Previous Page Next Page 
నిశాగీతం పేజి 30


    ఉదయ్ రిసీవర్ పెట్టేసి, జయంత్ చెయ్యి పట్టుకుని, త్వరత్వరగా బయటికి లాక్కొచ్చాడు.
    రెండు నిముషాల వ్యవధిలో కారెక్కి బయలుదేరారు. జయంత్ వేగంగా కారు  నడుపుతూ ముందున్న  రోడ్డును చూస్తున్నాడు.
    ఉదయ్ అతడి పక్కన కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
    "ఇది మరొక ట్రాప్!"
    "చివాల్న తల తిప్పి జయంత్ కేసి చూశాడు ఉదయ్ .
    "అవును ఉదయ్ . మళ్ళీ ఉచ్చువేస్తున్నారు. ఆ నగలపెట్టే దొరికినట్టులేదు మళ్ళీ నీ నుంచి....."
    "అలా అని నేను అనుకోవడంలేదు. మళ్ళీ నేను వాళ్ళ ట్రాప్ లో పడ్తానని నమ్మేంతటి తెలివితక్కువవాడు కాడు  ఆ శివరామయ్య . ఒకవేళ అలాంటి ప్రయత్నమే చేసినా  మళ్ళీ  మానసిని ప్రయోగిస్తాడని అనుకోను, అందులోనూ ఆ పాత పద్ధతిలోనే ఇంతవరకూ వర్సుయేషన్ మనియాక్ గా నటించిన మానసి. ఈసారి నిజంగానే వేటాడబడుతుందేమోననుకొంటాను. ఆమె గొంతులో ధ్వనించిన  భయం, గాభరా, విహ్వలత, ఇదివరటికలా లేవు. ఈసారి నిజంగానే  ఆమెను వాళ్ళు  వెంటాడుతూవుండాలి. శివరామయ్య ఆడుతున్న నాటకంలోని చరమాంకానికి తెర లేచినట్టుంది. ఇప్పుడు శివరామయ్య ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఒక్కొక్కళ్ళనే వదిలించుకొనే  ప్రయత్నంలో ఉన్నడనిపిస్తోంది. ఎనీవే....లెటజ్ సీ!" ఉదయ్  కర్చీపుతో ముఖానికి పట్టిన చిరుచమట్లు తుడుచుకొన్నాడు.
    ఇరవై నిముషాల్లో పార్క్ చేసి, ఇద్దరూ బస్ స్టాండ్ కేసి నడవసాగారు.
    "ఉదయ్  బి కేర్ పుల్!"
    "ఏం?"
    "వాడ్ని చూడు! వాడు....అదుగో వాడే...."అంటూ దూరంగా నిలబడ్డ ఒక దృఢకాయుడికేసి చూపించాడు జయంత్.
    "ఉదయ్, అతడ్నీ ఆ పరిసరాల్ని పరికించిచూశాడు. తేలిగానవ్వేశాడు.
    "ప్రమాదాన్ని ఊహిస్తున్న మనసుకు ప్రతిదీ సందేహస్పదంగానే కన్పిస్తుంది. జయంత్! సరిగా చూడు. వాడెవడో  మాప్టీలో వున్న సి.ఐ.డిలా వున్నాడు. పద!" అంటూ ఉదయ్ ఎన్ క్వయిరీ కౌంటర్ కేసి నడిచాడు.
    ఊపిరి బిగపట్టి మానసికోసం చూస్తున్నాడు.
    క్షణాలు గడిచినై.
    నిముషాలు గడిచినై.
    మానసి జాడ లేదు,
    మానసి వాళ్ళకు దొరికిపోయిందా?
    ఆ ఆలోచన రాగానే ఉదయ్ కు మెదడు స్తంభించిపోయినట్టయింది.
    "ఉదయ్!ఆమెను....ఆస్టాల్ పక్కనుంచి వస్తున్నా ఆమెను చూడు...."
    ఉదయ్ ఆశగా, ఆతృతగా  తలతిప్పి చూశాడు.
    "ఛఛ ఆమె కాడు. మానసి చాలా అందగత్తె విశాలమైనకళ్ళు__ఆ కళ్ళపైగా ఇంద్రధనుసుళ్ళా వంగిన కనుబొమ్మలు__ప్రవరాఖ్యుడికైనాపిచ్చెక్కించగల పెదవులూ___ఆ ముక్కూ___ఆ  చెక్కిళ్ళూ___ఆ అందం___"
    "ఆమె నీకు కవిత్వాన్ని కూడా నేర్పినట్టుందే!" భుజంమీద మృదువుగా తట్టి అన్నాడు జయంత్.
    "నువ్వే చూస్తావుగా మానసి ఎంత అందగత్తో? నువ్వు గుర్తుపట్ట గలగడానికే ఆ వర్ణనంతా. అలాంటి ఆడది కన్పిస్తుందేమో చూడు" అని ఉదయ్ తల తిప్పుతూ నలువైపులా మానసికోసం చూడసాగాడు.
    "ఇలా ఇక్కడ ఎంతసేపని  నిలబడతాం?" జయంత్ అసహనంగా అన్నాడు.
    "మానసి వాళ్ళ చేతుల్లో పడలేడనే సమస్యను కలిగేంతవరకు ఇక్కడే నిల్చోవడం  మంచిది. మానసి చాలా తెలివైంది. వాళ్ళను  ఎలా అయినా తప్పించుకోగల  సమర్ధురాలు బహుశా వాళ్ళీదరిదాపుల్లో ఎక్కడో ఉన్నారనే అనుమానంతోనే , ఏ క్లోక్ రూం లోనో దాక్కుని వుండవచ్చు తను వచ్చేంతవరకు ఇక్కడే వుండమని కోరింది. చూద్దాం!" అన్నాడు ఉదయ్. 
    "అయితే నువ్విక్కడే నిలబడు. నేను అలా ఓ రౌండువేసి వస్తాను" అని జయంత్ ఆగివున్న బస్సు  దగ్గిరకెళ్ళాడు.
    జయంత్ వెళ్ళిన  రెండునిముషాలకు ఉదయ్  భుజాన్ని రెండుమృదువైన వేళ్ళు తాకాయి.
    అతడు మెల్లగా తిరిగి చూశాడు.
    "మానసీ!"
    "పదండి!త్వరగా!" ఆమె గొంతు వణికింది.
    "ఎవరతడు?" మెల్లగా  అనునయిస్తూ అడిగాడు ఉదయ్.
    "ఇంతవరకూ  మీ పక్కనే నిలబడివున్నాడే  అతడే!"
    "అతడెవరనుకోంటున్నావ్? అతడు  నా స్నేహితుడు డాక్టర్  జయంత్  రావు. నువ్వు ఫోన్ చేసింది ఆయన నర్సింగ్  హొమ్ కే. ఆఁ! అవును! నీకు  డాక్టర్  జయంత్ ఫోన్  నంబరు ఎవరు చెప్పారు? నేను అతడి దగ్గర ఉన్నట్టు ఎలా తెలిసింది?"
    "మీ నర్సింగ్ హొమ్ కు ఫోన్ చేశాను. మీ స్టాఫ్ నర్స్  విజయ నాకోసం వెదుకుతున్నారని చెప్పానుగా? పదండి."
    "భయపడకు నువ్వు  నాదగ్గర వుండగా వాళ్ళు నిన్నేమీ చెయ్యలేరు. జయంత్ ను రానియ్. నీ  కోసమే  వెదకడానికి  వెళ్ళాడు. కారు కీస్  అతని దగ్గిరే వున్నాయి. అతడ్ని రానియ్యి  పోదాం."
    "నా కోసం వెళ్ళాడా? అతడు శివరామయ్య మనిషి ఏమోనని  అనుమనపడ్డాను. మీతో  పని వున్నట్టుగా నటించి, నా గురించి తెలుసుకోవడానికి, మీ దగ్గిరకొచ్చాడని అనుమానపడ్డాను. అందుకే అతడు మీ దగ్గిరనుంచి వెళ్ళిపోయేదాకా, అదుగో అక్కడ ఆ షెడ్డువెనక నీడలో నిలబడివున్నాను." ముఖంమీది చెమటను పైటకొంగుతో తుడుచుకుంటూ అన్నది. 
    డాక్టర్ జయంత్ రావు వస్తూనే మానసిని ఆశ్చర్యంగా చూశాడు.
    ఉదయ్ వర్ణించినంత అందం  అతడికి ఆమెలో కన్పించలేదు.
    "కమాన్__లెటజ్ గో" ఉదయ్ జయంత్ ను హెచ్చరించాడు.
    "మానసీ, డాక్టర్ ఉదయచంద్ర కార్లో వెనక కూర్చున్నారు.
    జయంత్ కారు స్టార్ట్ చేసి వేగంగా పోనిస్తున్నాడు.
                                                                     18
    క్రాంతి నర్సింగ్ హొమ్ లో డాక్టర్ జయంత్ రావు చేంబర్లో మానసి రిక్లాయినింగ్  చైర్లో వెనక్కువాలి కూర్చునివుంది. ఆమెకు ఎదురుగా రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు ఉదయ్. డాక్టర్ జయంత్ రావు  టేప్  ఆన్ చేసి  సిద్దంగా వున్నాడు.
    మానసి గొంతు సవరించుకొని ప్రారంభించింది.
    "నాపేరు మాధవి. చాలా చిన్నప్పుడు మా అమ్మతో కలిసి నాటకాల్లో వేషాలు వేసేదాన్ని. లోహితాశ్యుడూ, ప్రహ్లాదుడూ, ప్రహ్లాదుడూ, ధృవుడూ వేషాలు వేసేదాన్ని వయసొచ్చాకా రెండు సినిమాల్లో చెల్లెలు పాత్ర, మూడు చిత్రాల్లో వాంపు రాలూ  చేశాను. ఓక చిత్రంలో హీరోయిన్ గా  కూడా వేశాను. అప్పుడే శివరామయ్యగారి అన్న కొడుకు రాంబాబు  పరిచయం అయ్యాడు. శివరామయ్యే ఆ చిత్రానికి ప్రొడ్యుసర్. ఆ సినిమా మూడు రోజులు ఆడాక డబ్బాలు తిరిగొచ్చాయి."
    "శివరామయ్య సినిమా తీశాడా?"
    "ఆ! తీశాడు. ఆపిల్చార్ ఫెయిల్ అయినా శివరామయ్య మరో  సినిమా తీససే ప్రయత్నంలో ఉన్నాడు.సినీమా మొదలు పెట్టేసరికి మద్రాసు తీసుకోస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. హిరోయిన్ వేషం తప్పకుండా  నాకే ఇప్పిస్తానని ప్రామిస్ చేశాడు....."
    "రాంబాబు కలకతాలో ఏం చేస్తుండేవాడూ?" ఉదయ్ అడిగాడు.
    "బ్లాక్ మేజిక్ ప్రాక్టీసు  చేస్తూవుంటాడు."
    "బ్లాక్ మేజికా!" నొసలు ముడిచి కళ్లు చిట్లించి చూశాడు.
    "క్షుద్రశక్తులను ఉపాసించే ఓకఆర్గనుజేషన్ తో ఇతడికి సంబంధం వున్నది." మాధవి ముఖంలో వచ్చిన  మార్పును ఉదయ్  గ్రహించాడు.
    ఆమె ముఖం పాలిపోయింది. భయంతో వణికిపోతున్నది. వళ్ళంతా చెమట్లు పోశాయి.
    "మాధవీ భయపడకు నువ్వు నా దగ్గర క్షేమంగా ఉన్నావు. వాళ్లు నిన్నేమీ చెయ్యలేరు. మనసుని అదుపులోకి  తెచ్చుకో. ఆలోచించిస్థిమితంగా చెప్పు. మనో దైర్యంగల వ్యక్తిత్వం  నీది. తెలివైనడానివి." అనునయిస్తూ ప్రోత్సహించాడు ఉదయ్.
    "థ్యాంక్యూ డాక్టర్ థ్యాంక్యూ" మాధవి  కంఠంలో ఆత్మవిశ్వాసం ధ్వనించింది!
    "బుచ్చిబాబే రాంబాబు? అవునా?"
    "అవును డాక్టర్! అవును! మీకెలా తెలిసింది?" దాదాపు అరిచినట్టుగానే అన్నది.
    "నన్ను హ్లిప్నటైజ్ చేసింది బుచ్చిబాబు ఐమీన్ రాంబాబే కదూ?"
    "అవును!రాంబాబే, శివరామయ్య మీతో  అమెరికాలో సూరిబాబు వున్నాడనీ, అతడికి నన్నిచ్చి....అంటే మానసినిచ్చి పెళ్ళి చెయ్యాలను  కుంటున్నట్టు మీకు  చెప్పాడు. అదంతా పచ్చి అబద్దం."
    డాక్టర్ ఉదయ్ జయంత్ ను అర్థయుక్తంగా చూసి నవ్వాడు. తమ విశ్లేషణ సరయిన మార్గంలో నడుస్తున్నందుకు గర్వంగా చూశాడు.
    "నేను తోటనుంచి వెళ్ళిపోయాక ఏం జరిగిందో వివరంగా చెప్పు"
    "బావి  చుట్టూ ఉన్న పనసచెట్లలో  ఉత్తరపు దిక్కున వున్న చెట్టు కింద పెట్టె దొరికివుండాలి. ఆ గుంతలోనే అడివయ్య శవాన్ని పూడ్చి పెట్టారు."
    ఉదయ్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.
    "అడివయ్యను చంపేశారా?"
    "మీరు వెళ్ళాక శివరామయ్య, వీరభద్రుడూ కలిసి తోటలోకి వెళ్ళారు. అంతకుముందునుంచీ రాంబాబు తోటలోనే వున్నాడు. శివరామయ్య నన్ను బంగళాలోనే ఉండమని హెచ్చరించి వెళ్ళాడు. నేను ఏఃస్యంగా అరటి తోటలోకి వెళ్ళి దాక్కుని  చూశాను. అడివయ్యశవాన్ని బావి దగ్గిరి  షెడ్డులో నుంచి బయటికి మోసుకొచ్చారు. దూరంగా తూర్పు దిక్కున త్రవ్వి వున్న గుంటలో పడేసి మట్టి కప్పారు. మిగతా గుంటలు పూడ్చే పనిలో వాళ్ళుండగా నేను తిరిగి  మెల్లగా బంగలాలోకి వచ్చేశాను...."
    "ఊఁ చెప్పు! ఆ తర్వాత  ఏం జరిగింది?"
    "వాళ్ళ  ప్రవర్తనను పట్టి  చూస్తే వాళ్ళకు  నగలపెట్టే దొరికిందనే  అనుకోవాలి. ఈ రహస్యం బయటపడకుండా వుండటానికే అడివయ్యను చంపేశారు.
    ఆ తర్వాతవంతు నాది  అనేది అర్థం అయింది" మాధవి కంఠం వణికింది.
    "అలా అని ఎందుకనుకొన్నావ్?"
    "కలకత్తా తీసుకెళ్ళి రాంబాబు నన్ను కాళీమాతకు  బలి ఇవ్వడానికి నిశ్చయించుకున్నట్టు నా మనసు  శంకించింది. ఆ  క్షణంనుంచి  ఎలా  తప్పించుకోవాలా అనే ఆలోచనలో  పడ్డాను. అవకాశం కోసం ఎదురు చూస్తూ  వున్నాను. ఈ రోజు పగలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపాను. వీరభద్రుడూ, రాంబాబో ఎవరో  ఒకరు  నన్ను  కనిపెట్టుకొనే  వున్నారు. వాళ్ళు నన్ను ఒక్క క్షణంకూడా  వంటరిగా  వదల్లేదు. బంగళా విడిచి వాళ్ళు బయటికి  వెళ్ళలేదు! శివరామయ్య  ఒక్కడే  ఒకటి రెండు  సార్లు బయటికివెళ్ళి వచ్చాడు. చీకటి  పడగానే  రాంబాబూ, వీరభద్రుడూ నన్ను తీసుకొని బయలుదేరారు. రాంబాబు కారు డ్రైవ్ చేశాడు. వీరభద్రుడు వెనకసీట్లో నాకు కాపలాగా కూర్చున్నాడు. అంతకుముందు ఎప్పుడూ  రాంబాబు నన్ను ముందుసీట్లో తన పక్కనే కూర్చోబెట్టుకునే వాడు. నన్ను వెనక సీట్లో కూర్చోబెట్టి నా పక్కన  వీరభద్రుడ్ని కూర్చోపెట్టడంతోటే నాకు వాళ్ళ ఉద్దేశ్యం అర్థం అయింది....." ఓ క్షణం  ఆగి మళ్ళీ చెప్పసాగింది. 

 Previous Page Next Page