"గుండెపోటుట! మాయదారి కాలం కాకపోతే, డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళేలోగా, పావుగంటకూడా పట్టకుండా ప్రాణం పోవడమేమిటి?"
"ముసలాడా ముతకాడా? మూడుపదులు కూడా పూర్తిగా దాటందే!"
"కలికాలం కాకపోతే ఏమిటి? రోగమా? నొప్పా? మంచం మీద పడున్నాడా? ఈ అకస్మాత్ మరణాన్ని ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు....!"
"సినిమాకి వెళదామని తయారుగా వుండమన్నాట్ట. వీళ్ళంతా ముస్తాబై కూర్చున్నారు, ఆవిడా పిల్లలూ! కానీ అంతలోనే ముంచుకొచ్చింది మృత్యువు. గద్దలా తన్నుకుపోయింది!"
"పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు! అసలు దంపతులే చిన్నవాళ్ళు! ఈ పిల్లల్ని పెట్టుకుని ఎలా బతుకుతుందో ఆ ఇల్లాలు!"
"ఈ కుర్రకుంకలిద్దరూ పెద్దవాళ్లు కావాలి _ అప్పటికి తెల్లారాలి ఆమె బతుకు!"
ఇలా ప్రతి మాటా ఆమె చెవిలో పడుతున్నా, పలక్కుండా, ఉలక్కుండా కూర్చుంది సీతాదేవి!
ఆమెలో చలనం లేదు! ఏడుపు లేదు! మాటాలేదు _ మంతీలేదు! కొయ్యబారినట్టు కూర్చుంది!
"మీ వాళ్లెవరికి చెప్పాలో చెప్పండి _ ఆ ఏర్పాట్లు చేస్తాం" అన్నారు రామానంద్ గారి మానేజింగ్ డైరెక్టరు.
సీతాదేవి బదులు పలుకలేదు.
ఆమెని పట్టి ఊపేశారు పక్కింటి పిన్నిగారూ, వాళ్ళమ్మాయి సరళా....!
ఈ గందరగోళానికి ఏడుపు లంకించుకున్నారు, క్రాంతీ, కావ్యా!
ఇద్దరూ తల్లి కాళ్ళని చుట్టేశారు.
అలా పట్టుకుని రాగాలు పెడుతూన్న బిడ్డలని చూసి సీతాదేవి గుండె చెరువయింది. భూమి బద్దలయినట్టనిపించింది. తన నెత్తిన పిడుగు పడ్డట్టనిపించింది. 'విధి' అనే క్రూర రాక్షసి, తన భర్తని నిర్ధాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నట్టనిపించింది. లేచి వెళ్ళి, అతని గుండెమీద గుండె పెట్టి, మొహంమీద మొహంపెట్టి, గట్టిగా ఏడ్చింది.
దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది.
గుండె బద్దలయ్యేలా ఏడ్చింది!
ప్రకృతి కంపించేలా ఏడ్చింది!
ఆ రోదనా, ఆవేదనా, ఏవీ ఏ దేముళ్ళకీ వినిపించలేదు!
కాలం వికృతంగా విలయతాండవం చేసింది.
తెల్లవారేటప్పటికి బెంగుళూరు బస్సులో దిగారు _ తల్లీ, అన్నయ్యలిద్దరూ, వొదినలూ, చెల్లాయి! తన బలగమంతా ఇంటినిండా నిండిపోయినా, ఏదో ఏదో వెలితి! అంతా శూన్యం! కటిక చీకటి! దారి కనిపించడంలేదు సీతాదేవికి!
తల్లో పూలూ, నుదుటన తిలకం, సినిమాకి వెళ్లాలని కట్టుకున్న కొత్తచీరా, ఆమెని పరిహసిస్తూన్నట్టనిపించింది. ఎగతాళి చేస్తున్నట్టనిపించింది. పూలు తెంపి పారేసింది, బొట్టు తుడిపేసింది. కసి తీరక చీర చింపేయబోయింది, మత్తు ఇంజక్షనిచ్చి పడుకోబెట్టాడు డాక్టరు.
ఆ తరవాత అంతా యాంత్రికంగా జరిగిపోయింది.
ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. అన్నయ్యలూ, అమ్మా ఆమెనీ పిల్లల్నీ బెంగుళూరు తీసికెళ్ళారు.
ఊరు కాని ఊరు! తనది కాని తన యిల్లు! తను పుట్టిన పెరిగిన ఇంట్లోనే తను గెస్టు. ఎన్నాళ్ళు ముగ్గురు మనుషుల్ని గెస్టుగా వుంచుకోవాలి?' అన్నావొదినల సమస్యలూ, ఎటూ చెప్పలేని తల్లి దుస్థితీ ఏకాంతంలోనే గ్రహించింది సీతాదేవి!
తల చెడి పుట్టింటికి చేరకూడదనుకుంది! అయిన వాళ్ళను 'దేహీ' అని అడగకూడదనుకుంది. పిల్లలిద్దరినీ చూసింది! వారిలో తన రక్తంతో పాటు, రామానంద్ రక్తం కనిపించింది. వారికి తన నీడ అవసరం. తన అండదండలు అవసరం! వారిని పెంచి పెద్దచేసే బాధ్యత తనే వహించాలి. భర్త స్థానాన్ని కూడా తనే పొంది, ఆ పిల్లలకి తండ్రీ, తల్లీ అన్నీ తనే చూసుకోవాలి! తన బిడ్డలు ఎవరి దయాదాక్షిణ్యాలమీదా ఆధారపడకూడదు. భర్త కోరిక ప్రకారం, క్రాంతి ఇంజనీర్ కావలి! పదిమందికి నీడ కల్పించే సమర్ధుడు కావాలి! అతని అడుగుజాడల్లో నడిచి అతని ఆశయాలు నిలబెట్టే పుత్రుడుగా నిలవాలి! కావ్య పదిమందికి వెలుగునిచ్చే నిద్యాప్రాప్తికి చిహ్నంగా మంచి ఉపాధ్యాయిని కావాలి! ఆమెని లెక్చరర్ గా తయారుచెయ్యాలి. అదే ఆయన ఆత్మకు శాంతి! తనకి తృప్తి!
వెంటనే ప్రయాణమైంది హైద్రాబాదుకి.
తల్లి నెత్తీ, నోరూ కొట్టుకుంది వెళ్లొద్దని! ఆడది తోడులేకుండా ఒంటరిగా బతకలేదంది. యౌవనంలోవున్న ఆమెకి అవాంతరాలెన్నో ఎదురౌతాయనీ, ఆ ప్రయత్నం మానుకోమనీ బతిమాలింది!
అన్నయ్యలూ, వొదినలూ నచ్చజెప్పారు. కావాలంటే బెంగుళూరులోనే వేరే ఇల్లు తీసుకుని వుండమన్నారు.
ఎవ్వరి మాటా వినలేదు! తనెన్నుకున్న దారిలోనే ప్రయాణించడానికి నిశ్చయించుకుంది.
భర్త తరఫున ఆమెకి బంధువులెవ్వరూ లేరు. హైద్రాబాదులో ఆమెకి అయిన వాళ్ళెవ్వరూ లేరు. తల్లిని వెంటబెట్టుకుంది తనకి తోడుగా!
ఆ ఇంటిని ఖాళీచేసి, మరో చిన్న ఇంట్లోకి మారింది. ప్రావిడెంటుఫండ్ నీ, ఇతరత్రా లభించిన రొక్కాన్ని బ్యాంకులో వేసింది. పిల్లల్ని స్కూలుకి పంపింది.
కానీ, ఒంటరితనం ఆమెని పిచ్చిదాన్ని చేస్తోంది. వొంటినిండా సంస్కారం వున్నా, ఉద్యోగానికి పనికివచ్చే విద్య లేకపోవడంవల్ల యే పనీ చెయ్యడానికి వీల్లేకపోయింది. సరదాగా నేర్చుకున్న కుట్టుపనే ఆమెకు ఆధారంగా నిలిచింది.
కుట్టు నేర్చుకోవడానికి వచ్చీ పోయే వాళ్ళతోటీ, బట్టలు కుట్టించుకుని పోయేవాళ్ళతోటీ, ఇల్లు గడబిడగా వుంటోంది. సీతాదేవికి మరే ఆలోచనా మనసులోకి రాకుండా చేసింది!
ఎన్నో క్యాలెండర్లు మారాయి! కాలం మారింది.
పెద్ద ఇల్లు తీసుకుని, పదిమంది వర్కర్లను పెట్టుకుంది చేతికింద. ప్రతివారికీ సీతాదేవే కుట్టు నేర్పాలి. ప్రతివారి బట్టలూ అక్కడే కుట్టించుకోవాలి.
'చైతన్యా కుట్టు సెంటర్' మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది!
క్రాంతి ఇంజనీయరింగు ఎంట్రెన్స్ మంచి మార్కులతో ప్యాసయ్యాడు!
సీతాదేవి ఆనందానికి అవధులు లేవు!
'మరో నాలుగేళ్ళు!' అనుకుంది.
కావ్య స్కూలు పూర్తిచేసి, కాలేజీలో అడుగు పెట్టింది.
అప్పుడే మళ్ళీ చిన్న డ్రా బాకు!
మనిషికి పూర్తి సంతోషాన్నిస్తే పట్టపగ్గాలుండవనీ, తననే మర్చిపోతాడేమోననీ భయమేమో, దేముడికి, మధ్య మధ్య గుర్రానికి కళ్లెంవేసి కంట్రోలు చేసినట్టు 'విధి'ని పంపించి కొంచెం వెనక్కి లాగుతూ వుంటాడు.
సీతాదేవిని అంటి పెట్టుకుని, కంటికి రెప్పలా కాపాడే ఆమె తల్లి, కళ్ళు మూసింది.
మళ్ళీ ఆమె ఒంటరిదై పోయింది!
అయితే ఈసారి ఆమెని ఓదార్చడానికీ, ఆమె రెండు కళ్ళూ, తుడవడానికీ క్రాంతీ, కావ్యా వున్నారు. ఎదిగిన బిడ్డలు తల్లిని పసిపాపలా చూసుకున్నారు. వారి శుశ్రూషలో, వారి మమతానురాగాలలో, కన్నతల్లి మరణాన్ని మరచిపోగలిగింది ఆమె. కానీ బి.పి. పెరిగి, రెస్టు అవసరమని డాక్టరు చెప్పగానే _'చైతన్య కుట్టు సెంటర్' ని మూసెయ్య వలసొచ్చింది.
మరో పంచవర్ష ప్రణాళిక ముగిసింది.
క్రాంతి ఇంజనీయరింగ్ ఫైనల్ ఇయర్ లో వున్నాడు.
కావ్య బి.ఏ. ఫైనలియర్ కొచ్చింది.
తల్లి కోరిక మేరకు, తెలుగు లిటరేచర్ తీసుకుంది.
భర్తని తన దగ్గర నుంచి లాక్కుపోయినా, బంగారంలాంటి బిడ్డల్ని తనకి మిగిల్చిన భగవంతుడికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది సీతాదేవి!
ఇప్పుడామె పంచప్రాణాలూ ఈ ఇద్దరు బిడ్డలే!
వారే ఆమె ధ్యాస!
వారే ఆమె ఆశ!
వారే ఆమె సర్వస్వం!
వారే ఆమె జీవితం!
కాలం సాగిపోతోంది!!
3
ఆరోజు తెలుగు పరీక్ష! ఫ్రెండ్సందరూ చీర కట్టుకుని వెళదామనుకున్నారు. కావ్యకి తనకంటూ చీరల్లేవు. ఒకటి రెండుసార్లు అమ్మమ్మ బతికున్నప్పుడు, తన చీరలు చుట్టబెట్టి, బుట్టబొమ్మలా కనిపిస్తూన్న మనవరాలిని ముద్దుల్లో ముంచేసింది. ఆ తరవాత ఇప్పటివరకూ చీర కట్టుకోలేదు, సీతాదేవి అప్పుడప్పుడు బ్రతిమాలినాకూడా!
"ఇప్పటి వరకూ మిడ్డీలూ, పంజాబీ సూట్స్, ఇవ్వే అయిపోయాయి! ఇంచుమించు డిగ్రీ కాలేజీ జీవితం కూడా ఈ పరీక్షలతో అయిపోతాయి. ఇక నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ కి ఈ డ్రెస్సుల్లో వెళితే హుందాగా వుండదు" అంది సీతాదేవి!
"చదువుకోడాని కెళ్ళినప్పుడు ఏ డ్రెస్సయితే ఏముందమ్మా?" నవ్వుతూ అంది కావ్య.
"అది నిజమే అనుకో! కానీ, డిగ్రీ పూర్తయిందీ అంటే ఒకవయసొచ్చిందీ అని అర్ధం. ఆ అధ్యాయాన్ని అక్కడితో ముగించి, పోస్టు గ్రాడ్యుయేట్ అనే అధ్యాయాన్ని ప్రారంభిస్తారు" నవ్వుతూ అంది సీతాదేవి.
తల్లి మాటల్లోని తియ్యదనం, స్వచ్చందత, ఎక్కువగా చదువుకోకపోయినా, ఆమెలో వుండే లోకజ్ఞానం, ఒక్కొక్కసారి తల్లే దేవతలా కనిపించేది కావ్యకి! అంత మంచి అమ్మనిచ్చిన ఆ దేముడికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకునేది!