Read more!
 Previous Page Next Page 
ప్రార్థన పేజి 4


    డాక్టర్ సమాధానం చెప్పలేదు. అతడు పాప దగ్గరికి వెళ్ళి వేళ్ళతో గొంతు దగ్గర తడుముతూ "అంటీ బయోటిక్స్ ఏమీలేవా...., పెన్సిలిన్?" అన్నాడు.

 

    "ఉహూ..."

 

    "ఆంటీ పైరటిక్స్ - ఎ.పి.సి.?"

 

    ఇంతసేపటికి ఓ మంచి సమాధానం దొరికినట్టు "లేవు! దిసీజ్ పి.హెచ్.సి." అన్నాడా డాక్టర్.

 

    "బట్ ష్యూర్ యూ హావె వెట్ క్లాత్!" (ఒక తడిగుడ్డ)

 

    డాక్టర్ ముఖం మ్లానమైంది.

 

    వసుమతికి వాళ్ళు మాట్లాడుకుంటున్న వైద్య సంబంధమయిన మాటలు అర్థంకాలేదు. కానీ అతడు ఆ డాక్టర్ని అలా నిలదీస్తూ వుంటే వర్షంలో తడుస్తూ చిన్న పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టినట్లు కొట్టాలనిపిస్తూంది. చిన్నపిల్లలు క్లాసులో దెబ్బలాడుతున్నప్పుడు బలంలేని స్టూడెంట్ ని బలవంతుడు కొట్టాక, టీచరు వచ్చి వాడిని దండిస్తూ వుంటే మొదటి కుర్రాడికి కలిగే సంతోషం లాంటిది-  

 

    వచ్చిందెవరో డాక్టర్ కి తెలీదన్న విషయాన్ని ఆమె గ్రహించింది. కానీ ఆ కుర్రడాక్టరు అన్ని ప్రశ్నలకి మారు మాట్లాడకుండా సమాధానం చెప్పే విధానం చూస్తూంటే, అలా చెప్పాల్సిన అవసరం తనకు లేదని కూడా అతడు మర్చిపోయాడని అనిపిస్తుంది. దానిక్కారణం అడిగే వ్యక్తి కంఠంలో వున్న కమాండ్- సబ్జెక్ట్ ని మోనోటోన్ లా అతడు ప్రశ్నించే విధానం- అన్నిటికన్నా ముఖ్యంగా అవతలి మనిషిని కట్టిపడేసే తీక్షణమైన చూపు.

 

    అతడు పాపని చేతుల్లోకి తీసుకుంటూ, "డాక్టర్ దగ్గరకు పేషంట్లు అతడు తమ్ము రక్షించే దేముడన్న నమ్మకంతో వస్తారు ఫ్రెండ్! మీరు మీ అమూల్యమైన కాలంలో ఒక్కక్షణం వెచ్చించి పాపని నోరు తెరవమని పరీక్షించి వుంటే ఈ జ్వరానికి కారణం మలేరియా కాదనీ, టాన్స్ లైటిన్ అనీ తెలిసివుండేది" అంటూ కారువైపు నడుస్తూ.... "రండి వెళదాం" అన్నాడు.

 

    చిత్తరువులా నిలబడిపోయిన వసుమతి అతడి పిలుపుకి ఉలిక్కిపడి నిద్రలో నడిచినట్టు వెళ్ళి కారులో కూర్చుంది. చిన్న కుదుపుతో కారు కదిలింది.

 

    కారు ఊరివైపు వెళ్తూంటే అతనన్నాడు, "ముందు మీ డ్రిల్లు టీచర్ దగ్గర వాకబు చేశాను. అతడిని వదిలిపెడ్తాననుకోకండి. అంత బాధ్యతా రహితంగా ఒక లేడీ టీచర్ని, స్టూడెంట్ నీ గాలికి వదిలేసి వెనక్కి వచ్చేస్తాడా... కమిటీలో పెట్టిస్తాను... అన్నట్టు మీకు థాంక్స్ చెప్పటం మరచిపోయాను కదా! నిజంగా థాంక్స్... తన స్టూడెంట్సుపట్ల ఇంత శ్రద్ధ తీసుకునే మాస్టర్లు అరుదు"

 

    వసుమతి సిగ్గుతో "నేను చేసిందేముంది? ప్రార్థనంటే నాకిష్టం" అంది.

 

    "ఈజిట్? ... అవునవును. ప్రార్థనంటే ఇష్టం ఎవరికుండదు? షీ ఈజ్ నైస్ గర్ల్" అన్నాడు. అప్పుడొచ్చింది ఆమెకి అనుమానం. అయిదు నిముషాల క్రితం ఒక మేధావిలా డాక్టర్ తో వాదించి, ఇప్పుడు చిన్నపిల్లాడిలా మాటలకోసం తడుముకుంటూ షీ ఈజ్ నైస్ గర్ల్ అంటాడు. ఇంతకీ ఇతడెవరా అని? కానీ ఎలా అడగాలో తెలియక వూరుకుంది. అంతలో అతడే "మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, ముందు దింపేస్తాను" అన్నాడు. ఆమెకు అలా ఆవకాశం దొరికి "ముందు ప్రార్థనని..." అంది.    

 

    అతడు అయోమయంగా "ప్రార్థనేమిటి? ప్రార్థన నాతోపాటే? నా ఇంట్లో ..." అని ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఆగి, "ఓ! నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదూ. నా పేరు భార్గవ- విజయభార్గవ! కపాడియా ఇన్ స్టిట్యూట్ పని చేస్తున్నాను..." కారు స్లో చేస్తూ... అన్నాడు. "ప్రార్థన నా కూతురు".

 


                                                                          3

 


    "పంచదార నాలుగు చెంచాలు".

 

    "చిన్నవా పెద్దవా?"

 

    "ఇందులో వ్రాసిలేదు"

 

    శ్రీనూ బుర్ర గోక్కుని, పెద్ద చెంచాతో రెండూ, చిన్న చెంచాతో రెండూ వేశాడు.

 

    "ఊ! ఇంకా"

 

    జిన్నీ చేతిలో పుస్తకంవైపు చూసి చదివి, "అంతే బావా, ఇంకేమీ లేదు పంచదార వేసిన రెండు నిముషాలకి పాలు మరుగును అని వ్రాసుంది అంతే. ఆ తరువాత కోడిగుడ్డు వేయాల్ట" అంది. ఇద్దరూ స్టౌ వైపు చూస్తూ కూర్చున్నారు. ఒకటి- రెండు నిముషాలయినా పాలమీద నుంచి పొంగు రాలేదు.

 

    "మనమో తప్పు చేసేం" అన్నాడు శ్రీనూ.

 

    "ఏమిటి".

 

    "స్టౌ వెలిగించటం మరచిపోయాం".

 

    "అదిందులో వ్రాసిలేదే"

 

    "నీ మొహం. అట్లాటివన్నీ వ్రాయరు"

 

    ఇంతలో 'ఏం చేస్తున్నార్రా' అన్న పిలుపు వినిపించింది. భార్గవ లోపలికి వస్తూ "మీరిద్దరూ చేరారేమిటి? ప్రార్థనేది?" అన్నాడు.

 

    "డాన్సు క్లాసుకి వెళ్ళింది"

 

    అతడికి కూతురు, తన మొదటి స్టేజి ప్రదర్శన తొందరలోనే జరగబోతూందని చెప్పిన విషయం గుర్తువచ్చింది. దానిపేరు ఏదో వుండాలి రుబ్బురోలు పత్రం... అలాటి పేరే ఏదో - ఆఁ "ఆరంగేట్రం" అందుకే ప్రొద్దునే వెళ్ళిపోతూంది.

 

    "ఏమిటీరోజు అంత స్పెషల్"

 

    "పన్నక్క బర్తడే..."

 

    "భోజనానికి ఇవ్వాళ మా యింటికి రావాలోయ్" అన్నాడు భార్గవ శేఖరాన్ని చూసి.

 

    "ఏమిటి విశేషం?" అని అడిగాడు అతడు.

 

    వాళ్ళిద్దరికీ వారం రోజుల్లోనే పరిచయం దగ్గరయింది. విభిన్న ధృవాలు ఆకర్షింపబడటంలో విడ్డూరంలేదు.

 

    "ప్రార్థన పుట్టినరోజు" అన్నాడు భార్గవ.

 

    "ఓ! అయితే తప్పకుండా వస్తాను" అన్నాడు శేఖరం. "కానీ గురూగారూ! మీకు అంతకన్నా మంచి విషయం చెప్పదల్చుకున్నాను".

 

    "ఏమిటి?"

 

    శేఖరం తలవంచి రహస్యం చెబుతున్నట్టు "మన సైంటిఫిక్ ఆఫీసరు కమలగార్ని ప్రేమిద్దామనుకుంటున్నాను" అన్నాడు.

 

    భార్గవ ఆశ్చర్యంగా అతడివైపు చూసి, "ఎవరూ! కమలగారా! ఆవిడకి ముప్పై అయిదేళ్ళు కదోయ్!" అన్నాడు.

 

    "ప్రేమింపబడటానికి అదే సరి అయిన వయసని నేను నమ్ముతున్నాను. అప్పటికి వాళ్ళకి ప్రేమ తాలూకు నాన్సెన్సికల్ అభిప్రాయాలు పోతాయి".

 

    "కానీ సోడాబుడ్డి కళ్ళద్దాలూ అవీ.. ఆవిడేం బావుంటుందోయ్?"

 

    "అమ్మమ్మ! అలా అనకండి. ఆవిడ తాలూకు విజ్ఞానం అంతా ఆ కళ్ళద్దాల్లోనే వుంది. సోడాబుడ్డి కళ్ళద్దాల వాళ్ళ ప్రపంచం చాలా లిమిటెడ్ గా వుంటుంది. ఎక్కువ ప్రపంచాన్ని చూడలేకపోవడంవల్ల... అలాటివాళ్ళు ప్రేమలో పడ్డారంటే అదే ఝంఝా మారుతంలా మనల్ని వూపేస్తారు. అందులో ఆనందమే వేరు" అన్నాడు. భార్గవ ఇంకా నమ్మకం కుదరనట్టూ "మరి మొన్న లాబ్ సూపర్ వైజర్ రాంబాయమ్మగార్ని ప్రేమించానన్నావ్" అన్నాడు.

 Previous Page Next Page