Read more!
 Previous Page Next Page 
చైనా యానం పేజి 2


                                        చైనా యానం

                                             ఒకటి
        
    ఇవాళ జనవరి 17, 1977, క్రిందటి సంవత్సరం డిసెంబరు నెలలో (6వ తేదీ పీకింగ్ విమానాశ్రయంలో దిగింది మొదలు 27వ తేదీ రాత్రి అదే విమానాశ్రయంలో తిరుగుప్రయాణం చేసిందాకా) 21 రోజులు చైనాలో పర్యటించాను. చైనా ప్రభుత్వపు ఆహ్వానం ప్రకారం నెల రోజులకు పైగా నేనా దేశంలో ఉండవలసింది. ఈలోపుగానే ఎందుకు మరలిరావలసి వచ్చిందో "తిరుగు ప్రయాణం" అనే శీర్షిక కింద మున్ముందు రాస్తాను.
    ఇది రాయబోయే సమయానికి "నగ్నముని" టెలిఫోన్ చేశాడు. నిన్నా, మొన్నా "మాలపల్లి"  నాటక ప్రదర్శనలు ముగించుకొని, ఇవాళ హైదరాబాదుకు బయలుదేరుతున్నట్టు నాకు తెలియజేయడానికి, "ఏం చేస్తున్నా" వని అతనడిగిన ప్రశ్నకు, అనంతంలో చైనా యాత్ర రాయ బోతున్నాననీ, చాలా వారాలా దాకా ఇదే సాగించదలచుకున్నాననీ జవాబిచ్చాను.
    "మీ చైనా పర్యటన గురించి ఒక్క వాక్యంలో వివరిస్తారా."
    "చాలా ఇబ్బంది కలిగించే ప్రశ్న. ఒక పెద్ద పుస్తకం రాయడానికి తగినంత సామాగ్రితో వచ్చా" నన్నాను.
    అదంతా చెబితే బాగుంటుందా, నిజం చెబితే బాగుంటుందా అని ఆలోచించడానికి కూడా వ్యవధి లేదు. నిజం చెప్పేశాను. "స్వర్గాని కేగిరి వెళ్ళి నరకంలోనికి మళ్ళీ దిగజారినట్టుంది" అని.
    నాకు సంబంధించినంత వరకు ఇదే నిజం. అయితే ఇక్కడ కొంత వివరణ అవసరం. చైనా సమస్తమూ స్వర్గమనీ, ఇండియా యావత్తూ నరకం అనీ నా ఉద్దేశం కాదు. చైనాలో నరకయాతన అనుభవిస్తున్నవారూ , ఇండియాలో స్వర్గసుఖాలు చూరగొంటున్న వారూ లేకపోలేదు. ఇంతకూ స్వర్గం, నరకం అనేవి మన చుట్టూనే ఉన్నాయి. మనం కల్పించుకునే వాతావరణంలోనే వున్నాయి.
    మనకి 1947 లో "స్వరాజ్యం" వచ్చింది. 1949 లో చీనా వారు "విమోచనం" సాధించుకున్నారు. స్వరాజ్యం వచ్చిన తరువాత మనదేశ ప్రజలలో Selfshness and hypocrisy (స్వార్ధ పరత్వమూ- కాపట్యమూ) పెచ్చు పెరిగినట్లు నిష్పాక్షిక పరిశీలకులు గమనిస్తున్నారు. విమోచనానంతరం చైనా ప్రజలలో నిస్వార్ధం,నిష్కాపట్యం పెరుగుదల చూపుతున్నట్లు , చైనా అంటే కిట్టనివాళ్ళు సహా గుర్తించిన వాస్తవం.  
    అందుకే నానాటికీ చైనా,  అచ్చటి ప్రజలలో అధిక సంఖ్యాకులకు భూలోక స్వర్గంగా మారుతోంది. మన దేశంలో ఈనాటికీ విలయతాండవం చేస్తున్న మత పిశాచికి చైనా నుంచి ఏనాడో వుద్వాసన చెప్పడం జరిగింది.
    చైనాకు బయలుదేరడానికి ముందర నేనో మూడు విషయాల మీద ముఖ్య నిర్ణయాలు తీసుకున్నాను.
    మొదటిది : నా దేశం గురించి మరో దేశంలో, అదెంత మిత్రరాజ్యమైన సరే,  చెడుగు మాట్లాడ కూడదని, ఎంచేతనంటే అది నాగరికతా లక్షణం కాదు. నా దేశంలో నాకు నచ్చనిదీ, అమిత బాధ కలిగించేదీ సవాలక్ష గ్రంధం వుంది. ఇంకో దేశంలో ఈ పురాణంఅంతా విప్పడం నాకిష్టం లేదు. ఈ దేశంలో జరిగే అకార్యకారణాలతో , అనాచారాలతో ఇక్కడే పోరాటం సాగిస్తాను. మన వాళ్ళు బర్బరులు కారు. నేను చెప్పే దానిలో మంచివి, ఇవాళ కాకుంటే రేపయినా గ్రహించి స్వీకరిస్తారు.
    రెండో విషయం : చైనా అంతరంగిక విషయాల మీద ఎటువంటి ప్రశ్నలూ అడగకూడదని . ఉదాహరణకు అలెండీ హత్యనంతరం చైనా ఎందుకా చర్యను ఖండించలేదు? అడగాలంటే ఇలాంటి ప్రశ్నలు చాలా వున్నాయి. అయినా ఇవన్నీఆ దేశపు అంతరంగిక విధానాలకు సంబంధించినవి. వీటన్నిటికీ వారి జవాబులు వారి కుంటాయి. అవి నాకు నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. అయినా ఇటువంటి ప్రశ్నలేవీ లేవదీయ కూడదని మొదటే నేను నిశ్చయించుకున్నాను.
    మూడవది : చైనా లోని రెడ్ ఆర్మీ (ఎర్రసేన) నిర్మాణానికి సంబంధించిన వివరాల గురించి అడగకూడదనుకున్నాను. ద్వితీయ ప్రపంచ యుద్దకాలంలో కొన్నాళ్ళు నేను లక్నోలో ఒక మిలటరీ ఆఫీసరుగా పనిచేశాను. ఒక్కొక్క దేశపు మిలటరీ శక్తి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఆరోజుల్లోనే నాలో జనించింది. యుద్దతంత్రం గురించి క్లోజ్ విచ్" అనే జర్మన్ దేశీయుడు వ్రాసిన గ్రంధాన్ని ఆరోజుల్లోనే, ఇంగ్లీషు అనువాదంలో చదివాను. అది ఇప్పటికీ ఒక ప్రామాణిక గ్రంధమనే చెప్పాలి.
    మన దేశాన్ని ముప్పయి మూడుకోట్ల దేవతలు రక్షిస్తున్నారనేది ఒక గొప్ప మూడవిశ్వాసం. మన సైనిక, నౌకా, విమానదళాలే మనకు పెట్టని కోటలు. ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుంది. అయినా ఎర్రసేన గురించి ఎన్నో సంగతులు తెలుసుకోవాలన్న కుతూహలం ఎంతగా వున్నా, ఆ విషయమై ఒక్క ప్రశ్న కూడా ఎప్పుడూ, ఎక్కడా చైనా వారిని అడగలేదు.
    చైనాలో వున్నన్ని రోజులూ వారు ఎక్కడకు తీసుకు వెళ్తే అక్కడకు వెళ్లాను. ఏది చూపిస్తే అది చూశాను. ఏమి చెబితే అది విన్నాను. విపులంగా నోట్సు తీసుకున్నాను. ఏరోజు జరిగింది ఆరోజు దినచర్యగా రాసుకున్నాను.
    ఇరవై ఒక్కరోజుల పర్యటనతో చైనా మీద నేనొక నిపుణుడిగా మరిపోయానన్న భ్రమలేవీ నాకు లేదు. కానీ ఒక గొప్ప దేశాన్నీ , విమోచనం సాధించిన అచిరకాలంలోనే ప్రపంచంలోనే అగ్రరాజ్యలలో మూడవదిగా రూపొందిన దేశాన్ని చూడగాలిగానన్న సంతృప్తి మాత్రం నేను దాచుకోలేదు. మన రెండు దేశాల మధ్య యిప్పుడిప్పుడే మెరుగవుతున్న సత్సబందాలు యిక మీద ఇంకా ఇంకా దృడతరమవుతాయన్న ఘన విశ్వాసంతో మరలివచ్చాను. ఇండియా చైనాల మధ్య స్నేహం ఎంత బలం పుంజుకుంటే అంత మేరకు ప్రపంచం మొత్తంలోనే శాంతి సౌభాగ్యాలు నెలకోనగలుగుతాయనే నా వెనుకటి విశ్వాసం ఇప్పుడు మరింత ఖాయమయింది.
    1954లో మొదటి సారిగా రష్యాకు వెళ్ళడానికి ముందు ఒకటి రెండేళ్ళ పూర్వమే చైనాకు వెళ్ళే అవకాశం నాకు కలిగింది. కాని, నేనొకటి తలిస్తే, చక్రవర్తుల రాజగోపాలాచారి' గారు మరొకటి తలచడం వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. అవి హిందీ, చీనీ భాయీ భాయీ రోజులు. ఆంధ్రరాష్ట్రం " అప్పటికింకా వేర్పడలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికప్పటి ముఖ్యమంత్రి సి.యార్ గారు. నామినేషన్ ద్వారా వచ్చి, ప్రకాశం పంతులుగారికి అడ్డుతగలడంతో రాజాజీ కనబరచిన గొప్ప చాణక్య నీతి - అదంతా వేరే కధ.
    ఆ రోజుల్లో కమ్యూనిస్టూపార్టీ 45గురు సభ్యులతో బలిష్టమైన ప్రతిపక్ష పార్టీగా వుండేది. కమ్యూనిస్టులు తనకు ప్రధమ శత్రువులని రాజాజీ సగౌరవంగా చాటేవారు. నేను కమ్యూనిస్టుల వోటుతో ఎగువ సభకు ఎన్నికయిన వాణ్ణి. అప్పుడే చైనాకు వెళ్ళే సౌహార్ణ ప్రతినిధివర్గంలో సభ్యుడిగా నాకు ఆహ్వానం వచ్చింది.
    ఆ విషయం రాజాజీకి చెప్పి, ప్యాస్ పోర్టు విషయమై కలెక్టరుకు సిఫారసు చేయవలసినదిగా కోరాను. "ఓ దానికేం అలాగే చేస్తా" నన్నారాయన. ఆ మాటలు నమ్మి వెయ్యి రూపాయల ఖర్చుతో ఉన్ని దుస్తులు కుట్టించడం మొదలైన పనులేవో చేశాను.
    తీరా ఆఖరి క్షణంలో నా ప్యాస్ పోర్టు మంజూరు కాలేదు. ఇందుకు రాజగోపాలాచారే అడ్డు తగిలారనడానికి తగ్గ సాక్ష్యాదారాలేవీ నా దగ్గర లేవు గాని, "ఈ కమ్యునిస్టును చైనాకు వెళ్ళనివ్వకూడదనీ, ప్యాస్ పోర్టు కు అనుమతించవద్దనీ" కలెక్టరుకు సీయార్ రాసినట్టే నా అనుమానం. అంతకు పూర్వం బలుసు సాంబమూర్తి" లండన్ ప్రయాణాన్ని ఆటకాయించిన వాడూ, ఆంధ్ర రాష్ట్రాన్ని వేరుచేస్తే మద్రాసు నగరంలో రక్తపాతం జరిగిపోతుందని లోపాయికారిగా బ్రిటీష్ మంత్రికి రాసినవాడూ ఈ ప్రబుద్దుడే కాబట్టి నా విషయం కూడా ఇతగాడి విషహస్తమే పనిచేసి ఉండాలని నేననుమానించక తప్పలేదు.
    నాటినుంచీ నిన్న మొన్నటి దాకా నా చైనా యాత్ర ఒక సాధ్యం కాని స్వప్నంగానే మిగిలిపోయింది. కాని ఈనాడు ఆ స్వప్నమే నిజమయింది.
    రాజాజీ వంటి అభివృద్ధి నిరోధకులను గొప్ప మేధావులుగా పరిగణించేవారు అప్పుడూ వున్నారు. ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. సర్ విన్ స్టన్ చర్చిల్" ఎన్నో విషయాలలో రాజాజీ కన్నా అధికుడు. కరుడుగట్టిన సామ్రాజ్యవాది. కమ్యూనిజానికి బద్దవిరోధి. సోవియట్ యూనియన్ ను పురిటిలోనే సంధి కొట్టించాలని చూసినవాడు.
    కాని ఆ చర్చిల్ అభిమతానికి విరుద్దంగా మనం స్వరాజ్యం సాధించుకున్నాము. చర్చిల్ బతికున్న కాలంలోనే! రాజాజీ అభీష్టానికీ వ్యతిరేకంగా నేను చైనా వెళ్ళి వచ్చాను ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత.
    ఇలా జరగకుండా తన సోట్టకాలు అడ్డు పెట్టడానికి రాజాజీ బ్రతికి లేడు. ఒకవేళ బ్రతికి ఉన్నా అది అతనికి అసాధ్యమే అంటాను.
    ఇండియా - చైనాల పరస్పర స్నేహం అభివృద్ధి కావడానికి నా చైనా పర్యటన ఏ కొంచెం తోడుపడ్డా నేను ధన్యుడ్నే అనుకుంటాను.

 Previous Page Next Page