5. నేలలేని, పట్టులేని, నిరాధారమయిన సముద్రమునందు నూరుతెడ్లుగల ఓడమీద ఉన్న భుజ్యుని అశ్వినులు శూరుని చేసినారు. ఇంటికి చేర్చినారు.
6. అశ్వవంతుడయిన వేదుడను రాజర్షి కొఱకు అశ్వినులు తెల్లని గుఱ్ఱమును తెచ్చి ఇచ్చినారు. అది వేదునకు మంగళప్రదము అయినది. అది గొప్పదానము. అందుకే అందరు పొగడినారు. అందువలననే యుద్ధములందు ఉపయోగించు వేదుని గుఱ్ఱము ప్రశస్తము అయినది.
7. సర్వకర్మనాయకులగు అశ్వినులారా ! అంగిరసవంశపువాడు మిమ్ము స్తుతించుచున్న కక్షీవంతునకు అధికబుద్ధిని ప్రసాదించినారు. మావంశీకులకు గుఱ్ఱపు డెక్కలనుండి, కారోతరమను పాత్రలో నూరుకుండల సుర అందించినారు.
(అంగిరసులు సౌత్రామణి అను యాగము చేసినారు. వారు కల్లు కావలెనని అశ్వినులను ప్రార్థించినారు. అశ్వినులు గుఱ్ఱపు డెక్కలనుండి కల్లును కలుగచేసినారు.)
8. అశ్వినులు ఊకనిప్పును మంచువంటి చల్లని నీటితో ఆర్పినారు. చీకటి గృహమున తలక్రిందులుగా పడవేసిన అత్రిని పరిపూర్ణ అవయవవంతుని చేసినారు. అతనికి ఆహారము ఇచ్చినారు. బలము కలిగించినారు. ఇంటికి చేర్చినారు.
9. అశ్వినులు గోతమర్షి కొఱకు బావిని తెచ్చినారు. ఆ బావి అడుగుభాగము మీదను, పైభాగము క్రిందను ఉండునట్లు చేసినారు. ఆవిధముగా చేసి గోతముని దాహము తీర్చినారు. వేలకొలది ధనమును ప్రసాదించినారు.
(అశ్వినులు సమకూర్చిన నీటితో గోతమర్షి ధనవంతుడు అయినాడు.)
10. అశ్వినులు చ్యవనుని వార్థక్యమును కవచమును తొలగించినట్లు తొలగించినారు. పుత్రులు విడిచిన చ్యవనునకు ఆయువు ప్రసాదించినారు. చ్యవనుని కన్యలకు భర్తను చేసినారు.
11. బుద్ధిశాలురగు అశ్వినులు పూడ్చిపెట్టిన ధనమును వెలికితీసినట్లు బావిలో ఉన్న నందర్షిని వెలికితీసినారు. అశ్వినులు చేసిన ఈ గొప్పకార్యము అనుకరించవలసినది. స్తుతించవలసినది. పూజింపవలసినది.
12. ఆరోగ్యప్రదాతలగు అశ్వినులారా ! మీరు అద్భుతకార్యములు చేసినారు. నేను వానిని నా ధనలాభము కొఱకు, ఉరుమువల్ల వర్షమువలె వ్యక్తపరచుచున్నాను. అధర్వపుత్రుడగు దధ్యంగుడు మీకు మధువిద్యను, ప్రవర్గవిద్యను బోధించుట అట్టి ఘనకార్యము అగును.
(ఇంద్రుడు దధ్యంగునకు మధువిద్య, ప్రవర్గ విద్య నేర్పినాడు. ఇతరులకు నేర్పరాదన్నాడు. అశ్వినులు దధ్యంగునితల వేరుచేసి దాచినారు. అతనికి గుఱ్ఱపు తల పెట్టినారు. ఆ విద్యలను దధ్యంగుని నుండి పొందినారు. అది ఇంద్రునకు తెలిసి దధ్యంగుని గుఱ్ఱపుతల నరికినాడు. అశ్వినులు దధ్యంగునకు అతని తలను అతికినారు. ఇది దధీచి కథవలె ఉన్నది.)
13. అశ్వినులు సర్వరక్షకులు, పూజ్యులు. స్తుతించినవారికి వరములు ఇచ్చువారు. వధ్రిమతి నపుంసకుని భార్య. ఆమె అశ్వినులను ఆహ్వానించినది. ఉపాధ్యాయులు చదువును అందించినట్లు అశ్వినులు ఆమెకు హిరణ్యహస్తుడు అను పుత్రుని ప్రసాదించినారు.
14. అశ్వినులు తోడేలు నోటపడిన వర్తక పక్షిని విడిపించినారు. దయగలిగి వారిని స్తుతించినవారికి జ్ఞానము ప్రసాదించినారు.
15. ఖేలుడు అను రాజు భార్య విశ్పల. యుద్ధమునందు ఆమె పాదము పక్షిరెక్కవలె విరిగినది. అశ్వినులు రాత్రికి రాత్రి విశ్పలకు ఇనుపపాదము తగిలించినారు. ఆపాదము ఆమెకు శత్రువుల ధనము తెచ్చుటకుగాను నడుచుటకు ఉపయోగపడినది.
16. ఋజ్రాశ్వుడు తోడేలు రూపమున ఉన్న అశ్వినుల వాహనమునకు నూరు గొఱ్ఱెలను ఆహారముగా ఇచ్చినాడు. ఋజ్రాశ్వుని తండ్రి ఋషాంగిరుడు కొడుకు చేసిన తప్పునకు ఋజ్రాశ్వుని గ్రుడ్డివానిని చేసినాడు. అశ్వినులు ఋజ్రాశ్వునకు తిరిగి కన్నులను సంధించినారు.
17. అశ్వినులు రథమును పందెపు స్తంభమువలె సూర్యుని కూతురు ఎక్కి కూర్చున్నది. దేవతలు అందరు అందుకు ఆమోదము తెలిపినారు. అశ్వినులకు స్త్రీలాభ రూపమగు సంపద సమకూరినది.
18. అశ్వినులారా ! మీరు స్తుతులను మెచ్చువారు దివోదాసుడు మిమ్ము స్తుతించినాడు. మీరు మొసలి, ఎద్దుపూనిన రథమున దివోదాసునకు ధనము, అన్నము తెచ్చి ఇచ్చినారు.
19. జహ్ను మహర్షి సంతతివారు ప్రాతస్సవనము, మధ్యందిన సవనము, సాయంసవనములు మూడును ఆచరించినారు. హవిస్సులు ఇచ్చి అశ్వినులను ఆహ్వానించినారు. అశ్వినులు వారి దగ్గరకు వెళ్లినారు. వారికి సన్మనస్కులయి బలమును, ధనమును, సంతానమును, అన్నమును ప్రసాదించినారు.
20. జాహుషుడు అణురాజునకు శత్రువులు అన్ని దిక్కుల నుండి చుట్టుముట్టినారు. అప్పుడు అశ్వినులు శత్రువును భేదించు తమ రథముమీద బయలుదేరినారు. రాత్రిపూట సుగమ మార్గమున జాహుషుని బయటికి తెచ్చినారు. శత్రువులు ఎక్కజాలని కొండలమీదికి ఎక్కించినారు.
21. అశ్వినులారా ! వశుడను వానికి ఒక్కపూటలోనే వేలకొలది ధనలాభము కలిగించినారు. వరదులగు మీరు ఇంద్రునితో కూడి దుఃఖములు కలిగించు అపకీర్తిగల శత్రువులను నిశ్శేషముగ వధించినారు.
22. ఋచత్కుని పుత్రుడు శరుడు, అతడు దాహముగొని అశ్వినులను స్తుతించినాడు. అశ్వినులు అతనికి బావినీరు బయటకు తెప్పించి ఇచ్చినారు. శయుడనువాని కొఱకు గొడ్డుటావును పాలిచ్చుదానినిగా చేసినారు.
23. కృష్ణుని పుత్రుడు విశ్వకుడు. అతడు సదాస్తుతులందే కాలము గడుపువాడు. విశ్వకుని పుత్రుడు విష్ణ్వాపుడు తప్పిపోయినాడు. అశ్వినులు తప్పిపోయిన తనయుని తండ్రికి తెచ్చి ఇచ్చినారు. పోయిన పశువు మరల లభించినట్లు విశ్వకుడు సంతోషించినాడు.
24. రేభుడు అను ఋషిని రాక్షసులు త్రాళ్లతోకట్టి నీటిలోనికి త్రోసినారు. రేభుడు పదిపగళ్లు, పదిరాత్రులు నీళ్లలో పడి ఉన్నాడు. అట్టివానిని అశ్వినులు, అధ్వర్వుడు స్రువముతో సోమమును పక్కకు చేర్చినట్లు దరి చేర్చినారు.
25. అశ్వినులారా ! మీరు సాధించిన కార్యములను వర్ణించి వివరించినాను. నాకు మంచి గోవులు, పుత్రులు కలుగవలెను. నేను ఈ దేశమునకు రాజును కావలెను. ఇంద్రియ సుఖములు, దీర్ఘాయువు అనుభవించి తన ఇంటికి చేరుకున్నట్లు వార్ధక్యమును చేరవలెను.
ఆలోచనామృతము :
1. మంత్రములందు కథాకథనము ప్రారంభమయినది. ఇది కథకు బీజమువంటిది. ఇచట ప్రారంభమయిన కథపాయలయి, నదులయి, మహానదులయి అవధులులేని సముద్రమంత అయినది. ఒక్కొక్క సంఘటనను కథగా తీర్చుట ముచ్చటగా ఉన్నది.
2. నపుంసకుని భార్యకు సంతానము, గొడ్డటాపుకు పాల విషయము ప్రస్తావించబడినవి. ఇవి కృత్రిమ సంతానమునకు సంకేతములు కావచ్చును.
3. విరిగిన కాలును మరల కూర్చుట కృత్రిమ అవయవములను కూర్చుటకావచ్చును.
4. అశ్వినులు గుఱ్ఱములులేని స్వయంచాలక రథమును కనుగొన్నారని తెలుసుకున్నాము. భూచరమయిన ఎద్దును భూ, జలచరమైన మొసలిని రథమునకు కట్టుట మరొక ప్రయోగము. ఒకే వాహనము నీటిమీదను నేలమీదను ప్రయాణమునకు అనువయినదియు కావచ్చును.
5. అశ్వినులు రథము అతివేగవంతము అని చెప్పినాము. దానిని ధ్రువపరచు కథ 17వ మంత్రమున ఉన్నది.
సూర్యుని అందాల కూతురు సూర్య. ఆమెను దేవతలు అందరు ఆశించినారు. పరుగు పందెమున అశ్వినుల రథము నెగ్గినది. సూర్య అశ్వినుల రథము ఎక్కినది. దేవతలు దానిని ఆమోదించినారు.
ఆరోగ్య దేవతలయిన అశ్వినులకే కదా సూర్యుని పుత్రిక దక్కవలసినది !
6. ప్రతిమంత్రము కథవలె చెప్పవలెననిపించినది. అప్పుడు నేను అనువాదకార్యము మాత్రమే నిర్వహించుచున్నాను అన్న నా పరిధి గుర్తుకు వచ్చినది.
నూట పదిహేడవ సూక్తము - ఋషి - కక్షీవంతుడు
దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. అశ్వినులారా ! సోమరసము సిద్ధముగా ఉన్నది. మీ ముదము కొఱకు చేయబడినది సనాతనుడగు యజమాని మిమ్ము సేవించుచున్నాడు. ఋత్వికులు స్తోత్రములు చదువుచున్నారు. సోమము దర్భలమీద ఉన్నది. మీరు విచ్చేయుడు. మాకు అన్నమును, బలమును ప్రసాదించుడు.
2. అశ్వినులారా ! మీరు సర్వప్రేరకులు. మంచి గుఱ్ఱములను పూన్చిన మీ రథము మనోవేగము కలది. ఆ రథముమీద మీరు యజ్ఞకర్త ఇంటికి వెళ్లుదురు. అదే రథము మీద మా ఇంటికి విచ్చేయుడు.
3. వరములు ప్రసాదించగల అశ్వినులారా ! హితవరుడగు సూర్యుని రాహువు పట్టినపుడు విడిపించినారు. పాపకూపమగు శతద్వార గృహమునుండి అత్రిని రక్షించినారు. ఆమంగళకరుడయి, హింసించు దస్యుని మాయలను వరుసగా నివారించినారు.
4. అశ్వినులారా ! మీరు సత్కర్మలు చేయింతురు. వర్షములు కురిపింతురు. రేభుని రాక్షసులు వీటిలో త్రోసినారు. అవయవములు సడలిన అశ్వమును సేదదీర్చినట్లు రేభుని సేదతీర్చినారు. మీరు చేసిన పనులు నశించునవి కావు.
5. భూగర్భమున నిద్రించువానివలె, చీకటినూతిలో పడినసూర్యునివలె నగలకుగాను తెచ్చిన ముడి బంగారమువలె బావిలోపడి ఉన్న వందన రుషిని అశ్వినులు రక్షించినారు.
6. సత్కర్మ ప్రేరకులగు అశ్వినులారా ! వేగవంతములయిన మీ గుఱ్ఱముల డెక్కలనుండి నూరు కుండల మద్యమును ప్రవహింపచేసినారు. అట్టి ఘనకార్యమును అంగిరసుడునయిన నేను స్తుతించుచున్నాను.
7. అశ్వినులారా ! మీరు సత్కర్మలు చేయింతురు. మిమ్ము స్తుతించిన కృష్ణుడనువానికొడుకు విశ్వకునకు అతని పుత్రుడు విష్ణ్వాపుని తెచ్చి ఇచ్చినారు. ఘోషయను బ్రహ్మవాదిని కుష్ఠురోగమున బాధపడినది. పెళ్లికాక పుట్టింటనే ఉండిపోయినది. మీరు ఆమెనురోగవిముక్తను చేసినారు. భర్తను కూర్చినారు.
8. అశ్వినులారా ! వృషదుని పుత్రునకు చెవులు ప్రసాదించినారు. శ్రావర్షికి కుష్ఠురోగముమాపి భార్యను సమకూర్చినారు. అంధుడయిన కణ్వరుషికి దృష్టి ప్రసాదించినారు. ఇవి అసామాన్య కార్యములు, నుతింపవలసినవి.
9. అశ్వినులారా ! మీరు ఒక్కొక్క పనికి ఒక్కొక్క రూపము ధరింతురు. మీరు వేదునకు వేగముగలది, వేలకొలది ధనములను ఇచ్చునది, శత్రువులకు అందనిది, శత్రువుల సంహరించునది, ఆపదల తరింప చేయునది అగు అశ్వమును అనుగ్రహించినారు.
10. భూరిదాతలగు అశ్వినులారా ! మీ గుణగణములు స్తవనీయములు. భూలోక, ద్యులోక రూపులగు మీకు ప్రియమయిన స్తుతిమంత్రము వెలువడినది. అంగిరో గోత్రులు మిమ్ము పిలిచినపుడు అన్నములతో విచ్చేయుడు. మీస్తుతిని ఎరిగిన నాకు అన్నము ప్రసాదించుడు.
11. అశ్వినులారా ! మీరు పోషకులు, సత్య స్వభావులు, అగస్త్యుడు మిమ్ము స్తుతించినాడు. మీరు బుద్ధిశాలియైన భరద్వాజునకు అన్నము కలుగచేసినారు. 'విశ్పల'కు పోయిన పాదము సంధించినారు.
12. అశ్వినులారా ! మీరు సూర్యపుత్రులు. వర్షప్రదాతలు. శయుని రక్షించినారు. ధనమునిండిన కుండను భూమినుండి వెలికితీసినట్లు నీటిలోపడిన రేభుని పదవనాడు వెలికితీసినారు. కవిపుత్రుని స్తుతులు వినబోయి ఎచట ఉంటిరి?
13. అశ్వినులు తమవైద్యవిద్యచేత చ్యవనుని యవ్వనుని చేసినారు. వారి రథమున 'సూర్య' సంపద సహితముగ చేరినది.
14. అశ్వినులు యవ్వనులు. పూర్వము నుండి స్తుతించదగినవారు. తుగ్రునివలన మరింత స్తోత్రవ్యులు అయినారు. వారు భుజ్యుని పక్షివలె ఎగిరియు, గుఱ్ఱమువలె పరుగెత్తియు రక్షించినారు. తండ్రికి చేర్చినారు.
15. తుగ్రుడు తన కొడుకు భుజ్యుని సముద్రముమీద పంపినాడు. భుజ్యుడు అశ్వినులను పిలిచినాడు. మనోవేగముగల మంచి గుఱ్ఱములు పూన్చిన రథారూఢులు అయిన అశ్వినులు భుజ్యుని రక్షించినారు.
16. ఒక పిచ్చుక తోడేటినోట పడినది. ఆ పిచ్చుక అశ్వినులకు మొరపెట్టుకున్నది. అశ్వినులు వెంటనే ఆ పక్షిని విడిపించినారు. జాహుషుని రథముమీద కొండకొనకు చేర్చినారు. 'విష్వాచుడు' అణు రాక్షసుని కుమారుని విషము ఇచ్చి చంపినారు.
17. అశ్వినుల వాహనమయిన గాడిద తోడేలు రూపము దాల్చినది. ఋజ్రాశ్వుడు ఆ తోడేలునకు నూరు గొఱ్ఱెలను ఆహారముగ అందించినాడు. అందుకు కోపించిన ఋజ్రాశ్వుని తండ్రి అతనిని అంధుని చేసినాడు. అశ్వినులు గ్రుడ్డివాడగు ఋజ్రాశ్వునకు వెలుగువంటి నేత్ర దృష్టిని ప్రసాదించినారు.
18. అంధునకు దృష్టి ఇప్పించుటకు తోడేలు అశ్వినులను ప్రార్థించినది. జారుడు నిర్లక్ష్యముగా ధనము ఖర్చు చేసినట్లు అతడు నూటొక్క గొర్రెలను ముక్కలుగా నరికి నాకు ఇచ్చినాడు.