Read more!
Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 1

                                 


                 ఆ ఒక్కటీ అడిగేసెయ్

                                                                     -బలభద్రపాత్రుని రమణి
 

                                      
 


    "ఆదర్శవాది అర్ధరాత్రి బురఖా తీసి అద్దంలో నగ్నంగా ప్రతిఫలించడం చూశాడు. అమ్మాయిల కన్నుల్లో సరదాకి, సభ్యతకి మధ్యన జరుగుతున్న యుద్ధం చూసాడు!" రిషేంద్రకి తిలక్ వ్రాసిన వాక్యాలు గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు.

    చేతిలోని పేపరులోకి మనసు లగ్నం చెయ్యడానికి ప్రయత్నించాడు కానీ మనసు మాట వినలేదు. మొండికేసింది. కళ్ళు వాటంతట అవే ఎదురు సీటువైపు తిరిగిపోతున్నాయి! కారణం .... అక్కడ కూర్చున్న అందమైన అమ్మాయి! సౌందర్యం మనసుని సున్నితంగా కోసే పదునైన ఆయుధం. రైలు చిన్న కుదుపుతో అలవోకగా సాగిపోతుంది.

    ఆకుపచ్చ స్కార్ట్ కట్టుకున్న ఆమె ముఖం అచ్చు రెమ్మల మధ్యన విరబూసిన బొండుమల్లెలా మనోహరంగా ఉంది. బొండు మల్లెమీద గండు తుమ్మెదలు వాలినట్లుగా వున్నాయి. ఆమె కాటుక కళ్ళు నేనున్నాను సుమా! అన్నట్లు తళుక్కుమని మెరుస్తోంది ఆమె ముక్కునున్న ఒంటి రాయి పుడక. జంట పర్వతాల మధ్య నుండి చెంగున క్రిందికి దూకుతున్న పిల్ల కాలువలా వుంది పైట కొంగు. కాలుమీద కాలు వేసుకొని కూర్చొన్న ఆమె భంగిమనీ, ఆ నడుం మీద ఒంపునీ చూస్తే కాలిదాసు కావ్యం, జక్కన శిల్పం పూర్తి చేసుండేవారు కాదనిపించింది రిషికి.

    రిషి సిగరెట్టూ, అగ్గిపెట్టె తీసుకుని డోర్ దగ్గర కెళ్ళి నిలబడ్డాడు. మీగడ బొమ్మలాంటి ఎదురుసీటు అమ్మాయి మనసుని వీడిపోనంటోంది.

    "తప్పు!" చెప్పాడు మనసుతో.

    "ఓసారి కాలు తగిలుంచు చూడు!" చెప్పింది మనసు.

    "నో" అన్నాడు.

    "పక్కన కూర్చుని భుజానికి భుజం తగిలించు నున్నని మెడమీద ముద్దు పెట్టుకో...."

    'నోర్మూయ్!"

    "అదే చెప్తున్నాను... కోపంగా నీకేసి తిరగగానే ఆ చిన్ని పెదవులని నీ పెదవులతో మూసెయ్యి...."

    "చెంప పగలకొడ్తుంది"

    "పర్లేదు... తర్వాతేగా" మనసు తాపీగా చెప్పింది.

    అప్పటికే రిషికి ఒళ్ళంతా వేడిగా మారినట్లయింది. సెగలు రేగాయి.

    "అబ్బా" చురుక్కుమనేసరికి ఈ లోకంలోకొచ్చి సిగరెట్ అవతల పారేశాడు.

    "త్వరగా వెళ్ళు... కంపార్ట్ మెంటులో ఇద్దరే వుండటం నీ అదృష్టం" మనసు తొందర పెట్టింది.

    "ఛ ఊర్కో! నేనలాంటి వాడ్ని కాదు!" చెప్పాడు.

    "ఇప్పటిదాకా కాదు! ఎందుకంటే అవకాశం రాలేదుగా" మనసు నవ్వుతూ అంది. "వయసులో వున్న కుర్రవాడివి కదా!"

    రిషికి కోపం వచ్చింది. ముఖం ఎర్రబడింది. "నీకు బుద్ధి లేదు" అన్నాడు.

    "అవును. నా తప్పు కాదు. పరిస్థితులది" అంది వేదాంతిలా.

    "అవును పాపం! నువ్వు మాత్రం ఏం చేస్తావు! అందరం పరిస్థితుల చేతిలో బందీలం" ఒప్పుకున్నాడు రిషి.

    ఓ గాలి తెమ్మెర చెళ్ళున కొట్టింది చెంప మీద. చెంప తడుముకున్నాడు. రైలు వంతెనమీద నుండి వెళ్తోంది. చిక్కటి చీకటి చీర నిండా ముసుగేసుకుని, తలుపు చాటునుంచి గాజుల శబ్దం చేస్తున్నట్లుగా వున్నాయి. కృష్ణమ్మ గలగలలు!

    రిషి వెనక్కు తిరిగాడు. శరీరంలోకి ఒక్కసారిగా వెయ్యి ఓల్టుల విద్యుత్తు ప్రవహించినట్లుగా అయి నిలబడ్డాడు. అతడ్ని ఢీ కొట్టిన ఆమె కూడా అంతే సిగ్గుతో తడబాటుగా చూసింది.

    అంత దగ్గరగా అంత అందాన్ని చూసిన రిషికి ఏం చెయ్యాలో తోచలేదు.

    "త్వరగా... నడుం దగ్గర ఒడిసిపట్టి దగ్గరగా హత్తుకో....ఊ....క్విక్!" అరిచింది మనసు.

    "ఒద్దు" తల అడ్డంగా వూపాడు.

    అతని భావం అర్ధంకాక, ఆ అమ్మాయి కంగారుగా రెప్పలు అల్లార్చింది.

    "సారీ! చూసుకోలేదు" అంది.

    "తనివి తీరా చూడు! ఇంత అందాన్ని మిస్ చేసుకోకు, పెదాల మీద గట్టిగా..." చెప్తున్న మనసుని కసుర్తూ.

    "ఛీ వద్దంటుంటే..." గట్టిగా అనేసాడు.

    ఆ అమ్మాయి ఈసారి భయంగా ఒక్కడుగు వెనక్కి వేసి రైలు ఊపుకి తూలి పడబోయింది.

    రిషి అప్రయత్నంగా ఆమెని పట్టుకుని ఆపాడు.

    ఒళ్ళు జల్లుమంది. ఎండాకాలం చల్లని కొబ్బరిబొండం అందించినట్లయింది.

    "ఇందాకనే చెప్తే కాదన్నావ్ గా!" మనసు నిష్ఠూరంగా అడిగింది.

    "కావాలని పట్టుకోలేదు" సిన్సియరుగా చెప్పాడు.

    ఆ అమ్మాయి కళ్ళల్లో భయం తగ్గింది. "థేంక్యూ!" అన్నాడు.

    "అప్పుడేనా?" అన్నాడు.

    "ఆ!" ఆ అమ్మాయి అర్ధం కానట్లు చూసింది.

Next Page