Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 18


    భవానీశంకర్ స్పృహలో కొచ్చాడు.
    "దయచేసి కూర్చోండి మిస్ కన్యకా! ఆప్ ఆయే, బహురాయే! మీ రాకతో మా ఆఫీస్ పావనమయిపోయింది" అన్నాడు ఆనందంగా.
    "నేను కూర్చోటానికి రాలేదు!" అంది కన్యక మరింత కోపంగా.
    "మీరెందుకొచ్చినా కూర్చోబెట్టటం మా ఆంధ్రదీపిక ఆచారం కన్యకాజీ! దయచేసి మీరు అయిదు నిమిషాలు కూర్చున్నారంటే మీకు చెక్ అందజేస్తాము."
    "నేను చెక్ కోసం రాలేదు" మండిపడుతూ అందామె.
    "చెక్ కోసం కాదా?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
    "నో! మీరు నా ఫోటో ఎవర్నడిగి ప్రచురించారని అడగటానికొచ్చాను."
    "ఓ! అదా! అలా ప్రచురించినందుకు నన్ను అభినందించడానికి వచ్చారని నాకు తెలుసు"
    "అభినందించడానికి కాదు. మీ పత్రిక మీద కేసు పెట్టటానికి" అన్నాడు శరత్ బాబు.
    "వాట్? కేసా? నో! మిస్ కన్యకలాంటి అందమయిన అమ్మాయిలు అలాంటి రాతిగుండె పనులు చేయరు మైడియర్ ఫ్రెండ్! మీరలాంటి పని ఎన్నటికీ చేయరని పందెం కడతాను."
    "అసలు కన్యక ఫోటో కవర్ పేజీమీద ఎందుకు వేసినట్లు?" కోపంగా అడిగాడు శరత్ బాబు.
    "లోపలి పేజీల్లో వేస్తే ఆమె అందానికి అన్యాయం చేసినట్లవుతుంది గురూజీ! అందుకే కవర్ మీద వేశాను."
    శరత్ బాబు రెండు చేతులతో తలపట్టుకున్నాడు.
    "అసలు ఎక్కడయినా గానీ నా ఫోటో వేయాల్సిన అవసరమేమొచ్చింది?"
    "అదేమిటి మిస్? ఇంత అద్భుతమయిన అందాన్ని అలా మరుగున పడేసి ఉంచడం ఎంత అన్యాయం? ఎంత అమానుషం? అందువల్ల సౌందర్యాన్ని ఆరాధించే ప్రాణులకు ఎంత నష్టం? సౌందర్యం ఏ రూపంలో ఉన్నా తక్షణం అది అందరి కనులకూ విందు కలిగించాలి డియర్! అది నాలాంటి ఎఫిషియెంట్ ఎడిటర్ల విధి! తాజ్ మహల్ బీబీ కామక్ బారా_ ఇవన్నీ ఏమిటి? సౌందర్యాన్ని..."
    "ఆపు!" అతని ప్రవాహానికి అడ్డుపడ్డాడు శరత్ బాబు.
    భవానీశంకర్ ఆపేశాడు "ఎందుకలా అరచారు? అద్భుతమయిన 'ఫ్లో'తో మాట్లాడుతున్నప్పుడు అలా అడ్డుపడకండి. జీవితంలో చాలా తక్కువసార్లు వస్తుంది ఇంత చక్కటి వాక్ ప్రవాహం."
    "లేకపోతే మేమడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అవన్నీ ఎందుకయ్యా?"
    "ఏమిటి మీరడిగింది?"
    "కన్యక ఫోటో ప్రచురించే హక్కు మీకెవరిచ్చారు?"
    "పిచ్చి ప్రశ్న. అజ్ఞానంతో కూడిన ప్రశ్న మైడియర్ శరత్ జీ! మనందరికీ శ్రవణానందం కలిగించే కోకిల పాటలు వినే హక్కు మనకెవరిచ్చారు? తనకోసం, తన ఆనందం కోసం ప్రైవేట్ గా డాన్స్ చేసుకునే నెమలి నృత్యం చూసే అధికారం మనకెవరిచ్చారు? పూల తోటలో సువాసనలతో నిండిన గాలిని పీల్చే హక్కు మనకు ఎవరిచ్చారు..."
    కన్యక రెండు చేతుల్తో తల పట్టుకుంది.
    "విల్ యూ ప్లీజ్, కన్ ఫైన్ టు ది సబ్జెక్ట్?" అంది చిరాకుగా.
    "విత్ ప్లెజర్ మేడమ్! ప్రస్తుతం నేను చేస్తొందదే కనుక మీ ఫోటో 'ఆంధ్ర దీపిక' కవర్ పేజీగా వేయటంలో తప్పు చేయలేదు మైడియర్ యంగ్ గాళ్! స్టాఫ్ ఫోటోలు సరదాగా మాగజైన్ లో ప్రచురించే ఆనవాయితీ మీ 'మల్లెలు' పత్రికే ప్రారంభించింది కదా!"
    కన్యక ఆశ్చర్యంగా చూసిందతనివేపు. "నేను ఆంధ్రదీపిక స్టాఫ్ మెంబర్నా?"
    "అఫ్ కోర్స్! ఇంతకుముందు అయి వుండకపోవచ్చు. కానీ మీరు 'ఊ' అంటే చాలు, ఈ క్షణం నుంచే ఆంధ్రదీపిక సబ్ ఎడిటర్. మీరూ నేనూ పాలూ, నీరులా కలిసిపోయి, ఆంధ్రదీపిక బాగోగులే మనిద్దరి కంబైన్డ్ వూపిరిగా జీవితాంతం శ్రమిస్తూ ఆనందంగా గడిపేద్దాం డియర్!"
    "నా కక్కర్లేదా ఉద్యోగం."
    భవానీశంకర్ ఆమెవేపు ఆశ్చర్యంగా చూశాడు. "ఉద్యోగం వద్దా?"
    "నో! నో! నో!"
    "కానీ మీకు అర్జంటుగా ఉద్యోగం కావాలన్నారు గదా శరత్ బాబుగారు!"
    "అంటే అని వుండవచ్చు. కానీ మీ పత్రికలో అక్కర్లేదు."
    "ఆర్ యూ షూర్?"
    "వెరీ షూర్!"
    "ఓ.కే. ఈ పత్రికలో ఉద్యోగం ఇష్టంలేకపోతే మనిద్దరం కలిసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదయినా ప్రారంభిద్దాం. నేను మేనేజరు, మీరు అసిస్టెంట్ మేనేజరు."
    "అవసరం లేదు"
    "పోనీ మీరు మేనేజరు, నేను అసిస్టెంట్ మేనేజరు."
    "యూ ఆర్ మాడ్" అంది కన్యక విసిగిపోయి.
    "అఫ్ కోర్స్! ఇంతకుముందు వసుంధర కూడా యిదే డైలాగ్ అంది. అప్పుడు కేర్ చేయలేదుగానీ ఇప్పుడు మీరుకూడా అంటుంటే చెక్ చేయించుకోవాలని వుంది. బై ది బై మీకు తెలిసిన మంచి సైక్రియాట్రిస్ట్..."
    కన్యక అసహనంగా లేచి నిలబడింది.
    "మాష్టారూ! మనం ఇతనితో మాట్లాడి లాభంలేదు"
    "ఆల్ రైట్! ఛీఫ్ ఎడిటర్ సాంబమూర్తితోనే మాట్లాడదాం" అన్నాడు శరత్ బాబు.
    "పద్ధతి మంచిదేగానీ, లోపం ఎక్కడుందంటే సాంబమూర్తిగారే కవర్ పేజీ అద్భుతంగా వుందని ఇంతకుముందే టెలిగ్రామిచ్చారు."
    "అంటే ఆయనిక్కడ లేరా?"
    "నో! మద్రాస్ లో సన్మానానికెళ్ళారు. అంతవరకూ కన్యకగారు ఇక్కడే ఉద్యోగంలో జాయినయితే..."
    "మాష్టారూ! మనం వెళ్దాం పదండి" అంది కన్యక.
    "అంటే మీ ఉద్యోగం రిజైన్ చేస్తున్నారా?" అడిగాడు భవానీశంకర్ ఆశ్చర్యంగా.
    "నేనసలు జాయినవందే రిజైన్ చేయటమేమిటి?"
    "నేను మీకు ఉద్యోగం ఇవ్వాలి అని అనుకున్న క్షణం నుంచే మీరు ఉద్యోగంలో వున్నట్లు లెక్క మిస్ కన్యకా!"
    కన్యక, శరత్ బాబు ఆఫీస్ బయటకి నడిచారు.
    "హలో కన్యకాజీ! మీ అడ్రస్ ఇస్తే చెక్ పంపటానికి..." వెంబడి నడుస్తూ అన్నాడతను.
    "నాకేం అవసరం లేదు."
    "పోనీ చెక్ అవసరం లేకపోయినా మీ అడ్రస్ ఇస్తే..."
    "నా అడ్రస్ ఎందుకు?"
    భవానీశంకర్ గతుక్కుమన్నాడు. "ఎందుకా? ఎందుకంటే... ఎందుకంటే...మీ ఇంటర్వ్యూ వచ్చేవారం పబ్లిష్ చేయాలికదా! అఫ్ కోర్స్, మీరు ఒప్పుకుంటేనే."
    "ఏమీ అక్కర్లేదు"
    "పోనీ నాక్కాబోయే భర్త ఎలా వుండాలి శీర్షికలో పాల్గొంటారా?"
    "షటప్!"
    ఇద్దరూ లిఫ్టులో కెళ్ళి డోర్ మూసేశారు. భవానీశంకర్ మెట్లు దిగి పరుగెత్తేటప్పటికి వాళ్ళు ఎక్కిన ఆటో ఆ రోడ్డు మలుపు తిరుగుతూ కనిపించింది.
    కొద్దిక్షణాలు అక్కడే నిలబడి, వెనక్కు తిరిగి నిరుత్సాహంగా తన గదిలోకొచ్చి కూర్చున్నాడు.
    మిస్ వెన్నెల కనిపించింది. కానీ వెన్నెల అడ్రస్ తెలీలేదు.


                                              *    *    *    *


    రెండురోజులు గడిచిపోయినాయ్. ఆ రెండురోజులూ ఆంధ్రదీపిక వారపత్రిక ఆఫీస్ చాలా నిస్తేజంగా వుంది. భవానీశంకర్ మొఖంలో కళ తగ్గిపోయింది. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కన్యక అడ్రస్ ఎలా సంపాదించాలా అన్న ఆలోచనే.

 Previous Page Next Page