Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 23


                                         విజయశ్రీ
                                                 (కురుక్షేత్ర వీరకావ్యము)

                                                   ప్రస్తావన
    
    ఎన్ని మారులు చదివినా తనివితీరని గ్రంథం మహాభారతం. చదివిన కొద్దీ చవులూరించే వీరభారత గాథ అది. అది కేవలం కౌరవ పాండవ ఇతిహాసమే కాదు; ధర్మశాస్త్రమూ, నీతిశాస్త్రమూ, కూడాను. ఆంధ్రమహాభారత రచయితలలో ప్రప్రథముడైన నన్నయ భట్టారకుడే చెప్పాడు, ఏమనంటే -
    
    ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం బని,
        యధ్యాత్మవిదులు వేదాంత మనియు.
    నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని,
        కవివృషభులు మహాకావ్య మనియు.
    లాక్షణికులు సర్వలక్షణం బనియును,
        నైతిహాసికు లితిహాస మనియు.
    పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ
        యం బని మహిఁ గొనియాడుచుండ
    వివిధవేదతత్త్వవేది, వేదవ్యాసుఁ,
    డాదిముని, పరాశరాత్మజుండు.
    విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
    పరుగుచుండఁజేసె భారతంబు.
    
    అని. అందువల్ల మహాభారతం ఒక విజ్ఞాన కోశమే. అది తెలుగులోకి పరివర్తన అయిన నాటినుంచి నేటివరకు తెలుగువారి కది ఒక ధార్మిక దర్శనం; నీతి ముక్తావళి; తత్త్వశాస్త్రం. ఆంధ్రమహా భారతమే ఆంధ్రజాతి సభ్యతకు పునాదులు వేసినదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రసంస్కృతికి ఆంధ్రమహాభారతము ప్రధాన ప్రాతిపాదిక. భాగవతం మినహాయిస్తే ఆంధ్రదేశం అంతటిలోనూ రామాయణుని కంటేకూడా మహాభారతానికే ఆదర ప్రచారాలు ఎక్కువ. భారత భాగవతాలలోకూడా దేనికి దేశంలో మొగ్గో చెప్పటం కష్టమే. భారతం పురాణం చెప్పించటం ఆంధ్రదేశంలో ఇప్పటికీ ఉంది. తెలుగు వారిలో భారతం ఇంటిపేరు గలవారు కూడా ఉన్నారు. అది పౌరుష నామమే. భారతం పురాణం చెప్పడంలోనో, మహాభారత రహస్యాలు వివరించి వ్యాఖ్యానించడంలోనో వారికి గల ప్రజ్ఞనుబట్టే ఆ యింటిపేరు కలిగి వుంటుంది.
    ఆంధ్ర మహాభారత ప్రభావం ఇప్పటికీ తెలుగువారిమీద మాసి పోనూలేదు; తగ్గనూలేదు. ఇప్పటికీ మహాభారతగాథ అనేకులను ఉత్సాహపూరితులనూ ఉద్వేగపూరితులనూ చేస్తూనే వుంది. భారత గాథలు కథలుగా, నవలలుగా, నాటకాలుగా, నాటికలుగా, హరికథలుగా, పాటలుగా రచింపబడి తెలుగుదేశంలో నేటికీ ముమ్మరంగా ప్రచారంలో వున్నాయి. చదువు వచ్చినవారికే కాకుండా చదువురానివారికి కూడా స్త్రీ పురుషులలో వృద్దులకూ, యువకులకూ బాలబాలికలకూ కూడా కౌరవపాండవ గాథ తెలుసు. ఈ మహాభారత గాథతోడి పరిచయం చదువుకొన్న వారికే కాకుండా చదువురాణి వారికి కూడా ధర్మరహస్యాలు తెలియజెప్పి వారి జీవితాలను చక్కదిద్దింది. తెలుగునాటిలో ధర్మరాజు ధర్మపరాయణత, భీముడి వేగిరపాటు, అర్జునుడి చురుకుపాలు, నకుల సహదేవుల ఉద్వేగము, శ్రీకృష్ణుడి నీతికౌశలము ఎందరెందరిని ఆశ్చర్య ఉద్రేక ఉత్సాహపూరితులను చేసినవో! పాంచాలి పడిన భంగపాటు, కౌరవ దుస్తంత్రాలు ఎందరెందరిని విచార క్రోధావేశ పరులను చేసినవో!
    మహాభారత గాథ అంతా మన వృత్తమే; మానవ ఇతిహాసమే. రాజ్యం పంపకంకోసం పాళ్ళు తెగక పోరాడుకొన్న రాచబిడ్డలు, అన్నదమ్ముల కలహం, నేటికీ భారతవృత్తం మనకు సజీవగాథే. కొన్ని సందర్భాలలో అర్జునుడు నీవాతకవచ సంహారం చేసి ఇంద్రుడికి హితముకూర్చి అమరావతికి వెళ్ళి అతడి అర్ధాసనం అధిష్ఠించడం, శ్రీకృష్ణుడు విశ్వరూపందాల్చడం వంటి అప్రాకృత, దివ్యచర్యలు చేసినట్లు మహాభారతంలో చెప్పి ఉన్నప్పటికీ మొత్తంమీద కౌరవులు పాండవులు కూడా రాగద్వేషాలకూ, క్రోధ మోహ భయ లోభ మద మాత్సర్యాలకూ లోని మనలాగే ప్రవర్తించిన వట్టి ప్రాకృతులే. నేటికీ మన కుటుంబాలలో భీములూ వున్నారు; దుర్యోధనులూ వున్నారు. మన రాజకీయాలలో, మన కుటుంబాలలో సంభవించే కలహాల్లో కౌరవ పాండవ గాథల ఛాయలూ చహరాలూ కనబడతాయి.
    భారతగాథ అంతటిలోనూ ఉద్యోగపర్వంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టం హృద్యాతిహృద్యమై మన మనస్సులను ఆనందంతో కదలింపజేస్తుంది. తిక్కన సోమయాజి ఈ రాయబార ఘటాన్ని రసోల్భణముగా రచించి దౌత్యంనడపడంలో శ్రీకృష్ణుని చాకచక్యము, రాజ్యతంత్రజ్ఞత చాలా చక్కగా చూపించాడు. కౌరవసభలో అధికార దుర్మాదాంధత, స్వార్ధలాభము, రాజ్యలోభము, గురుజనవాక్యధిక్కారములవంటి మానవ సహజములైన వికారాలు పైశాచిక నృత్యం చేసిన సందర్భం ఇది. కౌరవ సభకు పాండవుల పంపున తమ కయిదూళ్ళయినా ఇస్తే చాలునని సంధి ప్రయత్నంమీద దూతగా వెళతాడు శ్రీకృష్ణుడు. అయిదూళ్ళు కాదుకదా, సూదిమొన మోపినంత నేలనయినా ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా చివరికి దూతను బంధించి చేరబట్టుకు కుద్యమించి విఫలీకృత మనోరథులవుతారు సుయోధనాదులు. అంతటితో వారి కండకావరమూ తెలిసి వస్తుంది; సంధిరాయబారమూ భగ్నమవుతుంది. రారాజు ఎంతటి అధికారగర్వప్రమత్తుడైతేమాత్రం ఎంతటిబలపరాక్రమ సంపన్నుడైతే మాత్రం సంధి పొసగకపోయిన తరువాత తమకు న్యాయంగా మరి రావలసిన రాజ్యం రాకపోతే రాచపాడి పోనాడి వూరుకుంటారా పౌరుష ప్రతాప మహితులైన పాండునందనులు - రాచబిడ్డలు? సామముచేత చక్కబడని కార్యానికి ఇక దండమే ప్రయోగం. యుద్ధం తప్పనిసరి అయింది. శ్రీకృష్ణ రాయబార  ఘట్టంలో తిక్కన సోమయాజి పాత్రావిష్కరణలోనూ రాజ్యతంత్రజ్ఞతలోనూ చూపిన నేర్పు అద్వితీయమైనది ఏపాత్ర కాపాత్రకే ఒక విశిష్టత. నిండుసభలో దొరలందరి సమక్షాన అవమానింపబడిన మానవతి పాండుచక్రవర్తి కోడలు ద్రౌపది. అందరి పాత్రలు ఒకయెత్తు. ద్రౌపదిపాత్ర ఒక యెత్తూను. పాండవులు యుద్ద సన్నద్దులై సంగ్రామ రంగాని కవతరించడమే ఈ చిన్ని కావ్యం "విజయశ్రీ"లోని కథావస్తువు. తిక్కన సోమయాజి రాయబార ఘట్టాన్ని వరవడిగా పెట్టుకొని వ్రాసిన రసవంతమైన కావ్యమిది.

 Previous Page Next Page