ఈ తరం అమ్మాయిలు
"డోంట్ బి సిల్లీ మమ్మీ" రోజుకి పదిసార్లు తల్లితో అనే ఆమాట ఆరోజూ అంది ప్రీతి. డ్రస్సింగ్ టేబిల్ ముందు నిల్చుని ఆఖరి నిమిషంలో మేకప్ టచ్ చేసుకుంటూ.
రోజులా వోరుకోలేకపోయింది సుజాత. కోపంగా చూస్తూ ఏమిటే ఊరుకుంటున్న కొద్దీ మరీ ఎక్కువవుతుంది. ప్రతీదానికి డోంట్ బి సిల్లీ అంటావు. ఏమిటా మాటలకి అర్ధం, ఇంగ్లీషు నీకా కాదు వచ్చు! నీవేం చేస్తున్నా వూరుకుంటే సిల్లీ కాదన్నమాట! ఆవేశంగా అంది.
తల్లి కోపానికి కాస్త తగ్గినా, ఏమిటి మమ్మీ ఇప్పుడేమయిందని ఈ గొడవ విసుగ్గా అంది ప్రీతి.
"శలవు వచ్చేసరికల్లా ఏమిటీ తిరుగుడు అంటున్నాను. ప్రతీసారీ ఈ పిక్నికులు, పార్టీలు, సినిమాలు వీటికి అంతులేదా ----ఎప్పుడో ఏదో ఓసారి సరదాగా వెళ్ళడం సరే, వారంవారం ఏమిటీ తిరుగుడు . పోనీ ఆడపిల్లలతో అంటే సరే, ఈ మగపిల్లలతో ఈ తిరుగుళ్ళు నాకిష్టం లేదు. ఖచ్చితంగా తన అఇష్టాన్ని చెప్పింది.
"ఓహో , అదీ నీ అసలు గొడవ --- ఆడపిల్లలతో తిరిగితే నీకేం అభ్యంతరం లేదన్నమాట నేనెక్కడికి వెళ్ళినా! హేళనగా అంది ప్రీతి.
ఆడపిల్లతోనైనా సరే అస్తమానూ ఇలా తిరగడానికి వీలులేదు . శలవు వస్తే కాస్త చదువుకోడం లేదు. ప్రతి ఆదివారం పిక్నిక్కులు, సినిమాలు ఏమీటిదంతా. ఇదంతా చాలదన్నట్టు బాయ్ ఫ్రెండ్స్ తో కూడా తిరుగుతుంటే అభ్యంతరం కాకపొతే ఏమిటి?
"ఎందుకట అభ్యంతరం' తల్లితో రెట్టించింది.
'ఆడపిల్లవు వయసు వచ్చిన పిల్లవి కాబట్టి" సుజాత కోపంగా అంది.
"తిరిగితే ఏమవుతుంది ఏం" ప్రీతి మాటల్లో వ్యంగ్యం.
"ఏమనకూడదనే వద్దనడం నీవేం చిన్న పిల్లవనుకుంటున్నావా-- ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుళ్ళు పనికిరాదని చెప్తున్నాను.
"మమ్మీ డోంట్ బి సిల్లీ! ఐనో మైలిమిటేషన్స్, నా జాగ్రత్తలు నాకు తెలుసు. సరదాగా తిరిగితే చెడి పోయినట్టే అనడం .....ఇట్స్ యువర్"
"ఆగిపోయావెం అను. ఇట్స్ యువర్ స్టుపిడ్ టి పులిష్ నెస్.....నీకొచ్చిన పదాలన్నీ వాడి ---
ప్రీతి ఇంకేం అనేదో వాదించేదో కాని బయట నించి హరన్ విన్పించింది. దాంతో పాటు 'స్మృతి' హాయ్ ప్రీతి ఆర్ యు రెడీ అనుకుంటూ బాబ్డు హెయిర్ ఎగదోసుకుంటూ లోపలికి వచ్చింది హాయ్ అంటీ అంటూ సుజాతని పలకరించి ఓ నవ్వు పారేసింది. బయట నిలబడ్డ మారుతీ వేన్ లో శర్మద, లావణ్య అపూర్వలతో పాటు నిక్కీ నిఖిల్, డ్రైవింగ్ సీట్ ముందు సంజయ్ ఉన్నాడు. అయిదుగురు అమ్మాయిలూ, ముగ్గ్రురు అబ్బాయిలన్న మాట! విక్కీ స్మృతి అన్న .....నిఖిల్ లావణ్య కజిన్ --- సంజయ్ శర్మద అంకుల్ ----అంతా ఒకే కాలేజీలో చదువుతున్న వారే. ఇంటికి వచ్చిపోతుండే వాళ్ళే!
ఆయామ్ రెడీ, కమాన్ లెటజ్ గో! అంటూ భుజాన పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఓ చేతిలో గాగుల్స్ మరో చేతిలో తల్లిని వేధించి చేయించుకున్న పూరి, కూర వున్న హాట్ క్యారియర్ తో తల్లి వంక చూడకుండానే బయటికి నడిచింది ప్రీతి.
'బై అంటీ' అంటూ పరుగెత్తింది స్మృతి.
నిస్సహాయంగా చూస్తూ నిలబడింది సుజాత గుమ్మంలో. ఎర్రబడ్డ మొహంతో నిలబడ్డ భార్యని చూస్తూ లోపల్నించి పేపరుతో వచ్చిన కేశవరావు ఏమిటలా నిలబడ్డావు ఏం చేస్తున్నావు అన్నాడు.
"మీ అమ్మాయి వేషాలని" విసురుగా అంది.
"ఏం చేసింది మా అమ్మాయి" నవ్వాడు.
"అలా నవ్వండి. ఏదో గొప్ప అనుకుంటున్నారు పిల్లల్ని అలా ఎంకరేజ్ చెయ్యడం, ఏదో ఒకరోజు తెలుస్తుంది. ఆ నవ్విన దాని ఫలితం " కోపంగా అంది.
'గోరంతని కొండంతలుగా ఊహించకోయ్, ఇప్పుడెం జరిగిందని అంత భయపడ్తున్నావ్. ఈ ఏజ్ లో కాకపోతే యింకేప్పుడు ఎంజాయ్ చేస్తారు పిల్లలు. రెస్పాన్స్ బిలీటీస్ లేని ఈరోజులు మళ్ళీ వస్తాయా జీవితంలో. నీ చిన్నతనం గుర్తు తెచ్చుకో."
'ఆ గుమ్మం దాటితే మా నాన్నాగారి చెవిలో ఊదేది మా బామ్మ. కాలేజి నుంచి రావడం అరగంట ఆలశ్యమైతే సవాలక్ష ప్రశ్నలు వేసేవారు. ఇలా అబ్బాయిలతో పిక్నిక్కులు వెళ్ళడం కూడా మాకు.'
"నీకూ, ఈ తరానికి ముప్పై ఏళ్ళ డిఫరెన్స్ వుందన్నమాట మర్చిపోకు అయినా అందరూ కల్సి సరదాగా తిరుగు తున్నారు కానీ, ఇదొక్కటే బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళడం లేదుగా. ఏదో పెళ్ళయ్యే వరకే ఈ ఫ్రీడం . పొనిద్దూ....."
'అలా అంటూ మీరు దాన్ని సైడ్ చేస్తుండబట్టే నా మాటంటే దానికి అసలు లెక్కలేకుండా పోయింది. ఏం అన్నా డోంట్ బి సిల్లీ, డోంట్ బి స్టుపిడ్ అంటూ వెధవ మాటలు....
నవ్వేశాడు కేశవరావు, "మరి బోలెడు ఖర్చు పెట్టి కాన్వెంటు చదువులు చదివించుకున్నందుకు ఆమాత్రం ఇంగ్లీషు మాట్లాడొద్దు" హాస్యంగా అన్నాడు. "అయినా నీవూరికే వర్రీ అవకు సుజా. ఈ కాలం పిల్లలు మీకాలం అమ్మాయిలా తెలివి తక్కువవాళ్ళు కాదు. ఎంతవరకు గార్డు చేసుకోవాలో తెల్సు వాళ్ళకి."
"సరే మీకంత నిశ్చింత అయితే నాకేం పోయింది. ఇలా తిరగడానికి ఫ్రీడం ఇచ్చి అది రేపు ఏ తలమాసినవాడినో కట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది మీకు" సుజాత కోపంగా అని వెళ్ళిపోయింది. కేశవరావు నవ్వుకుని పేపర్ లో తల దూర్చాడు.
* * * *
కూతురి ధోరణి చూస్తుంటే సుజాత కీ మధ్య భయంగా వుంటున్నది. యూనివర్శీటీలో చేరిం దగ్గర నించి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువై పోయారు. బిఏ వరకు ఉమెన్స్ కాలేజీలో చదవడం వల్ల యిన్నాళ్ళు ఆడపిల్లలతోనే స్నేహాలు, ఇళ్ళకి రావడాలు పోవడాలు ఉండేవి. ప్రీతి ఈ కాలం పిల్లలకి ఏం తీసిపోదు ఏ విషయం లోనూ, రోజుకోరకం డ్రస్సులు, మిడీలు, స్కర్టులు , చుడీదార్ , కమీజులు , జీన్స్ ఫ్యాట్ బాబ్డు హెయిర్ , మాటకోసారి హాయ్, యా అనడాలు, ఫ్రెండ్స్ పార్టీలు పిక్నిక్ లు ఓ అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా వుంటుందో అలా స్మార్టుగా వుంటుంది. తయారవడం, మాట ఐడియా అన్నీ కాస్త వున్న వాళ్ళ అమ్మాయికి ప్రతీకగా వుంటుంది. స్మార్టు నెస్ మాటల్లోనే కాక చదువులో, గేమ్స్ లో అన్నింటిలో చూపించడంతో తల్లిదండ్రులు కూతురి గురించి అంత పట్టించుకోలేదు. తెలివిగా చదువుతుంది. స్మార్టుగా వుంటుంది. ఈ కాలం పిల్లల్లో కల్సి మేల్సి వుండాలంటే ఇవన్నీ తప్పవు అనుకునేది సుజాత. కేశవరావు ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అవడం, యిద్దరే పిల్లలు అవడంతో పిల్లల కోరికలు తీర్చడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. బంగళా - కారు. ఇంట్లో టీవీలు , ఫ్రిజ్ లు , వీడియోలు, ఎయిర్ కండిషనుల మోడర్న్ లైఫ్ కి కావాల్సిన హంగులు ఇంట్లో అమరడం, తల్లి దండ్రులు తమ కోరికలు తీర్చగలిగిన స్థాయిలో , హోదాలో వుండడంతో ప్రీతి ముందు నుంచి జాలీ లైఫ్ కి అలవాటు పడింది. తెలివైనది కావడం వల్ల ఒక్కసారి చదవడంతో సరిపోయేది. మిగతా టైము నవల్సు, వీడియోలు, ఫ్రెండ్స్ పార్టీ అంటూ తిరిగేది. చదువు నిర్లక్ష్యం చేయ్యకపోవాడంతో ఇన్నాళ్ళూ సుజాత పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాదిగా యునివర్శీటీలో చేరిం దగ్గరనించి మగపిల్లల స్నేహాలు, మగ పిల్లలతో తిరగడాలు సుజాతకి నచ్చలేదు. ఎంత ఆధునికత అయినా ఇంకా ఈ దేశంలో బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగితే ఎవరూ హర్షించరు అని సుజాత కి తెలుసు. అంతేకాక ఇలా స్నేహాలతో మొదలుపెట్టి , తరువాత లవ్ ఎఫైర్ల కి దిగి తరువాత తమ కులం గోత్రం లేనివాడిని, ఏ ఉద్యోగం సద్యోగం లేనివాడినో కట్టుకుంటానంటే ---- అదీ సుజాత భయం! ఒక్కగానొక్క పిల్ల -- బాగా చదువు , ఉద్యోగం పెద్ద హోదా అంతస్తు అన్నీ వున్న ఇంట్లో పడేయాలని తల్లిదండ్రులుగా తమ కోరిక! ప్రీతి చక్కగా స్మార్టుగా వుంటుంది. వుంటుంది. చదువుంది. తండ్రికి హోదా వుంది. మంచి సంబంధాలు రాక ఏం చేస్తాయి . ఇప్పుడిలా ప్రీతిని యిష్టం వచ్చినట్టు వదిలేస్తే ఏ తలమాసిన వాడినో కట్టుకుంటానంటే అప్పుడేం చేసేట్టు! ఎప్పుడేక్షణంలో ఏదన్నా వీక్ మూమెంట్ లో జరగరానిది జరిగితే! సుజాత అందుకే కూతుర్ని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ ప్రీతి ఇన్నాళ్ళు అలవాటుపడిన ఫ్రీడం వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. దాంతో తల్లి కూతుళ్ళ మధ్య వాగ్యుద్దాలు తలెత్తుతున్నాయి ఈమధ్య తరచూ. సుజాత ఏదో అనడం -- ప్రీతి నిర్లక్ష్యంగా దులపరించడం మామూలు అయ్యింది. కేశవరావు చూసీ చూడనట్టు వూరుకోడం. మరో సారి భార్యకి నచ్చచెప్పడం, మరీ మితి మీరిందన్నప్పుడు కూతుర్ని కాస్త మందలించడం చేస్తూ సర్దుకోస్తున్నాడు.