Previous Page Next Page 
మహాభారతము పేజి 37


    ప్రభుత్వ బలము ఉన్నవాడు లేనివానికి అనాయాసముగ అపాయము కలిగించును. భుజ బలము ఉన్నవాడు లేని వానికి, ధనవంతుడు ధనము లేని వానికి, రసజ్ఞుడు రసజ్ఞత లేనివానికి సునాయాసముగ అపాయము కలిగించగలరు.
    దుర్యోధనుడు దుర్మార్గుడు. అతనికి ప్రభుత్వ బలము ఉన్నది. కావున మనము పారిపోరాదు. అప్రమత్తులమై ఇందే ఉండవలెను. ఈ విషయము తెలియనట్లు ప్రవర్తించవలెను. లక్క ఇల్లు కాలునంతవరకు ఇందే ఉండవలెను."
    పాండవులు పగటిపూట అడవులకు పోయినారు. వేటాడినారు. రాత్రులు ఆయుధములు ధరించినారు. అప్రమత్తులయి గడిపినారు. అట్లు కొంతకాలము గడచినది.
    ఒకనాడు హస్తిన నుండి ఒక మనిషి వచ్చినాడు. అతడు గనులు తవ్వుట యందు నేర్పరి. విదురుడు పంపగా వచ్చినాడు. పాండవులను రహస్యముగా కలుసుకున్నాడు. ధర్మరాజుతో అన్నాడు:-
    "నేను విదురుడు పంపగా వచ్చినాను. అతడు మీ క్షేమముకోరి నన్ను పంపినాడు. పురోచనుడు కృష్ణ పక్ష చతుర్దశి నాటి రాత్రి లక్క ఇంటిని కాల్చనున్నాడు. ఈ ఇంటి నుండి మిమ్ము తప్పించవలెనని విదురుని అజ్ఞ. అందుకు నేను ఒక బిలమును తవ్వినాను. దాని ద్వారా మీరు బయటికి పోవచ్చును."
    భీముడు బిలమును చూచినాడు. పరిశీలించినాడు. అపాయము లేదని గ్రహించినాడు. తమకేమియు తెలియనట్లు మసలినారు.
    పురోచనుడు ఒక నిషాద స్త్రీని పెండ్లాడినాడు. ఆమెకు అయిదుగురు కొడుకులు. పురోచనుడు ఆమెను కుంతివద్ద నియమించినాడు. కుంతి రహస్యములు పురోచనునకు తెలియపరచుట ఆమె కార్యము. నిషాద స్త్రీ అకార్యమును నిర్వహించినది.
    అది కృష్ణ చతుర్దశి నాటి రాత్రి. లక్క ఇంటిలో పాండవులు గొప్ప ఉత్సవము చేసినారు. నిషాద స్త్రీయు, ఆమె అయిదుగురు కొడుకులు కల్లు తాగినారు. తెలివి తప్పినారు. లక్క ఇంటి ప్రక్కన నిద్రించినారు.
    ఉత్సవము ముగిసినది. అర్ధరాత్రి అయినది. అందరు నిద్రించినారు. పురోచనుడు అయుధాగారమున నిద్రించినాడు. ధర్మరాజు సమయము చూచినాడు. భీమునకు అనుమతి ఇచ్చినాడు. భీముడు నిప్పు అందుకున్నాడు. అయుధాగారపు ద్వారమునకు నిప్పు అంటించినాడు. అది భగ్గున అంటుకున్నది. పురోచనుని కాల్చి చంపినది.
    పాండవులు కుంతీదేవియు గనులు తవ్వువానికి తమ కుశలము తెల్పినారు. విదురునకు తెలియపరచమన్నారు. అతని నుండి శలవు తీసుకున్నారు. బిలమున ప్రవేశించినారు. బిలమున చీకటి. అందరు అలసి ఉన్నారు. నడుచుట దుస్తరము అయినది. అప్పుడు భీముడు కుంతిని మెడలపై ఎక్కించుకున్నాడు. నకుల, సహదేవులను రెండు చంకలకు ఎత్తుకున్నాడు. పరిగెత్తినాడు. వారు బిలము నుండి బయటకు వచ్చినారు. అర్ధరాత్రి కారుచీకటి, చిక్కని అడవిలో తల దాచుకున్నారు.
    దుర్యోధనుని కుట్రకు ప్రతీక లక్క ఇల్లు. లక్క ఇల్లు ఆరాత్రి భగ్గున మండినది. కాలినది. కూలినది. దుర్యోధనుని మనసు వంటి కటిక చీకటి మాయము అయినది. సూర్యుడు ఉదయించినాడు. వెలుగులు పరచినాడు. వారణావతము మేల్కొన్నది. ప్రజలు లక్క ఇంటిని చూచినారు. అదీలేదు. ఉరికినారు. చూచినారు. బూడిద రాశి కనిపించినది. వారు పాండవులకు గురించి పరితపించినారు. బూడిదను ఎత్తి పోసినారు. వారికి ఒక స్త్రీ అయిదుగురు కుమారులు కనిపించినారు. వారు కాలిచచ్చినారు. తగులబడుట వలన గుర్తించునట్లులేరు. కాలిచచ్చినవారు కుంతీ, పాండవులేనని నిశ్చయించినారు. పాండవులు అట్లు అంతమొందినందుకు దుఃఖించినారు. దుర్యోధనుని కుట్రకు పాండవులు బలి అయినారని విచారించినారు. వారిలో కొందరు హస్తినకు వెళ్ళినారు. నిండు కొలువులో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. అతనికీ దుర్వార్త తెలియపరచినారు.
    ధృతరాష్ట్రుడు దుర్వార్త విన్నాడు. అవువలె అరచినాడు. పెద్దగా ఎడ్చినాడు. గాంధారి మున్నగు ధృతరాష్ట్రుని భార్యలు గొల్లుమన్నారు. వారి రోదన ధ్వనులకు అంతపురము ప్రతిధ్వనించినది. భీష్మాది కురువృద్దులు జరిగిన దానికి వగచినారు. శక్తులు ఉదిగినారు. ఏడ్చినారు.
    అక్కడ వారణావతమున గనులు తవ్వువారు లక్క ఇల్లు కాలి కూలుట చూచినాడు. జనులు వచ్చిపోయినారు. ఎవరు చూడకుండ భూబిలమును కప్పి వేసినాడు. హస్తినకు వెళ్ళినాడు. విదురునకు నివేదించినాడు. పాండవుల కుశల వార్త చెప్పినాడు. కాలి చచ్చిపోయినవారు నిషాద స్త్రీయు ఆమె అయిదుగురు కొడుకులు అని చెప్పినాడు. పురోచనుడు కాలిచచ్చిన సంగతి చెప్పినాడు. విదురుడు ఆ మాటలు విన్నాడు. ఊరట చెందినాడు. ఊరుకున్నాడు.
    దుర్యోధనాదులు ఆవార్త విన్నారు. సంతోషించినారు. సంతోషమును ఎరుగనీయలేదు. దుఃఖము నటించినారు. పాండవులకు ఉదకదానములు చేసినారు. ధృతరాష్ట్రుడు తగు మనుష్యులను పిలిపించినాడు. పాండవులకు ఉత్తర క్రియలు జరుపవలసినదని ఆజ్ఞాపించినాడు. వారు గంగాతీరమున పాండవులకు ఉత్తర క్రియలు జరిపినారు. దానధర్మములు చేసినారు.
    దుర్యోధనుడు అది అంతయు కనుల పండువుగా చూచినాడు. పాండవులు పోయినందుకు సంతోషించినాడు. పురోచనుడు కాలిచచ్చినందులకు దుఃఖించినాడు.
    ఒక కుట్ర కాలి కూలినది.

                                                   ఆలోచనామృతము
    
1. మానవ సంబంధములు సమాజ ప్రగతికి నిదర్శనములు. ఆనాడు మనవ సంబంధములను గురించి నిరంతర పరిశోధన కరిపినట్లు కనిపించును. వానిలో వచ్చిన మార్పులు అందుకు తార్కాణము.
    యయాతికి పూరుడు యవ్వనము ఇచ్చినాడు. భీష్ముడు శంతనుని కొఱకు తన సర్వస్వము ధారపోసినాడు. ఆ కాలము చెల్లిపోయినది. ఆచారము మారినది. దుర్యోధనుడు చెప్పినట్లు ధృతరాష్ట్రుడు వినవలసి వచ్చినది. ఇది కొడుకుల రాజకీయము. ఈ మధ్యనే ఒక పుత్రుడు భారతదేశమున అల్లకల్లోలము రేపి అస్తమించినాడు. అది మనందరకు తెలిసిన విషయమే.
2. రామాయణమున రాముని అడవికి పంపుటకు, ఇచ్చటి పాండవులను పంపుటకు కొన్ని పోలికలు కనిపించుచున్నవి. ధృతరాష్ట్రుడు కైక వంటివాడు. కైకను రాముడన్న అభిమానము. ధృతరాష్ట్రునకు పాండవులన్న అభిమానము. దుర్యోధనుడు మంధరవంటివాడు. ఇద్దరిది ఒకే వాదము. రాజు కొడుకు రాజు అగును. అందువల్ల తమకు రాజ్యము దక్కదు. ఇద్దరును సఫలులు అయినారు. అక్కడ మాతృ ఈషణ. ఇక్కడ పితృ ఈషణ. ఈషణములు నాశనమునకు కారణములు. ప్రభువులు ఈషణములకు అతీతముగా ఉండవలెను. అను నీతి నేటికిని  బుఱ్ఱకు ఎక్కలేదు.

 Previous Page Next Page