Read more!
Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 1

                                 


                      మ్యూజింగ్స్ -2

                                                        చలం

                       

    గుండ్రంగా బలిసిన పిల్లి యెండలో పడుకుని వుంది__తెల్లని పిల్లి. దాన్ని చూస్తే మా వూళ్ళో నిత్యసంతోషిగా కనపడే స్త్రీ సంఘోద్ధారకురాలు ఒకామె జ్ఞాపకమొస్తోంది. చాలామంది కిట్లా గట్టి పోలికలుంటాయి. ఒక మిత్రుడి మొహం దేనినో పోలివుందని, ఆ వుపమానం మనసుకి స్ఫురించక చాలా నెలలు వూరుకున్నాను. మొన్న బస్సుకి అడ్డంగా నుంచున్న ఒక ఒంటెను చూసేటప్పటికి ఆ ఒంటె మూతికోసం ఇన్నాళ్ళు వెతుకుతున్నాననిపించింది. ఆ పిల్లి యిట్లా పడుకుందా ఎండలో కళ్ళుమూసుకుని, దాని కళ్ళు చుట్టూ ఎగిరే పిచ్చికల మీదే వున్నాయి. దానికి ఆ పిచ్చికలు యీకలు కట్టుకున్న లడ్డుండల్లాగూ, ఎగిరే ఇడ్డెనల్లాగూ కనిపిస్తాయి గావును! చేతులో కానీ లేక మిఠాయి దుకాణం ముందు నుంచున్న కుర్రాడి బాధగావును దానికి! పిల్లి జన్మలో పాపం అనుభవించే పద్ధతి అదేమో!
    చెరువునించి నీళ్లు మోస్తో సీత గుమ్మం ముందునుంచి వెళ్ళినప్పుడల్లా నావంక చూస్తోంది. ఏమిటా ఆకర్షణ? పట్టణం మొగవాడు. అధికారి. అదిగాక పూర్వానుభవాల స్మరణ కొంతవరకు పనిచెయ్యవొచ్చు. ఏమిటా ఆశ? ఏమో! ఏ ఐదు నిమిషాలో దొరకవా అనా? అంతమాత్రము యోచనా వుండదు. పిల్లి అట్లా పిచ్చికల వంక ఎందుకు చూస్తూ వుంది? ఏమిటా ఆశ? ఏమీలేదు అట్లానే! అంతే సాధారణంగా యీ సంబంధాలలో దొరికేది ఆ ఐదు నిమషాలే. అట్లాంటప్పుడు కవిత్వానికీ రొమాన్సుకీ వ్యవధి యేదీ? అందువల్లనే స్త్రీకి ప్రేమ అనగానే కటికినేల జ్ఞాపకం వస్తుంది, యీ పల్లెటూళ్ళలో_ ముఖ్యంగా కనిగిరిలో! ఏం? సుబ్బారావ్ c/of గంగానమ్మ! ఏమంటారు?
    పురుషుణ్ణి వెతుక్కోడానికి అలవాటయిన స్త్రీ చూపులు అదో విధంగా తయారవుతాయి వేశ్య చూపులు వేరు. అవి ధనం కోసం వెతుకుతాయి. ఈ స్త్రీల చూపులు మోహం కోసం - కాదు అవయవాల కోసం వెతుకుతున్నాయా అన్నంత అసహ్యంగా వుంటాయి. మరీ __ మ్మకి దేహమంతా, (మనసు కూడానేమో!) అంతా కూడా ఒక్క అవయవం చుట్టూ యేర్పడ్డ సహాయక ప్రదేశం వలె వుంటుంది.
    కొంతమంది స్త్రీలలో ఆకర్షణ పువ్వుల్నీ, చల్లని నీలపు నీటినీ, జ్ఞాపకం తెస్తుంది. ఎంతైనా కళ్ళవేపూ పెదవుల వైపే నిలుస్తుంది ఆరాధకుడి దృష్టి. స్త్రీలో ఔన్నత్యం తలుచుకున్నప్పుడల్లా చిన్న జ్ఞాపకం వస్తుంది. నేను చేసిన నిరాకరణా, ఆత్మత్యాగమూ అనవసరము అర్ధవిహీనమూనా? ఇట్లాంటి సంయోగాలకీ వియోగాలకీ ఆ రెంటి మధ్యా, వ్యక్తమై బాధించిన సంకోచాలకీ, త్యాగాలకీ, విచారాలకీ అంతం, సాఫల్యం, ఏమైనా వుందా, లేక ఆ అనుభవమే ఆ త్యాగమిచ్చిన మాధుర్యమే అంతమా? కాని ఇంకేం సఫలం కావాలీ? చి__ని మళ్ళీ కలుసుకోవాలా? ఈ లోకంలోనో ఇంకో లోకంలోనో ఆమెనించి కృతజ్ఞతను పొందాలా? ఇక్కడ మధ్యలో త్యజించిన ప్రేమ అనుభవాన్ని మళ్ళీ "కంటిన్యూ" చెయ్యాలా? ఇట్లాంటి ప్రశ్నలకి ఇష్టమయిన 'హాప్ ఫుల్' సమాధానాలు చెప్పుకుని ఎంతమంది ఆ కలలలో ఆనందపడడం లేదు? ఈ త్యాగాలకి హర్షించి భగవంతుడు ఊర్ధ్వ లోకాలు కటాక్షిస్తాడనీ, ఇంకో జన్మలో సౌఖ్యాలు ఏర్పాటు చేస్తాడనీ, ఆమెనే ప్రియురాల్ని చేస్తాడనీ, కరుణించి ఆ వ్యక్తినే ముసలితనములో ప్రసాదిస్తాడనీ ఎంతమంది, ఎన్ని మతాలవారు, ఎన్ని విధాల నమ్మటం లేదు! ముఖ్యంగా కర్మలో నమ్మే యీ దేశస్థులకి ప్రతి పనికీ ప్రతిఫలం యెదురుచూడడం అలవాటయిపోయింది. ప్రతిఫలం ఆ త్యాగంలో తప్ప ఇంక లేదనే నమ్మితే యిన్ని దొంగ ధర్మాలూ, కపటపు నీతి వర్తనలూ, వుండవు కాని ఏ భవిష్యత్తులోనూ నమ్మకం లేని నాబోటి వాళ్ళకు ఒక idea కోసం ఆదర్శం కోసం శరీర సుఖాన్ని - అందులో ప్రేమానందాన్ని త్యాగం చెయ్యడం దుష్కరమౌతుంది. ఎవర్ని ప్రేమిస్తున్నామో వారి క్షేమానికయితేనే గాని ఏ త్యాగమూ అర్ధవిహీనంగా కనపడుతుంది. కాని ఆమె క్షేమం కోసం మాత్రం నేనెందుకు త్యాగం చెయ్యాలి, ఆ త్యాగం వల్ల ఆమె నా చేతులోనించి జారిపోయేటప్పుడు? అయినా నా త్యాగం ఆమెకి క్షేమమని నమ్మకమేమిటి? ఆమె నా త్యాగానికి feel అవుతుందా, నన్ను admire చేస్తుందా?
    హృదయ తృప్తితప్ప సమాధానం లేదు. అంటే ... అంతరాత్మా! మతాలు బోధించే అంతరాత్మా!
    అంతరాత్మ అనేది వుందా? వుంటే అందరికీ ఒకే విధమైన అంతరాత్మా! మరి దేశకాల పరిస్థితులతో మారుతుందేం?
    చి__ని నేను కలుసుకోవాలని ప్రతి నిమిషం హృదయం దహిస్తుంది. కాని కలుసుకుంటే! తరవాత! ఆ పునస్సమాగమంలో నించి జనించిన అగ్ని ఎన్ని జీవనాల అగ్ని ఎన్ని జీవనాల ఆనందాన్ని ఆహుతి తీసుకుంటుంది?
    __న్నా! ఏం లాభం లేదు. మనిద్దరం ఇట్లా పరితపించి మళ్లీ కలుసుకుంటే మాత్రం యీ వేదన అంతమౌతుందా? ఎంతో దగ్గిరగా మనం కావిలించుకున్నా, ఎంత కాలం ఒకర్ని ఒకరం విడవకుండా కళ్ళలోకి చూసుకున్నా మనకీ హృదయ తాపం తీరుతుందా? తనివితీరా ముద్దు పెట్టుకోడం అని వ్రాస్తారుగాని నిజంగా ముద్దులతోగాని, ఇంకా దేహ ఐక్యంవల్లగాని తనివితీరే ప్రేమ చాలా అల్పం. ఆ మనుషులు చాలా అల్పులు, నన్ను నీకూ, నిన్ను నాకూ ఇంత ఆకర్షకంగా చేసి అగ్ని త్యాగాలకు పురికొల్పే యీ శక్తి ప్రత్యేకమయిన మన హృదయ దాహం కాదు. మన ఆత్మ ఔన్నత్యమే ఇట్లా వేరుపరిచింది మనని నిరంతరం అగ్నితో కాలుస్తోంది.
    "ఇంత పరాకా..." అని విన్నప్పుడల్లా, నిన్ను మరిచానని, ఆపాట పాడుతున్నవేమోనని వులికిపడి, నీ తేపిలో తడిసిన పదాలూ, పెదవులూ, చీకట్లో నీ చూపులు, తివాసీ, అన్నిటి జ్ఞాపకాలతోనూ పరాకులో పడతాను. "ఇంత పరాకా_" నాకు కాకుండా చేశావు నువ్వు పాడి.
    "ఈనాడు నన్నిట్లా పూజిస్తున్నావు సరే. ఇదివరకెందర్ని పూజించలేదు నువ్వు?" అన్నావు.
    "నీకెట్లా తెలుసు?"
    "నీ కథలు; నీ లేఖలు..."
    "కాని నీమీది వాంఛ వేరు."
    "నమ్మాననుకో. ఇకముందు? నాకన్న నువ్వు వాంఛించే వ్యక్తే ముందు ఎప్పుడో ప్రత్యక్షమయితే..."
    "కాదు."

Next Page