"వెళ్ళొద్దు" అంది పద్మజ ఆదుర్దాగా, తొట్రుపాటుతో.
అతను ఆశ్చర్యంగా చూశాడు.
"అవును మీరు వెళ్ళొద్దు. నన్ను నమ్మండి. మీరు నన్ను డిసప్పాయింట్ చెయ్యలేదు. నిజం మధూ! ప్లీజ్ రండి."
"నన్ను మీరు అసహ్యించుకోవడంలేదా."
"ఉహుఁ"
"నన్ను...నేనంటే అయిష్టమేమీ ఏర్పడలేదా."
ఆమె తలవూపింది సిగ్గుపడుతూ.
అతనికి పెద్ద బరువు తొలగిపోయింది. ఎంత తేలిగ్గా, హాయిగా వుందిప్పుడు? తిరిగివచ్చి కూర్చున్నాడు.
"మిమ్మల్ని చూస్తోంటే నాకంటే ఎంతో చిన్నవారనిపిస్తోంది యిప్పుడు. ఎంత పసిగా వున్నారు? అదేమిటి.....సరిగ్గా కూర్చోండి."
మధుబాబు సోఫామీదనుంచి పాదాలు క్రిందపెట్టేసి "సారీ, అట్లా కాళ్లు మీదపెట్టుకుని కూర్చోవటం అలవాటు" అన్నాడు సిగ్గుపడుతూ.
పద్మజ కొంచెం నవ్వి "అట్లా బ్లంట్ గా చెప్పేసినందుకు సారీ. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు...."అంది.
"హొటల్లో ఎందుకు దిగారు? ఈ వూళ్ళో మీకెవరూ లేరా?" అనడిగింది ఆమె మళ్ళీ.
"ఎందుకు లేరు? వున్నారు."
"ఎవరూ?"
ఆమె తలవంచుకు కూర్చుంది. ఓ క్షణం గడిచాక ముఖం ఎత్తి "ఎంత వేదనగా వున్నదో తెలుసా నాకు?"
"ఏమలా?"
"అర్థం కాలేదా? మీరక్కడ.....నేనిక్కడ యీ నాలుగుగోడలమధ్య. మీకు నేనేమీ చేయలేను. నా ప్రవర్తన చూసి మీరెంతో నిరాశ పొందుతారు. నా వల్ల మీకేమీ శాంతి లభించదు" ఆమె దీనంగా అంది.
"ఎందుకని పద్మా? ఎట్లా రాశావు ఉత్తరాల్లో, వచ్చెయ్యి అని ఎట్లా పిలిచావు?"
"అదంతా... అబ్బా ఎంతో ఆవేశం మధూ! అప్పుడు నువ్వు వస్తే అట్లాగే చేసేదాన్నేమో. ఎన్ని కలలుగన్నాను? అబ్బ! ఎన్ని ఊహలు. నువ్వు వచ్చావని తెలియగానే నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేద్దామనుకున్నాను. మనమిద్దరం ఒక యింట్లో వున్నట్లూ..... నిన్ను నిద్రలేపి కాఫీ అందివ్వటం, ఎక్కడో వంటరిగా.....అబ్బ! ఎంత ఇన్స్పిరేషన్! అందుకే అంతా పాడుచేశావని కోపంగా వుంది. ఎంత డల్ గా వుంది యిప్పుడు కలుసుకోవటం! ఏమిటి మధూ, ఇట్లా చేసేశావు....నన్నింత చేతగానిదాన్నిగా చేసి, యీ స్థితిలో.... ఎట్లా భరించేది మధూ! నేనెట్లా భరించేదీ అవస్థ" పద్మజ పిచ్చిదానిలా తాపత్రయపడిపోతోంది.
మధుబాబు ఓ క్షణం నిదానించి "నేనిప్పుడు రావటం మంచిపని కానట్లయితే..... భవిష్యత్తులో అలాంటిరోజు ఒకటి వుండగలదా పద్మా, నీకు నమ్మకం వుందా?"
"నాకు నమ్మకంవుంది. తప్పకుండా వచ్చేది" అందామె ఎంతో విశ్వాసంగా.
"ఎలా? నీది ఒట్టి కలలుగనే స్వభావం పద్మా. అట్లా ఊహలు నిర్మించుకుని, ఆ ఆశల్లో జీవిస్తూంటావు. ఇప్పుడు లేనిది. యీ జన్మలో, ఒకరి భార్యగా వుండి యెట్లా సాధ్యం? నీకెంతో స్వాతంత్ర్యం వుందనుకున్నాను. ఎన్నో కలలతో, ఏదో జీవిద్దామన్న ఆశతో నిన్ను వెదుక్కుంటూ వచ్చాను. మొదట నిన్నుచూసిన క్షణంలో నాకంటే ఎన్నోరెట్లు యెక్కువగా, తలయెత్తి చూడటానికి అందని అంతస్థులో వున్నావనిపించింది. అంత చనువుగా యీ దేవతకెట్లా రాశాను అనిపించింది. నీక్కూడా వున్నాయా పద్మా యీ బంధాలు, నిబంధనలు. నాకోసం.....నాకోసం బయటికి రాలేవా?"
ఆమె ఖేదంగా, విచారవదనంతో "అయ్యో! నేనుకూడా యెంతో సామాన్యురాల్ని మధూ! మామూలు ఆడదాన్ని....మామూలు ఆడాదాన్ని."
అతనేమీ మాట్లాడలేకపోయాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు.
"కాఫీ తీసుకువస్తాను" అంటూ లేచివెళ్లింది ఆమె.
ఓ అయిదునిముషాల్లో రెండుచేతుల్లోనూ, రెండు కప్పులతో తిరిగివస్తూ "అదిగో మళ్ళీ సోఫామీద కాళ్ళు....."
"సారీ" అంటూ తీసేశాడు.
"ఏం చెయ్యమంటావు చెప్పు పద్మా" అన్నాడతను కాఫీ త్రాగుతూ దిగులుగా.
"నన్నేం చేయమంటారు చెప్పండి."
అతను కొంచెంగా నవ్వాడు.
"నాకు నవ్వు రావటంలేదు" అంది పద్మజ.
"నాకూనూ."
"కాని మీరు నవ్వారు."
"ఏడవలేక."
ఆమె కొంచెంగా ఒణికి, మెల్లగా కాఫీ త్రాగసాగింది.
"నేనిట్లా యిక్కడకు రావటం, యిట్లా వుండటం నీకేమైనా యిబ్బందా!"
"ఇవాల్టికి పెద్ద యిబ్బంది లేదు."
"మీవారు....."
"ఓ అరగంటలో వస్తారు."
అతని మనసంతా అదోలా అయిపోయింది. "నేనింక వెడతాను పద్మా" అన్నాడు అనుకోకుండా.
ఆమె భయంగా చూసింది.
"నేను వెళ్లటం నీకు యిష్టంలేదా?"
"ఉహుఁ" అని తల అడ్డంగా తిప్పింది.
"మరి అయితే వుండేదా?"
"వద్దు."
"ఆయన వస్తారనా?"
పద్మజ నవ్వింది.
"మనం మళ్ళీ ఎలా కలుసుకోవటం?"
"ఎలా.....ఎలా కలుసుకుంటాం.......పోనీ ఓ విషయం చెప్పేదా."
అతను ప్రశ్నార్ధకంగా చూశాడు.
"నన్ను మరిచిపోండి."
"పద్మా."
"నిజం. ఇంతకంటే ఏం చేయలేం మనం. నేను వట్టి అస్వతంత్రురాలిని. మీరిక్కడికి వచ్చి అంత దూరంగా వుండటం భరించలేను. మీరు ఊరికి వెళ్లిపోండి యివాళే."
"పద్మా!" అన్నాడు ఆవేశంగా. "నేను నిన్ను విడిచిపెట్టి మళ్లీ ఆ విశాఖ పట్నానికి పోయి వుండలేను పద్మా. ఆ చదువు, ఆ యాంత్రికమైన వాతావరణం, ఆ వంటరితనం, చీకటి, అర్థరాత్రి ఆలోచన్లు. నేను బ్రతుకలేను పద్మా. నాకు మళ్ళీ ఆ శిక్ష విధించకు. నేను..... నేను....."
ఆమెకు ఏడుపు వచ్చింది. "అట్లాగే వుంటుంది మధుబాబూ. కొంతకాలం అయినాక మళ్ళీ మామూలుగా అయిపోతారు. అలవాటయిపోతుంది' అంది దుఃఖాన్నాపుకుంటూ.
"లేదు పద్మా. నిన్ను విడిచి వుండలేను. నాకెవ్వరూ లేరు. నీతో యింకా యింకా గడపాలి. నాకు తనివి తీరలేదు నీతో చాలా చెప్పాలి యింకా."
"ఎట్లాగ? ఏం చెయ్యను....."
"రేపు నా దగ్గరకు రా పద్మా"
"ఎంత కష్టం మధూ. నేనెలా తట్టుకోగలను?"
"నాకోసం......తప్పదు పద్మా."
ఆమె నిట్టూర్చింది. "అట్లాగే మధుబాబూ"
అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి. "నిజంగానా పద్మా."
"ప్రామిస్."
"వస్తాను. సెలవు" అంటూ అతను ఆమెని విడిచి వచ్చేశాడు.
ఎంత సంతోషంగా వుంది?
అవునవును ఎంతో దుఃఖంగా వుంది.
30
రాత్రంతా నిద్రపట్టలేదు మధుబాబుకు. అతనికి చిత్రంగా వుంది. ఏమిటీ బాంధవ్యం తమ యిద్దరి మధ్యా? అర్థంలేని అయోమయ భ్రాంతి. ఆసక్తిలేని ఆకర్షణ. ఏంచేస్తూ వుంటుంది పద్మజ? కలవరపాటుతో నిద్రపోతూ వుంటుందా?
తానిక్కడనుంచి తిరిగి వెళ్ళలేడేమో అనిపిస్తోంది. జీవితం అయిపోయినట్లుగా వుంది.