నూట ఒకటవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు.
దేవత - ఇంద్రుడు. ఛందస్సు - 1-7 జగతి, 8-11 త్రిష్టుప్.
1. ఇంద్రుడు కీర్తనీయుడు. ఋత్విజులారా ! హవీరూపమయి అన్నయుక్తమయిన స్తుతులను ఇంద్రునికొఱకు బిగ్గరగా చదువుడు. ఇంద్రుడు ఋజాశ్వునితోకూడి కృష్ణుడు అను రాక్షసుని, గర్భిణులు అయిన అతని భార్యలను వధించినాడు. వర్షము కలిగించువాడు, కుడిచేత వజ్రముగల ఇంద్రుని సఖ్యము కొఱకు ఆహ్వానించుచున్నాము. మరుత్వన్తం సఖ్యాయ హవామహే
2. ఇంద్రుడు కోపము పెంచుకొని భుజములు తెగిన వృత్రుని, శంబరుని, యాగవిరోధి పిప్రుని, శుష్ణాసురుని మొదలంట నాశము చేసినాడు. మరుత్వన్తం సఖ్యాయ హవామహే
3. ద్యులోక భూలోకములు ఇంద్రుని బలమును అనుసరించుచున్నవి. వరుణుడు, సూర్యుడు నదులు ఇంద్రుని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తించుచున్నవి. మరుత్వన్తం సఖ్యాయ హవామహే
` 4. ఇంద్రుడు అశ్వములకు, గోవులకు అధిపతి. ఇంద్రుడు స్వతంత్రుడు. సర్వకార్య సమర్ధుడు. సాయమునకై అనేకులు ఇంద్రుని ఆహ్వానించుచున్నారు. ఇంద్రుడు యాగవిరోధులను హతమార్చును. మరుత్వన్తం సఖ్యాయ హవామహే
5. ఇంద్రుడు సమస్త జీవ జగత్తుకు అధిపతి. ఇంద్రుడు అంగిరసులకన్న ముందుగనే గోవులను విడిపించినాడు. దస్యులను ఇంద్రుడు నేలకూల్చి చంపినాడు. మరుత్వన్తం సఖ్యాయ హవామహే
6. ఇంద్రుని వీరులు పిలుచుచున్నారు. భయభీతులు పిలుచుచున్నారు. పారిపోవువారు పిలుచుచున్నారు. సమస్త భూతములు ఇంద్రుని తమ కార్యములందు ముందుంచుకున్నవి. మరుత్వన్తం సఖ్యాయ హవామహే
7. ఇంద్రుడు వెలుగుచున్నాడు. రుద్రపుత్రులు మరుత్తుల ఆకర్షణతో అంతరిక్షమున కదలుచున్నాడు. మరుత్తుల ధ్వని ఆకసమున గర్జించుచున్నది. ప్రఖ్యాతుడగు ఇంద్రుని మంత్రములు స్తుతించుచున్నవి. మరుత్వన్తం సఖ్యాయ హవామహే
8. మరుత్వంతుడవగు ఇంద్రా ! నీవు ఉత్తమ స్థానమందును, పురాతన గృహమునందున తృప్తుడవయి ఉన్నావు. ఆ రెండు చోట్ల నుండి మా యాగమునకు విచ్చేయుము. ఇంద్రా ! నీవు శాశ్వత ధనవంతుడవు. నీ కొఱకు హవిస్సులు చేయుచున్నాము.
` 9. ఇంద్రా ! నీవు బలశాలివి. అశ్వవంతుడవు. నీ కొఱకు సోమము పిండి సిద్ధపరచినాము. హవిస్సులు అమర్చినాము. స్తోత్రములను అధిరోహించి విచ్చేయుము. మరుత్తులు, ఇతర దేవతలనుకూడి రమ్ము. కూర్చుండుము. సోమము సేవించుము. సంత్రుప్తుడవగుము.
10. అశ్వవంతుడవగు ఇంద్రా ! సోమపానమునకు నోరు తెరువుము. కొండనాలుక తగులునంతగా తెరువుము. మా మీద మనసు ఉంచుము. మా హవిస్సులను గ్రహింపుము.
11. ఇంద్రుడు మరుత్తుల సహితుడయి పూజలు అందుకొనును. ఇంద్రుడు శత్రునాశకుడు. ఇంద్రుడు మాకు అన్నములను, రక్షణలను ప్రసాదించును. మిత్రుడు వరుణుడు, అదితి, సముద్రుడు, భూమి, అంతరిక్షము మమ్ము రక్షింపవలెను.
నూట రెండవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు.
దేవత - ఇంద్రుడు ఛందస్సు 1-10 జగతి 10-11 త్రిష్టుప్
1. ఇంద్రా ! నీవు ఉత్తముడవు. నీ బుద్ధి గొప్పది. నా స్తోత్రమునకు నీ బుద్ధి ఇసుమంత అంటినది. అందువలననే ఈ స్తోత్రము ఇంత గొప్పది అయినది. ఋత్విజులు ఈ స్తుతి బలమున తమ వృద్ధి సంతానవృద్ధి, కొఱకు ఇంద్రుని ప్రార్థింతురు.
2. ఇంద్రుని కీర్తిని సప్త నదులు ధరించినవి. ముల్లోకములు, సూర్యుడు ధరించినారు. మాకు వస్తు జ్ఞానమునకు సూర్యచంద్రులు ఒకటి తరువాత ఒకరు వెలువడుచున్నారు.
3. ఇంద్రా ! నీ రథము శత్రుంజయము. శత్రువులు మూగిన యుద్ధమున మేము నీ రథమును స్తుతించుచున్నాము. నీవు ఆ రథముమీదనే విచ్చేయుము. మాకు సంపదలను, శంఖములను ప్రసాదించుము.
4. ఇంద్రా ! నీవు కలిసి వచ్చిన మేము శత్రువులను జయించగలము. ప్రతి యుద్దమందును మా పక్షమున నిలువుము. మమ్ము రక్షింపుము. మాకు ధనము సులభముగా లభించునట్లు అనుగ్రహించుము. మా శత్రువుల శక్తిని నశింపచేయుము.
` 5. ఇంద్రా నీవు ధనస్వామివి. తమ రక్షణ నిమిత్తము రావలసినదిగా నిన్ను అనేకులు, అనేకరీతుల నుతింతురు. నీవు నిశ్చల మనస్కుడవయి రథమును ఎక్కుము. మాకు ధనములు ప్రసాదించుము.
` 6. ఇంద్రా ! నీవు గోవులను విడిపించినావు. నీవు జ్ఞానవంతుడవు. శత్రుంజయుడవు. యోద్ధవు. నిరుపమాన బలవంతుడవు. నీవు చేయు ప్రతి పనికి అనేక రక్షణలు ఉన్నవి. అందుకే జనులు ధనముకోరి నిన్ను పలువిధముల ప్రార్థించుచున్నారు.
7. ఇంద్రా ! నీవు నరులకు ప్రసాదించిన అన్నము అపరిమితముగా పెరుగుచున్నది. నీవు శత్రు పట్టణములను ధ్వంసము చేసినావు. మా స్తుతులు నిన్ను వృద్ధిపరుచును. నీవు మా శత్రువులను హరింపుము.
8. ఇంద్రా ! నీవు జనపతివి. నీకు పుట్టినవారిగా శత్రువులు లేరు. సకల ప్రాణుల బలములకు నీవే ఆధార భూతుడవు. నీవు మూడు లోకములను మూడు తేజస్సులను ధరించినావు.
9. ఇంద్రా ! నీవు దేవతలలో శ్రేష్టుడవు. యుద్ధములందు శత్రువును తిరస్కరించగలవాడవు. నిన్ను ఆహ్వానించుచున్నాను. యుద్ధమున నీ రథమున ముందుగా నడిపింపుము. స్తుతికర్తయు, సర్వజ్ఞుడును, శత్రుంజయుడను అగు పుత్రుని ప్రసాదింపుము.
10. ఇంద్రా ! నీవు శత్రువులను జయించువాడవు. శత్రువులనుండి హరించిన ధనములను నిన్ను స్తుతించువారికి ఇచ్చువాడవు. యుద్ధములు కొద్దివైనను గొప్పవైనను నిన్ను ఆహ్వనింతుము. నీవు రథము సహితముగా యుద్ధమునకు విచ్చేయుము.
11. ఇంద్రా ! ఎల్లప్పుడు మా పక్షమున మాట్లాడుము. మేము కపటము ఎరుగని వారము. మాకు అన్నము ప్రసాదించుము. మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రుడు, భూమి, ద్యులోకము మమ్ము రక్షించవలెను. తన్నో మిత్రో వరుణో మామహన్తా మదితిః సిన్ధుః పృథివీ ఉతద్యౌః
నూట మూడవ సూక్తము - ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు.
దేవత - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రుని ప్రసిద్ధ బలమును పూర్వకవులు ప్రత్యక్షముగా వర్ణించినారు. ఇంద్రుని తేజస్సు భూమిమీద అగ్నిగను, ఆకాశమున సూర్యునిగను ప్రకాశించుచున్నది. యుద్ధమున ఎదురగు రెండు పతాకములవలె ఇంద్రుని ఈ రెండు తేజస్సులు విరాజిల్లుచున్నవి.
2. ఇంద్రుడు భూమిని పోషించినాడు. భూమిని విస్తరింప చేసినాడు. వజ్రమున మేఘమును కొట్టినాడు. వర్షము కురిపించినాడు. రోహిణుడు అణు రాక్షసుని కొట్టినాడు. వృత్రుని భుజములు నరికినాడు.
3. ఇంద్రుడు వజ్రి, స్వంత బలమున కార్యములు సాధించువాడు. శత్రు నగరములను ధ్వంసము చేసినవాడు. అట్టి ఇంద్రా ! నిన్ను భజించువారి శత్రువుమీద ఆయుధము విసరుము. వారి ధనమును బలమును వృద్ధిపొందింపుము.
4. ఇంద్రుని బలమును స్తుతించువారికి ఇంద్రుడు బలములు ప్రసాదించును. ఇంద్రుడే యుగములను ఏర్పరచినాడు. ఇంద్రుడు శత్రువులను వధించినాడు. శత్రుంజయుడను కీర్తిని ఆర్జించినాడు.
5. ఇంద్రుడు శూరుడు, శ్రేష్ఠుడు. వర్షి. బహుకార్యరథుడు. అతడు యాగము చేయనివాని ధనము అపహరించును. యజ్ఞము చేయువారికి అందించును. అట్టి ఇంద్రుని కొఱకు సోమము సిద్ధము చేసినాము.
6. ఇంద్రుడు భూరి పరాక్రమవంతుడు. ఇంద్రుని దర్శించుడు. ఆదరించుడు. ఇంద్రుడు హన బలమున గోవులను, అశ్వములను, ఓషధులను కలిగించినాడు. అతడు వర్షము కలిగించినాడు. ధనములు కలిగించినాడు.
7. ఇంద్రా ! మదోన్మత్తుడయి నిద్రించువృత్తిని నీ పరాక్రమమున మేల్కొల్పినావు. అట్టి నీ పరాక్రమమును దేవతల భార్యలు, వాయువులు, సమస్త ఇతర దేవతలు స్తుతించినారు.
8. ఇంద్రా ! నీవు శుష్ణుని, పిప్రుని, కుయుని, వృత్రుని వధించినపుడే శంబరుని కోటలు బ్రద్దలు కొట్టినావు. మిత్రుడు, వరుణుడు, అదితి, సముద్రుడు, భూమి, ద్యులోకము మా ప్రార్థన వినవలెను. మమ్ము రక్షించవలెను.
నూట నాలుగవ సూక్తము - ఋషి - అంగిరసపుత్రుడు కుత్సుడు.
దేవత - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీ కొఱకు వేదిక ఏర్పరచినాము. రాత్రిగాని పగలుగాని యజ్ఞమునకు వచ్చినపుడు, నీ రథమునులాగి తెచ్చిన గుఱ్ఱముల కళ్లెములను వదలిరమ్ము. వేదికమీద ఆసీనుడవగుము.
2. ప్రసిద్ధులు అయిన యజమానులు తమ రక్షణ కొఱకు ఇంద్రుని ఆహ్వానించుచున్నారు. ఇంద్రుడు వారి కర్మములను జరిపించును. ఆ దేవతలు ఆ యాగము సక్రమముగా జరుగుటకు ఇంద్రుని తీసికొనిరావలెను.
3. కుయవుడు ఇతరుల ధనములను ఎరుగును. అతడు స్వయముగా పరుల ధనమును అపహరించును. కుయవుడు నురుగుగల నీటిని ఆక్రమించుకున్నాడు. కుయవుని ఇద్దరు భార్యలు ఆనీటిలో స్నానము చేసినారు. శిఫానది లోతునీటిలో పడి చచ్చినారు.
4. కుయవుడు ఉదక మధ్యమున ఉండగలడు. అక్కడ ఉండి ఇతరులను బంధించగలడు. అతని తావు తెలిసినవారు లేరు. అతడు పూరించిన నీట వృద్ధిచెందినాడు. ప్రకాశించినాడు. అంజన, కులిశ, వీరపత్ని అను నదుల జలము నిండినచోటు కువయుని పోషించుచున్నది.
5. మేము కువయుని చేరు మార్గము కనిపెట్టినాము. మందకు చేరు గోవులవలె ఇంద్రా! నీవు అక్కడికి చేరుము. తదుపరి మమ్ము నిరంతర బాధలనుండి విముక్తులను చేయుము. జారుడు ధనమును పాడుచేసినట్లు మమ్ము పాడుచేయకుము.
6. ఇంద్రా ! నీవు గొప్ప బలవంతుడవు. నీ మీద మాకు పూర్తి విశ్వాసము కలదు. నీవు మమ్ము సూర్యుని సేవించువారినిగా చేయుము. జలములను సేవించువారినిగా చేయుము. అందరి విషయమున ప్రీతిగలవారము అగునట్లుగా చేయుము. మాకు, గర్భరూపమున ఉన్న సంతతికి హాని కలిగించకుము.
7. ఇంద్రా ! నిన్ను మేము మనసున గ్రహించినాము. నీ బలమును నమ్మినాము. అధిక ధనమునకు మమ్ము ప్రోత్సహించుము. ధనములేని ఇంట మమ్ము ఉంచకుము. ఇతర సుత్తి కర్తలకు కూడ అన్నము, పాలు ప్రసాదించుము.
8. ఇంద్రా ! మమ్ము హింసింపకుము. బాధింపకుము. మా భోగములను అపహరించకుము. గర్భములందు ఉన్న మా సంతానమును చెరుపకుము. తండ్రి తాతలనుంచి వచ్చిన యజ్ఞపాత్రలను పోగొట్టకుము.
9. ఇంద్రా ! నీవు సోమప్రియుడవని పూర్వులు చెప్పి ఉన్నారు. నీ కొఱకు సోమము సిద్ధపరచినాము. నీవు అభిముఖుడవయి విచ్చేయుము. కడుపునిండ సోమము సేవింపుము. తండ్రివలె మామాటలు వినుము.
నూట అయిదవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు కుత్సుడు.
దేవత-విశ్వేదేవతలు, ఛందస్సు1-6,8 మహాబృహతి 7,--18 పంక్తి, 19 త్రిష్టుప్.
1. చంద్రుడు ఉదాకముల మధ్య సూర్యకాంతితో ఆకసమున పరువులిడుచున్నాడు. ఆ చంద్రుని బంగారు కిరణముల స్థానమును తెలియజాలము. ద్యాహభూములారా ! ఈ స్తోత్రమును గ్రహించుడు. విత్తంమే అస్యరోదసీ.
2. ధనము కావలసినవారు ధనమును ఆర్జించుచున్నారు. భార్యాభర్తలు కలిసి సుఖించుచున్నారు. వీర్యము ధరించిన భార్య బిడ్డలను కనుచున్నది. విత్తంమే అస్యరోదసీ.
3. స్వర్గమునందున్న పితృదేవతలు భూమిమీద పడకుండవలెను. సోమపానము చేయు దేవతలకు సుఖము కలిగించు పుత్రులకు లేమి కలుగరాదు. విత్తంమే అస్యరోదసీ.
4. అగ్నీ ! నీవు దేవతలలో శ్రేష్ఠుడవు. పూజ్యుడవు. పూర్వపు స్తుతికర్తలకు నీవు చేసిన మేలు ఏది? కొత్తవాడు ఎవడు శుభములు పొందుచున్నాడు? విత్తంమే అస్యరోదసీ.
` 5. దేవతలారా ! ముల్లోకములందు మీ స్థానములు ఎక్కడ? ప్రకాశించు సూర్యుని స్థలములు ఎన్ని ? మిమ్ము స్తుతించు వారి శ్రేయస్సు ఎక్కడ? శత్రువుల కష్టములు ఎక్కడ ? పూర్వము మీకు ఇచ్చిన ఆహుతులు ఏమయినవి. విత్తంమే అస్యరోదసీ.
6. దేవతలారా ! మీ కర్మఫల పోషణ ఏది? వరుణుని ప్రియమయిన చూపు ఎక్కడ? ఆర్యముని సన్మార్గము ఏది? మేము శత్రువులను అతిక్రమింతుము. విత్తంమే అస్యరోదసీ.
7. దేవతలారా ! పూర్వకాలమున సోమము తీయనపుడు స్తుతులను చెప్పినాను. నేనే వాడిని. విత్తంమే అస్యరోదసీ.
8. ఇంద్రా ! ఈ బావియొక్క రెండు దరులు నన్ను రెండు పక్క ఎముకలవలెను, ఇద్దరు భార్యలమధ్య భర్తవలెను నలుపుచున్నవి. ఇంద్రా ! నేను స్తుతించినవాడను. నన్ను బాధలు దారమును ఎలుకలు కొరికినట్లు కొరికినవి. విత్తంమే అస్యరోదసీ.
9. స్వర్గమునందు ఏడు సూర్యకిరణములు ఉన్నవి. నా ప్రాణములు వాటిని అంటుకొని ఉన్నవి. ఉదక పుత్రుడయిన త్రితఋషికి ఈ విషయములు తెలియును. అతడు నూతి నుండి బయటికి రాదలచి సూర్యకిరణములను స్తుతించుచున్నాడు. విత్తంమే అస్యరోదసీ.
(బావిలోని నీటిని ఎండకొట్టిన బయటికి రావచ్చును)