Previous Page Next Page 
మహాభారతము పేజి 30

 

    విద్యార్జనమునకు, ఆసక్తి, ఏకాగ్రత, లక్ష్యశుద్ధి అవసరము అనుచున్నాడు వ్యాసదేవుడు. ఇంతకు మించిన పరిశోధన ఇప్పటికీ జరిగినదేమో విద్యావేత్తలు పరిశీలించి చెప్పవలసి ఉన్నది.

                                                      ఏకలవ్యుని కధ

    హిరణ్యధన్వుడు ఎరుకుల రాజు. అతడు కొడుకు ఏకలవ్యుడు. అతడు ధనుర్విద్య నేర్వదలచినాడు. ద్రోణుని ప్రసిద్ది విన్నాడు. అక్కడికి వెళ్ళినాడు. తనకు విద్య చెప్పవలసిందని ద్రోణుని అడిగినాడు. వచ్చినవాడు ఎరుకులవాడు. అది గ్రహించినాడు ద్రోణుడు. ఏకలవ్యునకు చదువు చెప్పుటకు అంగీకరించలేదు. ఏకలవ్యుడు అంతటితో ఊరుకొనలేదు. ద్రోణునకు పాదాభివందనము చేసినాడు. "ఆచార్యా! మీ విగ్రహమును ఏర్పరచుకొందును. దాని ముందు విద్యాభ్యాసము చేతును.' అన్నాడు. తిరిగి వెళ్ళినాడు.
    ఏకలవ్యుడు ద్రోణుని విగ్రహము ఏర్పరచినాడు. విగ్రహమున వినయమున పూజించినాడు. దాని ముందు విద్యాభ్యాసము ప్రారంభించినాడు. అనేక విద్యలు నేర్చినాడు. ధనుర్విద్యలో నిష్ణాతుడు అయినాడు. సమస్త అస్త్ర విద్యా రహస్యములు గ్రహించినాడు.
    ఒకనాడు కౌరవులు, పాండవులు వేటకు వెళ్ళినారు. వారి వెంట భటులు, భటుల వెంట కుక్కలు వెళ్ళినవి. వారు అడవి చేరినారు. వేట ప్రయత్నములలో ఉన్నారు. ఒక కుక్క తప్పించుకున్నది. అడవిలోనికి చొచ్చుకొనిపోయినది. అక్కడ ఏకలవ్యుడు బాణములు వేయుచున్నాడు. కుక్క అతనిని చూచినది. మొరిగినది. ఏకలవ్యుడు కుక్క నోటిలోనికి బాణములు కొట్టినాడు. అతడు ఏడు బాణములు కొట్టినాడు. యేడును ఒక బాణము వలె నోటిలో దూరినవి. కుక్క నోటికి బాధ కలుగలేదు. అది మొరుగుడు ఆపినది. అక్కడి నుండి ఉరికినది.
    కుక్క కౌరవ, పాండవుల వద్దకు వచ్చినది. దాని నోటిలో బాణములున్నవి. రాజ కుమారులు అది చూచినారు. ఆశ్చర్యపదినారు. చకితులు అయినారు. బాణము వేసిన వానిని చూడదలచినారు. బయలుదేరినారు. కుక్క బాట చూపినది. సాగిపోయినారు. ఎదుట ఏకలవ్యుని చూచినారు.
    ఏకలవ్యుడు కృష్ణాజినము ధరించినాడు. దృడముగా ఉన్నాడు. నల్లగా ఉన్నాడు. ధనుర్ధారి అయి ఉన్నాడు. తేజరిల్లుచున్నాడు.
    రాజకుమారులు ఏకలవ్యుని చూచినారు. ఎరుకులవాడని ఎరిగినారు. అతని అస్త్ర విద్యా నైపుణ్యమునకు అచ్చెరువొందినారు. ఒకరి ముఖములు ఒకరు చూచుకున్నారు. అతనిని అడిగినారు :-
    "నీవేవ్వరవు? నీ గురువెవ్వరు?"
    "నేను ఏకలవ్యుడను. ద్రోణాచార్యుల శిష్యుడను" అన్నాడు.
    రాజకుమారులకు ఈర్ధ్య కలిగినది. వారు వేట చాలించినారు. హస్తినకు చేరినారు. ద్రోణునకు ఏకలవ్యుని వృత్తాంతము తెలియబరచినారు. తదుపరి అర్జునుడు ద్రోణుని వద్దకు వెళ్ళినాడు. "మహాత్మా! ధనుర్విద్యలో నన్ను మించువాడు లేకుండ నేర్పుదువని చెప్పితివి అడవిలో ఏకలవ్యుని చూచినాము. అతడు నన్ను కాదు మిమ్ము గూడ మించునట్లున్నాడు. అతడు మీకు ప్రియ శిష్యుడనని చెప్పుకోనుచున్నాడు."
    ద్రోణుడు అది విన్నాడు. ఆశ్చర్యపడినాడు. అర్జునునితో బయలుదేరినాడు. ఏకలవ్యుడు ఉన్న చోటునకు వచ్చినాడు. తన విగ్రహమును చూచినాడు. ఏకలవ్యుని చూచినాడు. చకితుదు అయినాడు.
    ఏకలవ్యుడు ద్రోణాచార్యులను దర్శించినాడు. అతనిలో ఆవేశము పొంగినది. గురుభక్తి వినయమున నమస్కరించినాడు. అర్ఘ్యము అందించినాడు. పాద్యము ఇచ్చినాడు. చేతులు దోయిలించుకొని నిలుచున్నాడు.
    "ఏకలవ్యా! నీవు మాకు శిష్యుడవు అని చెప్పినావు. మా విగ్రహము ముందు విద్యలను నేర్చినావు. మాకు గురుదక్షిణ ఇవ్వవలె. ఇత్తువా?" అని అడిగినాడు ద్రోణుడు.
    "ఆచార్యావర్యా! నా దేహము మీ సొత్తు. నాకున్న సకల సంపదలు మీవి. నా బంధుజనులు మీవారు. కొరుకోనుడు ఏది కావలెనన్నను సంతోషముగా ఇత్తును."
    అది విన్నాడు ద్రోణుడు. క్రూరత్వమునకు తలపదినాడు. కఠినుదు అయినాడు. తన శిష్యుడు అర్జునుడు. అతనిని మించినవాడు ఉండరాదు. అంత ద్రోణుడు బుద్దితో ఇంత అయినాడు. తలవంచుకున్నాడు. ఏకలవ్యుని ముందు చేయి చాచినాడు. అతనిని అడిగినాడు :-
    "ఏకలవ్యా! గురుదక్షిణగా నీ కుడి చేతి బొటనవేలు నాకు కావలెను"
    ఏకలవ్యుడు ద్రోణుని మాటలు విన్నాడు. ఇసుమంత ఆలోచించలేదు. నిర్వికారముగా తన కుడి చేతి బొటనవేలు నరికినాడు. ద్రోణునికి దక్షిణగా అర్పించినాడు.
    ఆ విధముగా ఏకలవ్యుడు బాణము సంధించలేనివాడు అయినాడు. అతడు ఆర్జించిన విద్యలన్నియు అంతరించినవి.
    ద్రోణుడు తన మాట నిలుపుకున్నవాడు అయినాడు.
    అర్జునుడు మొనగాడు అయినాడు. అతనిని మించినవారు లేకుండపోయినారు.
    
                                                                                 ఆలోచనామృతము
    
1. ఏకలవ్యుని వృత్తాంతము మనసు చివుక్కు,మనిపించును. విద్యాతృష్ణ జాత్యహంకారమునకు బలియగుట విచారకరము. కాని నేడు జరుగుచున్నది ఏకలవ్యుని వృత్తాంతమునకు బిన్నము కాదు. పుట్టుకను బట్టి కొన్ని జాతులకు విద్యావకాషములు విరివిగాను, కొన్ని జాతులకు తక్కువగాను కల్పించుట జరుగుచున్నవి. ఇది మనవతకే అవమానము. విద్య ఏజాతి గుత్తసొత్తు కాదు. అట్లు గుత్తసొత్తు చేయుట అనాగరికము. నేటి ఏలికలు, విద్యను అనాగరికము చేసినారు.
2. కృపాచార్యుని జన్మ వృత్తాంతములో శరద్వంతుని కధ చదివినాము. ఆలోచించినాము. శరద్వంతుడు బ్రాహ్మణుడు . అస్త్ర విద్యకు ఉపక్రమించినాడు. ఇంద్రుడు సహించలేదు. అందుకు విఘ్నము కలిగించినాడు. శరద్వంతుడు తన ఉద్యమము వీడలేదు. కృపాచార్యుని అస్త్ర విద్యా పారంగతుని చేసినాడు. శరద్వంతుని ఉద్యమము లేకున్న బ్రాహ్మణులకు అస్త్ర విద్య ఉండెడిది కాదు. కృపుడు, ద్రోణుడు ఉండువారు కాదు.
    ఇందు బట్టి అప్పటికి వృత్తి విభజనము స్పష్టముగా జరిగినట్లు విదితము అగుచున్నది. ఏవృత్తి వారు ఆవృత్తినే అవలంభించుట ఆనాటి సామాజిక అవసరముగా కనిపించుచున్నది. నాడు నేటివలె శిక్షణ సంస్థలు లేవు. ప్రతి కుటుంబము ఒక శిక్షణా సంస్థ. తండ్రి నుండి కొడుకు వృత్తిని నేర్చుకొనును. ప్రతి వృత్తియు సమాజమునకు అవసరమే. కొన్ని ఆకర్షకమయిన వృత్తులు ఉందును. అందరును అటువైపునకు ఆకర్షితులు అయిన సమాజము సాగుట కష్టము. అందువలన పుట్టిన వృత్తిని వీడరాదను నియమము విధించినారు.

 Previous Page Next Page