Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 20


    "మరి మీరంతా ఇక్కడ ఎందుకుంటున్నారు?"

    "నువ్వెందుకుంటున్నావో అందుకే మేమూ ఉంటున్నాము!"

 

    అరుంధతి దెబ్బ తగిలినట్లు ఉలిక్కిపడ్డది. అంటే నాలా. అయి ఉండదు. దిక్కులేని వాళ్ళయి ఉంటారు. శ్రీమతి వైకుంఠం ఆశ్రయమిచ్చి ఉంటుంది. నిజంగా శ్రీమతి వైకుంఠం చాలా మంచిది. అనవసరంగా తనే ఆమె యెడల అనిష్టం ఏర్పరుచుకుంది. కొందర్ని చూడగానే అర్ధం చేసుకోలేము. మొత్తంమీద ఆవిడ నవ్వు చూస్తే తనకు కంపరం పుడుతుంది.

 

    "నీ పేరేమిటి?" అరుంధతి ఆదరణగా అడిగింది.

 

    "వసమ్థ౧ నీ పేరు?"

 

    "అరుంధతి."

 

    "ఎంత చక్కని పేరు! అందానికి తగిన పేరు" అంది వసంత.

 

    "శ్రీమతి వైకుంఠం చాలా మంచిదానిలా ఉంది. మనలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తుంది" అంది అరుంధతి మాట మార్చే ఉద్దేశంతో.

 

    "ఎవరికోసం ఇస్తుంది? ఇందులో తన స్వార్ధం ఉంది కనకనే ఇస్తుంది." విసురుగా అంది వసంత.

 

    "స్వార్ధమా? ఇందులో ఆమె స్వార్ధం ఏముంది?"

 

    వసంత చెప్పటం ఇష్టంలేనట్లు ముఖం పెట్టింది. "కొన్ని రోజులుపోతే నీకే అర్ధం అవుతుందిలే" అనేసింది.

 

    "నీతోపాటు ఉన్న వాళ్ళిద్దరి పేర్లూ?"

 

    "కమల పెద్దామెపేరు. సన్నగా నల్లగావున్న అమ్మాయి పేరు సరోజ."

 

    "వాళ్ళెక్కడా?"

 

    "సరోజ అంట్లు తోముతూంది. కమల ఇల్లు వూడుస్తూంది. నేను కాఫీ పెట్టాను" అంది వసంత.

 

    "నాక్కూడా ఏదైనా పని చెప్పు చేస్తాను" అంది అరుంధతి. అందరూ పని చేస్తుంటే తను కూచోటం అపరాధం అనిపించింది.

 

    "శ్రీమతి వైకుంఠం మీచేత పనిచేయించవద్దని చెప్పింది" అంది వసంత. ఆమె స్వరంలో ఈర్ష్య తొంగిచూసింది.

 

    "పద నీతోపాటు వంటపని చేస్తాను" అంటూ వసంతతో వంటింట్లోకి వెళ్ళింది అరుంధతి.

 

    నలుగురూ మధ్యాహ్నం భోజనాలుచేసి కూచున్నారు. వాళ్ళు చూసిన సినిమాల్ని గురించి మాట్లాడుకుంటూ వుంటే అరుంధతి ఆశగా వింటూ కూచుంది.

 

    "శ్రీమతి వైకుంఠం సినిమాలు కూడా చూపిస్తుందా?"

 

    "అప్పుడప్పుడు చూపిస్తూ వుంటుంది. ఆమెకు మనుష్యుల్ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అప్పుడప్పుడు ఉషారు కలిగించటానికి మమ్మల్ని సినిమాలక్కూడా పంపిస్తుంది" అంది కమల.

 

    అరుంధతికి కమల మాటలు అర్ధంకాలేదు. వీళ్ళని సినిమాలకు పంపించటంలో కూడా ఆమెకు స్వార్ధం వున్నట్లు మాట్లాడతారేం? "శ్రీమతి వైకుంఠం మీద జాలివేసింది అరుంధతికి.

 

    మధ్యాహ్నం ఒంటిగంట ఆ ప్రాంతంలో శ్రీమతి వైకుంఠం చెమట్లు పోసుకుంటూ రొప్పుతూ వచ్చింది. వస్తూనే చేతిలోవున్న మల్లెపువ్వుల పొట్లం కమలచేతి కిచ్చింది.

 

    "కట్టి అందరూ పెట్టుకోండి. మీటింగు దగ్గరకు మనం నాలుగు గంటలకే వెళ్ళాలి. కాసేపు పడుకోండి" అంది శ్రీమతి వైకుంఠం.

 

    "ఎన్ని గంటలకు తయారు కావాలి?" వసంత విసుగ్గా అడిగింది.

 

    "మూడున్నరకల్లా తయారవండి. ఏమ్మా అన్నం తిన్నావా?" అరుంధతిని ఆప్యాయంగా అడిగింది శ్రీమతి వైకుంఠం.

 

    "తిన్నానండీ!" అంది అరుంధతి. కమల, సరోజ, వసంత వాళ్ళ గదిలోకి వెళ్ళారు. అరుంధతి ఒక్కదానికి ప్రత్యేకంగా గది ఇవ్వబడింది. అరుంధతి మంచంమీద పడుకొని కళ్ళు మూసుకుంది.    

 

    సాయంకాలం శ్రీమతి వైకుంఠం మీటింగుకు తీసుకెళుతుంది. రాజారావు ప్రసంగిస్తాడు. శ్రీమతి వైకుంఠం దగ్గర ఉంటే కాస్త బయట ప్రపంచం కూడా చూడవచ్చు. అరుంధతి ఆదరాబాదరా నిద్రలేచింది. మూడు దాటింది. అందరూ తయారయారేమో? తనే ఆలస్యం ఏమో? అనుకుంటూ లేచివచ్చింది అరుంధతి.

 

    కమల, సరోజ, వసంత ఆకుపచ్చంచు ఖద్దరుచీరలూ, అంచు రంగులోవున్న ఖద్దరు రవికా తొడుక్కొన్నారు. అందరూ ఒకే దుస్తుల్లో తమాషాగా వున్నట్లనిపించింది. అరుంధతి ఆదరాబాదరా తల దువ్వుకొని, ముఖం కడుక్కొని బొట్టూ, కాటుకా పెట్టుకొని, శ్రీమతి వైకుంఠం ముందుకొచ్చి నిల్చుంది, తనకు కూడా ఆ డ్రస్ ఇస్తుందని ఆశించింది.

 

    కమల అరుంధతికి మల్లెపూల చెండు అందించింది.

 

    "చూడమ్మా! నీకు వంటరిగా వుండటానికి భయమేమోనని రంగమ్మను వచ్చి నీ దగ్గర పడుకోమని చెప్పాను, మేము రాత్రి వచ్చేటప్పటికి ఎంత సమయం అవుతుందో ఏమో? నువ్వు అన్నం తినేసి పడుకో!" అంది శ్రీమతి వైకుంఠం అరుంధతిని ఉద్దేశించి.

 

    అరుంధతి తెల్లమొఖం వేసింది. తెప్పరించుకొని, "మీటింగుకి నేనూ వస్తాను" అంది.

 

    "మీటింగు ఏడు గంటలకుగాని ప్రారంభించరు" అంది శ్రీమతి వైకుంఠం.

 

    "మరి వీళ్ళంతా ఇప్పుడే వస్తున్నారుగా!" అంది అరుంధతి.

 

    "వీళ్ళంతా వాలంటీర్లుగా వస్తున్నారు. ఇంకా కొందరు అమ్మాయిలూ అనాధ శరణాలయం నుంచి వస్తున్నారు"- చెప్పుకుపోతూంది శ్రీమతి వైకుంఠం తన ధోరణిలో.

 

    అరుంధతి ముఖం వికసించింది. ఉత్సాహంగా అంది:

 

    "నేనూ వాలంటీరుగా వస్తాను. పనిచేస్తాను. అలా చెయ్యటం నాకు ఇష్టం."

 

    "బాబోయ్! నీచేత వాలంటీరు పని చేయించమంటావా? రాజారావుగారు నా ప్రాణం తీసెయ్యరూ?" అంది శ్రీమతి వైకుంఠం.  

    అరుంధతికి ఏడుపు, రోషం ముఖంలో పెనవేసుకున్నాయి.

 

    "నేను వాలంటీరుగా పనిచెయ్యటానికి రాజారావు ఇష్టం ఏమిటి మధ్యలో?" అనాలనిపించింది.

 

    కమల, సరోజ, వసంత ఒకరి ముఖాలొకరు భావయుక్తంగా చూసుకున్నారు. అది చూసి అరుంధతి మనస్సు చివుక్కుమన్నది.

 

    "నేను వస్తాను" అంది అరుంధతి. ఎందుకో రాజారావు పేరు ఎత్తాలనిపించలేదు.

 

    "ఆయన్ను అడక్కుండా నేను నిన్ను ఎక్కడకూ పంపించను" అంది శ్రీమతి వైకుంఠం.

 

    అరుంధతికి ఏడుపొచ్చింది, శ్రీమతి వైకుంఠంతో కమల ,సరోజా, వసంత యూనిఫారంలో వెళుతుంటే కళ్ళప్పగించి ఉసూరుమంటూ కూర్చుంది. వాళ్ళలా వెళ్ళగానే నిండుకుండ బద్దలయినట్లు బావురుమని ముఖం చేతుల్లో దాచుకొని ఏడ్చింది.  


                                                                 23


    అరుంధతి శ్రీమతి వైకుంఠం ఇంటికి వచ్చి వారం రోజులయింది. శ్రీమతి వైకుంఠం అంటే అరుంధతికి చిర్రెత్తుకొచ్చింది. ఆమె మాటి మాటికీ రాజారావును పొగుడుతూ వుంటే అరుంధతికి అసహ్యం వేసేది. పైకి ఏమి అనలేక వూరుకొనేది.

 

    ఆరోజు సాయంత్రం ఏమీ తోచలేదు. కిటికీ దగ్గర నిల్చొని వీధిలో చూస్తూవుంది. చిన్నపిల్లలు ఆడుకుంటూ వున్నారు. పదేళ్ళ కుర్రాడొకడు రెండేళ్ళ పిల్లను ఎత్తుకొని ఓ పక్కగా కూచోపెట్టి తను ఆటల్లో మునిగిపోయాడు. ఆ పిల్ల మట్టిలో కూచుని తనలో తనే నవ్వుకొంటూ ఆడుకుంటూంది. అరుంధతికి మాధవి గుర్తొచ్చింది.

 

    ఇప్పుడు మాధవి ఏం చేస్తూంటుందో? అమ్మ కోసం ఏడుస్తూందేమో? తండ్రి కోపంతో కొడుతున్నాడేమో? తన బిడ్డకు తల్లి ప్రేమ కరువయింది. తనకు తల్లి ప్రేమ ఎలాంటిదో తెలియదు. తన తల్లి తను పుట్టగానే కన్ను మూసింది. కాని తను బతికుండీ చచ్చిన దానితో జమ అయింది. అరుంధతి మాతృహృదయం బిడ్డకోసం ఆక్రోశించింది.

 

    ఆమె కళ్ళవెంట నీరు కారిపోతూంది. తుడుచుకోవటానికి కూడా ప్రయత్నించలేదు.

 

    వసంత, సరోజా, కమలా అరుంధతి దగ్గరకు వచ్చారు. ఆమె ఏడుస్తూంటే వాళ్ళకు కొత్త అనిపించలేదు. వాళ్ళంతా కూడా వచ్చిన కొత్తలో అలా ఏడ్చినవాళ్ళే. అయితే ఒక్కొక్కరిగాథ ఒక్కొక్కరకం.

 

    "ఏడవకు. ఏం చేస్తాం? మన బ్రతుకులే అంత!" అంది ఆర్ద్రంగా కమల.

 

    అరుంధతి తొట్రుపాటుతో కళ్ళు తుడుచుకుంది. తను ఏడుస్తుండగా వాళ్ళు చూట్టం ఆమెకు ఇష్టంలేదు.

 

    అరుంధతిని తీసుకొచ్చి అందరూ ఆరుబయట కూర్చున్నారు. శ్రీమతి వైకుంఠం ఇంకా రాలేదు.

 

    "నువ్వు చాలా అందంగుంటావక్కా! శ్రీమతి వైకుంఠం అదృష్టం పండిందన్నమాటే!" మామూలుగానే అంది వసంత.

 

    అరుంధతి అయోమయంగా చూసింది. తను అందంగా వుండటానికీ, శ్రీమతి వైకుంఠం అదృష్టం పండటానికీ వున్న లింకు ఏమిటో ఎంత ఆలోచించినా అరుంధతికి అర్ధం కాలేదు. తను అందమైనదయితే వీళ్ళను సరిగా చూడకపోవటం ఏమిటి? వాళ్ళ తలా తోకా లేని వాగుడికి చిరాకు వేసింది అరుంధతికి.

 

    అరుంధతిని గురించి తెలుసుకోవాలని వాళ్ళందరికీ కుతూహలంగా వుంది.

 

    "అసలు మీది ఏ ఊరు అరుంధతీ?"

 

    "పెళ్ళయిందా? ఇక్కడ కెలా వచ్చావు?" కమలా, సరోజా ప్రశ్నల వర్షం కురిపించారు.

 

    అరుంధతి "ముందు మీ గురించి చెప్పండి తర్వాత నా గురించి చెబుతాను" అంది నిదానంగా ఆలోచిస్తున్న ధోరణిలో.

 

    "నేను చెప్పనా?" అంది వసంత ఉత్సాహంగా.

 

    "వద్దులే! అక్కయ్య చెబుతుంది" అంది సరోజ.

 

    చూస్తూండగానే కమల ముఖంమీద విషాద మేఘాలు వ్యాపించాయి. చిన్నగా మొదలుపెట్టి చెప్పసాగింది.

 

    "మా నాన్న తాలూకాఫీసు గుమస్తా! మేము ఆరుగురు ఆడపిల్లలం, ఒక మొగపిల్లవాడు. అందరికంటే నేను పెద్దదాన్ని. పొట్టలు గడవడమే కష్టంగా వుండేది. వయసుతోపాటు నాలో సహజమైన కోరికలు విజృంభించాయి. చదువు సంధ్యలు లేని నాకు మంచీ చెడూ ఆలోచించే ఇంగితజ్ఞానం లేకపోయింది. పాలపొంగులాంటి వయస్సు - మంచి బట్టలంటే నాకు ఇష్టం, నగలంటే వ్యామోహం; పువ్వులంటే ప్రాణం. కాని, ఇవేమీ నాకు లభించేవి కావు. సన్నగా పొడవుగా పాంటు వేసుకొని, సిగరెట్టు తాగుతూ నడుస్తూన్న యువకుని పక్కన మల్లెపువ్వులు పెట్టుకొని, కొత్తచీర కట్టుకొని సినిమాకు వెళ్ళాలనిపించేది. ఇలాగే చాలా చాలా అనిపించేవి. ఏ కోరికా తీరలేదు. అన్ని కోరికలూ కల్పనా ప్రపంచంలోనే వూహించుకుంటూ తృప్తిపడేదాన్ని. నా వెర్రిబాగులతనాన్ని అర్ధం చేసుకున్న ఎదురింటి శాస్త్రిగారి పెద్దబ్బాయి మూర్తి నాకు అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు, గంపెడు సంతానంతో, ప్రాథమిక అవసరాలే తీరక బాధపడుతున్న నా తల్లితండ్రులకు నా గురించి ఆలోచించే తీరికేలేదు, సహనం అంతకన్నా లేదు.

 

    ఒకరోజున తెల్లవారుఝామున మూర్తితో బెంగుళూరు పారిపోయాను. అక్కడ పదిహేనురోజులోనే అతను తెచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయింది. పెళ్ళిచేసుకుందాం అని చెప్పాడు. ఆ మాట ఎత్తినప్పుడల్లా "చేసుకుందాం" అనేవాడు చిరునవ్వుతో. ఆ చిరునవ్వు చాటున దాగివున్న విషాన్ని నేను తెలుసుకోలేకపోయాను. అంతా అమృతమే అనుకున్నాను. ఒకరోజు ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళిన మూర్తి తిరిగిరాలేదు. తెలియని ప్రదేశంలో భాష కూడ అర్ధంకాని ప్రాంతంలో ఒక హోటల్ గదిలో నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఆ హోటల్ యజమాని దయదలచి నాకు విజయవాడ టికెట్టుకొని బండి ఎక్కించాడు. నాన్న నన్ను ఇంట్లో కాలు పెట్టనివ్వలేదు. అమ్మ ఏడ్చింది. కాని, నాతో మాట్లాడలేదు. వాళ్ళద్వారా వీళ్ళద్వారా నానా అవస్థలూ పడి శ్రీమతి వైకుంఠం దగ్గరకు వచ్చాను. నేను వచ్చేటప్పటికి ఇద్దరు యువతులు ఆమె దగ్గర వున్నారు. వారిద్దరికి నేను వచ్చాకనే వివాహాలు చేసి పంపింది."

 

    "శ్రీమతి వైకుంఠం పెళ్ళిళ్ళు కూడా చేయిస్తుందా?" విస్మయంగా అడిగింది అరుంధతి. శ్రీమతి వైకుంఠం అంటే గౌరవం లాంటి భావం ఏదో లీలగా కదిలింది అరుంధతి మనసులో.

 

    "ఆ - చేసుకొనేవాళ్ళు దొరికితే చేస్తుంది. ఈ లోపల తన పనులు కూడా చేసుకుంటుంది" అంది వసంత విసురుగా.

 

    వసంతకు శ్రీమతి వైకుంఠం అంటే చాలా కోపం అని మొదటిరోజే గ్రహించింది అరుంధతి. కాని శ్రీమతి వైకుంఠానికి ఆ ముగ్గురిలో వసంత అంటేనే ఇష్టం అని కూడా అర్ధం చేసుకుంది. వసంత ప్రతిసారీ తమవల్ల శ్రీమతి వైకుంఠం ఏదో స్వార్ధం సాధించుకుంటున్నట్లు మాట్లాడుతుంది. ఆ స్వార్ధం ఏమిటో అరుంధతికి అర్ధం కాలేదు. మీటింగుల్లో వాలంటీర్లుగా తిప్పటం వసంతకు ఇష్టం లేదేమోననుకుంది. తను ఆ అవకాశం కోసం ఆరాటపడుతుంది. వసంతకు ఇష్టంలేదు. చాలా చిత్రం.

 

    "సరోజ?" అరుంధతి సరోజవైపు చూసింది.

 

    "సరోజ మాట్లాడలేదు. ఆమె కళ్ళు చెమ్మగిల్లటం కనిపించింది. కమల సరోజ కథ చెప్పసాగింది.

 

    సరోజను భర్త వదిలేశాడు. ఆమె అందంగా లేదట. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. చిన్నతనంలోనే పోయారు. మేనమామల ఇంట్లో పెరిగింది. మేనమామ మంచివాడే కాని, అతని భార్య బ్రహ్మరాక్షసి. కాల్చుకొని తినేది. భర్తనే త్యజింపబడి మళ్ళీ మేనమామ ఇంటికి వెళ్ళలేక ఎవరి ద్వారానో శ్రీమతి వైకుంఠం దగ్గర చేరింది. సరోజ కాస్త చదువుకొన్నదే. "ఏదో గవర్నమెంటు హోమ్ లో చేర్పిస్తాను అంటూ రెండు సంవత్సరాలు గడిపింది. ఇక చేర్పిస్తుందనుకుంటాను" అంది కమల.

 

    సరోజ విషయం వింటూ అరుంధతి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

 

    "ఇక ఇప్పుడు నువ్వొచ్చావుగా. చాలా అందమైన దానివి కూడా. శ్రీమతి వైకుంఠం తన దగ్గర ఎప్పుడూ ముగ్గురుకంటే ఎక్కువ మందిని పెట్టుకోదు అంది వసంత.

 

    "శ్రీమతి వైకుంఠం నిజంగా మనలాంటి వాళ్ళ పాలిట దేవత. తను మనలాంటి వాళ్ళను ఎప్పుడైనా స్వార్ధానికి ఉపయోగించుకున్నా, అందరికీ చివరికి ఏదో మార్గం చూపిస్తూనే వుంది. ఈ మాత్రం పతితల్నీ అనాధల్నీ చేర్చి ఆదరించేవారు ఎంతమంది వున్నారు?" అంది కమల.

 

    "వసంత?" అరుంధతి కుతూహలంగా అడిగింది.

 

    "వసంతను ఎవరో కాని ఆసుపత్రిలో వదిలేసిపోయారు. ఆ ఆసుపత్రి నర్సు ఒకామె వసంతను పెంచి పెద్దదాన్ని చేసింది. వసంత హైస్కూల్లో తొమ్మిది వరకు చదువుకుంది. నర్సు ఆమెకు పెళ్ళి ప్రయత్నాలు చేస్తుండగానే అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయింది. వసంత ఎక్కడకు పోవాలో, ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. వయస్సు పదిహేను సంవత్సరాలున్నా లోకం పోకడ తెలియకుండా, పెంచిన తల్లి నీడలో గడిచిపోయింది కాలం. ఆమె పోవటంతో ప్రపంచమంతా చీకటే అయింది. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉండగా శ్రీమతి వైకుంఠం వసంతను ఆదుకున్నారు" అంది కమల.

 Previous Page Next Page