Read more!
Next Page 
అమ్మా... నన్ను క్షమించొద్దు పేజి 1

                                 


                         అమ్మా... నన్ను క్షమించొద్దు
                                                                                     (కథాసంపుటి)    


                                                         __ డా|| సి.భవానీదేవి

 

                                    

    కథాక్రమం:    1.నాకీ బొమ్మ చాలు 2.అనురాగస్మృతి 3.అమ్మా! నన్ను క్షమించొద్దు 4. వెలుగులోకి 5.ఆమె విముక్తి 6.ముద్దబంతిపూవులో 7.నడక 8.ఇనుపతెర 9.గోపురం 10.నవరాగం 11.నాణానికి మరోవైపు 12.యావజ్జీవితం 13.తెల్లమబ్బు 14.వినిమయం 15.కొండచిలువ 16.ప్రతీకారం 17.స్నేహం ఖరీదు
18.'సహ'గమనం

                                                   నాకీ బొమ్మ చాలు!


    

తూర్పు దిక్కు బద్దలైపోయి రెండు గంటలవుతోంది. రామకృష్ణ 'గీతా మందిరం' దాకా వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు నీరసంగా!
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఓసారి అంతా కలియచూశాడు. ఎక్కడా చడీచప్పుడూ లేదు. కొడుకు, కోడలు ఇంకా మేడ మీంచి దిగినట్లు లేరు. గడియారం ఏడున్నర చూపిస్తోంది. నాలుక కాఫీ కోసం పీకేస్తోంది. కానీ తాను స్వయంగా కాఫీ తయారుచేసుకుంటే కోడలు ప్రమీల సృస్టించే సీన్ గుర్తొచ్చింది.
"ఏం? కోడలు కాఫీ కూడా చేసివ్వదని ప్రచారం చేయాలనుకున్నారా! నేనుండగా మీరు వంటింట్లోకి వస్తే నేను చచ్చినట్లే కదా!" గట్టిగట్టిగా చేతులు ఊపుతూ అరిచింది. ఆ దృశ్యం గుర్తొచ్చి ఒక్కసారి ఉలిక్కిపడి ఆ ఆలోచనను విరమించుకున్నాడు.
అసలు సీత పోయాక వంటింటి ఛాయలకే పోవడం తగ్గిపోయింది. సీత ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా తానే తయారుచేసి ఇచ్చేవాడు. అప్పట్లో వాకింగ్ కూడా అంతగా అలవాటు లేదు. ఎనిమిది గంటలకు సీత పదిసార్లు లేపితేనే లేవడం.
సీతతో కలిసి జీవితం పంచుకున్న ఆ రోజులు రామకృష్ణ మనఃఫలకం మీంచి చెరిగిపోకుండా ఇంకా తాజాగా ఉన్నాయి. ఇంకా నిన్న మొన్న జరిగినట్లుగా ఉన్నాయి.
కొన్ని దృశ్యాలంతే!
మనిషి మర్చిపోవాలన్నా వీలు కాదు.
గోడ మీది ఫోటోలో సీత చిరునవ్వు చిందిస్తోంది!
"నన్ను గుర్తు చేసుకుంటున్నారు కదూ!" అంటున్నట్లుంది. మనసంతా చేదుగా ఉంది.
మనిషి పోతేనే గానీ జ్ఞాపకాలు ముద్ర పడవు.
"పోయినోళ్లు అందరూ మంచోళ్లు!
ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు."
ఎక్కడి నుంచో ఆత్రేయ పాట గుండె తలుపు తీసుకుని ప్రేమగా జొరబడుతోంది.
ఎనిమిదవుతుండగా ప్రమీల మేడ దిగి వంటింట్లోకి వచ్చింది. ఆమె ఇచ్చిన కాఫీ తాగి స్తబ్దుగా తన గదిలోకి వెళ్లాడు రామకృష్ణ.
"మీ నాన్నగార్కి కూరలు తెమ్మని నిన్ననగా చెప్పాను. నా మాటలు వినిపిస్తేగా" ప్రమీల వెనుక నుంచీ మూతి మూడు వంకరలు తిప్పడం తెలుస్తోంది. కొడుకు వాసు ఏమీ మాట్లాడకపోవడం మామూలైపోయింది. మనసంతా శూన్యమంత నిస్సహాయంగా ఉంది.
                                                      * * *
వాసుకు తగిన భార్య కోసం ఎన్ని సంబంధాలు చూసింది సీత! చివరికి వాడి ఇష్టానుసారమే ప్రమీలను చేశారు.
"మాకు కోడలు కాదు. కూతురు కావాలి" అని ఆశపడ్డారు.
అటువంటిది ప్రమీల ప్రవర్తన చూడకుండా త్వరగా దాటిపోయిన సీత నిజంగా అదృష్టవంతురాలు!
"అంతసేపు గదిలో కూర్చుని ఏం చేస్తారో ఏమో!" బిగ్గరగా అరుస్తోంది కోడలు.
వాసు గుమ్మం దాకా వచ్చి అసహనంగా అన్నాడు.
"నేను మళ్ళీ ఆఫీసుకు వెళ్లాలని తెలుసు కదా! త్వరగా వెళ్లి కూరలు పట్రండి."
ఆజ్ఞాపించిన కొడుక్కి కోపంగా జవాబు చెప్పాలనిపిస్తోంది. కోపాన్ని బాగా అణుచుకోవడం అసలు చిన్నప్పటి నుంచీ అలవాటు అయిపోయింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కింది వారికీ, పైవారికీ కూడా కోపంగా బదులుఇచ్చి ఎరగడు.
గదిలోంచి బైటకు వచ్చి కొడుక్కేసి పరీక్షగా చూస్తూ శాంతస్వరంతో.
"చెప్తే ఎందుకు తేను. అయినా నేనేం తెచ్చినా కోడలికి నచ్చదు" అన్నాడు.
"మీరు తెచ్చేవి పుచ్చినవీ, కుళ్లినవీ అయితే నాకెలా నచ్చుతాయి" పదునుగా అంది ప్రమీల.
"ఎవరైనా తెస్తే నచ్చనప్పుడు, ఎవరికి కావలసినవి వారే తెచ్చుకోడం మంచిది కదమ్మా" మెల్లగానే అన్నా ఆ మాటలు చురుగ్గా తగిలాయి.
"ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తారు. చిన్న చిన్న పనులు చేస్తే తప్పా!"
"వాదాలు ఆపండిక" వాసు కసిరాడు.
మౌనంగా సంచి తీసుకుని బయలుదేరాడు రామకృష్ణ.
రౌతు కొద్దీ గుర్రం. సీత ఇలా తన వెనకేనాడూ సంచి ఇచ్చి బజారుకి పంపలేదు. తనకేం తినాలని ఉందో కనుక్కొని తెప్పించి వండి వడ్డించేది. ఆమె ఎలా తెప్పించేదో కూడా తెలీదు తనకి. కొత్త కొత్త వంటకాలు రుచికరంగా చేసి పెట్టేది. కొసరి కొసరి వడ్డించేది. ఏదైనా తినాలని ఉంది అని అడిగితే వెంటనే సంతోషంగా చేసిపెట్టేది. తను రిటైర్ కావడం, వాసు పెళ్లి... సీత పోవడం...ఏమిటో! ప్చ్... రిటైరు అయితే వచ్చిన డబ్బుతో వాసుకి స్కూటరు, ఒక చిన్న ఇల్లు కొన్నాడు. సొంత ఇల్లు కోరిక తీరకుండానే సీత దాటిపోయింది. ఇంక మిగిలింది పెన్షన్. అదీ ఇలానే ఏదో ఒక వంకతో ప్రమీల ఖర్చు చేయిస్తూనే ఉంది. ఎన్నాళ్లనుంచో మిగిలిన చిన్నచిన్న కోరికలు కూడా తీరని జీవితం. కారు హారన్ తో ఈ లోకంలోకి వచ్చాడు రామకృష్ణ.

                                                     * * *

Next Page