జమీందారుగారితో పాటు వేణుగోపాలస్వామి వైభవం అంతరించింది. ఆలయం గోడలు బీటలు వేశాయి. బీటలలో పిచ్చి మొక్కలు మొలిచాయి. సున్నానికి నోచుకోక గోడలు నాచు పట్టాయి - నేల పెచ్చులు వూడింది. వేణుగోపాల స్వామి విగ్రహం వన్నె తగ్గింది. ఏనాటి చీని చీనాంబరాలో వెలసి వాలికలు పీలికలు అయ్యాయి. దీపస్థంబాలలో నూనె కూడా కరువయి ఒకే ఒక వత్తి వేసి దీపం వెలిగిస్తాడు మాధవయ్య -- ఆ నాటి వైభవానికి గుర్తుగా ఆలయంలో వెండి హారతిపళ్ళెం , వెండి శఠగోపం మాత్రం నిలిచాయి. చుట్టూ నగిషీలు చెక్కిన రెండొందల తులాల హారతిపళ్ళెం ....ఆ హారతి పళ్ళెం .....ఆ హారతి పళ్ళెం పట్టుకున్న మాధవయ్య చెయ్యి వణుకుతుంది. ఈరోజు అసలు గుడి తలుపులు తెరిచి లోపలికి అడుగు పెట్తిం దగ్గరనించి మాధవయ్య కళ్ళల్లో వణుకు పుట్టింది. పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఎన్నడూ లేంది తడబడి తప్పులు చదివాడు. చేతుల్లో బలం హరించిపోయినట్టు హారతి యిస్తూ గంట కొడుతుంటే చెయ్యి వణికింది. ప్రతి పనిలో ఆలశ్యం, హారతి కోసం బయట నిల్చున్న జనాన్ని చూసి అయన కంగారు మరింత ఎక్కువయి వంటి నిండా చెమటలు పట్టాయి - గుండె దడదడ లాడింది. "పంతులుగారూ, ఏమిటంత ఆలశ్యం ....' ఎవరో కేకపెట్టారు. 'వస్తున్నా' అంటూ వణుకుతున్న చేతుల్తో హారతిపళ్ళెం , శఠగోపం , తీర్ధం తెచ్చి అందరికి హారతి యిచ్చి శఠగోపం పెట్టి తీర్ధం యిచ్చాడు మాధవయ్య - కళ తప్పిన అయన మొహం చూసి "ఏం బాబూ , ఆరోగ్యం సరిలేదా?" ఎవరో కుశల ప్రశ్న వేశారు. మాధవయ్య తడబడ్డాడు. "తమకు తెలియందేం వుంది బాబూ, సంసార బాధలు -" పేలవంగా నవ్వాడు అయన. అందరూ వెళ్ళాక హారతి పళ్ళెం లో పోగయిన అరవయి పైసలు రోంటిని దోపుకున్నాడు. గుడి తలుపులు మూయబోయే ముందు చటుక్కున పై మీద పంచా తీసి హారతి పళ్ళెం అందులో చుట్టబెట్టాడు. వేణుగోపాలస్వామి వైపు తిరిగి లెంపలు వేసుకుని "నా కింత కంటే దారి ఏది లేదన్నది నీకు తెలియనిది కాదు వేణు గోపాలా మన్నించు తండ్రీ" అంటూ గద్గద స్వరంతో ప్రణమిల్లి , చకచక తలుపు తాళం పెట్టి యింటివైపు వెళ్ళాడు.
పెళ్ళాం, కూతురు చూడకుండా అలమరులో పాత పంచాంగాల కింద హారతి పళ్ళెం దాచాడు . ఉన్న ఊర్లో అమ్మితే గుళ్ళో హారతి పళ్ళెం అందరికీ గుర్తే. సాయంత్రం పక్క వూరికి తీసికెళ్ళి అమ్మాలి. తెల్లారి చీకట్నే గుడితలుపులు తీసి వుంచి ఏ దొంగో జోరాపడి హారతి పళ్ళెం దొంగిలించాడని గొడవ చెయ్యాలి. అయన కంతకంటే గత్యంతరం లేదు. దేముడ్ని క్షమించమంటూ మనసులో లెంపలు వేసుకుని వెయ్యి దండాలు పెట్టుకున్నాడు. అయినా మనసులో పాప భీతి తగ్గలేదు. తిండి సయించలేదు. "ఏం నాన్నా అలా వున్నారు వంట్లో బాగులేదా?" కూతురి సానుభూతిగా చూస్తూ అడిగింది. "ఏం లేదమ్మా తడబడ్డాడు మాధవయ్య.
'అందరికీ రోగమే అడ్డెడు గిన్నేకేం రోగం లేదు" యీసడించింది తాయారమ్మ.
"అమ్మా ఆ తినే రెండు ముద్దలన్నా తిననియ్యి ఆయన్ని కాస్త ప్రశాంతంగా .' కూతురు తిరస్కారంగా తల్లిని చూస్తూ అంది.
'అవునే తల్లీ నేనే గయ్యాళిని, రాక్షసి ని, నానోరే కనిపిస్తుంది. తండ్రి కూతురోక్కటే - నేనో పైదాన్ని - అమ్మశక్తిని."
"అనవే అను - అను , నీ నోటికి అడ్డు అయిపు వుందా - నీ నోటికి తాళ'లేకా ......యీనాడు -యీ పనికి తగలడ్డా ......." ఆయనేం మాట్లాడుతున్నదీ అర్ధం కాగానే ఆవేశం చప్పున చల్లార్చుకుని చటుక్కున నోరు మూసుకుని అన్నం తినసాగాడు.
* * * *
చిన్న కునుకు తీసి, లేచి కాస్త పొద్దు వాలాక, వున్న ఒక చిరుగుల లాల్చీ తొడుక్కుని చేతి సంచిలో హారతి పళ్ళెం పెట్టడానికి అలమరు తీసి పాత పంచాంగాల కింద చెయ్యి పెట్టాడు మాధవయ్య అంతే -- గుండె గుభీల్మంది -- పళ్ళెం లేదు. ఆరాటంగా చకచక పుస్తకాలన్నీ వెతికి చూశాడు - లేదు. పెట్టిన పళ్ళెం , యింతకీ ఎలా మాయమైంది? ఈలోగా ఏ దొంగ వచ్చాడు - ఎవర్ని అడగడం - చేసిన దొంగతనం బయటపడదూ? అడగకుండా ఎలా వూరుకోటం? అయన గిన్దేల్లో దడ బయలుదేరింది. "కామాక్షి' ఆయనకి తెలియకుండానే అరిచాడు- కామాక్షి రాలేదు - కాని తాయారమ్మ కయ్ మంది. "పాడు కొంప కాసేపు నడుం వాలుద్డామన్నా లేదు - ఎందుకలా రంకెలు పెడతారు, ఏం కావాలి?' నిద్ర మధ్యలో విసుక్కుంది. "కామాక్షేది ?' నెమ్మదిగా అడిగాడు. "ఏదో పత్రికలు తెచ్చుకోస్తానని జానకి దగ్గిర కెళ్ళింది." మాధవయ్య నీరుగారి పోయాడు- కామాక్షి తీయలేదు - వాసు స్కూలు కి వెళ్ళాడు- పళ్ళెం ఎలామాయమయింది. ఆ భగవంతుడు తన మీద ఆగ్రహించి తను చేసిన వెధవ పనికి బుద్ది చెప్పడానికి మాయం చేశాడా? అనుమానం తోచి గబగబ దేవాలయం వైపు వెళ్ళాడు - గర్బగుడి తలుపు తీసి వుంది. అయన గుండె గుభేల్మంది. ఎదురుగా వుంది హారతి పళ్ళెం - తను పడ్డ కష్టం అంతా ఆ విధంగా వృధా అయిపోగానే ఏదో ఆవేశం, నిస్సహాయత, కసి, దుఖం, అవమానం ఆయన్ని ఊపేసింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనందుకు ప్రాణం ఉసూరు మనిపించింది . మాయదారి దేముడు? ఎంత పనిచేశాడు? దేముడు లేడని ఎవరన్నారు? - ఉన్నాడు , ఎంచక్కా తన పళ్ళెం తను వెనక్కి తెచ్చుకున్నాడు- ఉక్రోషం వచ్చింది మాధవయ్యకి - కసిగా దేముడ్ని చూశాడు. ఏమయ్యా - వేణుగోపాలా - నలబై ఏళ్ళుగా నీ సేవ చేసుకుంటూ నిన్నే నమ్ముకుని బతుకుతున్నానే - ఒక్కనాడన్నా నా కష్టాలకి జాలిపడి నన్నాదుకున్నావూ -- ఒక్కరోజు నేనున్నానని ముందుకు వచ్చి సహాయ పడ్డావూ ....యీనాడు కష్టాలలో ఉండి, తిండికి గతిలేక, కట్టుకున్న పెళ్ళాం గడ్డి పోచలా తీసి పారేస్తుంటే , కన్నకూతురు కాపురం నిలబెట్టడానికి గత్యంతరం లేక నీ హారతి పళ్ళెం అమ్ముకుందామనుకున్నాను. హు .....భగవంతుడివి గాబోలు, భక్తుల కష్టాలలో ఆదుకోవాల్సినవాడివి, అదుకోకపోగా.....నీ యింతోటి హారతి పళ్ళెం కోసం కక్కుర్తిపడి లాక్కుపోయావా, వెండి హారతిపళ్ళెం నీకేక్కువయిందా? ఎంత నిర్ధయుడివయ్యా దేముడూ -- నా కన్నకూతురు కాపురం కంటే నీ వెండి పళ్ళెం నీకెక్కువా - హు ....నీ కూతురు గాదుగా , నీకెందుకు బాధ? నీవసలుంటే ....నీకు ఓ హృదయం వుంటే - యిలా చేస్తావా , నీవు నల్లరాయివయ్యా ....అంతే ఉత్త రాతి బొమ్మవి .....నిన్ను నమ్మి పూజించే వెర్రి వెధవలం మేము - నీవు పాషాణానివి -- నీవే వుంటే రా - లేచివచ్చి ఆ పళ్ళెం యియ్యి- ఇన్నేళ్ళుగా కొల్చినందుకు నీ మహిమ చూపు లేదంటే ...చూడు ...ఏం చేస్తానో ....' పిచ్చివాడిలా ఆవేశంగా అరిచాడు. అయన వళ్ళంతా చెమటలు పట్టాయి - మనిషి పూనకం వచ్చిన వాడిలాగ ఊగిపోయాడు. నీకోపానికి బెదరనులే .....ఫో...ఫో....పిచ్చివాడా అన్నట్టు వేణుగోపాలస్వామి కదలక మెదలక అలాగే చిరునవ్వులు చిందిస్తూ నిల్చున్నాడు. అది చూసేసరికి మాధవయ్య ఆగ్రహం అవధులు దాటింది. "హ....నవ్వుతున్నావు గదూ ...నా బీదరికం నా అగచాట్లు , నా నిస్సహాయత చూచి నవ్వుతున్నావు గదు. హ...నవ్వు.... అంతకంటే నీకేం చేతనవును. ఇదిగో ....నీ హారతి పళ్ళెం తీసి కేడుతున్నాను- నీ దిక్కున్న చోట చెప్పుకో.... రా....ఏం చేస్తావో చెయ్యి...." ఆవేశంగా హారతి పళ్ళెం తీయబోయాడు మాధవయ్య.
"నాన్నా....' చటుక్కున తలుపు చాటు నించి కామాక్షి వచ్చింది. మాధవయ్య ఉలిక్కిపడ్డాడు. కూతురిని చూసి , "నాన్నా దేముడు హారతిపళ్ళెం దేముడికే వుండనీ నాన్న.....మనకింక అవసరం లేదు....నాన్న. నాకీవూర్లో స్కూల్లో ఉద్యోగం యిచ్చారు. రెండొందలు జీతం నాన్నా! చూశావా నాన్నా దేముడు మనకి అపకారం చెయ్యలేదు. దేముడు మంచివాడు గనకే ఆ పళ్ళెం అమ్మి డబ్బిచ్చి నన్ను అత్తవారింటికి వెళ్ళి ఆ బాధలు పడకుండా చేశాడు. అంతా మనమంచికే చేస్తాడు చూశావా - నాన్నా నన్నింక ఆ నరకానికి వెళ్ళమనకు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నన్ను నేను కడతెర్చుకోడమే గాదు మిమ్మల్నీ కడతెర్చగలను- నన్నింక కొడుకనుకో - కామాక్షి గబగబఅంది. కూతురి మాటలు విస్తుపోతూ విన్నాడు మాధవయ్య.
'అయితే హారతిపళ్ళెం తెచ్చి నీవా పెట్టేశావు యిక్కడ?" అయోమయంగా ఆడిగాడు.
'అవును నాన్న- నీ వరస యివాళ నాకెందుకో అనుమానం అన్పించింది. ఇందాక అమ్మ దగ్గర అలా అన్నావు - వస్తున్నప్పుడు సంచిలో ఏదో తెచ్చి అలమరలో పెట్టావు . నాకనుమానం వచ్చి చూశాను - సరిగా అపుడే పోస్టులో నా ఉద్యోగం ఆర్డరు వచ్చింది. ' హారతి పళ్ళెం పవిత్ర కార్యానికి పనికొచ్చేది నాన్నా - దానితో నన్ను ఆ నీచుడింటికి కాపురానికి పంపడం ఆ దేముడికీ ఇష్టం లేదు నాన్న" కామాక్షి శాంతంగా అంది. మాధవయ్య ఇంకా అయోమయంగానే వేణుగోపాల స్వామి వంక చూశాడు. ఎప్పటిలాగే చిరునవ్వులు చిందించాడు వేణుగోపాలస్వామి.
"నన్ను తిట్టావు చూశావా అనవసరంగా" అన్నట్టనిపించింది ఆయనకి.
"నీ లీలలు చిత్రమైనవి తండ్రి.....నన్ను క్షమించు వేణుగోపాలా....నీ ముందు మే మెంతవారం, నా అజ్ఞానాన్ని మన్నించు." చేతులెత్తి నమస్కారం చేశాడు మాధవయ్య. అయన కన్నీటి పొరల మధ్య మసకమసకగా కన్పించాడు వేణుగోపాలస్వామి నవ్వుతూ.
(స్వాతి సౌజన్యంతో ) ***