Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 37

    ఆగండి. నీరూ..... నేనింకా బతికున్నాను. ఈ ఇంట్లో నే బతికినన్నాళ్ళువుండే హక్కు నాకిచ్చారు, మీ నాన్న. నేను సొంత ఇల్లు విడిచి అద్దె కొంపలో వుండను. "స్థిరంగా అంది శారదాంబ.     
    "నీవుండమ్మా నీ కొడుకు దగ్గిర. నేను వద్దనలేదు" అంది నిర్మల.
    "ఇల్లు నీవు వాళ్ళకి రాసిస్తే అప్పుడింక ఈ ఇల్లు నాకు పరాయిదే అవుతుంది. ఇంత బతికి ఈనాడు కొడుకు, కోడలు దయాధర్మం మీద బతకాలా నేను?"
    "అమ్మా....." అన్నాడు రఘు బాధగా" అమ్మా! ఇంట్లో నిన్నుంచొద్దనేటంత దుర్మార్గుడినా? నీకు అవమానం జరుగుతుందా ఈ ఇంట్లో!"   
    "నీకు తెలియదు రఘూ - డబ్బు పాపిష్టిది - అది ఉన్నంతసేపే మనిషికి గౌరవం. ఇల్లు నీ పేర కాగానే నేను మీ దయాధర్మాలమీద బతుకుతున్నానన్న తేలికాభిప్రాయం వచ్చేస్తుంది. ఇప్పుడు దివ్యా, నీరూ విషయంలో నీవేం చెయ్యగలిగావు? రేపు నా విషయమూ అలాగే అవుతుంది. నే బతికిన నాల్గు రోజులూ నేనెవరికీ బరువు బయి బతకడం నాకిష్టంలేదు. భగవంతుడి దయవల్ల, మీ నాన్న దయవల్ల నాకింత ఇచ్చిపోయారు. ఈ ఇల్లు నేనున్నంత వరకు అనుభవించేహక్కు మీ నాన్న నాకిచ్చారు."      
    "అయితే మరి నీరూ ఒకర్తె ఎలా వుంటుంది?" లత అడిగింది.
    "అది ఎక్కడికీ వెళ్ళదు. నేను వెళ్ళనీయను. నేనున్నన్ని రోజులూ అది ఈ ఇంట్లోనే వుంటుంది. ఆడపిల్లని అలా వంటరిగా వదలను నేను. నాతోపాటే అదీ వుండాలి ఇక్కడ."      
    "కాని అమ్మా..... ఈ వాతావరణంలో, ఈ దెబ్బలాటల్లో నేను కూడా వుండలేనమ్మా! నీవు వుండాలంటే వుండు. నేను మాత్రం పోతాను ఈ కొంపలోంచి."
    "నీవెందుకమ్మా పోవడం..... మేమేపోతాం. అదేగా మీ ఇద్దరి ఉద్దేశం? మీరే ఉండండి ఈ ఇంట్లో. ఏమండీ..... ఇదే మీకు ఆఖరిసారి చెప్పడం. మీకు భార్య కావల్సివస్తే ఇంకో పదిరోజుల్లోగా ఈ ఇంట్లోంచి వెళ్ళాలి.... నేనూ గతిలేనిదాన్ని కాదు. ఎవరి దయాధర్మాలు నాకు అక్కరలేదు" దివ్య ఉక్రోషంగా అని విసురుగా లేచి వెళ్ళిపోయింది.   
    "రాధాకృష్ణా!...... నేను పోయాక నీరు ఇష్టం నీరూది. అది ఇల్లు వుంచుకుంటుందో, ఇచ్చుకుంటుందో అదంతా దానిష్టం. అప్పటివరకు ఆయన రాసిన ప్రకారమే రిజిష్టరు చేయించండి."   
    "చిన్నాన్నా! అమ్మ తరువాత, ఈ ఇంటి మీద హక్కు ముగ్గురన్నలది అని రాయించండి. ఇందులో నాకేం వాటా అక్కరలేదు . నాన్న ఇచ్చిన లక్ష, నా నగలు నా జీతం నాకు హాయిగా బతకటానికి చాలు. నావల్ల మగపిల్లలకి అన్యాయం జరగక్కరలేదు" అంది స్థిర నిశ్చయంగా.  
    రాతకోతలు పూర్తయ్యాయి.
    మరుసటి నెలలో రఘు వాళ్ళు వేరే ఇంట్లోకి మారారు.
    నిర్మల శారదాంబా ఆ ఇంట్లో  గత ఐదేళ్ళుగా నిర్లిప్తంగా బతుకుతున్నారు. నిర్మలకి డాక్టరేట్ వచ్చింది. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయింది. నిర్మలమ్మకిప్పుడు ముప్ఫై ఐదేళ్ళు.        
    నిర్మల చెప్పటం ముగించింది.
    విద్య ఆశ్చర్యంగా, "ఆంటీ..... ఇంత కథుందా మీకు? నేనింకా మీరు ఇష్టం లేక పెళ్ళిచేసుకోలేదని, హాయిగా పెళ్ళిచేసుకోకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నారని అనుకొన్నాను. మీకు పెళ్ళయినట్టే ఎవరికీ తెలీదా..... ఎవరూ అనలేదా ఎప్పుడూ?" అంది.
    "ఈ కథ నాదే అని ఎలా తెలుసుకున్నావు?" అంది నిర్మల నవ్వుతూ.
    "అంత స్టుపిడ్ నా అంటీ నేను?...... ఇంకొకరి కథ అయితే అన్నిరకాల ఎమోషన్స్ ఇంతబాగా ఎలా చెప్పేవారు? మీరు పడిన బాధ, ఇంకొకరి కథయితే ఇంత హృద్యంగా ఎలా చెప్పగలిగేవారు. మీ పేరు, మీ అమ్మగారి పేరుతో సహా చెప్తుంటే ఆ మాత్రం కూడా తెల్సుకోలేని స్టుపిడ్ నా! ఇంత వ్యధదాచుకుని ఇలా కేర్ ఫ్రీగా ఎలా వుండగలుగుతున్నారు ఆంటీ?"
    నిర్మల అదోలా నవ్వింది. "కాలం అన్ని గాయాలు మాన్పుతుంది విద్యా! ముందు ఏడాది వున్నంత బాధ రెండో ఏడాది లేదు. అలా అలా రోజురోజుకీ పరిస్థితికి అలవాటుపడిపోతాం. ఒక స్టేజి వచ్చేసరికి మనసు అనుభూతులకి అతీతంగా అయిపోయింది. నాన్నగారు పోయాక అదోరకం విరక్తి వైరాగ్యం వచ్చేశాయి. నిర్లిప్తత, దేనికీ చలించని అదోరకం జడత్వం వచ్చేసింది. ఆ స్టేజీ దాటిపోయాక జరిగినదానికి ఏడుస్తూ కూర్చోకుండా ఉన్నంతలో ఆనందంగా బతకటం కంటే చెయ్యగల్గింది ఏమీలేదని అర్థం చేసుకుని, మీ స్టూడెంట్స్ తో కబుర్లు, కొలీగ్స్ తో నవ్వులు, ఫ్రెండ్స్ తో షికార్లు తిరగటం, కనిపించిన మంచి చీరకట్టుకుని సినిమాలు చూస్తూ, పార్టీలు ఇస్తూ బతికేయటం నేర్చుకున్నాను. విద్యా..... ఇప్పుడు చెప్పు, నా కథ విన్నాక నీకేమనిపిస్తూంది?   
    నేను నీ గురించి ఎందుకింత ఆరాటపడ్తున్నానో అర్థం అయిందా? తొందరపడొద్దని ఎందుకు సలహా ఇస్తున్నానో అర్థం అయిందా?" నిర్మల విద్య వంక చూస్తూ అంది.     
    విద్య రెండు నిమిషాలు తలదించుకుని ఆలోచనలో ఉండిపోయింది.
    అయితే ఆంటీ..... ఈ కథకి నీతి, భర్త ఎలాంటి వాడయినా వదులుకోవద్దని, ఆ కాపురం చెయ్యమని చెప్పడమా మీ ఉద్దేశం?" సూటిగా నిలేసింది విద్య.
    "నా ఉద్దేశం అది కాదని నీకు తెలుసు. కాని చుట్టూ అందరిని చూస్తూంటే మనదేశంలో పెళ్ళిళ్ళు నూటికి అయిదన్నా సక్సెస్ ఫుల్ మారేజెస్ ఉన్నాయా అన్న అనుమానం వస్తూంటుంది నాకు. సక్సెస్ అంటే పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లలని కంటూ సంసారాలు చేసుకోడంకాదు. ఒకరికి ఒకరు కావాలనుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి వ్యక్తిత్వాలని, అభిరుచులని ఒకరు మన్నిస్తూ, మనసునమనసై, ప్రేమ, అనురాగం, ఆప్యాయత పంచుకుంటూ జీవిస్తున్న భార్యాభర్తలెందరున్నారంటావు? వంటరితనంతో విసుగెత్తో, ఇల్లూ వాకిలి చూసుకోవడానికి ఆడది కావాలనో మగవాడు! తన రక్ష, అండ కావాలని ఆడది కావాలని పెళ్ళిళ్ళు చేసుకుంటారు.   

 Previous Page Next Page