Read more!
 Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 2


    "కాలాంతకుడు. ప్రతిదానికీ పందెం. ప్రతి పందెంలో గెలుపూ తనదే!" అన్నాడు అన్సారీ.
    "ఈ డబ్బు కూడా మన పిక్నిక్ ఫండ్ కి కలిపేస్తున్నాను. ఈ డబ్బుతో స్వీట్స్ కొందాం" అంటూ ఆ నోటు కుమార్ కు ఇచ్చాడు. అందరి డబ్బు పోగుచేసే బాధ్యత కుమార్ ది కాబట్టి.
    ఆదివారం ఎన్ని గంటలకి బయలుదేరేదీ, ఎక్కడ కలుసుకునేది వగైరా విషయాలన్నీ మాట్లాడుకుని ఇంటి మొహం పట్టారు అందరూ.
    మృత్యుంజయరావు రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసి రిటైరయిపోయారు. భోగ భాగ్యాలకేమీ లోటు లేకపోయినా భార్య కౌసల్య మరణం ఆయన్ని కృంగదీసింది. ఆనాటి నుంచీ ఆయన ప్రాణాలన్నీ అయిదేళ్ళ పసికందు అజయ్ మీదే పెట్టుకుని కాలం గడుపుతూ వచ్చారు.
    ఆడదిక్కులేక చిందర వందరగా ఉన్న ఆ ఇంట్లో తోడుగా వుండటానికి చెల్లెలు గోవిందమ్మకి ఒక్కడే ఒక్క కొడుకు గోపీనాథ్. గోపీ పుట్టగానే భర్త ఈశ్వర్రావు సన్యాసులలో కలిసిపోయాడు. ఎక్కడున్నాడో ఏమిటో అసలున్నాడో లేడో తెలీక సతమతమయిపోతూన్న గోవిందమ్మని తమ ఇంటికి తీసుకొచ్చి ఆదరించారు మృత్యుంజయరావు.
    గోవిందమ్మ గోపీతో బాటు వెంట గౌరిని కూడా తీసుకురాక తప్పలేదు. గౌరీ ఈశ్వర్రావుగారి చెల్లెలు కూతురు. గౌరీ పుట్టగానే పురిట్లోనే సంధి రోగం వచ్చి కళ్ళు మూసింది శాంతమ్మ. భర్త సుబ్బారావు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. సవతి తల్లి నరకం నుంచి తప్పించడానికి ఈశ్వర్రావు గౌరిని తన ఇంటికి తీసుకొచ్చాడు. గోవిందమ్మ చేతిలో పడేసినందుకు విచారించని క్షణం లేదు.
    సన్యాసుల్లో పోయేవాడు పోక నా మెడకి దీన్ని కూడా తగిలించిపోయాడే అని గోవిందమ్మ శోకాలు పెట్టని రోజు లేదు. ఎన్నోసార్లు గౌరిని తన్ని తగలెయ్యడానికి ప్రయత్నించినా, తన కొడుకే తనకి ఎదురు తిరిగి ఆ పిల్లని ఆదుకోవడం వలన అశక్తురాలయిపోయింది. కౌసల్య పోవడంతో అన్నగారింటి తాళాలు బొడ్లో కొచ్చి, గోవిందమ్మ దుఃఖాన్ని చాలామటుకు దూరం చేశాయి.
    గోవిందమ్మ గోవింద నామాలు చదువుకుంటూ పూజ గదిలో కూర్చుంది. మృత్యుంజయరావు పద్దు పుస్తకాలేవో తిరగేస్తున్నారు. అంట్లు తోమటం పూర్తి చేసి, గదిలో సోఫాలు దులుపుతోంది గౌరీ.
    గౌరీ చేత ఈ పనులు చేయించొద్దని ఎన్నిసార్లు మృత్యుంజయరావుగారన్నా, గోవిందమ్మ వినిపించుకోలేదు. పై పెచ్చు ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెప్పేసింది.
    గౌరీ... ఎక్కడ చచ్చావే" ఉరుములాంటి ఆ కేకకు 'వస్తున్నా అత్తయ్యా, సోఫాలు ఫులుపుతున్నా' అని సమాధానం ఇచ్చింది గౌరీ.
    "ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టి తీరిగ్గా సోఫాలు దులుపుతున్నావా? ఈ పనులన్నీ నీ బాబు చేస్తాడనుకున్నావా?" అరిచింది గోవిందమ్మ.
    "ఏయ్ అత్తయ్యా... నన్నంటే అను. కానీ నా బాబు సంగాతెత్తావా ఊరుకోను జాగ్రత్త" అంటూ తన తండ్రిని వెనకేసుకొచ్చింది గౌరీ.
    తనకు తిరిగి సమాధానం చెప్పిందన్న కోపంతో 'ఏమిటే వాగుతున్నావ్? అంటూ చేతిలోని రుద్రాక్ష మాల సోఫామీద పెట్టి, జుట్టు పట్టుకుంది గోవిందమ్మ. అప్పుడే అటుకేసి వచ్చిన గోపీనాథ్ జేబులోంచి పర్సు తీసి రూపాయి నోటు కింద పడేసి చూడనట్టు అటొచ్చాడు. "ఏమిటే ఇదంతా" అంటూ.
    నోటు చూసిన గోవిందమ్మ గౌరీ జుట్టు వదలిపెట్టి గబగబా ఆ నోటందుకుని "చూడరా దీని పొగరు. ఇది నాకే సమాధానం చెబుతోంది" అంది.
    "నువ్వెళ్ళమ్మా, నే చూసుకుంటా" అన్నాడు గోపి.
    రూపాయి తీసుకుని వెళ్ళిపోయింది గోవిందమ్మ.
    "బావా! నీ జేబులోంచి రూపాయి పడింది. అత్తయ్య అది తీసుకుని వెళ్ళిపోయింది" అంది గౌరీ.
    "తెలుసులే అరవకు. కావాలని నేనే నీకోసం అలా పడేశాను" అన్నాడు నవ్వుతూ గోపి.
    "నా కోసమా?" ఆశ్చర్యంగా అంది గౌరీ.
    "ఊ...నీకోసమే..."
    "అదేంటి బావా?" మరింత ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని అడిగింది గౌరి.
    "అబ్బబ్బబ్బ ఖర్మ! వట్టి నాటు సరుకు. ఏదీ అర్థం కాదు. ఆ డబ్బు అలా చూడనట్టు పడెయ్యకపోతే, అమ్మ నీ జుట్టు వదలదు. నేను నీ దగ్గరకు రాలేను."
    "ఓ...అదా!" అత్తయ్యకి బురదలో కాణీ దొరికినా చాలు కడిగేసి తీసుకుంటుంది." అంటూ పగలబడి నవ్వింది.
    అంతలో గోపీ గొంతు విని పద్దు తిరగేస్తున్న మృత్యుంజయరావు కేక పెట్టాడు 'గోపీ' అంటూ.
    "వస్తున్నా మామయ్యా" అంటూ వెళ్ళాడు గోపి.
    "ఏరా! అజయ్ పేరు మీద ఇంత ఖర్చా? ఎందుకని?"
    "ఏమో! నాకేం తెలుసు మామయ్యా. బావ అడిగినంతా ఇస్తున్నాను. దానధర్మాల్లో బావ అచ్చు మీ కొడుకేగా!"
    అడిగినంతా ఇస్తున్నావా? ఒరేయ్ చేతినిండా డబ్బుండి చెప్పుకోవలసిన బాధ్యతలు లేకపోతే మనుష్యులు చెడిపోతారు. ఇకముందు నుంచి వాడడిగినదాంట్లో సగం ఇయ్యి" అన్నాడు.
    "అలాగే మామయ్యా" అని ఇవతలికొచ్చేశాడు గోపీ.
    లోపలికొస్తూ ఈ సంభాషణ విన్న అజయ్ ముసిముసిగా నవ్వుకున్నాడు. గోపీ దగ్గరికెళ్ళి ఆదివారం ఫ్రెడ్సందరం కలిసి నాగార్జున సాగర్ పిక్నిక్ కి వెళుతున్నాం. ఓ వెయ్యి రూపాయలియ్యి" అన్నాడు.

 Previous Page Next Page