డాక్టర్ శ్రద్ధగా పరీక్ష ముగించాడు. సుందరం ముఖంవంక పరిశీలనగా చూసి మీకు టి.బి. అని ఇదివరకు చెప్పానా?" అన్నాడు.
"అవునండీ!" అని సుందరం అప్పుడు తీయించిన ఎక్స్ రే ఫోటోలు తీసి చూపించాడు.
"అవునే" అని ఆయన ఆశ్చర్యం వెలిబుచ్చి "మిమ్మల్ని స్క్రీన్ క్రింది ఎగ్జామిన్ చేస్తాను రండి" అని లోపల ఎక్స్ రే లేబొరేటరీలోకి తీసుకువెళ్ళి స్క్రీనింగ్ చేసి చూశాడు. తర్వాత భుజంతట్టి "నో. యు ఆర్ ఫర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్! ఎలా రికవర్ అయ్యారు! ఎవరు ట్రీట్ చేశారు?" అని అడిగాడు.
"నేనెవరి దగ్గర ట్రీట్ మెంట్ తీసుకోలేదండి. ఏమీ మెడిసన్స్ కూడా తీసుకోలేదు. చదువూ మానలేదు. అన్నీచేస్తూనే శరీరం విషయంలో అమిత జాగ్రత్త తీసుకున్నానంతే" అన్నాడు సుందరం.
"వెరీగుడ్. మీకు అదృష్టంకూడా కలిసివచ్చి క్యూర్ అయింది. ఇప్పుడు భయపడాల్సింది రవ్వంతయినా లేదు. హాయిగా వుండండి" అన్నాడు.
ఆయనకు థ్యాంక్స్ చెప్పి సుందరం బయటికి వచ్చాడు. అతనికిప్పుడు ప్రపంచమంతా పచ్చగా, అందంగాను నందనవనంలా కనిపించింది. అతను హుందాగా నడిచాడు. గర్వంగా వుంది. తనలో ఏదో ప్రత్యేకత వున్నట్లు తనని చూసి అంతా అసూయపడుతున్నట్లూ అనిపించింది. నీలాకాశం, ఆ క్రింద ఎగిరే పక్షులూ, పొంగే సముద్రమూ, అందులో పోయే పడవలూ తిలకించి తన్మయత్వం చెంది అమితమయిన అనుభూతి పొందాడు.
తను అప్పుడు ఏమయినా చెయ్యగలడు. ఒకరిని చూసి తక్కువతనం ఫీల్ కానవసరంలేదు. తను పరుగెత్తగలడు, క్రికెట్ మేచ్ ఆడగలడు.
అతనికి జ్యోతి గుర్తుకువచ్చింది.
'జ్యోతి! నిన్ను విడిచి వుండలేను' అనుకున్నాడు.
7
సుందరం కాకినాడలోనే వేరే ఇంట్లో వుండవల్సిన అగత్యం ఏమిటి?
ఆ తర్వాత అతను విశాఖపట్నంలో చదవటం దుర్భరంగా పరిణమించింది. ఇప్పుడు హోటలు మెతుకులు తింటూంటే ఏడుపు వస్తోంది. ఏమిటి కర్మ అనిపిస్తుంది. వంటరితనం దుస్సహంగా, మునపటిలా పుస్తకం పట్టుకుంటే మనసు లగ్నం కావటంలేదు. రెండురోజులకో మారు జ్యోతి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చేది. అతనికి పిచ్చెక్కినట్లుగా వుంటోంది.
ఇక్కడకు ఆమెను తీసుకువచ్చి కాపురం పెడితే అని ఆలోచించాడు. దానివలన అనేక ఇబ్బందులున్నాయి. అసలు మొదటి విషయం ఇంట్లో అంగీకరించరు. 'కాపురం పెట్టి చదువేం అఘోరిస్తావోయ్!' అంటాడు తండ్రి.
అతనికో ఆలోచన స్ఫురించింది. ఆ ఏడాది గడిచిపోగానే ట్రాన్స్ ఫర్ కోసం గట్టిగా ప్రయత్నం చేశాడు. కాకినాడ తాము వున్న వూరు. కుటుంబంమంతా అక్కడ వుంది. అందుకని అక్కడి కాలేజీలో చేరటానికి అనుమతించ వలసిందని విజ్ఞప్తి చేసుకున్నాడు. ప్రయత్నించగా ప్రయత్నించగా అతని కోరిక ఫలించింది. అతనికి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికింది.
అప్పటికి చదువు మరో ఏడాది వుంది.
అతను వూరునుంచి వచ్చిన మరునాడు లలితమ్మగారు మెల్లగా "వాళ్ళు మరీ తొందర పెడుతున్నార్రా. ఇప్పుడిహ అభ్యంతరమేముంది?" అన్నది లాలనగా.
"నీ యిష్టం అమ్మా!" అన్నాడు సుందరం.
విషయం ఫలానా అని ఉత్తరం రాసి రెండురోజుల్లోనే ఏలూరుకు పంపించారు సుందరాన్ని.
ఆ రాత్రి...
విద్యుత్ వెలుగుల్లో, మల్లెల పరిమళాల్లో సెంటువాసనల ఘుమఘుమల్లో జ్యోతి కొత్తపెళ్లికూతురులాగా సిగ్గుపడిపోయింది.
"జ్యోతి!" అన్నాడు సుందరం ఆమె చుబుకాన్ని పట్టుకొని పైకి ఎత్తుతూ.
"ఊ" అన్నది ఆమె అరమోడ్పు కనులతో.
"ఇది మనకు తొలి మజిలీ అవునా?" అన్నాడతను చిలిపిగా.
ఆమెకు సిగ్గుతో కూడిన నవ్వు వచ్చింది. జవాబు చెప్పలేకపోయింది.
అతనామె భుజాలు పొదివిపట్టుకొని తనవైపు త్రిప్పుకున్నాడు. ఆమె అతని హృదయంపై తలవాల్చి కళ్ళు మూసేసుకుంది.
* * *
హటాత్తుగా సుందరం ప్రవర్తన విచిత్రంగా కనిపించింది. ఇంట్లోని వారందరికీ అతను మారిపోయినట్లనిపించింది. ఇదేమిటంత భార్యలోలుడని విస్తుపోయారు.
రామం విషయంలో వాళ్ళు అట్లా అనుకోవటానికి అవకాశం లేకపోయింది. అతను మొదటినుంచీ గంభీరంగా వుండేవాడు. పెళ్ళి అయినాక కూడా అలాగే వున్నాడు. సుందరం అలాకాదు. అతను ఇంట్లో చిలిపిగా, పసిగా, కలుపుగోలుతనంగా వుండేవాడు. భార్య కాపురానికి వచ్చినప్పట్నుంచీ అతను కాస్త హుందాగా వుండనారంభించాడు. అది అతని తప్పుకాదు. ఈ మార్పు తప్పనిసరి, విధిగా వచ్చి తీరాలి. జీవిత భాగస్వామిని వచ్చాక జీవితానికి విలువ ఏర్పడుతుంది. బాధ్యత, నిండుతనం వస్తాయి. అది సహజం.
కాని లలితమ్మగారికిది గోరంతలు కొండంతలుగా కనిపించసాగింది.
అప్పటికి పెద్దకోడలు మనోరమ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎక్కువరోజులు కాలేదు. అప్పటినుంచీ ఆమె మనస్సు వికలమైపోయింది. మనోరమ గురించి యిరుగుపొరుగు అంతా ఎన్నోవిధాల అనుకుంటున్నారు. ముఖాన అడుగుతున్నారు. ఆమెకు అభిమానంతో చచ్చిన చావుగా వుంది. ఈ కలతపడ్డ మనస్సుతో ఆమెకు ప్రతిదీ విడ్డూరంగా కనిపించసాగింది.
సుందరానికి తన ప్రవర్తన మిగతావారికి విపరీతంగా కనిపిస్తూన్న సంగతి మొదట్లో తెలియదు. ఈ నూతన రసమయ ప్రపంచం స్వల్పమైన విషయాలని అతనిచేత విస్మరింపచేసింది. తమ ఇద్దరి అన్యోన్యాన్ని చూసి అంతా ముచ్చట పడతారని అతను భ్రమించాడు. తమ ప్రవర్తన ఎబ్బెట్టుగా ఇతరులు తలపోస్తున్నారని అతనికి తోచలేదు. అసూయ. ఈ అబద్దమైన అసూయ తాత్కాలికమైనది. అది తల్లినీ, తండ్రినీ, భార్యనీ, భర్తనీ ఆవహిస్తుంది. దానికి అర్థంలేదు. అందుకనే అది త్వరగా అంతరించిపోతుంది. ప్రస్తుతం లలితమ్మగారికి అలా వుంది.