Read more!
Next Page 
శరతల్పం పేజి 1

                                 


                                   శరతల్పం

                                                                    దాశరథి రంగాచార్య

                             


    వాన! ముసురు!! ఈదురుగాలి!!!
    వారం రోజులుగా మనుషులు, పశువులే కాదు సూర్యుడు కూడా బయటికి రాలేదు. పశువులు కొట్టాల్లో, మనుషులు ఇళ్ళల్లో, పక్షులు చెట్లమీదా వణుకుతున్నాయి. మేకలు. గొర్రెలు వణికి చస్తున్నాయి. ఉరుములు, మెరుపులు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు గుడిసెల వాళ్ళు.
    ప్రళయం వచ్చినట్లుగా ఉంది. లోకాల్ను ముంచేసేట్లుంది.
    ఊరూ నాడూ జలమయం అయినాయి.
    వారం తరువాత ఇవ్వాళే వాన వెలిసింది. పంజరం నుంచి బయటపడ్డ పక్షులా జనం, జంతువులు ఇళ్ళల్లోంచి బయటపడ్డాయి. ఇన్నాళ్ళనుంచీ ఊపిరి బిగబట్టి మళ్ళీ ఇవ్వాళే ఊపిరి పీల్చుకున్నట్లుంది ఊరు.
    ఏటి ఒడ్డుకు చేరుకున్నారు నారాయణస్వామి. ఏరు పొంగి పారుతూంది. చూస్తూ నుంచున్నారు. గట్లను ముంచి పారుతూంది నది. హోరు ధ్వని చేస్తూ సాగిపోతూంది. ఎర్రటి నీరు ఎగిసి పడుతూంది. అలలు ఊగుతున్నాయి. కర్రా, కంపా కాదు పశువులను కూడా లాక్కొనిపోతూంది.
    విలయతాండవం చేస్తూంది నది.
    చూస్తున్నారు నారాయణస్వామి. ఆకాశానికి చేతులు జోడించి "ప్రభూ! ఎందుకీ ప్రళయం తెస్తున్నావు? పాపం కూటికి లేని జనం గూళ్ళలో మ్రగ్గుతున్నారు. కరుణించు ప్రభూ! కోపం చాలించు" అని ప్రార్థించారు.
    నది హోరుమంది.
    అది వేగం పెంచుకుంటూ నురగలు కక్కుతూంది.
    నది ఆవలి ఒడ్డున కొట్టుకొని పోతున్న ఒక దుంగ కనిపించింది నారాయణ స్వామికి. అది తరంగాల మీద ఊయలలో వలె ఊగి వచ్చేస్తూంది. అది ఏటి మధ్యకు వచ్చింది. మరో దుంగ ఎక్కణ్ణుంచి వచ్చిందో దాని కొనకు తాకింది. రెండు దుంగల కొనలు తాకి కొంత దూరం సాగాయి. తరువాత రెండూ కలిసిపోయాయి. జంటగా సాగాయి. తరువాత విడిపోయాయి.
    ఆ దుంగల విషయంలో ఆసక్తి ఏర్పడింది నారాయణస్వామికి. ఏటి ఒడ్డున కొంతదూరం నడిచారు. మొదటి దుంగ కనిపించలేదు. రెండవది మునుగుతూ తేలుతూ సాగిపోతూంది.
    ఆగిపోయారు నారాయణస్వామి. "ఏం బోధించదలచావు ప్రభూ! మనుషులూ ఇంతేనా! ఎక్కణ్ణుంచో వచ్చి, ఎక్కడో కలుసుకొని విడిపోతారనా! లేక నాకే ఏమైనా చెప్పదలచావా ప్రభూ! గురవయ్యకు ఆయుర్దాయం ప్రసాదించు. నన్ను వేరుచేయకు" అన్నారు. వారికి తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. పై పంచెతో కళ్ళు తుడుచుకొని ఆకాశాన్ని చూశారు.
    ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి.
    మందలు మందలుగా మబ్బులు ఆకాశంలో పురివిప్పుకొని సాగిపోతున్నాయి. నాలుగు చినుకులు కూడా రాలేయి.
    అప్పుడు గాని అర్థంకాలేదు నారాయణస్వామికి. తాము వచ్చి చాలా సేపైందని! రేవు వైపు నడక సాగించారు. రేవుకు చేరింతరువాతగాని తాము నదీతీరాన చాలాదూరం సాగామని తెలియలేదు. వెంటనే పైపంచె నడుముకు కట్టుకొని వంగి నది నీటిని తాకి, సంధ్యావందనం సాగించారు.
    మబ్బులు బాగా కమ్ముకున్నాయి. మసక చీకటి పడుతూంది.
    నారాయణస్వామి సంధ్య ముగించారు. కళ్ళు మూసుకొని, చేతులు జోడించి ధ్యానంలో నిమగ్నులైనారు.
    పెద్ద ఉరుము! ఎక్కడో పిడుగు పడ్డట్లుంది!
    నారాయణస్వామి ధ్యానం చెదిరిపోయింది.
    వారు తటాలున ఆకాశాన్ని చూచారు.
    ఆకాశమంత మెరుపు మెరిసింది. ఆ మెరుపులో వారికి మర్రిచెట్టు కనిపించింది. మర్రిచెట్టులోంచి తాటిచెట్టు పెరిగింది. తాటిచెట్టుకు అల్లుకొని పాకుతున్న తీగ కనిపించింది.
    అదంతా లిప్తలో జరిగింది.
    అయినా ఎందుకో చెరగని ముద్ర వేసిందా దృశ్యం నారాయణస్వామి మనసు మీద.
    మెరుపు మాయం అయింది. మసకచీకటి ఏర్పడింది.
    అయినా ఆ చెట్టునే చూస్తూ నుంచున్నారు నారాయణస్వామి.
    ఆ తాడిచెట్టును ఎలా బంధించింది ఆ మర్రి!
    ఎక్కణ్ణుంచి వచ్చిందా తీగ!
    ఎలా అందుకుంది! ఎంతగా అల్లుకుంది!
    "ఏం బంధం ప్రభూ ఇది! బంధంలో ఆనందం సృష్టించావా! దుఃఖమా!! ఎంత విచిత్రమైంది నీ సృష్టి! ఎవడికి అర్థం అవుతుంది? ఎవనికి కాగలదు! ఎందుకీ దృశ్యం చూపావు నాకు! ఆశ చిగురించు కొమ్మంటున్నావా?"
    దబదబా చినుకులు రాలేయి.మళ్ళీ యీ లోకంలోకి వచ్చారు నారాయణస్వామి. పెద్దపెద్ద అంగలు వేస్తూ ఊరివైపు సాగిపోయారు.
    వాన పెద్దదయింది. తడిసిపోయారు నారాయణస్వామి.
    దారి వదిలి పొలాల గట్లమీంచి సాగిపోతున్నారు. వాన దెబ్బకు పొలాలు తలలు వంచాయి. వరిచేలు తలలు ఎత్తలేక పోతున్నాయి.
    స్వామి బాగా తడిసిపోయారు. తలమీంచి నీరు ధారాపాతంగా కారుతుండగా ఇంటికి చేరారు.
    నాంచారమ్మ వాకిట్లో స్వామికోసం ఎదురుచూస్తూ నుంచుంది_ గూట్లో ప్రమిద వుంచి.
    స్వామి వాకిట్లో అడుగు పెట్టగానే "ఉత్తరం వచ్చింది_గురువయ్య దగ్గర నుంచి కాదుకదా_చూడండి" అని అందించింది. స్వామి తడిసి ఉన్నారనేది ఆమె గమనించలేదు.బయట పడుతున్న కుండపోత వాన ఆమెకు కనిపించలేదు. ఉత్తరం వచ్చినప్పణ్ణుంచి ఆమె ముళ్ళమీద వుంది. వచ్చిన ఉత్తరం గురవయ్య నుంచేనని ఆమె మానసు చెపుతూంది. మనసేమో ఏదో కీడు శంకించింది. అలా కాకూడదని భగవంతునికి మొక్కింది మనసులో ప్రార్థించింది. కాలు కాలిన పిల్లిలా ఇంట్లోకీ బయటికీ తిరిగింది. వేళ కాకముందే గూట్లో దీపం పెట్టింది. కళ్ళల్లో వత్తులేసుకొని వాకిట్లో స్వామికోసం ఎదురుచూస్తూ నుంచుంది. అందుకే స్వామి తడిసింది కాని, బయట కుండపోత వానగాని ఆమె గమనించలేదు!
    ఉత్తరం అందుకున్న స్వామికీ తాము తడిసి ఉన్నామని తెలిసి రాలేదు. "తే_తొందరగా లాంతరు తే" అని కవరు చించి ఉత్తరం మడత విప్పి బల్లపీట మీద కూర్చున్నారు.
    క్షణంలో సగంలో లాంతరు తెచ్చి బల్లపీటమీద పెట్టి కాంతి పెంచింది నాంచారమ్మ_పక్కనే నుంచుంది ఉత్తరంలో విషయం వినాలని ఆదుర్దాతో.
    స్వామి మౌనంగా ఉత్తరం చదువుతున్నారు. లాంతరు కాంతి వారి ముఖం మీద పడుతూంది. ముఖంలో రంగులు మారడాన్ని నాంచారమ్మ గమనిస్తూంది.
    "ఏమండీ! ఎక్కడినుంచి ఉత్తరం?" ఆమె ధ్వనిలో ఆవేశం, ఆవేదన ఉన్నాయి. గొంతు జీర పోయింది.
    స్వామి ఉత్తరాన్ని మడిచి పక్కన పెట్టాడు. ముఖం పైకి ఎత్తకుండానే "గురువయ్య దగ్గరినుంచే. డాక్టరు రాసిండు" వారి కళ్ళు చెమ్మగిల్లాయనే విషయం గమనించింది నాంచారమ్మ.
    నాంచారమ్మ కళ్ళవెంట నీరు జాలువారింది. "చెప్పండి! ఏమైంది? గురువయ్య బాగున్నాడా? చెప్పండి బాగున్నాడని" స్వామిని భుజాలు పట్టుకొని ఊపి అడిగింది.

Next Page