కొత్తగానే వుంటుంది- నువ్వు ప్రేమించే వారికన్నా నిన్ను ప్రేమించేవారి మూలంగానే ఎక్కువ సుఖపడతావ్. నీ ఆలోచనల్లోకి ఈ విషయాన్ని కూడా ప్రవేశపెట్టుకో..."
అప్పటికీ శ్రీధరేం మాట్లాడలేదు. ఆకాశమెత్తు ఆలోచనలు అతని అంతరంగాన్ని శస్త్రచికిత్స చేస్తున్నాయి.