Read more!
Next Page 
చీకట్లో నల్లపులి  పేజి 1

                                 


                           చీకట్లో నల్లపులి

                                                            - రామవరపు వేణుగోపాలరావు

 



    ఏరాడ కొండ....కొండమీద చల్లగాలి.... పక్కని చక్కని చుక్క....కొండమీది కెక్కితే కింద ఇంద్రనీలం రంగులో పరుచుకున్న సముద్రం...దానిమీద లేత నీలంలో మేఘాల గుంపు...గుంపు ఆవల...అంతుకు ముందు...?

    వెస్ట్ బెంగాల్లో సౌతీస్టర్న్ రైల్వే ... స్టీమ్ ఇంజన్ పొగలు కక్కుతూ... ఇంజన్ లో డ్రయివరు అసిస్టెంట్...అదే...కళాసి...చెమట్లు కక్కుతూ...బొగ్గు....ఇంజన్ కి ఆకలి తీరుస్తూ.... ఎప్పుడొస్తుందా ఆద్రా అని అంగలారుస్తూ....మోసం....దగా...కుడి ఎడమలనగా...

    లేలేత చేతులు, లావుపాటి చేతులు, జాణల చేతులు, బాలల చేతులు, బంగారు గాజులు, వాచీల కోసం వస్తే, చూసీ, తొడిగీ, విసిగీ, ఛీ అని లోకంమీద విరుచుకుపడీ...

    "అమ్మా" అన్నమాట వినపడగానే రాజారామ్ ఉలిక్కిపడి చూశాడు. ఆలోచనల్లో కొట్టుకు పోతున వాడల్లా ఆత్రంగా మంచం మీద నిద్రపోతున్న ఏడేళ్ళ కూతురు రమణి వంక చూశాడు. "ఊ" అని మరోసారి అస్పష్టంగా అని ఇటు వత్తిగిల్లి పడుకుంది.

    అమాయకంగా ఆదమరచి నిద్రపోతున కూతుర్ని చూసేసరికి రాజారామ్ గుండె మరోసారి చెరువయింది. తల్లి లేని పిల్లను ఎలా సాకాలా అన్న బెంగ ఇంకోసారి అతన్ని వేధించింది.

    టైమ్ ఎడున్నరయింది..

    ఉస్సు రంటూ లేచి వంటింట్లోకి వెళ్ళాడు. చిటికెలో తయారయ్యే టిఫిన్ ఉప్మా ఒక్కటే కాకపోతే తాజా కరివేపాకు, కాస్త అల్లం, ఎక్కువగా జీడిపప్పూ ఉంటే చాలు రమణి ఆవూరావురు మంటూ తినేస్తుంది. స్టవ్ వెలిగించి పావుగంట అయీ అవకముందే టిఫిన్ తయారు చేశాడు. తనకోసం కప్పులో కాఫీ పోసుకుని బెడ్ రూంలోకి నడిచాడు.

    అప్పుడే నిద్రలేచింది రమణి.

    కళ్ళునులుముకుంటూ "టైమెంత డేడి?" అని అడిగింది.

    "స్కూల్ టైం కావస్తోంది."

    "అబ్బ......టైమెంత డేడీ?" అని గారంగా అడిగింది రమణి మరోసారి.

    "ఏడున్నర దాటింది!"

    "మైగాడ్!" అంటూ కప్పుకున్న దుప్పటిని ఓ మూలకి విసిరేస్తూ లేచికూర్చుంది.

    "మైగాడ్ అనడం ఎక్కడ నేర్చుకున్నావు రమణీ?" అనడిగాడు రాజారామ్ కాఫీ తాగుతూ.

    "నేనేదైనా తప్పుచేస్తే మా టీచర్ అలానే అంటుంది..."

    "ఎలా"?

    "ఓ మైగాడ్....ఇంత చిన్న విషయం తెలీదూ... అని విసుక్కుంటుంది."

    "అంటే నీవు స్కూల్లో బాగా వెనకపడి పోయావన్న మాట?"

    "అంటే?" పెద్ద పెద్ద కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది.

    "అంటే....సరిగ్గా చదవడం లేదన్నమాట?"

    "అదేంకాదు. మా టీచర్ పిచ్చిది?"

    "సరే__తెల్లారి లేస్తూనే మీ టీచర్ గొడవెందుకు కాని గబగబలే. బాత్రూంలో నీళ్ళున్నాయి. మొహంకడుక్కుని తుఫాన్ ఎక్స్ ప్రెస్ లా వచ్చెయ్. నీకోసం ఫస్ట్ క్లాసైన ఉప్మా చేశాను." అన్నాడు రాజారామ్ సిగరెట్ వెలిగిస్తూ.

    "డేడీ.....డేడీ..."

    ఆరోజు దినపత్రికలో మొహం దూరుస్తూ "ఊ......ఏమిటి?" అన్నాడు.

    "బెడ్ కాఫీ కావాలి డేడీ!"

    "తప్పమ్మా....అది బేడ్ హేబిట్."

    "ఎప్పుడూ నువ్వలాగే అంటావు" మొహం ముడుచుకుంది. అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మొహంపెట్టి - రహస్యంగా "మరి....మన పక్కింటి ఆంటీ రోజూ బెడ్ కాఫీనే తాగుతుందిట! నేను తాగితే తప్పా?" అంది.

    పతాక శీర్షికల్లోంచి తలెత్తి తదేకంగా కూతురి వేపు చూశాడు రాజారామ్.

    ఇప్పుడు ఏడేళ్ళపిల్ల. పెరిగిన వాతావరణం ప్రభావంతో వయసుని మించిన మాటలు మాట్లాడ్తోంది. చిన్నప్పుడే తల్లి పోయినందువల్ల మితిమీరిన గారాబం. అడిగిన రిబ్బన్లు లేకపోతే, జోళ్ళు కొనకపోతే, గొల్ల రంగులు ఇవ్వకపోతే ఎక్కడ నొచ్చుకుంటుందో ఆ చిన్నారి హృదయం అని అతని ఆరాటం - మగపిల్లల అవసరాలు తెలుసుకోవడం చాలా తేలిక. అవి కూడా కొన్నే ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. అదే ఆడపిల్లలయితే....పిన్నీసు దగ్గర్నుంచి పౌడర్ దాకా అన్నీ వాళ్ళకు అతి ముఖ్యమైన విషయాలే.

    మరో పదేళ్ళుపోతే ఫ్రాకులుమాని లంగాలు వోణీలు వేస్తుంది. లేకపోతే పంజాబీ డ్రెస్ వేస్తుంది. అప్పుడు తన అవసరాలు ఏం తెలుస్తాయి? నాకిది కావాలి అది కావాలి అని తండ్రిని అన్నీ అడగ్గలదా?

    "ఏంటి డేడీ అలా చూస్తున్నావు? నా మాటకి జవాబు చెప్పూ!"

    వేలు చురుక్కుమనగానే సిగరెట్ మరో దమ్ములాగి దాన్ని ఆష్ ట్రేలో పడేశాడు.

    "ఆఁ ఏమన్నావ్?"

    "నేను బెడ్ కాఫీ తాగితే తప్పా?"

    "అవును తప్పే"

    "మరి పక్కింటి అంటి తాగితే?"

    "అదీ తప్పే"

    "మరెందుకలా తాగుతుంది"

    "అడిగేవాళ్ళు లేక....సరేగాని బ్రష్ చేసుకోరాదూ? ఉప్మా చల్లారిపోతే బాగుండదు. లే మరీ?" అంటూ తొందర చేశాడు రాజారామ్.

    తనడిగిన ప్రశ్నకి సరైన జవాబు రాలేదని నిరుత్సాహంగా మంచం దిగి బాత్రూం వేపు నడిచింది రమణి.

    మరో సిగరెట్ వెలిగించి బాల్కనీలోకి వెళ్ళాడు రాజారామ్.

    విజయనగర్ కాలనీ అంటే అతనికి ఏదో చెప్పలేని ఇష్టం. ఆబిడ్స్ దగ్గర ప్లాజా టవర్స్ లో ప్లాట్ కొనుక్కున్నా ఈ ఇల్లు మాత్రం అమ్మబుద్ది కాలేదు. ఇరవయ్యేళ్లుగా ఈ ఇంటితో ఉన్న అనుబంధాన్ని అంత తేలిగ్గా వదులుకోగలడా?

    వృద్దాప్యంలో అతని తల్లిదండ్రులు ఈఇంట్లోనే కన్నుమూశారు. పెద్దలు చేసిన పెళ్ళి అయినా అతన్నెంతో ఆరాధించి, అందాల పాపని ప్రసాదించి, తరువాత ఏడాదన్నానిండకుండానే హఠాత్తుగా అతని అర్ధాంగి ఈ లోకం వదలివెళ్ళింది కూడా ఈ ఇంట్లోనే కాకపోతే అప్పుడు డాబా ఇల్లు ఇప్పుడు మేడ అయింది:

    ఊళ్ళో అంతటా కర్ ఫ్యూలు గొడవలు ఉన్నా, తుఫానులు చెలరేగినా ఇక్కడ మాత్రం అంతా ప్రశాంతంగా ఉంటుంది. పాలు వస్తాయి. పేపర్లు వస్తాయి. దుకాణాల్లో అన్నీ దొరుకుతాయి. కాయగూరలు సరేసరి. కరెంటు సాధారణంగా పోదు. నీళ్ళబాధ లేదు.

    తెల్లటి యూనిఫారాల్లో చేతుల్తో పుస్తకాలు పట్టుకుని అయిదారుగురు అమ్మాయిలు చకచకా విజయాబ్యాంక్ వేపు వెళ్తున్నారు. నవ్వుకుంటూ ముచ్చట్లాడుకుంటూనే గమ్యం చేరాలన్న తొందరతో నడిచి వెళ్తున్నారు. అంతా పదేళ్ళ లోపు అమ్మాయిలు. వాళ్ళని చూస్తుంటే అతనికి తన బాల్యం గుర్తొచ్చింది.

Next Page