Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 39


                        రెండవ అష్టకము

              శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
          ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే ||

        ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి |
        నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని నమేత స్థివాంసః ||

        మొదటి మండలము - మొదటి అధ్యాయము - పద్దెనిమిదవ అనువాకము
       
        నూట ఇరువది రెండవ సూక్తము - ఋషి - కక్షీవంతుడు,
                దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.   


    1. కోపములేని ఋత్విజులారా ! మా రక్షణ కొఱకు యాగమును నిర్వహింపుడు. హవిస్సులను ఫలప్రదుడగు రుద్రునకు సమర్పింపుడు. రుద్రుడు అమ్ములపొదులవంటి మరుత్తులతో కూడినవాడు. ముల్లోకములనుండి అసురులను పారద్రోలువాడు. ద్యావాపృథ్వుల మధ్య ఉన్న మరుత్తులతో కూడిన రుద్రుని నుతించుచున్నాము.

    2. దివారాత్రులారా ! పిలువగనేవచ్చు భార్యవలె మా ఆహ్వానములు అందుకొని విచ్చేయుడు. సూర్యుని బంగారుకాంతి ధరించి, అందములు అలముకొన్న ఉష మా పూర్వాహ్వానమును మన్నించవలెను.

    3. సూర్యుడు మాకు తృప్తికలిగించవలెను. వర్షములు కలిగించు వాయువు మాకు తృప్తి కలిగించవలెను. ఇంద్రుడు, పర్జన్యుడు మా మనసులు నిర్మలముగా ఉంచవలెను. సమస్త దేవతలు మాకు సమృద్ధిగా ఆహారము ప్రసాదించవలెను.

    4. అశ్వినులు కీర్తిమంతులు. చరుపురోడాశ భక్షకులు. సోమపాయులు. ఉశిజపుత్రుడనాగు కక్షీవంతుడను నేనీ ఉషఃకాలమున అశ్వినులను ఆహ్వానించుచున్నాను. పూజించుచున్నాను. ఋత్విజులారా ! జలముల పౌత్రుడు అగ్నిని స్తుతింపుడు.

    (జలములవలన వృక్షములు కలుగును. అందువలన వృక్షములు జలములు పుత్రులు. వృక్షముల వలన అగ్ని కలుగును. అందువలన అగ్ని జలములకు పౌత్రుడు అగును.)

    5. దేవతలారా ! నేను ఉశిజపుత్రుడగు కక్షీవంతుడను. పాండురోగము పోగొట్టుకొనుటకు ఘోషయను బ్రహ్మవాదిని మిమ్ము స్తుతించినట్లు నేను స్తుతించుచున్నాను. పిలుచుచున్నాను. ఫలదాత అగు పూషదేవుని నుతింతును. అగ్నియొక్క దాతృత్వమును నుతింతును.

    6. మిత్రావరుణాలారా ! మా ఆహ్వానములను యజ్ఞములందలి మా స్తోత్రములను వినుడు. జలాధిదేవతలగు మీరు క్షేత్రములను నీటితో తడుపుచు మా కీర్తనలను ఆలకించుడు.

    7. మిత్రావరుణులారా ! కక్షీవంతునకు అపరిమితమయిన గోధనమును కలిగించుడు. అన్నదాన యుక్తమయిన యజ్ఞమును కలిగించుడు. మీరు ప్రసిద్ధమగు రథమున విచ్చేయుడు. ప్రీతిని, పుష్టిని కలిగించుడు.

    8. దేవ ధనమును కీర్తింతును. మేము పరస్పరము స్నేహము గలవారలము కావలెను. మాకు పుత్ర పౌత్రులు కలుగవలెను. మేము పరస్పర ప్రేమాభిమానములు కలిగి ఉండవలెను. మాకు అన్నములు, అశ్వములు, రథములు కలుగవలెను.

    9. మిత్రావరుణులారా ! ఒకడు మీయాగము చేయక, రెండవవాడు మీకుగాను సోమము పిండక ద్రోహము చేయుచున్నారు. ఆ ఇరువర్గముల ద్రోహులు రోగగ్రస్తులు అగుచున్నారు. మరొకడు యజ్ఞము చేయుచున్నాడు. స్తుతించుచున్నాడు. సోమము సిద్ధము చేయుచున్నాడు.

    10. మిత్రావరుణులారా ! మిమ్ము పూజించువాడు వినయవంతుడగును. రథవంతుడు అగును. శత్రుంజయుడు అగును. ప్రసిద్ధుడు అగును. దాత అగును. శూరుడు అగును. యుద్ధములందు నిర్భయుడు అగును. నరులకు బెదురనివాడు అగును.

    11. దేవతలారా ! మీరు సర్వాధికారులు. ఆనందదాయకులు, నేను అమృతుడను. స్తుతికర్తను, నరుడను. నా ఆహ్వానమును మన్నించుడు. నేను రక్షకులులేనివాడను. మీరు ఆకసమున సంచరించువారు. విచ్చేయుడు. నా స్తోత్రమును ఆలకించుడు. శ్లాఘించుడు.

    12. హవిస్సులు అందించి ఆహ్వానించు యజమానులకు పుష్టిని ఇచ్చునది, ఇతరులకు ఉపయోగపడునది, ఇప్పుడు అక్కరకు వచ్చునట్టి అన్నములను ప్రసాదింతుము అన్నారు దేవతలు. ఆ దేవతలు యాగములందు మాకు అన్నములను, సంపదలను ప్రసాదించవలెను.

    13. పది ఇంద్రియములకు తృప్తి కలిగించునట్టి పదివిధముల అన్నములకొఱకు పదిమంది ఋత్విజులు యజించు దేవతలను స్మరించుచున్నాము. మాకు దేవతలు ప్రభువులయి ఉండగా ఇష్టాశ్వ, ఇష్టదశ్మి వంటి శత్రువులు మమ్ము ఏమి చేయగలరు ?

    14. ప్రసిద్ధులు, పూజ్యులు, అగు దేవతలను ఆహ్వానించుచున్నాము. వారు విచ్చేయవలెను. మా స్తుతులను వినవలెను. మాకు స్వర్ణకుండలములు రత్నహారములు రమణీయ రూపులయిన పుత్రులను ప్రసాదించవలెను.

    15. నన్ను-కక్షీవంతుని మశర్మారుడను రాజు యొక్క అజ్ఞానులయిన నలుగురు పుత్రులు బాధించుచున్నారు. ఆవయశుడను రాజపుత్రులు ముగ్గురు బాధించుచున్నారు. మిత్రావరుణులారా ! మీ రథము గొప్ప రూపము, సుఖకరమగు కాంతి కలిగి సూర్యునివలె ప్రకాశించవలెను.

                             నూట ఇరువది మూడవ సూక్తము

               ఋషి - కక్షీవంతుడు, దేవత - ఉష, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఉష సమర్థురాలు. విశాలమయిన ఆమె రథము సిద్ధమయినది. మరణము ఎరుగని దేవతలు ఆమె రథమున ఆసీనులు అయినారు. ఆ దేవి నరుల కొఱకు చీకట్లు తొలగించ వచ్చినది. కారు చీకటినుంచి కాంతిరేఖ అయి ఉదయించినది.

    2. జగములకన్నముందు యజమానులకు అన్నము ఇచ్చునదియై ఉష మేల్కొన్నది. ఉష కాంతి దాత. ప్రకాశవతి. మహిమాన్విత యువతి. పునర్భవ. ఉష ఉదయించినది. తొలిపిలుపునకే యజ్ఞశాలలో అవతరించుచున్నది.

    3. ఉషోదేవీ ! నీది శోభన జననము. నీవు నరులను పాలించుదానవు. వారి కొఱకు నీవెలుగును విభజించి ఇచ్చినావు. ఆ వెలుగులుగల మమ్ము ఇష్టార్థములను ఇచ్చువాడు, మనసున్నవాడు, సవితృదేవుడు, దోషరహితులనుగా సూర్యునకు నివేదించవలెను.

    (సూర్యుడు సవితృడు ఒక్కరే అయ్యు విధి నిర్వహణ వలన పదభేదము, సవితృడు పాప పుణ్యములు పరిశీలించువాడు. సూర్యుడు ఫలప్రదాత.)  

    4. ఉషోదేవి ప్రతిదినము ప్రతియజ్ఞగృహమును ప్రకాశవంతము చేయుచున్నది. జగములకు కాంతిని ప్రసాదించుటకు ప్రతిదినము ఆవిర్భవించుచున్నది. వెలుగులు పరచుచున్నది. హవిర్భాగములను అందుకొనుచున్నది.

    5. ఉషా ! నీవు సన్మార్గవర్తినివి. సూర్యునకు సోదరివి. దేవతలందరిని మించినదానవు. స్తవనీయవు. దుఃఖము కలిగించువారికి శత్రువవు. నీసాయమున వైరులను జయింతుము.

    6. తిమిరమున మునిగిన జగములకు వెలుగులు ఇచ్చుచు ఉషోదేవి అవతరించినది. మానోళ్లనుండి ప్రియములు, సత్యములు అయిన వాక్కులే వెడలవలెను. మా బుద్ధులు సర్వదా కార్యనిమగ్నములు కావలెను. అగ్నులు మిక్కిలి ప్రజ్వరిల్లి పైకి లేవవలయును.

    7. రాత్రింబవళ్ళు వంతులుగా ఒకదాని తరువాత ఒకటి వచ్చుచున్నవి. రాత్రి చీకటి రూపమున పాపము చేయుచున్నది. దివాభాగమయిన ఉషోదేవి కాంతులు రథముమీద వచ్చి వెలుగులు పరచుచున్నది.

    8. ఉషోదేవతలు పగలు ఒకదానికి ఒకటి సమానములు అగుచున్నవి. రేపు కూడ అన్యోన్యములు అగుచున్నవి. దోషరహితములగు ఉషస్సులు వరుణస్థలమును సేవించుచున్నవి. సూర్యునకు ముప్పది ఆమడల ముందు పుట్టుచున్నవి. ఒక్కొక్క ఉషస్సు తమ గమనాగమనములను తన ఉదరమునందే నిర్వహించుచున్నవి.

 Previous Page Next Page