సంగీత దిగ్భ్రాంతితో చూస్తోందా సంఘటనంతా సుష్మ భయంతో తల్లిని కౌగిలించుకుంది. కానిస్టేబుల్స్ శిలా ప్రతిమల్లా కూర్చున్నారు. ఇన్ స్పెక్టర్ మాత్రం ఆలోచిస్తున్నాడు. ప్రమోషన్ కొట్టడానికి తనకు దొరికిన అవకాశం క్షణంలో చేయిజారినట్లనిపిస్తోంది. కనీసం ఇప్పుడయినా ఎలాగోతను హోమ్ మినిస్టర్ కాపాడగలిగితే తన పేరు దేశమంతా మార్మోగిపోతుంది. ఆ ప్రయత్నంలో తనుగాయపడినా ఫర్లేదు. ప్రాణాలు మాత్రంపోవు. ఎందుకంటే నక్సలైట్స్ సాధారణంగా ఎవరినీ చంపరు, గాయపరచడంవరకే చేస్తుంటారు. వాళ్ళ రైఫిల్స్ ట్రైనింగ్ కూడా చాలా పర్ ఫెక్టుగా వుంటుంది. చేతికి గురిపెట్టికాలుస్తే చేతికే తగులుతుంది. కాలికి గురిపెట్టి కాలిస్తే కాలికే తగుల్తుంది. అంతేగానీ తమ పోలీసుల్లాగా ఒకడికి గురి పెడితే ఇంకొకడికి తగలడం జరగదు.
"అదిగో! మన వాళ్ళ వాన్! మన కోసం ఎదురుచూస్తున్నారు "కిటికీలోంచి ట్రాక్ పక్కనే ఆగివున్న మోటాడోర్ వానుని చూపుతూ అన్నాడు జమదగ్ని.
చంద్రిక తనూతల తిప్పి కిటికీలోంచి చూసింది. ఇన్ స్పెక్టర్ ఆ అవకాశాన్ని వదలదల్చుకోలేదు.
అమాంతం చంద్రిక చేతిలోంచి గన్ ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ అతనూహించినట్లు చంద్రిక ఆ గన్ ని వదులుగా పట్టుకోవటంజరగలేదు. గన్ ని వదలకుండా నే అమాంతం లేచి నిలబడి మోకాలితో బలంగా, వేగంగా అతనిమెడకింద కొట్టింది.
అది ఎదురుచూడని ఇన్ స్పెక్టర్ 'అబ్బా' అని అరుస్తూ గన్ వదిలేశాడు. కానీ అతని చేయి లాక్కునే ప్రయత్నంలో ట్రిగ్గర్ నొక్కుకుపోయింది. బుల్లెట్ పెద్ద శబ్దంతో ఎదురుగా కూర్చున్న విజయ్ కుమార్ వేపు దూసుకుపోయింది.
"అబ్బా" అన్నాడు విజయ్ కుమార్ భుజం గట్టిగా రెండో చేత్తో పట్టుకుంటూ అతని చేతి వ్రేళ్ళసందులో నుంచి రక్తం సన్నగా బయటకు వస్తోంది.
బుల్లెట్ అతని చేతికి తగిలిపైనున్న బెర్తుకింద ఇనుపరేకుకి కొట్టుకుని కిందపడింది మళ్ళీ. జమదగ్ని ఇంక ఆలస్యం చేయలేదు. తుపాకీ బట్ తో ఇన్ స్పెక్టర్ నెత్తిమీద కొట్టాడు. అతను కిందపడి క్షణాల్లో స్పృహ తప్పాడు. వెంటనే అతనిని బెర్తుమీదకి తోసింది చంద్రిక.
"ఇంక ఫరవాలేదు, సాయంత్రం వరకూ లేవడు" అందామె.
సంగీత కళ్ళల్లో టెర్రర్ కనబడుతోంది. భయంగా, జాలిగా విజయ్ కుమార్ వేపు చూస్తోంది. అతని భుజానికి తగులుతూ బుల్లెట్ రాసుకుపోయిందని అర్ధమయిందామెకి. మరీ పెద్ద గాయం కాదు గానీ ముందు అతనికి టెటానస్ ఇంజెక్షన్ ఇవ్వటం అవసరం.
విమల్ తండ్రిని చూసి భయంతో ఏడ్చేయటం ప్రారంభమయింది.
పక్క కంపార్ట్ మెంటులోని ఓ వ్యక్తి నిద్రకళ్ళతోలేచి వచ్చి కర్టెన్ తొలగించి చూశాడు.
"ఏదో పెద్ద శబ్దం వినిపించింది ఏమిటది? ఏం జరిగింది?" అడిగాడు రఘునాథ్ వేపుచూస్తూ.
రఘునాథ్ నడుముకిగుచ్చుకుంటోంది ఫణిచేతిలోని గన్ బారెల్.
"ఏమీ లేదు" అన్నాడు పొడిగా.
"మరేం లేదులెండి! పైనుంచి సూట్ కేసు కిందపడింది" అన్నాడు విజయ్ కుమార్ అతను వెళ్ళిపోయాడు.
"అయామ్ సారీ జంటిల్మన్" అంది చంద్రిక విజయ్ కుమార్ తో. "ఇదంతా ఈ ఇడియట్ ఇన్ స్పెక్టర్ వల్ల జరిగింది!" విజయ్ కుమార్ మాట్లాడలేదు.
"మేడమ్! మీరు డాక్టర్ కదా! మీ దగ్గరే మయినా ఎమర్జెన్సీ కిట్ వుందా" సంగీత వైపు చూస్తూ అడిగిందామె.
"వుంది!"
"దయచేసి హెల్ప్ చేయండి అతనికి! మీ బిల్ ఎంతవుతుందోనేనిచ్చేస్తాను-"
సంగీత ఆ ఆదేశం కోసమే ఎదురు చూస్తోంది. చటుక్కున లేచి తన ఎయిర్ బ్యాగ్ లో నుంచి ఎమర్జెన్సీ కిట్ తీసి నిముషాల్లో అతని గాయం క్లీన్ చేసి యాంటీ సెప్టిక్ క్రీమ్ తో బాండేజ్ వేసి ఇంజక్షన్ ఇచ్చింది.
"థాంక్యూ వెరీమచ్ డాక్టర్! మీ ఫీజెంత?"
"అవసరంలేదు! చాలాచిన్న ట్రీట్ మెంట్ ఇది! అదీగాకుండా ఇరవై నాలుగ్గంటలూ ఫీజు కోసమో, జీతాలకోసమో బ్రతికే డాక్టర్ ని కాదు నేను."
"ఓ! వెరీ కైండాఫ్ యూ!"
విజయ్ కుమార్ కృతజ్ఞతా భావంతో సంగీతవేపు చూశాడు.
"థాంక్యూ!" అన్నాడు అభిమానంతో.
"నో మెన్షన్ ప్లీజ్" అంది సంగీత.
* * *
గూడ్స్ ట్రైయిన్ డ్రైవర్ సెల్టానాకి ఖాజీపేటలో తన ట్రెయిన్ బయల్దేరేసమయానికే జ్వరంగా వుంది, ఆ సమయంలో తనుడ్యూటీ చేయాలేనని బండి దిగిపోతే ఆ బండి మరో డ్రైవర్ కోసం కనీసం రెండు గంటలు డిటెయిన్ అయిపోతుంది.
అదీగాక తనను రైల్వేడాక్టర్ 'సిక్ లిస్ట్'లోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నాగానీ రైళ్ళు నడిపేడ్యూటీలున్న ఉద్యోగులను సిక్ లిస్ట్ లోకి తీసుకోవద్దని స్టాఫ్ పొజిషన్ సరిగ్గా లేనప్పుడు అధికారులు రైల్వేడాక్టర్లను ఆదేశించటం పరిపాటే! సెల్డానా ఈ గొడవంతా ఆలోచించి ఎలాగోలా ఈ ఒక్క ట్రిప్ ట్రైన్ వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
కానీ మరోగంటలో అతనిటెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయింది. వళ్ళుకాలిపోతోంది. నాలిక పిడచకట్టుకుపోతోంది. కళ్ళు మూసుకుపోతున్నాయ్ ఛాన్స్ దొరికితేచాలు తల వాల్చినిద్రపోవాలని వుంది.
ట్రెయిన్ డోర్నకల్ దాటేసరికి అతని పరిస్థితి మరింత దారుణమయిపోయింది. ఎలాగోలా విజయవాడ చేరుకుంటే అక్కడే డాక్టర్ దగ్గరకెళ్ళి ట్రీట్ మెంట్ తీసుకోవాలని ఉందతనికి. దానికి తగ్గట్టేకంట్రోలర్ కూడా తన ట్రెయిన్ కి మంచి 'రన్' ఇస్తున్నాడు. గూడ్స్ ట్రెయిన్ గంగినేని దగ్గరకొచ్చేసరికి అతని పరిస్థితి మరింత క్షీణించింది.
కేవలం అసిస్టెంటు మీదే ఆధారపడి బండినడుపుతున్నాడు. సిగ్నల్ ఇండికేషన్స్ గురించి అసిస్టెంట్ రిపీట్ చేస్తుంటేనే తను కళ్ళు తెరిచి జాగ్రత్తగా చూస్తున్నాడు. తన ట్రెయిన్ కి విజయవాడ వరకూ ఆపకుండా 'రన్' ఇచ్చే సూచనలు కనబడుతున్నాయ్. అందుకే ఎక్కడా క్రాసింగ్ పెట్టడంలేదు కంట్రోలర్ తను కూడా మాక్సిమమ్ పర్మిషబుల్ స్పీడ్ కొడితేనే ప్రిఫరెన్స్ లు లేకుండా తన ట్రెయిన్ విజయవాడ చేరుకోడానికి వీలవుతుంది.
స్పీడ్ పెంచాడతను. లైట్ లోడ్ అవటంతో బండి త్వరగా వేగంపుంజుకుంది. చెరువు మాధవరం చేరుకునే సరికి వేగం మరింత పెరిగిపోయింది. ఇంచుమించుగా ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ వేగం అందుకుంది.
"సార్! ఎక్సెస్ స్పీడ్-" అన్నాడు అసిస్టెంట్.
"త్వరగా విజయవాడ చేరుకోవాలి - నా పరిస్థితేం బాగుండలేదు" అన్నాడతను.
అసిస్టెంట్ ఇంకేమీ మాట్లాడ లేకపోయాడు.
గూడ్స్ ట్రెయిన్ ఎక్సెస్ స్పీడ్ వెళ్ళటం ఎంత రిస్క్ వ్యవహారమో సెల్డానాకు తెలుసు. అయినాగానీ ఇలాంటి సమయాల్లో ఈ కాస్త దూరం రిస్క్ తీసుకోవడంలో నష్టమేమీ లేదనిపించిందతనికి. అతనికి తెలీదు. అప్పటికే 8 డౌన్ ఎక్స్ ప్రెస్ లైన్ క్లియర్ లేకుండా తన ట్రెయిన్ ని అతివేగంగా సమీపిస్తోందని అతనికి తెలీదు.
తనముందు ట్రాక్ మీద వెళ్తోన్న గూడ్స్ ట్రెయిన్ తాలూకు బ్రేక్ టైల్ లాంప్ గమనించాడు గురుమూర్తి. అతనికి అర్ధమయిపోయింది.
ఇంకొద్ది నిమిషాల్లో ఆ గూడ్స్ ట్రైయిన్ వెనుకనుంచి ఢీకొనటం ఖాయం. తను చేయగలిగిందేమీ లేదు. సాధారణంగా గూడ్స్ సిగ్నల్స్ మీద ఆగుతూంటాయ్.
ఒకవేళ ఈ గూడ్స్ బండికూడ ఆపుతే చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది.
అలా కాకుండా త్రూ వెళ్ళిపోతూంటే ఇంపాక్టు తక్కువ వుండవచ్చు. ఏమి చేయడానికీ తోచకపెద్దగా లాంగ్ విజిల్ మోగించసాగాడతను.
కొండపల్లి ఏఎస్సెమ్ దాస్ బయటకొచ్చిచూశాడు. గూడ్స్ బండివేగంగా వస్తోంది. దూరంగా ఎక్కడో మలుపు తిరుగుతూ 8 డౌన్ ఇంజన్ హెడ్ లైట్. గూడ్స్ ట్రెయిన్ యింతత్వరగా ఎలా వచ్చిందో అర్ధం కాలేదతనికి. కేవలం 8 డౌన్ పాసింజర్స్ అదృష్టం! అంతే! సెక్షనులో యాక్సిడెంట్ జరక్కుండా తప్పించుకోగలిగింది.
-నీ తన స్టేషన్ లో మాత్రం తప్పదు. లూప్ లైనులో గూడ్స్ బండి వస్తూండగానే వెనుకనుంచి 8 డౌన్ వచ్చి ఢీ కొనటం ఖాయం. ఎందుకంటే లూప్ లైనులో కిటర్నింగ్ తీసుకునేప్పుడు గూడ్స్ ట్రెయిన్ వేగం బాగా తగ్గిపోతుంది.
స్టేషనులోకి కొండపల్లిలోని లోకల్ డాక్టర్స్ అందరూచేరుకున్నారు హడావిడిగా.
"ఏమిటి? ఏం జరిగింది?" అడిగాడు ఒక డాక్టర్.
"ఇంకాసేపట్లో ఇక్కడ యాక్సిడెంట్ అవబోతోంది" చెప్పాడతను. అందరూ ఆశ్చర్యపోయారు "ఎలా?"
"8 డౌన్ గోదావరి ఎక్స్ ప్రెస్ కి బ్రేకులు ఫెయిలయినాయి. దాని ముందు వస్తోన్న గూడ్స్ ట్రెయిన్ ని ఢీ కొనడానికి అవకాశం వుంది" చెప్పాడు దాస్.
"యాక్సిడెంట్ ఎవర్ట్ అవడానికి ఛాన్సెస్ ఏమీలేవా?"
"ఉహు! గూడ్స్ ట్రెయిన్ డ్రైవర్ తో కమ్యూనికేషన్ ఏమయినా వున్నట్లయితే అతని వేగం పెంచమని చెప్పడానికి వీలయ్యేది. కానీ మన రైల్వేలు అంత అభివృద్ది చెందలేదింకా!"
"ఏమి రైల్వెనో, ఏమిటో! ప్రపంచమంతా అభివృద్ధి చెందినాగానీ మనరైల్వేలింతే!"
హఠాత్తుగా దాస్ బ్రెయిన్ లో డాక్టర్ డైలాగ్స్ ఫ్లాష్ వెలిగించినట్లయింది.
అవును! తను ఈ యాక్సిడెంట్ అవకుండా చూడ్డానికి అవకాశం వుంటుందేమో! గూడ్స్ ట్రెయిన్ స్లో అయిందిప్పుడు. బహుశా డ్రైవర్ లూప్ లైను సిగ్నల్ వద్ద వేగం తగ్గించివుంటాడు.
పరుగుతో స్టేషన్ లోకి వెళ్ళి 'కాబిన్' ని పిలిచాడతను.
"హలో రాములూ! గూడ్స్ ట్రెయిను వచ్చేసిందా?"
"కాబిన్ దగ్గర కొచ్చేసింది సార్!"
"8 డౌన్ ఎంత దూరంలో వుంది?"
"ఇంకో కిలోమీటరు ఉంటుందేమో సార్! గూడ్స్ ట్రెయిను మొత్తం లూప్ లైనులోకొచ్చేసరికి 8 డౌన్ కూడా వచ్చేస్తుంది."
"ఆల్ రైట్! నేను వస్తున్నానుండు" అనేసి ఇ.యస్.ఎమ్. దగ్గరకు పరుగెత్తాడు.
"సత్యనారాయణా! కమాన్! మన ఇద్దరం కాబిన్ దగ్గర కెళ్ళాలి?"