Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 12


    అయ్యగారి యీ ఆకస్మిక ఆదరణ అర్ధం కాక ఆనందంతో తికమకలయి పోయాడు రంగడు . "రావే....పాట అంటే నీ కిష్టం కాదే యిందాం రా" సిగ్గుపడుతున్న సీతాలుని లాక్కెళ్ళినట్టే చేయి పట్టి తీసికెళ్ళాడు రంగడు. రేడియో గ్రాములో తెలుగు రికార్డులు పెట్టాడు రమేష్. తన కిష్టమైన తెలుగు పాట వింటూ రికార్డు ప్లేయర్ తిరగడం ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ, చిన్న బాబుగారి గదిలో మెత్తని పక్క, ఖరీదయిన దుప్పటి, డ్రస్సింగ్ టేబిల్ వగైరాలని గమనిస్తుంది సీతాలు. రమేష్ జేబులోంచి సిగరెట్ పెట్టె తీసి ఖాళీగా వుండడం చూసి విసిరేస్తూ 'రంగా , ఓ సిగరెట్ పాకెట్ పట్రా బజారు కెళ్ళి ....' అన్నాడు ఐదు రూపాయలు అందిస్తూ. రంగడు పాట మధ్యలో వెళ్ళడం ఇష్టం లేక యిబ్బందిగా కదిలాడు. సీతాలు లేచి వెళ్ళబోయింది. 'అరే, నీవెందుకు వెళ్ళిపోతావు, కూర్చుని పాత విను, సిగరెట్ పాకెట్ తీసుకుని యిప్పుడేగా వచ్చేస్తాడు.' అన్నాడు రమేష్. రంగడు ఏమనలేక వెళ్ళిపోయాడు. సీతాలు యిబ్బందిగా సిగ్గుగా కూర్చుంది. రమేష్ డ్రస్సింగ్ టేబిల్ మీద నించి సెంట్ స్ప్రే తీసి సీతాలు మీద స్ప్రే చేస్తూ నవ్వి ....'వాసన బాగుందా చూసుకో ఎంత మంచివాసన వేస్తున్నావో , నీకు కావాలా' అన్నాడు స్ప్రే చూపిస్తూ. సీతాలు ఆ సువాసనని అఘ్రానిస్తూ సిగ్గుగా నవ్వి తల అడ్డంగా ఆడించింది.
    'సీతాలు నీకీ చీర ఎంత బాగుందో తెలుసా....మంచి తెల్ల చీర కట్టుకుంటే యింకా మిలమిల మెరిసిపోతావు. నేను డబ్బిస్తా నేవొక చీర కొనుక్కో, అదేమిటలా సిగ్గుపదతావు. చూడు నావైపు . అరే.....అరే నీవలా సిగ్గు పడ్తుంటే ఎంత బాగున్నావో తెలుసా ' ఆమె గడ్డం ఎత్తిపట్టి కళ్ళలోకి కొంటెగా చూసాడు రమేష్ . సీతాలు నిలువెల్లా పులకరించింది. చినబాబు గారి సువాసన తలనూనె వంటికి రాసుకున్న పౌడరు వాసన, బట్టలని ఫారిన్ సెంటు అన్ని సువాసనల మధ్య ఆ మెరిసి పోతున్న రంగు, మాటల్లో చూపుల్లో కొంటెతనం , చినబాబు తన మీద చూపించే శ్రద్దా - అతని పొగడ్తలు అన్నీ కలిసి సీతాలుని వివశురాలీని చేసేసాయి. కళ్ళెత్తి రమేష్ మొహంలోకి చూడలేకపోయింది. "సీతాలు ఇదిగో యిటు చూడు. నేనంటే నీకు యిష్టమేనా. నేను బాగున్నానా లేదా చెప్పాలి. మరి నీ రంగడి కన్నా బాగున్నానా లేదా. ఇదిగో యీ నూరు రూపాయలు తీసికెళ్ళి మంచి తెల్ల జరీ చీర కొనుక్కో" అంటూ చేతిలో కుక్కాడు నోటు. "అమ్మో వద్దండి మావేటంటాడో----" భయంగా అంది.
    "ఏమనడు - నేనిచ్చానని చెపుతాలే ......చూడు - రాత్రి రంగడు పడుకున్నాక మెల్లిగా యీ గదిలోకి రా. తలుపు తీసి వుంచుతా, ముందు వైపు నించి కాక వెనక వైపు తలుపు తీసి వుంచుతా. మెట్లెక్కిరా. ఎవరూ చూడరు. పదకొండు దాటాక ---- యిటు చూడు యీ కిటికీ లోంచి బ్యాటరీ లైటు యిలా వెలిగిస్తా .....రంగడు నిద్రపోయాడో లేదో చూసి వచ్చేయ్....' మెల్లిగా ఆమె భుజం మీద చెయ్యి వేసి నొక్కి తమకంగా చూస్తూ అన్నాడు. సీతాలు అర్ధం కానట్టు తెల్లపోతూ చూసింది. "ఏమిటలా చూస్తావు --అర్ధం కాలేదా ....సీతాలు పొద్దుట నిన్ను చూసిం దగ్గిరనించి నా మనసు మనసులో లేదు ....సీతాలు నీవెంత బాగున్నావో తెలుసా....' అంటూ చటుక్కున సీతాలు పెదాల మీద ముద్దు పెట్టుకుని "అదిగో రంగడోచ్చేస్తాడు . రాత్రికి మరిచిపోకు" అంటూ బుగ్గలు వేలితో రాసి చిటికే వేసి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. చిన్నదొర లాంటి పెద్దింటి బిడ్డ ....అంత గొప్పవాడు తన అందాన్ని మెచ్చి, తనని కోరాడు.....ఆ పెదాల మీద ఆ ముద్దు అతని మాటలు, చేష్టలు, ఆ డబ్బు ఆ అందం, ఆ హోదా అన్నీ కలిసి సీతాలు మతి పోగొట్టేశాయి. బహ్యస్మృతి కోల్పోయిన దానిలా మంత్ర ముగ్ధలా అలా వుండిపోయింది.

                                             *    *    *    *

    వారం రోజులు గడిచాయి. ఆరోజు ఉదయం రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నాడన్న మాటేగాని మనసు మనసులో లేదు. వాడి మనసులో రగిలే ఉద్రేకం చేతుల్లో చూపిస్తూ గుర్రాన్ని జోరుగా బరబర మాలిష్ చేస్తున్నాడు. వాడి మనసు, శరీరం ఉక్రోషంతో, అవమానంతో, కోపంతో ఉదికిపోతోంది. రాత్రి నించి ఏదో చేయ్యాలి, ఏదో చేసి కసి తీర్చుకోవాలన్న కక్ష నిలవనీయడం లేదు. నిన్న రాత్రి .....గురించి తలచుకున్న కొద్దీ వాడి వళ్ళు సలసల కాగిపోతుంది.  నిన్న రాత్రి చటుక్కున ఎందుకో మెలకువ వచ్చింది. పక్కన సీతాలు లేదు. పెరట్లో కెళ్ళిందేమో వచ్చేస్తుందేమోనని కాసేపు అలా నిద్రమత్తులోనే చూశాడు. అరగంట దాటినా రాలేదు. రంగడు చటుక్కున లేచి చూశాడు --- తలుపు చేరేసి వుంది. పెరట్లో చూశాడు లేదు. సీతాలు అని పిలిచాడు పలకలేదు. రంగడిలో ఏదో అనుమానం చోటు చేసుకుంది. వారం రోజుల నించి సీతాలు ప్రవర్తన వింతగా వుంది. మనిషి ఏదో పరధ్యానంగా వుంటుంది. ఇదివరకులా నవ్వుతూ సరదాగా మాట్లాడడం లేదు. పిలిస్తే విసుక్కుంటుంది. దగ్గిర కొస్తే చీదరించుకుంటుంది. ఏమడిగినా ఏం లేదంటుంది. ఎంతసేపూ చిన్న బాబుగారిచ్చిన పౌడరు, స్నోలు , సెంట్లు పూసుకుని ముస్తాబయి అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇదివరకు లేనిది కొత్తగా స్నానం చేసి బజార్లో కొన్న తెల్ల  చీర కట్టుకు ముస్తాబవడం చూసి మొదటిరోజు సంతోషించాడు. తీరా ఆ ముస్తాబు తన కోసం కాదన్నట్టు సీతాలు రంగడిని దగ్గరికి రానీయకుండా తల నొప్పంటూ మూలుగుతూ పడుకుంది. వారం నించీ రోజూ ఏదో వంక .....మూడు రోజులు స్నానం కాలేదంది...ఏదో చెపుతుంది. ఓరాత్రి సీతాలు పక్కలో లేదు. లేచి చూసేవేళకి బయట నించి తలుపు తీసుకు వచ్చి పడుకుంది. ఎక్కడి కెళ్లావంటే బయట ఏదో చప్పుడయితే చూసానంది. సీతాలు వ్యవహారం, అవతల చిన్న దొర వ్యవహారం.....ఎప్పుడూ సీతాలేది అని అడగడం రికార్డులు పెట్టి వినమనడం, స్నోలు పౌడర్లు నీ పెళ్ళానికీ కీయరా అని ఉదారంగా యీయడం , అడక్కుండానే పాత ప్యాంట్లు షర్టులు ఇచ్చాడు. సీతాలుతో ఎంతో చనువుగా మాట్లాడుతాడు. ఇద్దరూ తన ఎదురుగానే నవ్వుకుంటారు.....ఏదో అనుమానం తొంగి చూసినా చిన్న దొర ఉదారం ముందు అణగారిపోయింది. నిన్న రాత్రి సీతాలు ఎంతకీ రాకపోతే, ఆ అనుమానం బలపడింది.....అలా నడిచి భవంతి ముందు వైపు వచ్చాడు. చిన్న దొర గది కింద నిలబడ్డాడు. చిన్నగా ఏదో మాటలు నవ్వులు వినబడ్డాయి. అలా చీకట్లో దెయ్యంలా నిలబడాడు రంగడు..... ఓ రెండు గంటల తరవాత సీతాలు కిందకు వచ్చి గుడిసె వైపు వెళ్ళింది. రంగడు ఒక్క ఉరుకున సీతాలు జుట్టు పట్టుకు బరబర గుడిసె లోకి యీడ్చుకు వెళ్ళి శక్తి వున్నంత వరకు బాదాడు. సీతాలు కుక్కిరి బిక్కిరి మనకుండా ఏడ్చింది. సీతాలుని కొట్టి అలిసిపోయిన రంగడు - కొట్టాల్సింది సీతాలుని కాదని, సీతాలుని మభ్యపెట్టి వల విసిరిన చిన్న దొరనని గ్రహించాడు. ఇంత ద్రోహమా - యింత అన్యాయమా - ఇంత ఘోరమా ....వాళ్ళ కాళ్ళ కింద బతికే వాళ్ళమని యింత అలుసా.....ఉడికిపోయాడు . తనకింత ద్రోహం చేసిన చిన్న దొరని వదలకూడదు -----వదలడు!- పరపర గుర్రానికి మాలిష్ చేస్తున్న రంగడి మెదడులో ఆలోచన మెరిసింది.
    చకచక పరిగెత్తినట్టే పొలాలకి అడ్డం పడి కొండల వైపు వెళ్ళి తనక్కావలసిన ఆకులూ కొన్ని తుంపి తీసుకువచ్చాడు. గడ్డితో కలిపి గుర్రానికి దగ్గిరుంది తినిపించాడు. గుర్రాపు కళ్ళెం తీశాడు. గుర్రం లాగే ఆ కళ్ళెమూ పాతబడింది, తోలు పటకా చాలాచోట్ల పాతబడి , నలిగి ముడతలు పడి తెగిపోవడానికి సిద్దంగా వుంది. గడ్డి కోసే కత్తి తీసి తెగిపోవడానికి సిద్దంగా వున్న ఆ గాట్లని మరింత కోశాడు కాస్త పట్టు వదలి.....గుర్రానికి జీను వేసి రెడీ చేశాడు.
    రమేష్ యధాప్రకారం నిద్రలేచి బెడ్ కాఫీ సేవించి గుర్రపుస్వారీకి బయలుదేరాడు ఉత్సాహంగా. ఈవారంగా రమేష్ ఉత్సాహంగా వుంటున్నాడు. కాస్త విసుగు తగ్గి కులాసాగా వున్నాడు .....పనులన్నీ చకచక పూర్తీ చేస్తున్నాడు. యింక నాలుగైదు రోజులతో పూర్తి కావచ్చు. ఈలోగా కాలక్షేపానికి సీతాలు బాగా పనికొచ్చింది. ఆ ఉత్సాహంతో గుర్రాన్ని అదిలించాడు . గుర్రం సకిలించింది..... కదలడానికి ఎందుకో మొరాయించింది . గొంజుకుంది. "ఏంరా , ఏం వచ్చింది దీని కివాళ -' రంగడిని అడిగాడు!
    "ఏం లేదు దొరా, యిన్నాళ్ళూ బద్ధకం బలిసి యిప్పుడు పరిగెత్తాలంటే వళ్ళు వంగడం లేదు. రెండు తగిలించండి -" అన్నాడు. రమేష్ కాలితో గుర్రం డొక్కలో తన్ని కళ్ళెంతో అదిలించాడు. డొక్క పోటూ తిన్న గుర్రం పౌరుషంగా ముందు కురికింది. తిన్న ఆకుల పసరు పనిచేయడం ఆరంభించి పిచ్చి పట్టిన దానిలా పరుగు లంకించుకుంది. ఆ పరుగు .....అసహజంగా వుందనిపించినా చాలా రోజుల తర్వాత గుర్రం మీద యింత జోరుగా సవారి చెయ్యడం ఉత్సాహమనిపించి కళ్ళెంతో యింకాస్త అదిలించాడు. గుర్రం వెర్రి ఆవేశంతో పొలాలు, గట్లు దాటి కొండవాలు మీదకి పరిగెత్తింది. రాళ్ళు, రప్పలు, చెట్లు చేమలు దాటి దుముకుతూ.....ఎంతో వేగంగా పరిగెత్తుతున్న ఆ వేగానికి మొదటిసారిగా రమేష్ భయపడి కళ్ళాలు బిగించి లాగాడు. గుర్రం ఆగలేదు. శివం ఎత్తిన దానిలా ఆ పరుగు ఆ జోరు చూసి రమేష్ కి చమటలు పట్టాయి. భయంతో గుర్రాన్ని అదుపులో పెట్టాడానికి కళ్ళెం మరింత జోరుగా బిగించి లాగాడు. పటుక్కున కళ్ళెం తెగి తోలు పటకా చేతిలోకి వచ్చేసింది -----రమేష్ బిత్తరపోయాడు. కళ్ళెం వదులయిపోవడంతో మరింత  అడ్డు అదుపు లేనట్టు పిచ్చిగా పరిగెత్తసాగింది గుర్రం - ఆ వేగానికి తట్టుకోలేక బోర్లా గుర్రాన్ని కరుచుకు పోయి పిచ్చిగా గుర్రాన్ని ఆపాలని వ్యర్ధ ప్రయత్నాలు చేస్తూ కేకలు పెట్టసాగాడు. ఆ కేకలకి హడలిపోయిన దానిలా గుర్రం ఎటు వెడుతున్నది తెలీకుండా గుట్టలు, రాళ్ళు దుమికేస్తుంది -- కొండ ఎక్కేసింది. అవతల కొండ వాలులోకి దిగడం ఆరంభించి పల్లంలోకి మరింత వేగంగా జారిపోతూ పరిగెడ్తుంది .....రమేష్ పై ప్రాణాలు పైనే పోయాయి..... కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. గుర్రం కాలు ఓ కొండ రాయి మీద మడత పడి జారిపడి వేగంగా కిందకి దొర్లుకుంటూ పడిపోసాగింది ----గుర్రంతో పాటు రమేష్ అతి ఘోరంగా కొండరాళ్ళ వెంట దొర్లి దొర్లి కింద లోయలోకి విసిరేయబడ్డాడు. అతని ఆర్తనాదం కొండల్లో ప్రతిధ్వనించింది.
    "గుర్రపు కళ్ళెం "- అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని బంధించడానికే కాదు, --- ముడిపడ్డ బంధాలని తెంచడానికి పనికొస్తుంది .

                                                                   (జ్యోతి (దీపావళి సంచిక) సౌజన్యంతో ) ***

 Previous Page Next Page