మాధవి బయటికొచ్చేసింది. కాసేపయ్యాక రావుగారికి ఫోన్ చేశాడు ప్రిన్సిపాల్.
"ఎవరూ? జానా? ఏమిటి విశేషాలూ?"
"ఏమిటి?"
"మీ కోడలు, మనుమరాలు ఇందాక నా దగ్గరికొచ్చారు."
"ఏమిటీ? ఏమిటండీ మీరనేది?" ఆశ్చర్యంతో అడిగారు రావుగారు.
"అవును. మీ మనవరాల్ని మా స్కూల్లోనే చేర్పించింది మీ కోడలు."
"వాట్. మీరేమైనా పొరబడుతున్నారేమో?"
"లేదండి. తండ్రి పేరు అజయ్, ఆర్మీ డాక్టర్. పైగా మీ పేరు చెబితే, వారు మీకు తెలుసా?" అని అడిగింది.
"అలాగా? అయితే మీరేమన్నారు?"
"మీ పేరు చెప్పగానే ఆవిడ అదోలా అయిపోవడం చూసి తెలీదని చెప్పాను. క్షమించండి. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను."
"మంచి పని చేశారు. నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఈ విషయం రహస్యంగా వుంచండి."
"అలాగే"
ఫోన్ పెట్టేశారు.
అర్జంటు పనుందని గోపీతో చెప్పి బయల్దేరారు రావుగారు. మర్నాడు ఉదయంనుంచే స్కూలు దగ్గర కూర్చుని జాన్ ద్వారా చాటునుండి మాధవినీ, పాపనీ చూశారు. పాపని చూడగానే అతని గుండె చెరువయింది. అచ్చు చిన్నప్పుడు అజయ్ ఉన్నట్టుగానే వుంది.
అయిదేళ్ళనాడు మాధవి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఆ రోజున ఆమె మాటలు నమ్మనందుకు బాధపడుతూ జాన్ ద్వారా ఆమె అడ్రస్ అడిగి తీసుకున్నారు. ఏదో తప్పుచేసిన వాడిలా భయపడిపోతున్నారు.
ఎలాగో వెతుక్కుంటూ వెళ్ళి తలుపు కొట్టారు. "అమ్మాయ్" అంటూ.
"ఎవరూ?" అంటూ తలుపు తీసింది.
"నేనేనమ్మా" అన్నారు అవతలి నుంచే.
అతనికేసి ఒక్క క్షణం చూసింది. "ఓ! మీరా?" అంది.
"నన్ను గుర్తుపట్టలేదా తల్లీ?"
"పూర్తిగా పట్టలేదు. నాకు తెలిసిందల్లా మిమ్మల్ని పోలిన ఒక ఆగర్భ శ్రీమంతుడు. అతనికి ఈ గడప తొక్కవలసిన అవసరం వుండదు" వ్యంగ్యంగా అంది.
"లోపలికి రావొచ్చా" అన్నారు మెల్లగా.
"మరిచేపోయాను. రండి" అంది.
"ఆనాడు నువ్వన్నావే. మనసు మమత కోసం పరితపిస్తూ వుంటే, ఐశ్వర్యం అడ్డుపడి ఆనందాన్ని ఇవ్వదూ" అని. అది అక్షరాల నిజం. ఆస్థిలో గొప్పవాణ్ణేకానీ, ఆంతర్యాలు తెలుసుకోలేక అన్నీ పోగొట్టుకున్నవాణ్ణి" దీనంగా వుంది అతని గొంతు.
"చెప్పండి మీకేం కావాలో?" ముక్తసరిగా అడిగింది మాధవి.
"అమ్మా! లంకంత యిల్లూ, దీపం పెట్టే దిక్కులేక చీకటితో నిండిపోయింది."
"అయితే ఏ అనాథాశ్రమంగానో మార్చి దీపాలు వెలిగించుకోలేకపోయారా? పేరు, ప్రతిష్టా కూడా దక్కేవి."
"గతాన్ని మరిచిపో తల్లీ. నా మనమరాలు దర్జాగా నా ఇంట్లో తిరిగే వరం ప్రసాదించు."
"ఎవరు మీ మనమరాలు? అయినా ఇప్పుడు దర్జాగానే బతుకుతోంది నా బిడ్డ. లంకంత ఇల్లులేక పోయినా తలదాచుకోవడానికో యిల్లుంది. ఆస్థులు లేకపోయినా, పస్తులుండడం లేదు. కలిగింది తింటున్నాం. హాయిగా వుంటున్నాం. ఎవరి దయాదాక్షిణ్యాలూ మాకక్కర్లేదు."
"అవునమ్మా! పరువుగా బతికేవాళ్ళకి పప్పన్నమే పంచభక్ష్యపరమాన్నాలూ, సంతృప్తే సకల సంపదలూనూ చేతులు చాచి యాచిస్తున్నానమ్మా. ఈ పాపలో నా బాబుని చూసుకుని తృప్తి చెందే అదృష్టాన్ని కలిగించు."
"క్షమించండి. మనుషులు మారినా మాటలు మిగిలిపోతాయ్."
"నిజమే! నా పాపానికి ప్రాయశ్చిత్తంలేదా? జీవితాంతం ఈ శిక్ష అనుభవించవలసిందేనా? చెప్పు తల్లీ!!
"దానికి సమాధానం మీకు మీరే చెప్పుకోవాలి. ఆనాడు పుట్టెడు దుఃఖంతో, కొండంత ఆశతో, మీ నీడన తలదాచుకోవాలని వస్తే, జాలైనా లేకుండా వెళ్ళగొట్టారు. దయచేసి మీరెవరో పాపకి తెలీకముందే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి" కఠినంగా నిశ్చలంగా వుంది మాధవి గొంతు. రావుగారి కళ్ళు నీటి కుండలయ్యాయి.
"వెళతానమ్మా...కనీసం ఒక్కసారి పాపని చూపించు, కళ్ళారా చూసి వెళతాను.
"శాంతీ? ఇలా రామ్మా."
బొద్దుగా, తెల్లగా, చురుకుదనం, తెలివితేటలూ వుట్టిపడుతూ ముద్దుముద్దుగా అడుగులేస్తూ ఒచ్చింది శాంతి. రావుగారికి అజయ్ కళ్ళల్లో నిండినట్లనిపించింది.
పాపా ఇలా రామ్మా.... రా శాంతీ! రెండు చేతులూ చాచుతాడు.
ఎవరమ్మా ఇతను? ముద్దుగా అడిగింది శాంతి.