Read more!
Next Page 
రామాయణము పేజి 1

                                 

                                                                         

                                                                రామాయణము

                                                        

                                                          రచయిత :
  
                             ' బాలబంధు ' ,   ' బాల సాహితీ పితామహ '
                                    పాలంకి వెంకట రామచంద్రమూర్తి

                                                                మలిపలుకు   
                                             శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
                                             సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
                                            ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
                                             రామం నిశాచర వినాశకరం నమామి.
   
    రాముని కథను తెలుపునది రామాయణము. ఇందు రాముని పాత్రకు ఎంత ప్రాధాన్యమున్నదో సీత భూమికకునూ అంత ప్రాముఖ్యమున్నది. అందువల్ల ఈ కావ్యమునకు 'సీతాచరితము' అన్న నామమునూ ఉన్నది. లోక కంటకుడగు రావణుని సంహరించుటకే లక్ష్మీ నారాయణులు సీతారాములుగా అవతరించిరి. రావణ వధ ప్రధానాంశము గల ఈ కావ్యమును వాల్మీకి 'పౌలస్త్యవధ అని కూడా పిలువవచ్చునన్నాడు. 'పౌలస్త్యుడ'నగా పులస్త్య బ్రహ్మపుత్రుడగు రావణుడు. ఈ నామత్రయములో 'రామాయణము' అన్నదే ప్రసిద్దమైనది. ఆద్యంతము అన్నిప్రధాన ఘట్టములందు ప్రత్యక్షముగనో పరోక్షముగనో రాముని ప్రసక్తి వచ్చును. రాముడు సకల సుగుణాభిరాముడు. వాల్మీకి తన కావ్య రచనకు ముందుగా నారదునితో పదునారు సద్గుణములను పేర్కొని "ఈ గుణగణమును కలిగియున్న మానవుడెవ్వడైనా కలడా?' యని ప్రశ్నించెను.

        నారదుడు "దశరథాత్మజుడగు రాముడట్టి వాడు' అని తెలుపుచూ ఆశోడశగుణములే కాక రాఘవునాకు అదనముగా గల ఎనిమిది సద్గుణములను కూడా చేర్చి వివరించెను. రాముని సద్గుణ సంచయములో ప్రధానమైనది ధర్మజ్ఞత్వము. రాముడు ధర్మసూక్షముల నెరిగి, దాని నాచరించినవాడు. ఛాత్రుడుగ; పుత్రుడుగ, సోదరుడుగ, భర్తగా, మిత్రుడుగ, తుదకు శత్రువుగ ధర్మమునే పాటించి ఆచరించెను. తక్కిన పాత్రలు రాముని ధార్మికతను సమర్ధించుటయో, వ్యతిరేకించుటయో జరిపి దానిని భాషింపజేయును. కౌసల్య, లక్ష్మణుడు, భరతుడు, జాబాలి, వసిష్ఠుడు వీరందరునూ రాముని ధర్మ నిర్ణయమును (తండ్రి మాట బొంకుకాకుండ తాను వనవాసము చేయవలెనన్న నిశ్చయమును) మార్చుటకు ప్రయత్నింతురు. కాని అతడు చలించడు; తన నిర్ణయము మార్చుకొనడు.

        దండకారణ్యమున మునులు రాక్షసుల వలన తమకు కలుగుచున్న బాధలను రామునకు విన్నవించి "మమ్ము ఆ మనుజాశనుల నుండి కాపాడుము "అని కోరుదురు. రాముడు "దనుజులను వధించి మీకు వారి పీడను వదల్చెదను" అని మునిజనులకు అభయమిచ్చును. సీత ఏకాంతమున రామునితో "నాథా, నీకిక్కడి రాక్షసులతో పగలేదు; వైరము లేనివారిని చంపదగునా?" అని వారింపజూచును. అప్పుడు రాముడు "శిష్టహితంబు దుష్టజన శిక్షయు జేయని రాజు రాజె యుత్క్రుష్ట తపస్వి కోట్లను వధించు నిశాటుల జంపకుండినంగష్టతరాదె?" అని క్షత్రియ ధర్మమును వివరించి ఆమెను సమాధానపరచును. విభీషణుడు శరణుజొచ్చినపుడు సుగ్రీవాదులు వానిని చేరదీయ రాదందురు. హనుమంతుడు "విభీషణుడు ఉత్తముడు కనుక అతనికి శరణునిచ్చుటయే ఉచితమ"నును. రాముడు ఉత్తమానుత్తమత్వ ప్రసక్తి లేకుండగనే విభీషణుని రక్షించెదననును.

       అంతటితో ఆగక రావణుడే వచ్చి శరణుజొచ్చినచో అభయమిత్తుననును!....రావణునిచారులు వానర వేషములతో వచ్చి పట్టుబడినపుడు కవులు వారిని వధించబోగా రాముడు విడిపించును.....రావణునకు సంధి చేసికొనుటకొక అవకాశమిచ్చుట ధర్మమని తోచి అంగదుని రాయబారిగా పంపును....రావణుడు తనతో యుద్దము చేసి అలసిపోయినపుడు రాముడు "నిన్నీస్థితిలో చంపివేయుట సులభమే ఐననూ ధర్మము కాదు. నీవు పోయి విశ్రమించి శక్తిని పుంజుకొని రేపు తిరిగి రణస్థలికి రమ్ము" అని వానిని పోనిచ్చును. ధర్మానుసరణమున సీత/రామునకు తీసిపోవునది కాదు. "సుకుమారివగు నీకు వనవాస క్లేశము భరింపరానిద"ని అతడామెను వారించబోగా ఆమె భర్తను ఒప్పించిన రీతి మిక్కిలి ప్రశంసనీయము....పతివ్రతా శిరోమణియని ఖ్యాతిగాంచిన అనసూయ సీతతో "వరగుణశాలియైన రఘువర్యుని వెంబడి ఘోర కాననస్థిరకిటు భర్త్రు భక్తినరుదెంచుట జేసి కృతార్దవైతి'వని అభినందించగా వైదేహి "జగతిన్ నీచ చరిత్రుడైన విభుడెంచన్ సాధ్వికిన్ దైవతంబగు చుండన్"...ప్రియుడున్మూరుండు శుద్దాత్ముడౌ మగనిన్ దైవతమంచు జిత్తమున సంభావించుటాశ్చర్యమే?" అని పలికినది. భర్త వరగుణశాలి కాక నీచ చరిత్రుడైననూ వానిననుసరించుట సాధ్వీ ధర్మమను సూచన గల ఆ వాక్యము అనసూయ నలరింపజేసినది.   
    ...అశోక వనమున హనుమంతుడు జానకిని సందర్శించి "అమ్మా నా భుజస్కంధము నిన్ను గూర్చుండబెట్టుకొని రాముని సన్నిధిని చేర్చి నీ క్లేశమును బాపుదును, రమ్ము" అనగా ఆమె అంగీకరించలేదు. ఆమె "యుద్దమున రావణుని సంహరించి నన్ను రక్షించెనన్న కీర్తి నా భర్తకే దక్కవలెను" అని చెప్పి రాముని రాకకై ఎదురుచూచుచూ దుష్ట రాక్షస స్త్రీల మధ్యనే ఉండిపోయినది...ఆమెను అనేక విధముల భయపెట్టి పీడించిన దనుజ స్త్రీలను చంపివేయుదునని హనుమంతుడనగా ఆ సాధ్వి" వారు రాజాజ్ఞానువర్తులు, వారి విధిని వారు నెరవేర్చిరి; పగబూని వారిని శిక్షించుట తగదు" అనిత తన ధర్మబుద్దిని ప్రదర్సించినది.   
    వాల్మీకి తన కావ్యమున పాత్ర చిత్రణములో పక్షపాతము లేకుండ అన్ని భూమికలనూ చక్కగా పోషించినాడు. భరతుని ధార్మికత మిక్కిలి ప్రశంసనీయము. లక్ష్మణ హనుమంతుల ప్రతిఫల నిరపేక్షమైన సేవా పరత్వము శ్లాఘనీయము. విశ్వామిత్రుడు, విరాధుడు, శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు, జటాయువు, కబంధుడు, శబరి, మైనాకుడు, సురస - వీరందరునూ ధర్మపక్షపాతులై వివిధ రీతుల రామ కార్యమున తోడ్పడినారు. ప్రతి నాయకుడగు రావణుని భూమికను పోషించుటలో వాల్మీకివాని యందుకల మెచ్చదగిన దేదియు విస్మరించలేదు.రావణుని జూచి హనుమంతుడు "రూపము నందును, ధైర్యము నందును, పరాక్రమము నందును తేజస్సు నందును, సర్వ లక్ష్మణ సమన్వితత్వము నందును సాటిలేని మేటి ఈతడు!" అని మెచ్చుకొనును.

          "వీనియందు అధర్మము అను ఒక్క లోటున్నది కాని లేనిచో వీడు దేవేంద్రుని, సురలోకమును కూడా రక్షించగల సమర్ధుడు!" అని అంజనీ సుతుడు భావించును....వాల్మీకి హనుమంతునిచే రావణుని ముందు హితవాక్యములను పలికించినపుడు "రక్షోవల్లభా, నీవెన్నియో పుణ్య కార్యములు చేసితివి; వాటి ఫలితముగా అనితరసాధ్యమగు ఐశ్వర్యముననుభవించుచుంటివి" అని ఉపోద్గాతముగా చెప్పించి, రావణుని తపస్సంపదనూ, పుణ్యకార్యాచరణమునూ, పాఠకులకు వెల్లడి చేసినాడు....రావణుడు మారీచుడూ, విభీషణుడూ, మాల్యవంతుడూ, మండోదరి మున్నగు తనవారు ఎన్ని విధముల హితము బోధించిననూ సీతను విడుచుటకు అంగీకరించడు! ఈ అహంకారము, ఈ పట్టుదల, ఈ మొండితనము, రావణుని యందు వ్యక్తపరుచుటలో కవి తన శిల్పమును చూపినాడు. రావణుని కూటమిలోని వారగు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, విభీషణుడు-తమ తమ పరిధులలో తమ వైశిష్ట్యమును ప్రదర్శించినారు.

          కుంభకర్ణుడు "అన్నా నీవు సీతను దొంగిలించి తెచ్చుట తప్పు, ఐననూ నీవు నా సోదరుడవు కాన యుద్దమున నీకు తోడ్పడెదను" అని తన భ్రాత్రుప్రేమను వెల్లడించి, రావణుని అభిమానమునకు పాత్రుడైనాడు. ఇంద్రజిత్తు తండ్రి పై పరుషమూలా మాట ఎత్తక, అనేక విధముల జనకునకు తోడ్పడి తుదకాతని నిమిత్తము యుద్దమున ప్రాణములర్పించినాడు. విభీషణుడు కుంభకర్ణుని వలె ఒక్కసారి చెప్పి యూరుకొనక అన్ననూ, రాక్షస కులమునూ నాశము నుండి రక్షించవలెనన్న ఆకాంక్షతో పౌనఃపున్యముగ హితమును బోధింప సమకట్టి, ఇంద్రజిత్తు హేళనకునూ రావణుని కోపాగ్నికినీ గుణియై తుదకు నిండు సభలో అవమానింపబడినాడు. సాగర చక్రవర్తి దుర్మార్గుడుగ పరిణమించిన అశ్వమంతుని-పుత్రుడన్న పక్షపాతమును వదలి - విసర్జించినట్లు, విభీషణుడు అధర్మవర్తనుడగు అగ్రజుని వదలి, ధర్మపక్షమును చేరినాడు. కుంభకర్ణుడు అనుసరించినది సామాన్య ధర్మము. విభీషణుడు ఆచరించినది వాశేష ధర్మము. విభీషణ కుంభకర్ణుల భూమికలలోని ఈ వైవిధ్యము గమనార్హము.

Next Page