బయటకెళ్ళి టీ తీసుకొచ్చిన ఆజానుబాహుడు తలుపులోపల గడి వేసుండడంతో తలుపు దగ్గరే ఆగిపోయాడు. ఎయిర్ కండిషన్డ్ గది కావటంతో లోపల జరిగేది ఏమాత్రం బయటకు వినిపించదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు త్రినాధ్ లోపల.
పావుగంటకు తలుపులు తెరుచుకుని త్రినాధ్ బయటకొచ్చి వేగంగా మెట్లు దిగి వెళ్లిపోయాడు.
లోపలకు వెళ్ళిన ఆజానుబాహుడి వెన్ను భయంతో జలదరించింది. యాదవ్ ఒంటిమీదున్న లాల్చీ, పైజామా అక్కడక్కడా చిరిగిపోయి అస్తవ్యస్తంగా వున్నాయి. నోటినుంచి నెత్తురు కారిన మరకలు... అంతకు ముందక్కడ ముష్టి యుద్ధం జరిగిన ఆనవాళ్ళు కనిపించాయి. గదంతా చిందరవందరగా వుంది. చిన్నసైజు గున్న ఏనుగులా వుండే యాదవ్ ఒళ్ళు హూనమయి అక్కడున్న పరువు మీద నిస్త్రాణంగా పడున్నాడు.
త్రినాధ్ వెళ్తూ వెళ్తూ భయపడిన హీరాలాల్ ని, అతని భార్యను తనతో పాటు హిందూ గదికి తీసుకెళ్ళిపోయాడు.
* * * *
"ఏం జరిగింది...? వీళ్ళను కూడా తరిమేశాడా ఆ దుర్మార్గుడు?"
ఆందోళనగా అడుగుతున్న హిందూవేపు కోపంగా చూశాడు త్రినాధ్.
"జరగవల్సిందింకా పూర్తికాలేదు. వేటకు వెళ్ళి పులిని గాయపర్చి వచ్చాను. వాడికి 24 గంటలు టైమ్ ఇచ్చాను. రేపు సరీగ్గా సాయంత్రం 6-30కి వాడు ఖాళీ చేస్తాడు. అంతవరకు వీళ్ళను నీ గదిలోనే వుంచుకో" అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు త్రినాధ్.
హీరాలాల్, అతని భార్య వెళుతున్న త్రినాధ్ వేపు భయాందోళనలతో చూస్తుండిపోయారు.
* * * *
వందమంది కూలీలు క్షణాల్లో వచ్చారు. స్విమ్మింగ్ పూల్ ఆర్కిటెక్ట్స్ ఇద్దరు దగ్గరుండి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. పని 24 గంటలూ నిర్విరామంగా జరుగుతోంది. తన గదిలో కిటికీ వద్ద కూర్చుని దేదీప్యమానంగా వెలుగుతున్న మెర్క్యురీలైట్స్ కాంతిలో గుంటను త్రవ్వుతున్న కూలీలవేపు చూసి గర్వంగా నవ్వుకుంటోంది ప్రియాంక.
అప్పుడు మ్రోగింది ఫోన్. స్టయిల్ గా వచ్చి ఫోన్ ఎత్తి "హలో" అంది.
"మొత్తానికి పౌరుషంగా యుద్ధ ప్రాతిపదికమీద పూల్ కట్టిస్తున్నావ్. సెభాష్..." పబ్లిక్ బూత్ లోంచి మాట్లాడుతూ, రోడ్డుమీద వెళుతున్న వాహనాలను చూస్తూ మాట్లాడుతున్నాడు త్రినాధ్.
ముందో క్షణం ఎవరు మాట్లాడుతున్నదీ అర్ధం కాకపోయినా తర్వాత అర్ధమయి పళ్ళు పటపట కొరికింది ప్రియాంక.
"ఎలా అయితేనేం మొత్తానికి నాకు లొంగి పోవటానికి... ఇష్టపడుతున్నావన్న మాట..."
"వాడ్డూ యు మీన్?" కోపంగా ఫోన్ లోనే అరిచింది ప్రియాంక.
"కోపంలో చాలా అందంగా వుంటావ్ బి.ఎం."
"బి.ఎం. అంటే?" ఉడుక్కుంది ప్రియాంక, త్రినాధ్ తనను ఏడిపిస్తున్నాడని అర్ధం చేసుకొని.
"బి.ఎం. అంటే ఏమిటో తెల్సుకోటానికి ప్రయత్నించింది. మొత్తానికి నా వ్యాపారానికి మీ నాన్నతో పెట్టుబడి పెట్టించావ్. థాంక్యూ!" ఫోన్ పెట్టేశాడు త్రినాధ్.
అప్పుడు గుర్తొచ్చింది అతనికి తన ఇంటికి వెళ్ళి దాదాపు వారమైందని. అంతే- సరాసరి ఇంటికేసి బయలుదేరాడు.
* * * *
వాసమ్మ వారంరోజులుగా కళ్ళు కాయలు కాచేలా కొడుక్కోసం ఎదురుచూస్తోంది.
కొడుకులో తనాసించిన మార్పు వచ్చినట్టుగా ఆమెకు తోస్తోంది. మరి కొంతకాలం అజ్ఞాతవాసంలో వుండటం అవసరమనిపిస్తోంది ఆమెకు.
ఆమె ముందిప్పుడు చాలాకాలం నాటి పాత ట్రంక్ పెట్టె వుంది. ఓసారి దాన్ని తెరిచింది. దానిలో వున్న పాతబట్టల్ని పక్కకు తప్పించి చూసింది. అప్పుడు కనిపించిందామెకు బ్యాంక్ లాకర్ కి సంబంధించిన తాళం చెవి ఒకటి.
దాన్ని చేతిలోకి తీసుకొని ఆలోచనల్లో పడిపోయింది. ఆలోచనలు గతంలోకి చొచ్చుకుపోతున్న కొద్దీ ఆమె చేతివేళ్ళు ఆ కీ చుట్టూ బలంగా బిగుసుకుపోతున్నాయ్.
సరీగ్గా ఇదే సమయంలో ప్రియాంక తీవ్రంగా ఆలోచిస్తోంది- త్రినాధ్ అన్న మాటలు గురించి.
"డాడీ అతనికి పెట్టుబడి ఇవ్వడం ఏమిటి...? నిజమేనా...?" అంతలోనే ఆమె ఆలోచనలు త్రినాధ్ వైపు మళ్ళాయి.
అతని మాట తీరులో ఎంతో మార్పు కనిపిస్తోంది. స్పష్టంగా, శాసిస్తున్నట్టుగా వున్నాయా మాటలు. అంతలోనే గుర్తొచ్చింది- బి.ఎం.
"బి.ఎం. అంటే-?"
నిజంగానే ఛాలెంజ్ లో గెలిచే ప్రయత్నాలు చేస్తున్నాడా? లొంగిపోవటానికి సిద్ధపడుతున్నావా అనడగటంలో అంతరార్ధం-?"
పావుగంట తర్వాత త్రినాధ్ గురించి ఎంక్వైరీ చేయాలనే నిర్ణయానికొచ్చిందామె.
* * * *
రాత్రి తొమ్మిది గంటల సమయం-
వాసమ్మ స్పృహలో లేదు-
ఆమె కళ్ళ ముందిప్పుడు గతం లీలగా కదలాడుతూ ఆమెను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తోంది.
తన భర్తను దారుణంగా చిత్రహింసకు గురిచేసి, చట్టానికి దొరకని అతనే ఇప్పుడు ఆమెకు కనిపిస్తున్నాడు.
కసి... కసి... కసి... ఆమె ఇరవై రెండు సంవత్సరాల మోడువారిన జీవితాన్ని అతను పరిహసిస్తున్నట్లుగా అనుక్షణం భావిస్తూ, ఆ వ్యధాభరితమైన భావన నుండి కసిని పెంచుకుంది.
అడుగుల చప్పుడుకు చప్పున తేరుకుంది వాసమ్మ. ఎదురుగా త్రినాధ్.
కొడుకును ఆ స్థితిలో చూస్తున్నందుకు ఆమెకు ఆశ్చర్యంగా వుంది. భౌతికంగా కూడా మార్పు కనిపిస్తోంది. తేటగా కనిపిస్తున్న ముఖంలో ఏదో మార్పు... చూపుల్లో ఏదో స్థిరత్వం కనిపిస్తోంది.
గుడ్డిదీపం మిణుకుమిణుకుమంటూ తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
ఆమెకు ఓ స్వాప్నికావస్థలో వున్నట్టుగా వుంది. శిథిలమైన ఆ గుడిసె నాలుగుగోడల మధ్య పేరుకున్న నిశ్శబ్ద నీరవంలో తల్లీ కొడుకులు కొద్ది నిమిషాలపాటు ఏం మాట్లాడుకోలేకపోయారు.
ఎందుకో తెలియదు కాని ఆమె ఇదివరకులా కొడుకును తీసేసినట్లు మాట్లాడలేకపోతోంది.
ఆమె మౌనంగా వెళ్ళి పెనంమీదున్న రెండు రొట్టెల్ని తెచ్చి కొడుకుకు అందించింది.
అప్పటివరకు ఎంతో నిగ్రహంతో వున్న త్రినాధ్ ఇంక తనను తాను సంభాళించుకోలేకపోయాడు.
ఆనందోద్వేగంతో ఓ వెర్రికేక పెడుతూ అమాంతం తల్లిని తన రెండు చేతుల్తో పైకి లేపాడు. ఆమె చేతుల్లో వున్న రొట్టెలు ఎగిరి అవతల పడబోతుండగా తల్లిని ఓ చేత్తో పొదువుకుని, మరో చేత్తో వారిని లాఘవంగా అందుకున్నాడు. కొడుకుపట్ల తను ఆశించిన మార్పు కళ్ళెదుట కనిపిస్తున్నట్టు వుండి ఆమెకు అదంతా ఓ కలగా వుంది.
"ఏం జరిగిందిరా...?" ఆమె నిట్రాటకు ఆనుకుని కూర్చుంటూ అడిగింది.
సమాధానం ఇవ్వకుండానే ఆ రొట్టెల్ని తినే హడావుడిలో వున్నాడు.
"ఏం జరిగింది తిమ్మడూ-?"
అప్పుడు చప్పున తలెత్తాడు.
"తిమ్మడు కాదమ్మా- త్రినాధ్... నా పేరు త్రినాధ్" ఆమె అర్ధం కానట్లు చూసింది.
అప్పటికప్పుడు అతని కళ్ళల్లో ఎరుపు జీర పుట్టుకొచ్చింది.
"నిన్ను చాలాకాలంగా బాధపెట్టాను గదమ్మా?"
ఆమె విస్మయంగా చూస్తుండిపోయిందంతే!
"ఒకప్పుడు నాకు చదువు రాలేదని నీవు బాధపడే దానివి. అంటే చదువు రాకపోతే ఎలా బ్రతగ్గలనని. చదువు రాలేదని నేనూ బాధపడే రోజు వచ్చేదేమో? కాని ఆలోపే ఈ దేశంలో చదువు వున్నవాళ్ళు సుఖంగా బ్రతగ్గలరనే గ్యారంటీ లేదని తెల్సుకున్నాను."
కొడుకు మాటల్లో కూడా విచిత్రమైన తేడా కనిపిస్తోంది. ఆమె మౌనంగా వింటోంది.
"తల్లిగా నీ రక్తం ధారపోసి నన్ను ప్రయోజకుడ్ని చేయాలని విశ్వప్రయత్నం చేసి విసిగి వేసారిపోయావు కాని నీవాసించిన మార్పు ఇప్పుడు నాలో వచ్చిందమ్మా. ఎలాగో తెలుసా-? బాధలోంచి. సిద్ధప్ప తల్లిని కాపాడుకోలేక పోయామే అన్న బాధలోంచి, మోసంలోంచి- నేను మోసగించబడ్డానే అన్న కసిలోంచి- అవమానంలోంచి... నాకు చిల్లిగవ్వ లేదని, నేనో పాపర్ నని ఓ పొగరుబోతు ఆడపిల్ల నాకు చేసిన అవమానంలోంచి... నన్ను గడ్డిపరకగా తూలనాడిన ఓ ధన మదాంధుడి కొరడా దెబ్బలోంచి వచ్చిందమ్మా మార్పు. ఈ లోకంలో బ్రతకడానికి భయపడే కోట్లాది పిరికివాళ్ళకు నేనో ఉత్తేజాన్ని అవుతాను. అపార విజ్ఞానాన్ని సముపార్జించి కూడా బ్రతుకుపట్ల భయపడే నిరాశావాదుల కళ్ళు తెరిపిస్తాను..." భావోద్వేగమో, ఆవేశమో అతన్ని ఆసాంతం కదిలించివేస్తోంది.
ఆమెకు కొడుకును ఆ విధంగా చూడటం మహదానందంగా వుంది. ప్రపంచాన్ని జయించినంత గర్వంగా వుంది.
"కాని నాన్న- ఈ ప్రపంచం నీవూహించనంత చెడ్డది. ఈ సమాజంలో నీకు అడుగడుగున నయవంచకులు, విశ్వాస ఘాతకులు, దుష్టులు, దుర్మార్గులు తారసపడతారు. ఒకరి అభివృద్ధిని సహించలేని తుచ్చులు నీ వేగానికి కళ్ళేలు వేయాలని చూస్తారు. నీ ఆత్మవిశ్వాసంపై నాకు నమ్మకం వుంది. అదే సమయంలో చాటుగా తొడగిల్లి, పబ్లిక్ గా బుజ్జగించే దుష్టశక్తుల, క్షుద్ర వ్యక్తుల శక్తి సామర్ధ్యాలపై కూడా నమ్మకం వుంది."
మెరుస్తున్న తల్లి కళ్ళవైపే చూస్తూ శ్రద్ధగా వింటున్నాడు త్రినాధ్.
"ఈ దుర్గంధ భూయిష్టమైన వ్యవస్థలో ఒక వ్యక్తి పైకి రావడానికి ఎన్ని తెలివితేటలు కావాలో... దెబ్బ తినకుండా వుండడానికి అన్ని తెలివితేటలు కావాలి..." అంటూ అప్పటివరకు తన గుప్పిట్లో బిగించి పట్టుకున్న లాకర్ కీని త్రినాధ్ ముందుకు చూపింది.
త్రినాధ్ ఆశ్చర్యపోతూ దాన్ని చేతిలోకి తీసుకుని తల్లివైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"మన బ్రతుకులిలా మట్టిపాలు కావడానికి వెనుక వున్న కథని ఆ లాకర్ కీ నీముందుంచుతుంది. వెలికి వచ్చే దారుణాల్ని, బలవత్తరమైన ఆ దుష్టశక్తుల్ని నీకు తెలియపరుస్తుంది. కాని యిప్పుడే కాదు. ముందు నువ్వు ఎదగడానికి ప్రయత్నించు. అవమానమే నీలో ఈ మార్పును తెస్తుందని నేనేమాత్రం భావించగలిగినా దీన్ని ఎప్పుడో నీ ముందుంచే దాన్ని. నీకా శక్తి సామర్ధ్యాలు లేకుండా ఈ కీ వెనుక దాగిన రహస్యాల్ని నీకు తెలియపర్చి నిన్ను నష్టపోవడం ఇష్టం లేని తల్లిగా వెనుకంజ వేశాను...." అంటూ ఆవేశంగా వెళ్ళి మూలంగా వున్న ఓ రేకుపెట్టెను తెరిచి అందులోంచి ఒక డైరీని బయటకు తీసింది. దాన్ని త్రినాధ్ కు అందించబోతూ ఓ క్షణం ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో అప్పటికప్పుడు నిస్పృహ కమ్ముకుంది. త్రినాధ్ ఒకడుగు ముందుకేసి తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ నీ బాధ నాకర్ధమైందమ్మ. నేనా డైరీని చదవలేననేగా...?" అన్నాడు.
ఆమె కళ్ళు తడిదేరాయి.
త్రినాధ్ డైరీని ఓపెన్ చేసి దీపం దగ్గరకు జరుపుకున్నాడు.
కొడుకు దీక్షగా డైరీలోని పేజీల్ని ఒక్కొక్కటి త్రిప్పుతూ వెళుతుంటే ఆమె బాధగా చూస్తుండిపోయింది.