ద్రుపదుని తమ్ముడు సత్యజిత్తు. అతడు అర్జునుని ఎదిరించినాడు. నూరు బాణములు వేసినాడు. అర్జునుడు వానిని విరిచినాడు. సత్యజిత్తు గుఱ్ఱములను చంపినాడు. సారధిని కూల్చినాడు రధమును విరుగకొట్టినాడు. సత్యజిత్తు పారిపొయినాడు.
ద్రుపదుడు రంగమున ప్రవేశించినాడు. బాణములు అతివేగమున ప్రయోగించినాడు. అతని చేతనున్న బాణము చక్రము వలె కనిపించినది. యముని వాలే విజ్రుంభించినాడు. అర్జునుడు అంతకు మించిన వేగమున బాణములు విడిచినాడు. వారి బాణముల చేత ఆకాశము కప్పబడినట్లయినది.
ద్రుపదుడు బాణము విడిచినాడు. అర్జునుని బాణము నరికినాడు. అప్పుడు అర్జునుడు సింహనాదము చేసినాడు. కత్తి అందుకున్నాడు. ద్రుపదుని రధము పైకి దూకినాడు. ద్రుపదుని పట్టినాడు. ద్రుపదుని సైన్యములు హహకారములు చేసినవి. అర్జునుడు ద్రుపదుని రధపు ఇరుసునకు కట్టినాడు. ద్రోణాచార్యుని వద్దకు తెచ్చినాడు. ద్రుపదుని గురుదక్షిణగా సమర్పించినాడు. ద్రోణుడు అర్జునుని పరాక్రమమునకు మేచ్చినాడు. ద్రుపదుని తెచ్చినందుకు సంతోషించినాడు.
ద్రుపదుడు కట్టుపడి ఉన్నాడు. అవమాన భరమున తలవంచుకున్నాడు. నాటి ద్రోణుని వలె నేటి ద్రుపదుడున్నాడు.
ద్రోణుడు విజయ గర్వమున ఉన్నాడు. తల ఎత్తి ద్రుపదుని చూచినాడు అన్నాడు :-
"నీవెవ్వరివో గుర్తించలేకున్నాను. ఓహో! మీరు ద్రుపద మహారాజుగారా! మీరు పట్టుబదినారు. కట్టుబదినారు. దీనులయి ఉన్నారే! రాజ్యమదాంధము నశించినదా! ఇప్పుడయినను నన్ను గుర్తింతురా! నేను ద్రోణుడను. ఒకనాడు యాచకుడనయి మీవద్దకు వచ్చినాను. నన్ను అవమానించి పంపినారు. ఇప్పుడు మిమ్ము నేను అవమానించినాను. చాలును" అని అర్జునునితో చెప్పి ద్రుపదుని కట్లు విప్పించినాడు.
ద్రుపదుడు విముక్తుడు అయినాడు. కాని ద్రోణుని ఎడ ప్రతీకారము పెంచుకున్నాడు. అవమానమునకు బదులు తీర్చుకొనవలెననుకున్నాడు.
ద్రోణుని పగ తీరినది.
ద్రుపదుని పగరేగినది.
ఆలోచనామృతము
పాంచాలము స్వతంత్ర రాజ్యముగా కనిపించుచున్నది. ద్రుపదుడు శౌర్యవంతుడు, ప్రతాపవంతుడుగా ఉన్నాడు. హస్తిన , పాంచాలముల మధ్య ఏదో స్పర్ధ ఉన్నట్లున్నది. స్పర్ధ సామానుల మధ్యనే సాధ్యము. పాంచాలము హస్తినకు దీటయిన రాజ్యమగును. అస్త్ర విద్యకు, ద్రుపదుడు రాలేదు. అందుకు స్పర్ధ కారణము కావచ్చును.
ద్రుపదుడు ద్రోణుని వెళ్ళగొట్టుటకు మరొక కారణము తోచుచున్నది. ద్రోణుని భార్య కృపి - కృపాచార్యుని సోదరి. కృపాచార్యుడు హస్తినలో ఆచార్యుడు. ద్రోణుని చేరదీసిన అతడు హస్తినకు వేగుగా మారవచ్చును. అట్లని ద్రోణుని పంపివేసినాడు. కాకున్న ద్రుపదుడు అంతటివాడు ద్రోణుని అవమానించుట అసంభవము. అసహజము.
భీష్ముడు ద్రోణుని కధ విన్నాడు. ద్రోణుడు ద్రుపదుని ఎడ పగబూని ఉన్నాడు. అది తనకు అనుకూలము. అట్లని ద్రోణునకు ఆశ్రయము ఇచ్చినాడు.
ద్రోణుడు హస్తినకు చేరినాడు. అప్పటినుంచియే ద్రుపదుని ఆవమానించుటను గురించి పధకము వేసినాడు. అర్జునుడు అందుకు తగినవాడని గ్రహించినాడు. విద్యలు నేర్పినాడు. ఏకలవ్యుడు అడ్డురావచ్చును అనుకున్నాడు. అతనిని అసమర్ధుని చేసినాడు.
ద్రుపదుని ఓడించుటకు అంత ప్రయత్నము కావలసివచ్చినది.
ద్రుపదుడు అంతటి బలవంతుడు.
ధర్మరాజు యువరాజు
వేద వ్యాసుని వలన అంబికకు అంబాలికకు ధృతరాష్ట్ర, పాండురాజులు కలిగినారు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు. కాని గుడ్డివాడు. అతనికి రాజ్యమును రక్షించు శక్తి లేదు. యుద్దము చేయు శక్తి లేదు. కాబట్టి పాండురాజునకు రాజ్యము రావలసి యున్నది. అయినను పాండు రాజు అన్న రాజగుటకు సమ్మతించినాడు. ధృతరాష్ట్రుడు రాజు అయినాడు. పాండురాజు యుద్దములు చేసినాడు. సంపదలు సమకూర్చినాడు. అడవులకు వెళ్ళినాడు పాండవులను కన్నాడు. శాపవశమున నిహతుడు అయినాడు.
అసలు రాజ్యము రావలసినది పాండురాజునకు. రాజు కావలసినవాడు కాలేదు. కాబట్టి అతని కొడుకు యువరాజు కావలసి ఉన్నది. అందును గురించి ధృతరాష్ట్రుడు భీష్మునితో ఆలోచించినాడు. విదురునితో ఆలోచించినాడు. వారిద్దరును ధర్మరాజును యువరాజును చేయవలెనన్నారు. అందుకు ధృతరాష్ట్రుడు సమ్మతించినాడు.
ధర్మరాజును యువరాజు చేసినారు. ధర్మరాజును యౌవరాజ్య పట్టాభిషేకము జరిగినది. భీమార్జున నకుల సహదేవులు నలుదిక్కుల దండెత్తినారు. రాజులను జయించినారు. ధనరాసులను తెచ్చి సమర్పించినారు. ధర్మరాజు యువరాజు. అయినాను సార్వభౌముని వంటి గౌరవమును పొందినారు. నిర్మిల కీర్తిని అర్జించినాడు. అతని యశశ్చంద్రికలు నలుగడల వ్యాపించినవి. సామంతులు అతనిని పొగడినారు. జనులు కీర్తించినారు.
ప్రజలు పాండవులు అయిదుగురిని ఎంతో పొగడినారు. ముఖ్యముగా అర్జునుని పరాక్రమమును వేనోళ్ళ పొగడినారు. అతడు ద్రుపదుని పట్టి తెచ్చుటను గురించి కధలు అల్లి చెప్పినారు.
ప్రజల ప్రశంసలు విన్నాడు ద్రోణుడు. అర్జునుని ఎడల అతని వాత్సల్యము పొంగినది. పొరలింది. అర్జునుని పిలిచినాడు. అతనికి బ్రహ్మశిరమను అస్త్రమును ఇచ్చినాడు అన్నాడు:-
"అర్జునా! నీ గురుభక్తికి మెచ్చినాను. బ్రహ్మశిరము దివ్యాస్త్రము పూర్వము బ్రహ్మ దీనిని అగ్నివేశునికి ఇచ్చినాడు. అగ్నివేశుడు నాకు ఇచ్చినాడు. నేను నీకు ఇచ్చినాను. నీవు మహాతేజోవంతుడవు. ఈ అస్త్రము నీవద్ద ఉండదగినది. స్వల్పతేజస్సు గల మనుష్యుల మీద దీనిని ప్రయోగించరాదు. నిన్ను బాధించు మనుష్యుల మీద ప్రయోగించవచ్చును. అది వారిని అనాయాసముగా గెలువగలదు. నేను నీకు ఈ అస్త్రమును ఇచ్చినాను. అందుకు బదులుగా నాకు నీవు గురుదక్షిణ ఇవ్వవలెను. అది ఏమనగా నేను యుద్దము చేయునపుడు నీవు నాతొ ప్రతి యుద్దము చేయరాదు."
అర్జునుడు అస్త్రమును అందుకున్నాడు. ద్రోణునకు నమస్కరించినాడు. ప్రతియుద్దము చేయకుండుటకు అంగీకరించినాడు. అందుకు మాట ఇచ్చినాడు.
ఆ విధముగా ధర్మరాజు రాజ్యము దేదీప్యమానమయి వెలుగొందినది.