Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 34


    రాజాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ వయసులో స్త్రీ తోడులేక ఒంటరిగా కుటుంబ భారాన్ని మోస్తూ జీవనయాత్ర సాగించటమే కాకుండా దేశంకాని దేశం వచ్చి లక్షలకొద్దీ ధనం వెచ్చిస్తూ ఎన్ని అవస్థలు పడ్డాడు!

 

    "నన్ను చచ్చిపోనివ్వాల్సింది డాడీ! నాకోసం ఎన్నో బాధలు పడ్డారు" అన్నాడు తండ్రితో.

 

    ఆయన మంచంమీద రాజా ప్రక్కనేకూర్చుని తల నిమురుతున్నాడు. "నేను బ్రతికేది మీ యిద్దరి కోసమేరా. మీరంటూ లేకపోతే ఆ బ్రతుకుకు అర్థమేముందిరా?" అంటుంటే ఆయన గొంతు వణికింది.

 

    తర్వాత చెప్పాడు. డాక్టర్లు ఈ కేసుగురించి మొదట్నుండీ ఆశావాదంతో వున్నారు. వాళ్ళెప్పుడూ నిరుత్సాహపడలేదు. ఏరోజుకారోజు నూతనోత్సాహంతో పట్టుదలగా కేసు ట్రీట్ చేస్తూ వచ్చారు.

 

    చివరకు వాళ్ల కృషి నెరవేరింది.

 

    రాజాకు మాధవి గుర్తొస్తోంది. ఆమె తనతో ఎప్పుడూ ప్రేమతో సంభాషించి వుండకపోవచ్చు కానీ ఆమెకు దగ్గరగా, దూరంగా జరుగుతున్న ఆ కాసిని రోజులూ ఎంత లేత బాధతో, తియ్యని విషాదంతో రోజులు గడిచాయి! ఆమె కోసం, ఆమెను పొందటంకోసం ప్రాణాలకు తెగించి ఆమె పెట్టిన పరీక్షల్లో పోరాడాడు. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. చివరిసారిగా... ఎంత భయంకర మైన సాయంత్రమది! ఆమెమీది ప్రేమ సాఫల్యం కోసం సౌగంధికా పుష్పం తీసుకురావటానికి పోయినట్లు తెగించి వెళ్ళి లోయలో పడిపోయాడు. ఆమె పమిట విసిరి ఆదుకోకపోతే...ఆదుకోకపోయినా బాగుండేది. ఇన్నాళ్ళూ బ్రతికున్నా, చచ్చిపోయినవాడితో సమానమే.

 

    మూడు సంవత్సరాలు...మాధవి ఏం చేస్తుంది? తాను గుర్తు వుండి వుంటాడా?

 

    సీతారామారావుగారు లోపలకు వస్తున్నారు.

 

    "రాజూ! ఏమిటాలోచిస్తున్నావు?" అన్నారు ప్రక్కన కూర్చుంటూ.

 

    రాజా ఏమీ జవాబు చెప్పలేదు.

 

    "మాధవి గురించా?"

 

    ఇందాక మాధవి గురించి అడిగినప్పుడు "తెలియదు" అన్నారు. అసలామె గురించి ఆయనకెలా తెలుసు?

 

    అతని మనసులోని సందేహం గమనించినట్లు "నీకు సీరియస్ గా వున్నప్పుడు నీ డైరీ చదవటం తటస్థించింది. ఆమెకు ఫోన్ లో విషయం చెప్పాను" అన్నాడు.

 

    "మీరు ఆమెతో మాట్లాడారా?"

 

    "మాట్లాడాను. ఎంతో ఆందోళన పడింది. వెంటనే బయల్దేరి వస్తానన్నది. కానీ ఎందుచేతనో రాలేదు."

 

    "వస్తానన్నదా?" ఆ మాట చాలు తనకు. ఎందుకని రాలేదో, పోనీ రాలేకపోయిందో - అనవసరం.

 

    "మనం ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపోదాం డాడీ!"

 

    "డాక్టర్ గార్ని అడిగాను. సాయంత్రం వచ్చి పరీక్షలు చేసి చెబుతానన్నారు."

 

    ఆ సాయంత్రం ఆ తెల్లటి పొడవాటి డాక్టరుగారు వచ్చారు. ఆయన పేరు రాడ్నీ స్మిత్! రాజా ఆ హాస్పిటల్లో ఎడ్మిట్ అయినప్పటినుంచీ ఆ కేసు పర్యవేక్షిస్తున్నది ఆయనే.

 

    ఆయన రాజాకి మరోసారి అన్ని పరీక్షలూ చేశారు. అతన్ని మంచంమీద నుంచి లేపి అటూ ఇటూ నడవమన్నారు.

 

    రాజా నడిచాడు. పసిపిల్లవాడు నడిచినట్లు తప్పటడుగులు వేశాడు. కానీ ఎక్కువసేపు నిలద్రొక్కుకోలేకపోయాడు. ఒళ్ళంతా నీరసం ఆవహించినట్లయింది. కళ్ళు చీకట్లు క్రమ్మాయి. చప్పున వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు.

 

    "యు కెన్ గో టు యువర్ కంట్రీ మై బాయ్!" అని చెప్పి "కానీ అప్పుడే పూర్తిగా స్వేచ్చగా వుండటంలేదు.... మీ దేశంలో హైదరాబాద్ లో నా ఫ్రెండ్ డాక్టర్ నరేంద్ర అని వున్నారు. ఆఫ్ కోర్స్! హి ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. బట్ హి ఈజ్ రన్నింగ్ ఎ బిగ్ నర్సింగ్ హోం. అన్ని రకాల కేసులూ ఎడ్మిట్ చేసుకుని డానికి సంబంధించిన స్పెషలిస్టులకు చూపిస్తూ వుంటాడు. ఇంకో అయిదారు నెలలు...నీ హెల్త్ నార్మలైజ్ అయ్యేదాకా అతని సూపర్ విజన్ లో వుంటే మంచిది. హి ఈజ్ ఎ వెరీ నైస్ మేన్. అతనికి లెటరిస్తాను" అన్నాడు రాడ్నీ స్మిత్ ఇంగ్లీషులో.

 

    "అమ్మో! మళ్లీ హాస్పిటల్ కా?"

 

    ఆయన చిరునవ్వుతో "ఇన్నేళ్ళూ నీకు తెలియని స్థితిలో వున్నావు. ఇప్పుడు తెలిసి వుండలేవా?" అన్నారు.

 

    "మీరు చెప్పినట్టే చేస్తాను డాక్టర్!"

 

    అతను హాస్పిటల్ నుంచి డిచార్జ్ అయేటప్పుడు రాడ్నీ స్మిత్ డాక్టర్ నరేంద్రకు లెటర్ టైప్ చేసి యిచ్చాడు.

 

    రాజా వంగి ఆయనకు పాదాభివందనం చేశాడు.

 

    "ఓ...మైగాడ్! వాట్ ఈజ్ దిస్?" అన్నాడాయన ఖంగారుగా వెనక్కు జరుగుతూ.

 

    "పెద్దలపట్ల గౌరవంచూపే మా దేశం ఆచారం డాక్టర్ యిది. మీరు నాకు ప్రాణదానం చేసి పునర్జన్మ ప్రసాదించారు. మీరు నాకు పూజనీయులు" అన్నాడు రాజా లేచి నిలబడి.

 

    ఆయన కనకొలకుల్లో నీళ్ళు నిలిచాయి. రాజాని దగ్గరకు తీసుకుని గాఢాలింగనం చేసుకుని "గాడ్ బ్లెస్ యు!" అన్నాడు చలించే కంఠంతో.


                                    * * *


    రాజా తండ్రితో, తమ్ముడితో కలిసి ఇండియా వచ్చాడు. రాడ్నీ స్మిత్ చెప్పింది నిజమే! అతని శరీరం ఏమాత్రం అలసటను తట్టుకోలేకపోతోంది. రెండు మూడుసార్లు తల తిరిగినట్లయింది. మూడేళ్ళ సుదీర్ఘకాలం శరీరం అజ్ఞాతంగా విశ్రాంతి తీసుకున్నా, అదుపులోకి వచ్చాక ఆ తెలియని విశ్రాంతి సరిపోలేదు. మొదట విజయవాడ మాధవీ వాళ్ళ ఇంటికెళ్ళి వాకబు చేద్దామనుకున్నాడు. అక్కడ లేకపోతే గుంటూరు వెళదామనుకున్నాడు. తన లెక్క ప్రకారం ఆమె ఇప్పుడు ఫైనలియర్ చదువుతూ వుండివుండాలి. కానీ విపరీతమైన నిస్సత్తువ మూలంగా వెళ్ళలేకపోయాడు. విధిలేక సుధాకర్ ని అటుకేసి పంపించి తాను తండ్రితో హైదరాబాద్ వెళ్ళాడు.

 

    రాడ్నీ స్మిత్ యిచ్చిన ఎడ్రస్ ప్రకారం టాక్సీలో నీలిమ నర్సింగ్ హోంకి వెళ్లారు.

 

    విజిటర్స్ రూంలో కూర్చుని లెటర్ లోపలకు పంపించాక ఒకటి రెండు నిముషాల్లోనే పిలుపు వచ్చింది.

 Previous Page Next Page