హువే విష్ణుం పూషాణం బ్రాహ్మణ స్పతిం భగం నుశంసం సవితారమూతయే
ఈ దేవతలందరను రక్షణ కొరకు ఆహ్వానించుచున్నాను.
50. శస్త్రసంశకర్త, స్తుతికర్త, హవిసమర్పించువానిని, మమ్ము ధానాదులనిచ్చు రుద్రుడు - పర్వతములు వృత్రహంత ఇంద్రుడు నేతగాగల సమస్త దేవతలు దుఃఖము నుంచి కాపాడవలెను.
51. యజనీయ దేవతలారా! మీరందరు నేడు మాకు అనుకూలురు కండి. నేను భయభీతుడనై హృదయమునందున్న వనసును మీవైపు పంపుచున్నాను. మమ్ము హింసక వృకము నుండి రక్షించండి. కించ పరచువారినుండి రక్షించండి.
52. నేడు అందరు మరుత్తులు, అగ్నులు మాకు రక్షకులు అగుదురు గాథ. అన్నసహితులైన విశ్వేదేవతలు మమ్ము చేరుదురు గాత. సకల బలములు, ధనములు మాకు లభించును గాత.
53. విశ్వేదేవతలారా! అంతరిక్షమున ఉన్నవారును, ద్యులోకమున ఉన్నవారును, అగ్నిజిహ్వల వారును, ఇతర యజనీయ దేవతలును నా ఆహ్వానమును విందురు గావుత.
యజనీయులారా! మీరందరు దర్భాసనముల మీద ఆసీనులు కండి .సోమ పానమున ఉన్మత్తులు కండి.
54. సవితృదేవా! యజనీయ దేవతలందు సర్వప్రథమముగా అమృతమాయ ఉన్నత భాగమును అగ్నికి అందింతువు. తదుపరి అనుకూలగమన కారణిలును, జీవన ప్రదలగు రశ్ములను ప్రకటించుచున్నావు.
"సమాప్తం సర్వమేధికం కర్మ"
55. వాయువు మహాధని. సర్వవరణీయుడు. రథధనాదులు నింపువాడు. వెలుగుబాటల వాడు. నియుతాశ్వములపై సంచరించువాడు. విద్వాంసుడు.
యజనశీల అధ్వర్యులారా! మీ మహాబుద్ధి వలన వాయువునాకు సమ్ముఖులు కండి. స్తుతించండి.
56. ఇంద్ర వాయువులారా! ఈ సోమరసములు మీ ఉభయుల కొరకు అభిషుతములైనవి. ఈ సోమాన్నముల కొరకు మీరు ఈ యజ్ఞమునకు విచ్చేయండి.
సోమరసమా! నేను నిన్ను ఉపయామ పాత్రమున - వాయువు మరియు ఇంద్ర వాయువుల కొరకు గ్రహించుచున్నాను. ఇది నీస్థానమగును. ఇంద్రవాయువుల కొరకుగాను నిన్ను ఇచట స్థాపించుచున్నాను.
57. పవిత్ర జలమును - మిత్రుని - పాపనాశక వరుణుని ఆహ్వానించుచున్నాను. వారిద్దరు మాబుద్ధియందు యజ్ఞమునకు ప్రేరణ కలిగింతురు గాత.
58. దర్శనీయ నాసత్య అశ్వినులారా! మీరుకోరునట్టి సోమరసము అభిషుతమై సిద్ధముగా ఉన్నది. రుద్రమార్గమున సంచరించు అశ్వినులారా! యజ్ఞమునకు విచ్చేయండి.
(అశ్వినులు వైద్యదేవతలు. వారు నాసత్యులు - "న అసత్యే సత్యావేవ" వారు అబద్ధమాడరు. నిజము మాత్రమేచ చెప్పుదురు. వైద్యుడు అబద్ధమాడరాదు. నాసత్యుడు కావలెను. రోగికి ఉన్నది ఉన్నట్లు వివరించవలెను.)
59. సరమ పర్వత ఛిద్రమును కనుగొన్నది. తన పిల్లల కొరకు సరమ - అపూర్వము, పథ్యము నగు పాలు నేరుగా అడిగినది. చక్కని పాదముల సరమ దేవతలను ముందుకు తీసికొని వెళ్లినది. ఆవుల అంబారావములు విని ముందునడచినది.
(పణులు గోవులను అపహరించి కొండ గుహలందు దాచినారు. ఇంద్రుడు వానిని వెదకుటకు దేవశునకమగు సరమను తీసికొని సాగినాడు. పణుల - గోవుల కథ వేదములందు పలుమారులు వచ్చును. ఇంద్రుడు సాధించిన మహాకార్యములందు గోవులను విడిపించుట ఒకటి. కుక్కలను అన్వేషణమునకు ఉపయోగించుట వేదకాలము నుంచి ఉన్నది.)
60. వైశ్వానరాగ్ని కాక దేవతలకు మరొక అగ్రగామి దూత లభించలేదు. ఈ అమరవైశ్వానరాగ్నిని ఆ అమరదేవతలు భూమిని జయించుటకు వర్ధిల్లచేసినారు.
61. ఉగ్రస్వభావులు, హింసకుల హంతలగు ఇంద్రాగ్నులను మేము ఆహ్వనించుచున్నాము. ఇట్టి కార్యములందు వారే మాకు సుఖములు ప్రసాదించవలెను.
62. ఋత్విజులారా! ఇది పావకము. అభిముఖముగా దేవతలను యజించకోరు సోమరసము. దీని స్తుతులు గానము చేయండి.
63. ఇంద్రా! వృత్రవధ విషయమున మరుత్తులు నిన్ను వర్ధిల్లచేసినారు. వారు శంబరుని యుద్ధమున నిన్ను వర్ధిల్లచేసినారు. గోవులను వెదికి వెలికి తీయుటకు వారు నిన్ను ప్రోత్సహించినారు. ఆ మరుత్తులు నిన్ను నిశ్చయముగా సర్వత్ర వర్ధిల్లచేయువారు. మరుద్గణములతో కలసి - హర్యశ్వా పిబేన్ద్రసోమం.
64. ఇంద్రుడు ఉగ్రస్వభాని.స్తుత్యుడు. అత్యంత ఓజస్వి. బహుళాభిమాని. అతడు త్వరత్వరగా శత్రువుణు పరాజితుని చేయుటకే జన్మించినాడు. ఈ విషయమున మరుత్తుల సహితము ఇంద్రునకు సాయపడినారు. ఎంతో ధన్యమైన అదితి తల్లి ఇంద్రుని గర్భమున దాల్చినది.
65. ఇంద్రా! మహామహా రక్షణల మహిమాన్వితుడవు. నీవు యజ్ఞమునకు విచ్చేయుము. మా అర్ఘ్యము స్వీకరించుము.
66. ఇంద్రా! యుద్ధములందు నీవు శత్రుసేనలను పరాజితులను చేయు వాడవు. నీవు దుష్టఘాతివి. సర్వోత్పాదకుడవు. సర్వశత్రు నాశకుడవు. హింసకులను వధించుము.
67. ఇంద్రా! నీవు శత్రువులకు నీ బలమును ప్రదర్శించువాడవు. తల్లి బిడ్డను అనుసరించి సాగినట్లు - ద్యావాపృథ్వులు నిన్ను అనుసరించి సాగును.
ఇంద్రా! నీవు వృత్రుని సంహరించి ఉన్నందున శత్రువులు నీ ఆగ్రహమునకు నీరసపడి పోవుదురు.
68. యజ్ఞము దేవతలకు ధనము అందించునది అగును.
ఆదిత్యులారా! మీరు మాకు సుఖములు కలిగించండి. మీ సుబుద్ధి సకల కళ్యాణకారణము. దానిని మావైపు మరలించండి.
సోమరసమా! పాపుల ధనము సహితము మాకు అందించ సిద్ధపడుదువు. అట్టి నీయందు ఆదిత్యుల కొరకుగాను - పెరుగు కలుపుచున్నాను.
69. సవితాదేవా! బాధించనివియు, శుభములు కలిగించు రక్షణలచే మా ఇంటిని కాపాడుము. నీవు హిరణ్మయ అగ్నియే జిహ్వగా కలవాడవు. మాకు నవీన సుఖశాంతులు ప్రసాదించుము. ఎవడేని పాపియు, నిందకుడును మమ్ము మించిన సమర్ధుడు కారాదు.
70. యజమాన దంపతులారా! అధ్వర్యులు సోమమును అభిషవించిన రీతి మీరు అధ్వర్యులచే నిగ్రామ జలమున అభిషితులైనారు.
వాయుదేవా! నీవు నీ నియుతాశ్వములను రథమునకు పూన్చుము. యజ్ఞగృహమునకు విచ్చేయుము. మత్తు కలుగునట్లు అభిషుత సోమరసము - నీ భాగమును - సేవింపుము.
71. గోమాతలారా! మీరు మమ్ము రక్షించండి. మహా యజ్ఞమునకు స్వరూపప్రదానము చేయు ద్యావాపృథ్వులారా! మీరు మమ్ము రక్షించండి. మీ ఉభయుల "కర్ణాహిరణ్మయా" చెవులు బంగారపువి.
72. మిత్రావరుణులారా! మీరు విద్వాంసులకు హితకరులు. యజమాని సహితముగ యజ్ఞగృహమున ఉండువారు. సోమపానము చేయువారు. దుష్టఘాతకులు. మీరు త్వరత్వరగా విచ్చేయండి.
73. దైవీ అధ్వర్యులగు అశ్వినీద్వయమా! మీ సూర్యప్రభా భాసిత రథమున శీఘ్రముగా విచ్చేయండి మీరు యజ్ఞమును మధువుచే ఆసించితము చేయు వారలగుదురు.
74. ఈతని వ్యాపించునట్టి వక్రకిరణములు క్రింద ఉన్నవి - పైన ఉన్నవి. అవి మహిమాన్వితస్రష్ఠలు. స్వధ, ఆహారము - క్రింద ఉన్నది- మానవ ప్రయత్నము దాని మీద ఉన్నది.
75. అతడు ద్యావాపృథ్వులను పూరించినాడు. స్వర్గమును పూరించినాడు వైశ్వానర కర్మవంతులగు యజమానులను భరించినాడు. కవులు మరియు అన్నముకొరకు స్థాపించ బడినాడు. అన్నప్రాప్తి మరియు యాగార్థము అతనిని అగ్నిభావమున రప్పించుచున్నాము.
76. ఇంద్రాగ్నులు వృత్రహనన నిపుణులు. సోమమున మదోన్మత్తులు. వారు ఉక్థములు, స్తుతులు, సాధువాదములచే కీర్తించబడుదురు.
77. అమృతపుత్ర దేవతలు మా స్తుతులను ఆలకింతురు గాత. వారు మాకు సుఖప్రదాతలు అగుదురు గాత.
78. ఇంద్రుడు అనుచున్నాడు:-
శాస్త్రములు, స్తుతులు నాకు సుఖప్రదములు అగుచున్నవి. అభిషుత సోమములు బలము నిచ్చుచున్నవి. నా వజ్రము నాకు సాయపడుచున్నది. యజమానులు నన్ను రమ్మని ప్రార్థించుచున్నారు. ఉక్థములు నన్ను కోరుచున్నవి. హర్యశ్వములు నన్ను యజ్ఞదిశగా తీసికొని పోవుచున్నవి.
79. మరుత్తులు పలుకుచున్నారు:-
ఇంద్రా! నిన్ను మించిన వాడులేడు. నీకు సమానుడు కూడలేడు.
నిన్ను తెలిసిన దేవత ఏడి?
ఇంద్రా! నీవు ఇంతకు ముందు చేసిన కార్యములను గాని ఇప్పుడు చేయుచున్న కార్యములను గాని - ఇంతకు ముందు పుట్టినవాడుగాని - ముందు పుట్టబోవువాడు గాని చేయజాలడు.
80. ఇంద్రుడే సమస్తలోకములందు సర్వశ్రేష్ఠుడు. అతడే ఉగ్రుడు. అతడే ఉగ్రుడు. అతడే తేజస్వి. అతని పుట్టుకయే అట్టిది. సద్యోజాతుడగు ఇంద్రుడు శత్రువులను పరిమార్చినాడు. ఇంద్రుని అనుయాయులు దేవతలు. అతని వలననే రక్షించువారై ఆనందించుచున్నారు.
81. బహుధన ఆదిత్యా! ఇదిగో ఇవి నా స్తుతులు. ఇవి నిన్నే ప్రార్థించుచున్నవి.
ఆదిత్యా! అగ్నికన్న తేజస్వులు, పవిత్రులు విద్వాంసులయిన స్తోతలు నిన్ను స్తుతించుచున్నారు.
82. ఆదిత్యుడు ఆర్యజగత్తుచే సేవించబడువాడు. ధనముదాచిన వాడు, శత్రువు, హింసకుడు, వజ్రమున కన్న కఠిన హృదయము వాడు దాచిన ధనము కూడా - ఆదిత్య! నీదే అగును కదా!
(పిసినారికి ధనము దక్కదని)
83. ఈతడు - ఈ ఆదిత్యుడు- వేలమంది ఋషులచే వేల తీరుల స్తుతించబడువాడు. ఇతడు సముద్రవలె విస్తరించి ఉన్నవాడు. ఇతని మహిమ సత్యమగును. ఇతని బలమును విద్వాంసులు స్వరాజ్య యజ్ఞమున స్తుతింతురు.
84. సవితాదేవా! బాధించనివియు శుభములు కలిగించు నీ రక్షణలచే మా ఇంటిని రక్షింపుము. నీవు హిరణ్మయ అగ్నియే జిహ్వగా కలవాడవు. మాకు నవీన సుఖశాంతులు ప్రసాదించుము. ఎవడేని పాపియు, నిందకుడును మాకన్న సమర్థుడు కారాదు.
85. వాయుదేవా! మా యజ్ఞము సత్ స్తోమములచే స్వర్గమును అంటుచున్నది. నీవు దానిని అందుకొనుము. ఈ పాత్రయందు నిండిన సోమము దేశపవిత్రమున శుద్ధము చేయబడి, దుగ్దాదులచే కలుపబడి, వీర్యప్రదమై యున్నది. దీనిని నీకొరకే సిద్ధము చేసినాము.
86. ఇంద్రాగ్నులు దర్శనీయులు. సుహవులు. వారిని ఆహ్వనించుచున్నాము. వారి రాక మాలో ఒక్కొక్కరిని ఆరోగ్యవంతులను చేయును గాత. కలసినపుడు ఆనందింతుము గాత - "సంగమే సుమనా అసత్"
87. ఏ మానవుడు తన అభీష్టసిద్ధి కొరకు మిత్రావరుణులు హవిగ్రహించు రీతి అనుకూలరను చేసికొనుచున్నాడో అతని యజ్ఞమున సత్యమునకు శాంతి కలుగును.
88. అశ్వినులారా! యజ్ఞమునకు విచ్చేయండి. దర్భాసనమున ఆసీనులు కండు. సోమరసమును సేవించండి. అభీష్ట వరదులారా! ధనవిజేతలారా! వర్షజలము కురిపించండి. మమ్ము వధించంకండి రండి.
89. మంత్రములకు అధిష్ఠానదేవత బ్రాహ్మణ స్పతి యజ్ఞమునకు వచ్చును గాత. సూనృతా దేవి విచ్చేయును గాత. శత్రువును కలవరపరచువారును, నరాశంస సవన రక్షకులును, మానవ హితకరులగు దేవతలు మా యజ్ఞమును సంపన్నము చేయుదురు గాత.
90. సోమము ఆహ్లాదకము, జలమిశ్రము, సుపర్ణము. సోమము ద్యులోకమునకు పరుగులు తీయుచున్నది. పసుపు రంగు కలిగి, అత్యధికమై అనేకులచే కోరబడు సోమము ధనధ్వనిచేయుచు సాగుచున్నది.
91. యజమాని దంపతులారా! మీరక్ష కొరకు విశేష దేవతలను - మీ అభీష్టలాభమునకు విశేష దేవతలను - అన్నలాభమునకు విశేషదేవతలను - మా దివ్యస్తుతులచే స్తుతించి ఆహ్వానించుచున్నాము.
92. మహానుడు, సర్వాగ్రణియగు అగ్ని ద్యులోకమున విశేషకాంతులచే శోభిల్లుచున్నాడు. అగ్ని భూమి వలన జలమున వర్ధిల్లి, అన్నదాత యగు అగ్ని తనజ్యోతిచే చీకట్లను తారుముచున్నాడు.
93. ఇంద్రాగ్నులారా! ఉషపాదహీన. అట్లయ్యు పాదములున్న జనుల కన్న మున్నే అవతరించును. ఆమెకు శిరము లేదు. అయినను పలుకగలదు. ఆమె ముప్పది అడుగులు నడువగలది.
94. తేజోవంతులగు దేవగణములు మానవుల కొరకు ఒకేసారి ధనవంతులు అగుదురు గాత. వారు నేడు మాకు ధనము ప్రసాదింతురు గాత. ఇతర దినములందును వారు మాకు ధనము ప్రసాదింతురు గాత. మాపుత్రపౌత్రాదులను ధనవంతులను చేయుదురు గాత.
95. ఇంద్రుడు పాపనాశకుడు. అతడు దారిద్య్రము మున్నగు సకల దౌర్భగ్యములను దూరము చేసినాడు. అప్పుడు అతడు కీర్తిశాలి అయినాడు.
మరుద్గణయుక్త ఇంద్రా! దేవతలు నీమైత్రి కొరకు నిరంతరము ప్రయత్నించుచుందురు.
96. మరుత్తులారా! మీరు మహానుడగు ఇంద్రుని కొరకు స్తుతులు ఉచ్చరించండి. వృత్రహంతయు, శతక్రతువగు ఇంద్రుడు తన శతధార వజ్రమున వృత్రుని వధించును.
97. అభిషుత సోమపు మత్తునందున్న ఇంద్రుడు ఈ యజమాని వీర్యబలమును వర్ధిల్లచేయును. పూర్వ కాలము వారివలె నేటివారు అతని మహిమలను వర్ణింతురు.
ఇంద్రుని మహిమలను వేలమంది వేలరీతుల స్తుతింతురు.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీ మదాంధ్ర వచన శుక్లయుజుర్వేద సంహిత యందలి
సర్వమేధికమను ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.