Read more!
 Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 2


    "బత్తమీజ్! షరమ్ నై ఆతీ? అయ్ సా బాత్ కర్ నేకో....?" అంది పబ్లిక్ వేపు తిరిగి.
    అంతా మళ్ళీ ఘోల్లుమన్నారు.
    "సీతా! పద వెళ్దాం. జరిగిందానికి నేను సారీ చెపుతున్నా కదా... ప్లీజ్" అన్నాడు గోపాల్రావ్ కొంచెం గొంతు తగ్గించి.
    "అదేం నడవదు. కాళ్ళమీద పడు" ఇంకెవరో అరిచారు జనంలో నుంచి.
    మళ్ళీ నవ్వులు.
    "షటప్! ఎవడ్రా వాగుతోంది?" షర్టు చేతులు మడిచి ఆ గొంతు వినిపించిన వేపు తిరిగాడు గోపాల్రావ్.
    "ఎవడ్నా? మై సీతాకా బాప్ హురే... సీతా! ఆ... గలే లగ్ జా" ఇంకోవేపు నుంచి ఎవడో అరిచాడు.
    "అరే సాలే! సీతా కా బాప్ మై హు రే! సీతా! ఇదరావ్! మేరే గలే లగ్ జా" అని ఇంకోడు ఇంకోవేపు నుంచి అరిచాడు.
    "అరే పాగల్ ఏక్ సీతాకో దో దో బాప్ కహాసే ఆతేరే?" మరో గొంతు.
    మళ్ళీ నవ్వులు, కేకలు, విజిల్స్.
    ఆ గొడవతో సీత కోపమంతా తగ్గిపోయింది.
    తన తెలివి తక్కువతనం వల్ల తామిద్దరి గొడవనీ ఎగ్జిబిషన్ కొచ్చిన జంటనగరాల ప్రజలంతా ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం అర్ధమైంది.
    చప్పున గోపాల్రావ్ చేయి పట్టుకుని ఆ గుంపులో నుంచి బయటకు ఈడ్చుకుపోయిందామె.
    ఇద్దరూ జనసమ్మర్ధం లేనిచోట ఆగారు.
    "అయామ్ సారీ" అన్నాడు గోపాల్రావ్.
    "తప్పు నాదే_ అయామ్ సారీ" అంది సీత.
    "ఇంకో అమ్మాయితో మాట్లాడినంత మాత్రాన నీకు అంత కోపం వస్తుందని తెలీదు సీతా."
    "నాకెందుకో మొదటి నుంచీ పొజెసివ్ నెస్ ఎక్కువ. మా డాడీ కేవలం నా ఒక్కదానికే రిజర్వ్ డ్ అనే ఫీలింగ్ తో వుండేదానిని. పొరపాటున ఇంకెవర్నయినా మా డాడీ దగ్గరకు తీసుకుని ముద్దాడినా నాకు అమితమైన కోపం వచ్చేసేది. అలాగే మా మమ్మీ కూడా. అంతెందుకు? మా మమ్మీ మా డాడీని ప్రేమగా ట్రీట్ చేసినా అనీజీగా ఫీలయ్యేదానిని."
    గోపాల్రావ్ కి అర్ధమైంది.
    "పిల్లలందరిలోనూ వుండే ఫీలింగే అది. నథింగ్ అన్నేచురల్" అన్నాడు ఎందుకయినా మంచిదని ఆమెని సపోర్ట్ చేస్తూ.
    "తమాషా ఏమిటంటే పెద్దయ్యాక అలాంటి ఫీలింగ్సన్నీ పోతాయని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మరీ ఎక్కువయిపోయాయ్. మా క్లోజ్ ఫ్రెండ్ రాధకు పెళ్ళయిందీ మధ్య. అది వాళ్ళాయనతో క్లోజ్ గా వుంటే నాకెంత జెలసీగా వుండేదో చెప్పలేను. అది నన్ను మోసం చేసినట్లు, అంతవరకూ నాతో చేసిన గాఢ స్నేహం అంతా నటన అన్నట్లు ఫీలయ్యాను."
    "జనరల్ గా అందరూ అంతే."
    "ఇప్పుడు నీ గురించి కూడా అలాగే ఫీలవుతున్నాను. నువ్వు నా వాడివనీ, నా ఒక్కదానికే స్వంతమనీ ఇంకెవ్వరికీ చెందవనీ, చెందకూడదనీ నా కోరిక. నువ్వింకే అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అయినా నాకు పట్టరాని కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకు తెలుసు _ అంత జెలసీ, అంత ఆవేశం మంచిది కాదని. కానీ చెప్పాను కదా_ అది నా వీక్ నెస్."
    ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్.
    గోపాల్రావ్ ఆమె భుజం మీద చేయి వేశాడు ఆప్యాయంగా.
    "దట్సాల్ రైట్! జరిగిందేదో జరిగిపోయింది. ఇంక ఆ విషయం ఆలోచించకు" అన్నాడు అనునయంగా.
    "నన్నర్ధం చెసుకుంటావ్ కదూ?" దీనంగా అడిగింది.
    "నిన్ను కోరి చేసుకుంది ఎందుకనుకున్నావు సీతా! నువ్వు నా డ్రీమ్ గాళ్ వి. నా డ్రీమ్ గాళ్ ఎప్పుడూ అందంగా, ఆనందంగా వుండటమే నాక్కావలసింది. నీ ఆనందం కోసం నేను ఏమయినా చేస్తాను" కొంచెం సినిమా ఫక్కీలో అన్నాడు.
    సీత అతని చేతిని మృదువుగా నొక్కింది.
    "థాంక్యూ"
    "ఇంక వెళ్దాం పద. చాలా స్టాల్స్ చూడాల్సి వుంది మనం."
    ఇద్దరూ ఆనందంగా మళ్ళీ నడవసాగారు.
    జెయింట్ వీల్ మీద తిరగటం, మోటార్ సైకిల్ ఫీట్స్ చూడటం, చిలక మేజిక్ _ అన్నీ చూసుకుంటూ తిరుగుముఖం పట్టాక జరిగిందో సంఘటన...  
    ఇద్దరూ కూల్ డ్రింక్స్ కోసం ఓ కూల్ డ్రింక్ షాప్ దగ్గర కెళ్తూండగా గోపాల్రావ్ ఠక్కున ఆగిపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. గొంతు తడారిపోయింది.
    "ఏమిటాగిపోయావ్?" అందామె ఆశ్చర్యంగా.
    గోపాల్రావ్ ఆ ప్రశ్నకు బాంబ్ పడిన లెవెల్లో రియాక్షనిచ్చాడు.
    "అ.. అదా... అదీ... మరేం లేదు. మనం ఇంకోచోట కూల్ డ్రింక్ తాగుదాం_ ఇక్కడేం బావుండదు" అన్నాడు కంగారుగా.
    అతని చూపులు మాత్రం అటువైపు తిరిగి నిలబడి మరో అమ్మాయితో కబుర్లు చెపుతూ కూల్ డ్రింక్ తాగుతున్న రజని మీదున్నాయి.
    ఆ పిల్ల తన ఖర్మ కాలి ఇటు తిరిగిందో తన బ్రతుకు ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది.
    అందుకే అక్కడి నుంచి పారిపోవాలన్న ప్లాన్ లో వున్నాడు.
    "కూల్ డ్రింక్ ఎక్కడయితే ఏమిటి? బాగోపోడానికి వీడేం స్వంతంగా తయారుచేస్తాడా?" ఆశ్చర్యంగా అడిగింది సీత.
    "అవును. వీడు కల్తీ చేసి అమ్ముతున్నాడని మొన్నే పోలీసులు అరెస్టు చేశారు."
    "వాళ్ళందరూ తాగుతూండగా లేంది మనకేనా ఏమిటి? మళ్ళీ వెనక్కు నడవటం నా వల్ల కాదు_ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి రా" అంటూ కౌంటర్ దగ్గరకెళ్ళి కూల్ డ్రింక్స్ అందుకుంది.
    గోపాల్రావ్ గత్యంతరం లేక ఆ రజని ఒకవేళ వెనక్కు తిరిగినా తనను గుర్తుపట్టడానికి వీలుకాకుండా సైడ్ కి నడవసాగాడు.
    నిజానికి గోపాల్రావ్ కి తెలుసు.
    అతి తెలివిపరులూ, ఓవర్ స్మార్ట్ గా వుండేవాళ్ళూ, అతి జాగ్రత్త పరులూ ఖచ్చితంగా చావుదెబ్బ తింటారని.
    ఎంతోమందికి ఎన్నోసార్లు ఆ విషయం ఎగ్జాంపుల్స్ తో సహా తనే చెప్పాడు కూడా.
    కానీ ఆ క్షణంలో మాత్రం ఆ రూల్ ఏ మాత్రం గుర్తుకి రాలేదు.
    రూల్ గుర్తుకి రాకపోయినంత మాత్రాన చావుదెబ్బ తగలకమానదు కదా?
    అంచేత మొహం పగిలేట్లు తగిలింది.
    మొహం సైడ్ కి పెట్టుకుని ఓ పక్కకు నడుస్తూంటే రజనితో మాట్లాడుతున్న పిల్ల చూసింది ముందు.
    "ఏయ్ రజనీ! ఆ పక్షి ఎవరో చూడవే_ చాలా పెక్యూలియర్ గా నడుస్తున్నాడు. త్వరగా చూడు... మళ్ళీ మిస్ అయిపోతావ్" అంది రజనీతో.
    రజని పూర్తిగా వెనక్కు తిరిగి ఆ విడ్డూరం చూసింది ముందు. తర్వాత.....
    ఆ విడ్డూరం తాలూకూ మొహం చూసి ఆనందంతో ఒక్క కేక పెట్టింది_ హాయ్! గోపాల్" అంటూ.
    గోపాల్రావ్ కి అ కేక వింటూనే 'హ సీతా' అని మారీచుడు అరుస్తున్న ఫీలింగ్ కలిగింది. తనకు ఇంచుమించుగా మూర్ఛ వస్తున్నట్లనిపించింది.

 Previous Page Next Page