Read more!
Next Page 
నీ కలల బందీని పేజి 1

                                 

 

                                    నీ కలల బందీని

                                        యర్రం శెట్టి శాయి

                   
    అది శోభనం గదిలా లేదు.
    గది మధ్యలో ఉన్న స్తంభం పక్కనే తాతల నాటి ఓ పందిరి మంచం ఉంది. దాని మీద పరువూ, పరుపు మీద తెల్లటి దుప్పటీ పరచి వున్నాయ్. ఆ మంచం పక్కనే అంత ఎత్తూ వున్న ఓ ముక్కాలి పీట మీద స్టీలు ప్లేటూ, దాన్నిండా ఏవేవో మిఠాయిలూ ఉన్నాయి. గదిలో ఓ పక్క వేలాడుతున్న తీగకి కాంతిగా వెలుగుతున్న ఓ లాంతరు ఉంది. ఓ పక్క నున్న తడికెకు సినిమా పోస్టర్లు అంటించి ఉన్నాయి. ఓ మూలగా గోడ కానుకొని ఓ పెద్ద కావిడి పెట్టె, దాని మీద మరో రెండు చెక్క పెట్టెలూ ఉన్నాయి.
    పందిరి మంచం మీద పడుకొని సిగరెట్ తాగుతూ మధురమయిన ఊహల్లో తెలిపోతున్నాడు మాధవరావ్. టైము చూసుకొన్నాడతను. పది దాటింది. తీరా తను నిద్రపోయాక సీతని గదిలోకి పంపుతారేమో! నవ్వు వచ్చిందతనికి. తను సీతతో ఎన్నో విషయాలు మాట్లాడాలి. తామిద్దరూ కలిసి మోయవల్సిన బరువులూ, బాధ్యతలూ , కష్టాలూ, ఒకటేమిటి ఎన్నో.
    ఒకరినోకరు పరిచయం చేసుకోవడం, కొంతవరకయిన అర్ధం చేసుకోడానికి ప్రయత్నించడం , తాము ఎదుర్కోవలసిన సమస్యలు చర్చించడం. ఆ తరువాత తీయని సుఖాలు ప్రప్రధమంగా అనుభవించడం ఇవన్నీ జరగవలసి వున్న మొదటి రాత్రిలో ప్రతి క్షణమూ విలువైనదే.
    తలుపు దగ్గర గుసగుసలు వినిపించినయ్ మాధవరావు చటుక్కున మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడతను. గది తలుపు వేపే చూడసాగాడు. సీత లోపలి కడుగిడే మధుర ఘట్టాన్ని వీక్షించడానికి మనసు తహతహలాడుతోంది. బయట గాజుల గలగలలూ, నవ్వులూ-----
    మరో పది నిమిషాల తర్వాత సీత లోపలి కొచ్చింది. ఆమెను చూస్తూనే విభ్రాంతుడయిపోయాడు మాధవరావు . అలంకరణ ఆమె అందానికి ఓ కొత్తదనం తీసుకోచ్చుంది. పట్టు చీర కట్టుకొని, కాటుక కళ్ళతో తన కెదురుగా పేళ్లి చూపుల కోసం కూర్చున్న సీతకీ ఈనాటి సీతకీ ఎంతో తేడా కనిపిస్తోంది. ఆనాటి బెదురు, అమాయకత్వం బదులు ఇప్పుడు శృంగారం ఓ వింత అందం మెరసి పోతున్నాయ్ ఆమెలో.  
    "పుత్ర పాత్రాభివ్రుద్దిరస్తు " సీతతో పాటు లోపలికి వొచ్చిన నడి వయసు స్త్రీ బయట కెళ్ళిపోతూ అంది. ఆ తర్వాత తలుపులు మూసుకు పోయినయ్.
    మంచం మీద నుంచి దిగి ఆమెనే తనివి తీరా చూస్తూ దగ్గరకు నడిచాడు మాధవరావ్.
    "సీతా!" అన్నాడు ఆమె భుజం మీద చేయి వేయబోతూ.
    "తలుపు...." అందామె చప్పున వెనక్కు తగ్గి, సిగ్గుతో.
    మాధవరావుకి నవ్వొచ్చింది ఆమె ఖంగారు చూసేసరికి- నేమండిగా తలుపు గడియవేసి ఆమె చేయి పట్టుకొని మంచం దగ్గరకు నడిపించుకొచ్చాడు.
    "కూర్చో ....." అన్నాడు ఆమెకు  ఎదురుగా నిలబడి.
    "ఊహూ....." చిలిపిగా తలూపింది ఆమె.
    "ఓహో...నేనే కూర్చోబెట్టాలన్న మాట." అమాంతం ఆమెను కౌగలించుకొని పైకెత్తి మంచం మీద కూర్చోబెట్టాడతను. ఆమె తప్పించుకోడానికి ప్రయత్నించి కుదరక నిస్సహాయంగా కూర్చుండిపోయింది. ఆమె పక్కనే తనూ కూర్చుని ఆమె భుజం చుట్టూ చేయి వేసి తనకు దగ్గరగా లాక్కొన్నాడు మాధవరావు."
    "ఎవరయినా చూస్తున్నారేమో !' సిగ్గుతో అటూ ఇటూ చూస్తూ అందామె.
    "తలుపులు మూసే వున్నాయిగా!" నవ్వుతూ అన్నాడు మాధవరావు.
    "ష్! అలా గట్టిగా మాట్లాడకండి. వినపడుతుంది వాళ్ళకి....." ఇంకా బిడియంగానే అందామె.
    మాధవరావుకి నవ్వాగలేదు. మరింత గట్టిగా నవ్వేశాడు. అతని నవ్వుతో సీత మరీ సిగ్గుపడి అతని కంటుకుపోయింది. అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది. ఆమె స్పర్శ అతనికి పులకింతలు కలిగించింది. గాడంగా ఆమెను గుండెల్లో పొదువుకొని, కొద్ది క్షణాలు తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు. ఇద్దరి గుండెలూ ఆవేశంతో ఎగసిపడుతున్నాయి.
    "ఇందాకే నాకో విషయం తెలిసింది నీ గురించి. నువ్వో రచయిత్రివటగా!" నవ్వుతూ అడిగాడతను.
    ఆమె నవ్వేసింది. "అంతా వట్టిదే. మీకెవరు చెప్పారలా అని?"
    "అబద్దాలు చెప్పకు ఆడపిల్లలు పుడతారు' కొంటెగా అన్నాడతను.
    "ఛీ పాడు"
    "మనకు వచ్చిన పెళ్ళి బహుమతుల్లో నీ బహుమతులు కొన్ని పుస్తకాలు వచ్చాయి. వాటి మీద "వర్ధమాన రచయిత్రి సీతకి" అని రాశారు మీ ఫ్రెండ్స్ ఎవరో......"
    "అవి మీరెప్పుడు చూశారు?" ఆశ్చర్యంగా అడిగిందామే.
    "మీవాళ్ళే ఎవరో తెచ్చి చూపించారు ........"
    "నేనేం రచయిత్రిని కాదు. కధలు రెండు మూడు రాశాను గానీ అందులో ఒకటి తప్ప మిగతావి అచ్చవనే లేదు"

Next Page