Read more!
Next Page 
గీతోపదేశం కథలు పేజి 1

                                 


                                         గీతోపదేశం కథలు

                                                                                            డి. కామేశ్వరి    

           

                                                                                గీతోపదేశం

    "అమ్మా కాఫీ..." పదకొండు గంటలకి లేచి బద్ధకంగా ఆవులిస్తూ వచ్చి సోఫాలో కూర్చొని పేపరు తీసుకుని ఆర్డరేసింది తల్లికి. అప్పుడే వంటింటి పనంతా పూర్తిచేసి వచ్చి సావకాశంగా పేపరు తిరగేస్తున్న జయలక్ష్మి ఓసారి కూతురి వంక విరక్తిగా చూసి "వంటింట్లో అన్నీ వున్నాయి, కలుపుకుని తెచ్చుకో" నిర్లిప్తంగా అంది.
    "అమ్మా, ప్లీజ్..." చతుర ముద్దులు గునుస్తూ అడిగింది.
    "ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్" పేపరులోంచి తలెత్తకుండానే జయలలక్ష్మి అంది. తల్లివంక కోపంగా చూసి విసుక్కుంటూ లేచి వెళ్లి కాఫీ కలుపుకుని తన రూములోకి వెళ్లి తలుపు ధడాలున వేసుకుంది.
    "జయా! సాయంత్రం రాధాకృష్ణ వాళ్లు డిన్నరుకి వస్తున్నారు గుర్తుంది కదా!" క్రింద కారు పని చూసుకుని లోపలికి వస్తూ అన్నాడు సత్యమూర్తి.
    "ఊ..." ముభావంగా అంది. కాస్త సోడాలు తెప్పించి ఫ్రిజ్ లో పెట్టు. వాడికి డ్రింక్ కావాలి."
    "తెలుసులెండి" విసుగ్గా అంది జయలక్ష్మి.
    "ఏమిటలా వున్నావు? డల్ గా మాట్లాడుతున్నావు. నీకు చిరాగ్గా వుంటే చెప్పు కేన్సిల్ చేసేస్తాను" భార్య తీరు చూసి కాస్త నొచ్చుకుంటూ అన్నాడు.
    "ప్లీజ్! నాకేం అవలేదు. మామూలుగా నన్ను నన్నుగా వుండనీయదు గదా మీ అమ్మాయి. ఎంత పట్టించుకోవద్దనుకున్నా, ఇంట్లో చూస్తూ ఎలా ఊరుకోగలను? రాత్రి ఒంటిగంటన్నరకొచ్చింది తెలుసా? ఇప్పుడు లేచి కాఫీ అంటూ ఆర్డర్లేస్తుంది. హోటలనుకుంటుందేమో ఇది" ఉక్రోషంగా, దురుసుగా అంది.
    సత్యమూర్తి జయలక్ష్మి వంక చూసి "కూల్ డౌన్, ప్రతి వీకెండ్ కి ఇదే గోల కదా! కొత్తేముంది?"
    "అవును, ఏదో పోనీ వారం అంతా వర్క్ చేసి శనివారం వస్తే రిలాక్స్ అవుతుంది ఫ్రెండ్స్ తో అనుకుంటే... రాను రాను మరీ మితిమీరిపోతుంది భాగోతం. మీరేం అనరు. ఏదన్నా అంటే నేనో రాక్షసిలాగ కనిపిస్తున్నాను దానికి."
    "ఏం అనమంటావు? అంటే... డోంట్ బి సిల్లీ డాడీ! అని ఎన్నిసార్లు తేలిగ్గా కొట్టి పారేసింది. పాతికేళ్ల కూతురిని, ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నదాన్ని చిన్నపిల్లని కేకలేసినట్టు తిట్టమంటావా, తిడితే ఊరుకుంటుందా? పదేళ్ల పిల్లలే ఎదురు జవాబులు ఇస్తున్నారు ఈ రోజుల్లో..."
    "ఏమిటో బాయ్ ఫ్రెండ్స్ తో మోటారు సైకిళ్లెక్కి తిరగడం, పబ్బులు, పార్టీలు, డ్రింక్స్... ఆడపిల్లలు కూడా ఇంత బరితెగించిపోతున్నారు. దేనికన్నా ఓ లిమిట్ వుంటుంది" కోపంగా అంది పేపరు విసురుగా పడేస్తూ.
    "మనిద్దరం అరుచుకోవడం తప్ప ఏం లాభం? రెండు మూడుసార్లు గట్టిగా చెప్పాం. పట్టించుకుందా, జవాబిచ్చిందా? విననట్టే వెళ్లిపోయింది గదా! ఏం చెయ్యమంటావో నీవే చెప్పు? సరే అనవసరంగా మూడ్ పాడుచేసుకోకు" ఓదార్పుగా అని లోపలికి వెళ్లిపోయాడు.

                                                                                      *  *  *  

    "హాయ్ ఆంటీ, అంకుల్! ఎలా వున్నారు? చాలా రోజులయింది వచ్చి..." కూతురు సాయంత్రం ఇంటికొచ్చిన గెస్ట్ లని మర్యాదగా పలకరించి, పరువు నిలబెట్టినందుకు సంతోషించింది జయలక్ష్మి.
    ఆదివారాలు ఇంట్లో వుండేదే తక్కు. సాయంత్రం అసలుండదు. అలాంటిది యింట్లో వుండి, గెస్ట్ లొస్తే గదిలోంచి వూడిపడకుండా తమని యిబ్బంది పెట్టనందుకు సంతోషించి, కూతురి వంక ప్రసన్నంగా చూసింది.
    "ఏయ్... చతురా, లుకింగ్ గ్రేట్... ఏమిటెలా వుంది ఉద్యోగం?" చతుర చేయి పట్టుకుని ఆప్యాయంగా పలకరించింది శోభన.
    "హౌ ఆర్ యూ బేటా?" రాధాకృష్ణ ఆప్యాయంగా పలకరించి... "సో, నౌ యూ ఆర్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ లైఫ్. మీ నాన్న కంప్లైంట్ చేసేవాడు దీని ఖర్చులు తట్టుకోలేకపోతున్నానని. ఐ థింక్, హాయ్ యీజ్ నౌ రిలీవ్ డ్ మాన్..."
    "ఎక్కడరా నాయనా, వున్నదంతా ముందే వుంది ఖర్చు. ఇద్దరి పెళ్లిళ్లు అయ్యేసరికి ఐ విల్ బి ఎ పాపర్" మిత్రులిద్దరూ హాస్యాలాడుకుంటూ మాటల్లో దిగారు.
    "అయితే చతురా, పప్పన్నం ఎప్పుడు పెడ్తున్నావు?" శోభన హాస్యంగా అడిగింది.
    "ఏమిటి ఆంటీ, ఇంకా ఆ పాతకాలం కబుర్లు మానరా?" విసుగ్గా అంది.
    "పోనీలే, కొత్త కాలంగా 'పులావ్ అన్నం' ఎప్పుడని అడగనా?" చమత్కరించింది.
    "అబ్బ! అదికాదు ఆంటీ, పెళ్లెప్పుడు, పప్పన్నం ఎప్పుడు? అమ్మాయి కనిపిస్తే పెళ్లి గురించి తప్ప ఇంకేం మాటలుండవా అని..."
    "బాగుంది, పెళ్లీడు అమ్మాయి యింట్లో వుంటే మరింకేం అడగమంటావు? నీవు చదువుకున్నన్ని రోజులు పెళ్లెప్పుడు అని అడిగానా? చదువయింది, ఉద్యోగం అయింది, ఇప్పుడవాల్సింది మరి అదే గదా!" శోభన వదలకుండా రెట్టించింది.
    "అలా అడుగు, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలనుకోడం ఏదో వదుల్చుకోడానికి పేరెంట్స్ చేసే పన్నాగం అని దాని ఉద్దేశం. ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూద్దామన్నా యిప్పుడు కాదు అంటుంది" జయలక్ష్మి స్నేహితురాలి సపోర్ట్ తో అవకాశం దొరికిందన్నట్టు అందుకుంది. "పాతికేళ్లు నిండాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడో మరి! మమ్మల్ని చూడనీదు, అది వెతుక్కోదు."
    "ఏమిటి, రోడ్లమీద వెతుక్కోమంటావా? వెళ్లే ప్రతి మగాడిని చూసి ఎంచుకోమంటావా?" తల్లి వంక చురచుర చూస్తూ అంది.
    "చతురా, అదికాదమ్మా! నీకెవరన్నా నచ్చితే చెప్పు, లేదంటే అమ్మావాళ్లకి ఆ బాధ్యత అప్పచెప్పు. వాళ్లకి తెలీదా నీకేం కావాలి? అంతేగాని, అలా వూరికే ఆలస్యం చేయకు. ఏ వయసులో ఆ ముచ్చట. ఇది కరెక్ట్ ఏజ్ పెళ్లికి, అందుకు తొందరపడతారు పెళ్లికి..." అనునయంగా అంది శోభన.
    "ప్లీజ్ ఆంటీ, అమ్మలా మీరూ వూరికే పెళ్లి పెళ్లి అనకండి."
    "చతురా, ప్రతి తల్లికి ఆ ఆరాటం వుంటుందమ్మా! పిల్లకి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని పేరెంట్స్ కోరుకుంటారు."
    "బాధ్యత కాదు, భారం అనుకుంటారు. చదువయింది, ఉద్యోగం వచ్చేసింది, పెళ్లి చేసి యింట్లోంచి పంపేసి హాయిగా వుండాలనుకుంటారు. ఏం నాకేమంత వయసయిందని ఒకటే గోల. నాకు నచ్చినవాడు దొరకాలిగా..."
    "పోనీ నీకేం కావాలో, ఎలాంటివాడు కావాలో చెప్పు. మేమూ మంచి సంబంధం వుంటే చెపుతాం."
    "ఆ, మీరు వెతికేసి, ఇదిగో వీడి చదువు, ఇది ఉద్యోగం, ఇంత జీతం అనేస్తే నాకు నచ్చుతాడా?" వాదనలోకి దిగింది చతుర. "పెళ్లిచూపులంటూ ఓ అరగంట మాట్లాడేస్తే నచ్చిపోతాయా అన్నీ?"
    "అలా అన్నామా? ఎవరన్నా నచ్చితే ఇద్దరూ మాట్లాడుకోండి, ఒకరినొకరు తెలుసుకోండి. అప్పుడు చెప్పమన్నాం" జయలక్ష్మి కూతురి వంక చూస్తూ అంది.

Next Page