Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 60


                                            రుద్రమదేవి

                                                 1

    ఆనాఁడు విజయదశమి. మనోహరమగు సంధ్యాసమయమున నోరుగల్లుపట్టణ వీథులన్నియు నానందోత్సాహములతో పొంగిపొరలుచుండెను. రాచనగరులో రాజకుమారుల యస్త్రవిద్యాప్రదర్శనమును సందర్శించుటకై నగరమందలి యాబాలగోపాలమును వడివడి జనుచుండిరి. కాకతీయ గణపతి దేవచక్రవర్తి సామ్రాజ్యమునందలి సమస్త ప్రజలను, సామంతులను నా వినోదమును సందర్శించుటకై యాహ్వానించినాఁడు. వివిధ ప్రాంతముల నుండియు దండనాథులు, సేనానులు, ప్రధానులు, సామంతరాజులును విచ్చేసి యథోచితస్థానముల నలంకరించియుండిరి.        
    ఆ కాకతీయ సార్వభౌముని ప్రాభవౌన్నత్యముల కనుగుణముగా విద్యావినోద మంటపమలంకరింపఁబడి కన్నుల పండువు గావించుచుండెను. సభామందిర మంతయు ప్రేక్షకజనసమూహముతోఁ గ్రిక్కిఱిసియుండెను. మంటప మధ్యభాగమునందమర్పఁబడిన యొక పచ్చల సింహాసనము సార్వభౌముని యాగమునకై నిరీక్షించుచున్నట్లుండెను. దానికిఁ గుడివైపుననున్న యున్నతాసనము మహాప్రధాని గోవిందామాత్యులవారికి యమర్పఁబడినది.
    దుందుభి మ్రోఁగినది. తూర్యధ్వనులు చెలరేఁగినవి. చక్రవర్తి రాజసౌధము నుండి విద్యామంటపమునకు బయలుదేఱినాఁడు. ఆయనకు ముందుభాగమున నడచుచు మహామాత్యుఁడు దారి చూపించుచుండెను. చక్రవర్తిరాక గమనించి సభ్యులందఱు వినయవినమితశిరస్కులై లేచి నిలుచుండిరి. అంగరక్షకుఁడైన యయ్యపోతినాయఁడు కేలరాజదండముగొని నడువ, కాకతీయ గణపతి దేవచక్రవర్తి సభాభవనమును బ్రవేశించి పౌరసమూహమును గడచి సామంతరాజలోకము నతిక్రమించి సింహాసనమును సమీపించుచుండెను.
    చక్రవర్తి చేతి నూఁతగాఁ గొని యొక ముద్దులు మూటగట్టు రాజకుమారుఁడు నడచివచ్చుచుండెను. ఆ రాజకుమారుని సుందరసుకుమార రూపము సమస్తసభాసదుల నాకర్షించినది. సామంతరాజులందరు బాలుని గంభీర వదనమును సాశ్చర్యముగాఁ దిలకింపసాగిరి. సేనానాయకుల దృష్టు లావీరకుమారుని చేతిలోనున్న కరవాలము పయిఁ బ్రసరించినవి.
    చక్రవర్తి సింహాసమునొద్దకు వచ్చినంతనే సభయంతయు సగౌరముగా నొక్క పర్యాయము మహారాజునకు జయజయధ్వనులు పలికి కూర్చుండెను. మహారాజును మందహాసము చిందిపోవు వదనముతో సభాసదులవందనముల నందుకొని సింహాసనమున నుపవిష్టుఁడయ్యెను. వెంటవచ్చిన రాజకుమారుఁడు మహారాజుసింహాసనమునకు నెడమవైపున నున్న రత్నపీఠముపై గూర్చుండెను. మహామత్యుల వారును దక్షిణపార్వముననున్న యాసనమును స్వీకరించిరి.
    ఆ మహాసభయందు తమ విద్యావిశేషములను బ్రదర్శించి చక్రవర్తి మెప్పువడయుటకై రాజకుమారులు కొందఱు రంగస్థలమును బ్రవేశించిరి. గణపతి దేవచక్రవర్తి యనుజ్ఞనందుకొని ప్రదర్శనము ప్రారంభమైనది. పరంపరగా వర్షింపఁ బడుచున్న బాణసమూహములవైపు ప్రేక్షకులు విభ్రాంతులై చూడసాగిరి. విధివిరామములులేక సాగుచున్న వీరశిఖామణుల శస్త్రాస్త్ర ప్రయోగచాత్యుర్యమును, బాణ ప్రయోగోపసంహారములును, గదా భ్రమణమును, ఖడ్గసంచాలనవిలాసమును సభ్యుల నందఱ విస్మయానందముల నోల లాడించెను. రాజకుమారులగు మురారిదేవుడును, హరిహరదేవుడును తక్కుంగల వీరశిరోమణులకంటె మిన్నలై తమ యస్త్రవిద్యావిశేషమును బ్రదర్శించి చక్రవర్తి మెప్పువడసి తమతమ యాసనములపై సగర్వముగ గూర్చుండిరి.
    విద్యాప్రదర్శనము కొంత గడచిన తర్వాత గణపతి దేవచక్రవర్తి యఱచేతిలో నొక దంతపు బరిఱె నుంచుకొని "మురారీ! నా చేతిలోనుండి దీనిని క్రిందికిఁ బడఁగొట్టవలయును. నాహస్తమునకుఁ గొంచెమైనను నీ బాణపు గాలి సోఁకరాదు. శరప్రయోగమున దంతపుబరిణెయును పగులరాదు" అని పలికెను. వెంటనే మురారి దేవుఁడు సరిగా గుఱిచూచి బాణ ప్రయోగమొనరించెను. దంతపు బరిణె క్రిందపడినది. చక్రవర్తి హస్తమునకు గాలిసోఁకలేదు. కాని బరిణె క్రిందపడి విచ్చిపోయినది. సర్వవిధముల వెనుకటిదానిని బోలిన మరియొకదంతపుబరిణెను గుడిచేయియందుంచుకొని "హరిహరా! నీవు ప్రయత్నించి చూడు" మని చక్రవర్తి మఱల నాజ్ఞాపించెను. హరిహరుఁడు వింట బాణమును సంధించి ప్రయోగించెను. సంపూర్ణముగా నాతఁ డా పరీక్షలో విజయమును సంపాదింపఁగల్గెను. గణపతి దేవచక్రవర్తి వెనువెంటనే తన మెడలోనున్న ముత్యాలహారముతో హరిహరుని బహూకరించెను.
    ఈ విధముగా చక్రవర్తి మరికొంతసేపు విద్యావిశేషములను బ్రదర్శింపఁ జేసి యనంతరము విలాసార్థముగాఁ దనచేతియందుఁ బట్టుకొనియున్న తామరతీఁగెను బెంపుడు పావులమునోటఁ గఱిపించి "కుమారులారా! ఇటు చూడుఁడు! ఈ పావురమును స్తంభోపరిభాగమున నుంచుచున్నాను. ఒక్క పర్యాయముగా మూఁడుబాణములను బ్రయోగించి దీనినోటిలోని తామరతూఁడు మూఁడుముక్కలగునట్లుగాఁ గొట్టవలెను. పావురము బాణవేగమునకు భయమందిపాఱిపోవరాదు. ఈ పరీక్షయం దుత్తీర్ణులైనవారికి రత్న ఖచితమగుపిడితోఁ దళతళ మెఱయుచున్న యీ రాజఖడ్గము బహుమానముగ లభింపఁగల"దని యా కరవాలమును సభామంటప మధ్యమున వ్రేలాడఁదీయించెను. సభ్యుల దృష్టులన్నియు నా వజ్రమయ కరవాలముపై వ్రాలినవి. ఈ బహుమతిని గ్రహింపఁగల మహావీరుఁడెన్వ్వరోయని ప్రేక్షకులు కుతూహలముతో గాలిపీల్చుటకైన విరామములేక వీక్షించుచుండిరి.
    మురారికి ముందుగనే సందేహము కలిగి యాతఁడు ప్రయత్నింపలేదు. హరిహరుఁడు విజయగర్వముతోఁ గార్ముకమున మూఁడుబాణములు దొడిగి ఱొమ్మువిఱచి నారి వెనుకకు వంగి లాగి వదలిపెట్టెను. అమ్ములు నిశ్శబ్దముగా ముందునకు సాగినవి. పావురమున కించుకయైన భయముగలుగలేదు. కాని శరములు తామరతూఁటిని తాఁకి క్రిందపడినవి. తూఁడు మూఁడుముక్కలు గాలేదు. హరిహరుఁడు సిగ్గుతోఁ దలవంచుకొనెను. సమస్తసభాసదులును నతనివంక చూచి పరిహాసముగావించుచుఁ జప్పట్లుగొట్టిరి.

 Previous Page Next Page