'అమ్మాయిలూ మీరంతా వికసిస్తున్న మొగ్గలు. ఆ మొగ్గ రేకు విప్పి పరిమళాలు వెదజల్లకముందే నేలరాలిపోయే దుర్గతికి లోనుకాకండి. ప్రేమ అన్న పదమే ట్రాష్ -----నమ్మాకండి. మోసపోకండి. ఆడపిల్లలూ మీ అక్కలాంటి దాన్ని ...మీరు చదువుకోడాని వచ్చారు కానీ ప్రేమ పాఠాలు వినడానికి రాలేదని నాకు తెలుసు. బడిలో చదువుకునే పాఠాలు ఎలాగూ నేర్చుకుంటారు. జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం యిది. ఈ వయసులో ప్రతిదీ రంగుల మయంగా అందంగా కన్పించి ఊరిస్తుంది. మధువు గ్రోలాలని ఆరాటంగా భ్రమరం దరిచేరితే . పువ్వు తన రంగులని మరింత అందంగా కన్పించేట్టు చేసి ఆకర్షించాలని తాపత్రయ పడ్తుంది తప్ప 'ఆ భ్రమరం మకరందం కోసం మాత్రమే తన దరిచేరుతుంది. తరువాత వేరే పూవు దరి చేరుతుంది' అని గ్రహించలేదు. అలా అమాయకపు విరిసీ విరియని ఆ లేత మొగ్గ భ్రమరాకర్షణకి లోనయిపోతుంది. అమ్మాయిలూ......ఆ టీనేజ్ లో 'ప్రతి అబ్బాయి తన అందానికి సంమోహితుడై పోయాడని, తనని మనసారా వాంచించి ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేమ, ఆ మధురానుభూతి తనకి మాత్రమే దక్కిన వరం' అని ప్రతి అమ్మాయి నమ్ముతుంది! ఆ ఆకర్షణకి లోనుగాకుండా నిగ్రహించుకొగల్గిన అమ్మాయిలూ అదృష్టవంతురాలు! ఆ ఆకర్షణకి లోనయిన అమ్మాయి పతనానికి 'ఆనాడే పునాది పడ్తుంది' అని గ్రహించండి -----మీ ప్రేమకి తల్లితండ్రుల ఆశీర్వాదం వుండి, అది పెళ్ళి వరకు దారితీస్తే కొంతలో కొంత నయం! పెళ్ళితో ప్రేమ చచ్చినా ఆ వివాహబంధానికి కట్టుబడి నూటికి తొంభై మంది భార్య భర్తల్లో ఏ స్పందనా లేకపోయినా బతుకీడ్చవచ్చు. ఏం జరిగినా యిటు అటు పెద్దవారు అండగా వుంటారు. మీ ప్రేమకి పెద్దల అనుమతి లేకపోతే మాత్రం మూర్ఖంగా ఆ ప్రేమని నమ్ముకుని మోసపోకండి. ఆ ప్ర్రేమ మిమ్మల్ని దరి చేర్చదు! నిశ్చయంగా నట్టేటముంచుతుంది. నూటికి ఏ ఒక్కరో ప్రేమకి కట్టుబడి నమ్మినదాన్ని అన్యాయం చేయని పుణ్య పురుషులు వుంటారు! అలాంటి పుణ్య పురుషుడ్ని వరించిన స్త్రీ నిజంగా అదృష్టవంతురాలే అవుతుంది! 'ఆ నూటికి ఒక్కరు మీరే" అని నమ్మకండి గుడ్డిగా, "మీ మేలు కోరే పెద్దల మాట వినడం మీకు, మీ భవిష్యత్తు కు క్షేమం" అని మొదటి పాఠం ప్రతి సంవత్సరం రెండేళ్ళుగా ప్రతి క్లాసు ఆడపిల్లలకి చెపుతుంటుంది భారతి. ఆ పిల్లలకి ఎందుకు చెప్తుందో అర్ధం అవదు! అర్ధం కాలేదని గ్రహిస్తే భారతి అది తన కధ అని నిర్మొహమాటంగా చెప్తుంది --- చేసిన తప్పు దాచుకోనని ఆమె నిజాయితీని నమ్మి భారతి టీచర్ అంటే పిల్లలు ప్రాణం పెడ్తారు ఆ స్కూల్లో ! ఇన్ని తమకు చెప్పే ఆ టీచరు , యింత తెల్సిన ఆ టీచరు ఎందుకిలా తప్పటడుగు వేసింది? అన్న సందేహం మాత్రం వదలదు ఆ పిల్లలని ---- దానికీ భారతి జవాబు రడీగానే వుంటుంది ------"నా అనుభవం నేర్పిన పాఠం యిది. ఆ అనుభవం మీకు కలగకూడదనేగా యిది చెప్తుంది. అంత లోతుగా ఆలోచించే విచక్షణ, పెద్దలు మంచి కోసమే చేస్తారన్నదీ గుర్తించలేని వయసు తెచ్చిన ఆవేశం, తమ ప్రేమ అమర ప్రేమ అన్న గుడ్డి నమ్మకం, ఏం జరిగినా ఎదుర్కొంటాను అనే మొండి ధైర్యం, జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు అని తెలియని అవివేకం, నే చూసినది, అనుభవించినది జీవితంలో పదోవంతు మాత్రమేనని యింకా తొంబై శాతం గురించి పెద్దలు అలోచించి చెప్తున్నరన్నది గ్రహించలేని మూర్ఖపు పట్టుదల.....యివన్నీ అప్పుడు నా కళ్ళు కప్పాయి. దిగాక గాని లోతు తెలియదు. దిగిన తర్వాత ఆ లోతు దిగలాగుతుంటే బయటిపడడం అతికష్టం. అందుచేత దిగేముందు లోతు చూసుకోవాలంటారు పెద్దలు. నే చెప్పే యీ మాటలూ నా పెద్దలూ చెప్పారు. వయసు పొంగులో, ప్రేమ మైకంలో అవి పెడచెవిన పెట్టిన ఫలితం ఈనాడు మీ ముందు నిల్చుంది. 'అమ్మాయిలూ తొందరపడకండి" అని చెప్పే నా మాటలు మీలో పదిమందిలో నన్న ఆలోచన రేపితే నా ధ్యేయం నెరవేరినట్టే" అని పాఠం చెపుతుంది ----భారతి కన్పించిన ఆడపిల్ల లందరికీ.
"ఇంత లోతుగా రెండేళ్ళముందే అలోచించి వుండి వుంటే" అనుకుంది భారతి ఆ రాత్రి...' భారతీ నీవు చిన్నపిల్లవి నీకింకా లోకజ్ఞానం లేదు, ఏదో ప్రేమ అనుకుంటున్నావు , యీ ప్రేమలు కూడు పెట్టవు. నా మాట వినమ్మా" అని తల్లి నచ్చచెప్పింది , బతిమాలింది, ఏడ్చింది , తిట్టింది.
"ఏం చూసి అంత మోజుపడ్తున్నావు----వాడి బి.ఎస్సీ తో ఏం ఉద్యోగం వస్తుంది? ప్రేమ తిని ఇద్దరూ ఎన్నాళ్ళు బ్రతుకుతారు? నువ్వు కొన్ని సౌకర్యాలకు అలవాటుపడ్డావు. అవన్నీ లేకపోయేసరికి ఏ ప్రేమా అలాంటి చోట నిలవదు. నా మాట విను భారతీ, ఆ ఇంజనీరు అబ్బాయిని చేసుకో, నీ మంచి కోరే వాళ్ళం, నీకంటే లోకానుభవం వున్నావాళ్ళం. మామాట వినకపోతే నష్టపోయేది నువ్వే, కన్నవాళ్ళం కనక యింతగా చెప్తున్నాం ----" చెప్పి చెప్పి విసిగిపోయిన తండ్రి కోపంగా అన్నారు.
'ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారుట. వీళ్ళిద్దరికీ పిల్చి వేలకు వేలు యిస్తారు అనుకుంటుంది. ఈవిడ బి.ఏ కి అతని బి.ఎస్సీకి అంతగా యిస్తే చెరో వెయ్యి యిస్తారు గాబోలు. ఎంత చెప్పినా నీ బుర్ర కేక్కదేమిటే --------ఆస్తి వుందా అంతస్తుందా దేనికోసం మోహించావు? మేం తెచ్చిన సంబంధం ముందు ఈ అబ్బాయి అతని కాలి గోటికి ఏ విషయంలోనూ సరిపోడు. నీ కళ్ళకి ఏం పొరలు కమ్మాయే-" నచ్చచెప్పలేక తల్లి తల బాదుకుంది.
"ప్రేమ పొరలు కమ్మాయే దానికి, ఆ పొరల మధ్య నించి దానికి వాడు తప్ప యింకేం కనపడడం లేదు. ఆడుతూ పాడుతూ పనిచేసుకుని కలోగంజో సినిమాల్లో మాదిరి తాగితే చాలనుకుంటుంది. యీ వేడిలో , జీవితం సినిమా కాదని దానికి యిప్పుడు మనం చెప్పినా అర్ధం కాదు. ఆ పొరలు విడిపోయాక అప్పుడు ఏడుస్తుందిలే ----" కూతుర్ని వప్పించలేని నిస్సహాయత మధ్య కసిగా అన్నాడు తండ్రి . 'ఆ వెధవని పోలీసులకి అప్పచెపుతాను. ప్రేమ గీమ వదలగొడతారు---- చదువుకు రావే అని కాలేజీకి పంపితే, చేసుకొచ్చిన నిర్వాకం యిది. ఇవాళ్టి నించి ఇల్లు కదులు, కాళ్ళు విరగ్గోడతాను. గదిలో పడేసి తాళం వేసి మూడు ముళ్ళు వేయిస్తాను.' తల్లి ఆఖరి అస్త్రం విడిచింది.
'అసలు పొరపాటు మనది. ఆడపిల్ల ముందు పుట్టిందని గారాబం చేశాం. యివ్వవలసిన దానికంటే ఎక్కువ స్వేచ్చ యిచ్చాం --- వుండు , వాళ్ళింటి వెళ్ళి వాడికి, వాడి తండ్రికి అందరి ముందు గడ్డి పెడ్తాను. అంత సుళువుగా వదలను ఆ వెధవని. ఆడపిల్లలని వలలో వేసుకుని మాయమాటలు చెప్పి ప్రేమలు వల్లించి హీరో అనుకుంటున్నాడెమో ---నలుగురు రౌడీలని పెట్టి తన్నిస్తాను -- కాళ్ళు చేతులు విరగొట్టిస్తాను --" తండ్రి బెదిరింపు.
అప్పుడు తన మేలు కోరిన తల్లిదండ్రులు రాక్షసుల్లా కనిపించారు. కన్నకూతురి మనసు అర్ధం చేసికొని, ప్రేమికుల బాధ పట్టించుకోలేని వీళ్ళు ఏం మనుషులు! ఛీ....ఛీ..... యీ పెద్దవాళ్ళకి ఎప్పుడు బుద్ది వస్తుంది---- జనరేషన్ గాప్.......వాళ్ళ ఆలోచనలు అంతకంటే ఎదగవు........అనుకుని మనసులో శపించుకుంది. తల్లితండ్రులని ------కొంపదీసి నిజంగా వీళ్ళు చంద్రని తన్నించరు గదా! వెళ్ళి వాళ్ళతో కల్సి మంతనాలు జరిపి తమని విడదీయరు గదా---- తనని నమ్మించి మోసం చేసి ఎవరికో కట్టపెడితే తను నిజంగా చచ్చిపోతుంది గాని వాడితో కాపురం చెయ్యదు. చంద్రని జాగ్రత్తగా వుండమనాలి పెళ్ళి అయ్యేవరకు. ఎందుకన్నా మంచిది .......పెళ్ళి అయ్యేవరకు తమ ప్లాను వీళ్ళకి తెలీకుండా జాగ్రత్తపడాలి ---" "భారతీ ఎందుకన్నా మంచిది మీ వాళ్ళని ఎదిరించి మాట్లాడకు----వాళ్ళు అన్న వాటికి వప్పుకున్నట్టు నటించు. వాళ్ళు చేసుకోమన్న అబ్బాయిని చేసుకోడానికి ఆఖరికి వప్పుకున్నట్లు, నీవు దారికి వచ్చావని వాళ్ళని నమ్మించు------యివతల మన ప్లాను మనం వేసుకుందాం ------మీ వాళ్ళక్కడ నిర్ణయించిన ముహూర్తానికి ముందే మనం సింహాచలం వెళ్ళి పెళ్లి చేసేసుకుని రోగం కుదురుద్దాం---- మన ప్రేమ ఆషామాషీ కాదని నిరూపించాలి. ఈ నెల్లాళ్ళు కాస్త జాగ్రత్తగా వాళ్ళకి అనుమానం రాకుండా ప్రవర్తించు" అని చంద్ర యిచ్చిన సలహా తు.చ తప్పకుండా పాటించింది.