Read more!
Next Page 
పావని పేజి 1

                                 


                          పావని

                                                   దాశరధి రంగాచార్య

                 

    పొద్దు పొటమరించింది.
    మల్లమ్మ - శివయ్య వాకిట్లో కళ్ళాపి జల్లింది. వాకిలి సాంతం పచ్చగా - పచ్చిగా ఉంది. మల్లమ్మ ముగ్గుబుట్ట అందుకుంది. ముగ్గులు దిద్దింది. పచ్చని వాకిట్లో తెల్లని ముగ్గు ముచ్చటగా ఉంది. మల్లమ్మ ముగ్గు ముగించి తలెత్తింది. నర్సిమ్మ కనిపించాడు.
    బుర్ర మీసాలూ, తలపాగా, చేతిలో బల్లెం, కళ్ళలో నిషా - నర్సిమ్మ భయంకరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. అతడు తొడుక్కున్నది శివయ్య విడిచి పారేసిన చొక్కా. వదులుగా ఉంది. అతనికంటే పొడుగ్గా ఉంది. అక్కడక్కడా  మాసికలున్నాయి. అందులోనే ధీమా వలకబోస్తాడు నర్సిమ్మ.
    మల్లమ్మ నర్సిమ్మను చూసింది. ముగ్గుబుట్టతో వెనక్కు మళ్ళింది - దొడ్లోకి వెళ్ళడానికి.
    "ఒసే పోరీ! మారుమనుం కట్టుకోరాదే_ వయసు నీ దగ్గరనే కాపురం ఉంటదనుకుంటున్నావా? ఇగ పరమిగా డొస్తడా? చస్తడా?" నర్సిమ్మకు మల్లమ్మను చూడగానే ఏదో ఒకటి అనాలనిపిస్తుంది.
    "అన్నా! నీ కాల్మొక్త అట్టనకే. వస్తడే రాక యాడికిపోతడే" 'అన్నా' అనే వరుసను ఆశ్రయించింది. అదేదో కవచంలా కాపాడుతుందని ఆమె నమ్మకం.
    "గట్లనే అనుకుంటుండవే అట్లనేలేగని జర ఇంగలం ఇయ్యి చుట్టకాల్చుకుంట" నర్సిమ్మ దగ్గర అగ్గిపెట్టె ఉంది అయినా, మల్లమ్మను నిప్పు అడిగాడు. ఆమెను మరోసారి చూడొచ్చని అతని ఆరాటం.
    మల్లమ్మ పిడకమీద కణికవేసి తెచ్చిచ్చింది. నర్సిమ్మ చుట్ట కాల్చుకోలేదు. వెళ్ళిపోయే మల్లమ్మను చూస్తున్నాడు. ఆమె నడకలో వయ్యారం ఉంది, వయసు పోకడలున్నాయి.
    "దొర ఇంకలేవలేదే?" బ్రహ్మయ్య మాట విని నర్సిమ్మ ఈ లోకంలోకి వచ్చాడు.
    "లేవలే వస్తడు కూకో" అన్నాడు నర్సిమ్మ.
    "బమ్మయ్యన్నా! కల్నీల్లకు పైసలిస్తనని ఎగ్గొడ్తాన్నావులే. యాది ఉంచుకుంట ఏమనుకుంటున్నవో" - బెదిరించాడు.
    "ఇస్తలే నర్సిమ్మా! ఇంట్ల ఆడడానికి బాగాలేదు. జర బాగుకానియ్యి" - బ్రహ్మయ్య బతిమిలాడాడు.
    "ఇచ్చినట్లే ఉన్నదిలే చూస్కోక పోతనా?" అని చుట్ట వెలిగించాడు.
    ఇంతలో కుమ్మరి కొమరయ్య, కమ్మరి బాలయ్య, మంగలి మల్లయ్యా ఒకరి తరవాత ఒకరు చేరుకున్నారు. ఆ ఊళ్ళో అందరి పొద్దూ శివయ్య ఇంట్లో పొడవాల్సిందే. అక్కణ్ణించే వారు తమ పనులకు వెళ్ళాలి. అందరూ శివయ్య రాక కోసం పడిగాపులు కాస్తున్నారు.
    శివయ్య సిగరెట్టు పొగ వదులుతూ గడప దాటాడు. అక్కడ కూర్చున్న వారంతా చేతులు నేలకానించి దండాలు పెట్టారు. శివయ్య ప్రతి నమసారం చేయడు. అక్కడున్న వాలు కుర్చీలో కూర్చున్నాడు. వాకిట్లో వాళ్ళంతా నేలమీద కూలబడ్డారు. నర్సిమ్మ చుట్టపారేసి నిటారుగా నుంచున్నాడు.
    శివయ్య పక్కకు చూచాడు. అక్కడ చాప కాళీగా ఉంది. చాపమీద డస్క్ ఉంది. డస్క్ పక్క చిన్న బీరువా ఉంది. దానికి తాళం ఉంది.
    "పంతులింక రాలే" - శివయ్య ఎవరిని అడుగుతున్నాడో తెలియకుండా అడిగాడు. నర్సిమ్మ ఉలిక్కిపడ్డాడు "ఇప్పుడే వస్తిదొరా! పట్టుకొస్త, పిలిచొస్త" అని బల్లెం పట్టుకొని ఉరికాడు.
    "పెండ్లాం లేకుంటేనే పొద్దెక్కేదాక లేవడు. ఇగ పెండ్లాముంటే పొద్దుకూకేదాక పండెటట్లున్నాడు పంతులు!" ఏదో చమత్కరించినట్లు అందరినీ చూచాడు శివయ్య. ఎవ్వరూ నవ్వినట్లు కనిపించలేదు.
    "పంతులుకు పెండ్లయిందట కాదుండి?" బ్రహ్మయ్య తనకేదో అర్థం కానట్లు అన్నాడు.
    "అయింది లేవయ్యా! పంతులుకు మనమీద నమ్మకం లేదు. పెండ్లాన్ని ఈ ఊరికి తేడు. బస్తీ పిల్ల వయసులో ఉంటది, అక్కడ"
    "నమస్కారం శివయ్యగారూ! వస్తునే ఉన్న, నర్సిమ్మ ఎదురయిండు రాత్రి సాంతం నిద్రపట్టలే_నల్లులు" అన్నాడు కృష్ణారావు.
    అందరూ గొల్లున నవ్వారు. కృష్ణారావుకు సందర్భం అర్థం కాలేదు. వెలవెలపోయాడు. మెట్లమీద చెప్పులు విడిచి, వెళ్ళి చాపమీద కూర్చున్నాడు. బీరువా తాళం తీసి ఖాతా పుస్తకాలు డస్కు పక్కన పెట్టాడు. శివయ్య వైపు చూచాడు.
    "కానియ్యవయ్యా పని - వచ్చుడే ఆలస్యం - పైనుంచి నసుగుడు" శివయ్య విసుక్కున్నాడు.
    "ఎవరి లెక్క చూడమంటారు?"
    "నా లెక్క చూడండి, మా ఇంట్ల బాగలేదు పోవాలె" బ్రహ్మయ్య బ్రతిమాలుతున్నట్లు అన్నాడు.
    "వడ్ల బ్రహ్మయ్య ఖాతా - పనిముట్లు కొనడం వగైరాలకు తీసుకున్న అప్పు, అందుకు అయిన వడ్డీ మొత్తం ఒక వేయి నాలుగు నూర్ల పదిహేను రూపాయల ఇరవై ఆరు పైసలు. ఇందు యెంజమ్లే నిన్న జమకట్టినవి. ఆరు రూపాయలు మళ్ళీ అప్పుగా తీసుకున్నవి. అయిదు రూపాయలు సారాయి దుకాణానికి చీటీ రాసి ఇచ్చినవి. రెండు రూపాయలు మొత్తం మీద చెల్లుపడలేదు, ఖాతాలో ఒక్కరూపాయి పెరిగింది, దాని వడ్డీ చేర్చలేదు"
    "రామ రామ, నేను సారా తాగినానండి? తాగని సార లెక్కలోకి ఎక్కించినారండి?" బ్రహ్మయ్యకు ఏడుపు ముఖం పడింది. ఎముకలు మసి చేసుకొని రోజంతా సంపాదించి తెచ్చి జమ కట్టేస్తే రూపాయి జమకాకపోగా ఖర్చు యేదో రూపాయి రాశాడు. అదీ అతని బాధ.
    బ్రహ్మయ్య పనిముట్లకని శివయ్య దగ్గర కొంత పైకం తీసుకున్నాడు. దాంతో అతడు శివయ్య దగ్గర తాకట్టు పడిపోయాడు. అసలు డబ్బు హనుమంతుని తోకలాంటి వడ్డీతో అంత అయింది. పనిముట్లు రోజూ సాయంకాలం శివయ్యకు అప్పగించాలి. చేసిన కష్టం తెల్లవారి శివయ్యకు అప్పగించాలి. దిన వత్తానికి అప్పు తీసుకుకోవాలి. అప్పుడు గాని శివయ్య మళ్ళీ పనిముట్లు ఇవ్వడు. ఇదొక విషచక్రం. ఇదిలా తిరుగుతూనే ఉంటుంది. బాకీ పెరుగుతూనే ఉంటుంది. శివయ్య రుణం ఈ జన్మలో తీర్చలేడు బ్రహ్మయ్య.
    "బ్రహ్మయ్యా! సారా దుకాణం నేనే గుత్తపట్టిన, మన ఊరి పైకం మందికి పోవుడెందుకని, ఇన్నవా? మల్ల మీ అసుటోండ్లు తాగకుంటే సర్కారు పైకం ఎట్ల ఎళ్ళుతది?" గ్రామాన్ని స్వయం సమృద్ధం చేసే దీక్ష వహించినట్లు మాట్లాడాడు శివయ్య.
    "బ్రహ్మయ్య అనేది అది కాద్దొర! లెక్కల రాసుకుంటిరి. చీటీ రాసియ్యక పోతిరి, అట్ల ఇస్తే ఇంత నోట్ల పోసుకోక పోయిన్నా అంటాడు" కమ్మరి బాలయ్య కదిలించాడు, తుపుక్కున ముందు ఊసుకొని కాలితో దాన్ని రాస్తూ.
    "వరే బాలిగా! మాటలు మంచిగ రానియ్యి - ఎన్నడన్న చూచినావుర తాగంగ?" తాగితే ఏవో జంధ్యాలు తెగిపోతాయన్నట్లు జంధ్యాన్ని గట్టిగా పట్టుకుని అన్నాడు బ్రహ్మయ్య.
    "బ్రహ్మయ్య అందరు చూడంగ తాగడండి" మంగలి మల్లయ్య అంటించాడు, జంధ్యం ఉన్నవారు అందరూ చూడగా తాగరనే అర్థంతో.
    అంతా గొల్లున నవ్వారు. బ్రహ్మయ్య వెలవెలపోయాడు. శివయ్య నవ్వుతూ "బ్రహ్మయ్యా! తాగని దానికి నీకెందుకయ్యా కోపం?" అన్నాడు.
    "దొరవారూ! మేం విశ్వబ్రాహ్మలం కావాల్నంటే చూడండి" అని జంధ్యం తీసి చూపించాడు.
    మళ్ళీ అందరికీ నవ్వు వచ్చింది. కానీ ఎవరూ నవ్వలేదు. "ఇయ్యాల్రేపు బ్రాహ్మణులు కూడా తాగుతున్నారు. సర్లేగాని, పైకమెంత తెచ్చినవో చెప్పు, సార సుంకం తప్పెడిది లేదు, నువ్వు తాగు తాగకపో - ఇన్నవా?" చివరి వాక్యాలు కరకుగా అన్నాడు శివయ్య.
    బ్రహ్మయ్య విశ్వబ్రాహ్మణ లోకం నుంచి అసలు లోకంలోకి వచ్చాడు. సారాయి సుంకం తప్పదని గ్రహించాడు. జేబులోంచి నోట్లు తీసి జాగ్రత్తగా లెక్కపెట్టాడు. అయిదున్నాయి - అవి చెమటతో తడిసి ఉన్నాయి. గట్టిగా పట్టుకున్నాడు- వదులుకోదలచనట్లు.
    "అట్ల చూస్తవేం, జమకట్టు" నర్సిమ్మ హుంకరించాడు.
    "పైకం కావల్నుండి. ఆడదానికి రోగం లేస్తలేదు" బ్రహ్మయ్యకు దుఃఖం దుముకుతుంది. భుజాన ఉన్న జంధ్యం అక్కరకు రాలేదు. శివయ్య అనుగ్రహం కావాలతనికి. అప్పులిచ్చేవారి మెప్పు కోసం మహా మహా దేశాలే మోకరిల్లుతున్నాయి!

Next Page