Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 43

    "అప్పటికీ అతను మారకపోతే..... ఈలోగా నాకే కడుపోవస్తే శాశ్వతంగా అక్కడే సమాధి అయిపోవాలి నేను."
    "విద్యా..... స్టుపిడ్ లా మాట్లాడకు. ఈ రోజుల్లో నీవు అక్కరలేదనుకుంటే గర్బం రాదు. నీ భర్త ప్రవర్తన సరిగా అయ్యేవరకు, అతను మారేవరకు ప్రెగ్నెంట్ అవ్వకుండా జాగ్రత్తపడు. అతనికి మార్పు వచ్చేది లేనిది రెండు మూడు నెలల్లో తేలిపోతుంది. అప్పుడే చూడొచ్చు. అప్పుడే నిర్ణయించుకోవచ్చు. ఏం చెయ్యొచ్చన్న విషయం. ఈలోగా తొందరపడి హేస్టీ స్టెప్ తీసుకోవద్దు."   
    "ఏమో ఆంటీ..... మీరెంత చెప్పినా ఆయన మారతారని నాకనిపించడం. ఆయనలో ఏ కోశానా సరసం, సెన్సాఫ్ హ్యూమర్ లేదు. అలాంటివారితో ఎలా బతకడం."
    "విద్యా..... నీకో సంగతి చెప్పనా? మా అన్నయ్య, దివ్య మొదట్లో ఎలా వుండేవారో తెలుసా? రఘు ఆవిడమాట జవదాటేవాడు కాదు. ఇరవై నాలుగు గంటలూ దివ్య అంటూ ఆమె నామస్మరణే! ఆమె కూచుంటే అందం, నిల్చుంటే మోజు, పాడితే ఆరాధన, మాట్లాడితే మైమరపు! చుట్టూ ప్రపంచాన్నే మరిచి ఆవిడని ఆరాధించేవాడు..... అలరించాడు. వాళ్ళని చూస్తుంటే ఏ జంట, ఎంత అదృష్టం అని అసూయపడేదాన్ని ప్రేమంటే ఇదే, భర్తంటే ఇలా వుండాలి అనుకునేదాన్ని."
    కాని ఆ ప్రేమలు, మైమరపులు, ఆరాధనలు ఎన్నాళ్ళున్నాయి? పట్టుమని ఏడాది లేవు. అంతలా ఒకరికోసం ఒకరు బతికినట్లుండేవాళ్ళు ఏడాది గడిచే సరికి వాదనలు, మూతిముడుపులు, అర్చుకోవడాలు, భోజనాలు మానడాలు, దెబ్బలాటలు, ఒకరినొకరు ఎత్తిపొడుపులు. ఒక రెండేళ్ళు గడిచేసరికి వాళ్ళేనా వీళ్ళు అనేటట్టు మారిపోయారు. ఈ ప్రేమలు అన్నీ పెళ్ళి అయ్యేవరకే విద్యా! ఆడది తన సొంతం అయిపోగానే ఏ ప్రత్యేకతా కనబడదు మగాడికి. ఆమెతో కాపురం ఆరునెలలు చేసేసరికి పాతబడిపోయి, కాపురం రొటీన్ అయిపోతుంది. శృంగారభావాలు, రొమాన్స్ లకి చోటు ఎక్కడ? ఈలోగా పిల్లలు పుట్టుకొస్తారు. సంసారం బాధ్యతలు పైన పడతాయి. వాళ్ళూ అందరూ భార్యాభర్తల మాదిరి మామూలుగా రొటీన్ కి అలవాటుపడిపోతారు.
    పిల్లలు పుట్టాక వాళ్ళ ఆలనాపాలనా, చదువు సంధ్యల గొడవల్లో పడిపోతారు. విద్యా...... నీవన్నట్టు మనిషి సౌమ్యుడు, సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడయితే బతుకులో నిర్లిప్తత, నిరాశ వుండదు, రోజులు అందంగా గడిచిపోతాయి. అది లేని మగవాడితో ప్రతి క్షణం, ప్రతిరోజూ ఎడ్జస్ట్ అవ్వడం అన్నంత సుళువు కాదని నాకు తెలుసు. కాని ఈ వంటరిక జీవితంకంటే, ఏ ఎమోషన్స్, ఏ స్పందనలూ లేని వంటరి బతుకుకంటే ఆ జీవితమే నయం ఏమోననిపిస్తుంది. నా అనుభవంలో. కనీసం పిల్లలకోసం బతుకుతున్నామన్న తృప్తితోనయినా బతకవచ్చునని నా ఉద్దేశం.  
    "అంచేత మీరు వాళ్ళకి ఇప్పుడేం చెప్పొద్దు. అతను వచ్చాక ఓ రెండు మూడునెలలు నీవైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేసి చూడు. అప్పటికీ అతను మారకపోతే, మారడని నమ్మకం కలగకపోతే సౌమ్యంగా విడిపోవడానికి ప్రయత్నించండి నీవెంత, చూసుకో రేపే నా కూతురికి మళ్ళీ పెళ్ళి చేస్తాను అంటే ఆ మగవాడి అహం దెబ్బతిని పగసాధిస్తాడు. చట్టబద్ధంగా విడిపోయేవరకు మంచిగా, సౌమ్యంగా పని సానుకూలబడేట్టు చూడమని నా సలహా. అతను విడాకులకి అంగీకరించినా ముందుగానే నీకొక వార్నింగ్. రెండో పెళ్ళికి నీకు మొగుడు దొరక్కపోవచ్చు. దొరికినా నీ మొదటి పెళ్ళికంటే ఈ పెళ్ళి సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ వుండదు. అన్ని రిస్కులూ తీసుకోగలిగితేనే అతనితో    తెగతెంపులు చేసుకోవడానికి సిద్దపడు." నిర్మల స్థిరంగా అంది.    
    విద్య మొహం నల్లమబ్బులు కమ్మినట్లయింది.
    "ఆంటీ..... మీరు నాకు చాలా పిరికిమందు పోశారు. నిన్నటివరకు ఎన్నెన్నో అనుకున్నాను. ఇప్పుడు మీ మాటలు వింటుంటే భవిష్యత్ గురించి భయంగా వుంది. మనసులు కలవని భర్తతో కాపురం నాకేం ఖర్మ! విడిపోతాను, హాయిగా బతుకుతాను అనుకున్న నా నిర్ణయాలన్నీ తలకిందులు చేశాయి మీ మాటలు. చదువుండి, ఆర్ధిక స్తోమత వున్న మనమే ఇంత వెనకంజ వేస్తుంటే ఇంక ఆర్ధిక స్వాతంత్ర్యం లేని ఆడవాళ్ళ గతి ఏమిటి? ఎన్ని తరాలు మారినా మన బతుకు ఇలా మగవాడి ముందు తలవంచి బతకవలసిందేనా?"  
    "ఇదివరకే చెప్పానుగా విద్యా..... స్త్రీకి వ్యక్తి స్వాతంత్ర్యం భావ స్వాతంత్ర్యం- పురుషునితో సమానంగా స్వేచ్చ..... ఆ స్వేచ్చని పొందిన స్త్రీని విమర్శించని సమాజం వచ్చేవరకు మనం ఇలాగే వుండాలి విద్యా..... ఇంకో సంగతి కూడా ఆలోచించాలి మనం. మనకంటే అన్ని విధాల విదేశవనితలు పురోగమనం సాధించారు. మనకంటే ముందుగా వారు పురుషునితో సమానమైన హక్కులు, స్వేచ్చా పొందారు. అమెరికాలాంటి దేశాల్లో వాళ్ళు చదువుకుని, ఆర్ధిక స్వాతంత్ర్యం సంపాదించుకుని, పురుషునిపై ఆధారపడకుండా బతుకుతున్నారు. మనసులు కలవని భర్తతో, హింసించే భర్తతో విడిపోయి హాయిగా బతికే అవకాశం సంపాదించుకున్నారు వాళ్ళు. కాని ఇప్పుడు వారి ఆలోచనల్లో, భావాల్లో మార్పు వస్తోంది. ఇప్పుడు వాళ్ళు కుటుంబజీవనం కోసం ఆరాటపడుతున్నాడంటే వారు పొందిన స్వేచ్చలో వుండాల్సినంత ఆనందం లేదని గుర్తించారో..... లేదంటే వారూ వంటరి జీవితంతో విసుగెత్తారో - లేక పెళ్ళి మీద పెళ్ళి చేసుకున్నా కోరుకున్న ఆనందం దొరకకో, లేదా తమ మధ్యపిల్లలు నలిగిపోతున్నారన్న బాధో...... పిల్లల భవిష్యత్తు దెబ్బతిని విశృంఖలంగా తయారైపోతున్నారనో మొత్తం మీద నాగరిక దేశాల్లో కూడా మళ్ళీ కుటుంబ జీవనానికే ప్రాముఖ్యత నిస్తున్నారని చదువుతున్నాం.      

 Previous Page Next Page