Previous Page
Next Page
ఖడ్గసృష్టి పేజి 18
బొమ్మ లాంతరు
దిద్దుతూన్న గుంట ఓనమాలు చెరిపేసి
చేతిలో ఉన్న బలపం విరిచేసి
కొత్తపలక కొనుక్కొచ్చాడు కుర్రాడు
పాగాచుట్టుకొంటూన్న రోకలి పారేసి
తెలివితక్కువ తనాన్ని గొయ్యితీసి పాతేసి
పొరుగువాడెలా ఉన్నాడని భోగట్టా చేశాడు వెర్రాడు
ఆడుతూన్న నాటకం ఆపేసి
పెట్టుకున్న గడ్డం కుళ్ళాయీ లాగేసి
ఆడియన్సులో కలిసిపోయాడు విదూషకుడు
నిన్నటి వాగ్దానాన్ని నేటి ఉపన్యాసంలో కాల్చేసి
నేటి ఫోర్జరీని రేపటి సంతకంగా మార్చేసి
ఇక్కడే వుండు వొస్తానని ఎక్కడికో పోయాడు వినాయకుడు
తన చుట్టూ తాను తిరుగుతూ
సూర్యుడిచుట్టూ పరిభ్రమించే భూమిలాగ
ఆశయం చుట్టూ తిరుగుతోంది ఆవేశం.
- తెలుగు స్వతంత్ర - 4.12.1953
(చీట్లాటలో ఒక చేతిని అన్నీ పొడిముక్కలే అయి ఒక బొమ్మ లేకపోవడం బొమ్మ లాంతరు. అప్పుడు ఆట కలిపి మళ్ళీ ముక్కలు కలపడం ధర్మం.)
Previous Page
Next Page